భారత్ కు భంగపాటు.. ఫైనల్లో ఆసీస్

భారత్ కు భంగపాటు.. ఫైనల్లో ఆసీస్


సిడ్నీ: వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా జైత్రయాత్రకు బ్రేకు పడింది. ఆసీస్ కు పేస్ కు ధోని సేన దాసోహమైంది. ప్రపంచకప్ నుంచి భారత్ నిష్ర్కమించింది. సెమీస్ పోరుతో కంగారూల చేతిలో భారత్ కు భంగపాటు ఎదురైంది. ఆతిథ్య జట్టు ఫైనల్ చేరగా, టీమిండియా ఇంటిముఖం పట్టింది. గురువారమిక్కడ సిడ్నీ మైదానంలో జరిగిన సెమీస్ సమరంలో భారత్ ను ఆస్ట్రేలియా 95 పరుగుల తేడాతో ఓడించింది. 329 పరుగుల టార్గెట్ ను చేరుకునేందుకు బరిలోకి దిగిన ధోని సేన 46.5 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది.



ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించిన ఓపెనర్లు ధావన్, రోహిత్ 76 పరుగుల శుభారంభం అందించారు. ధావన్ ధాటిగా ఆడాడు. 41 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్ తో 45 పరుగులు చేసి తొలి వికెట్ గా అవుటయ్యాడు. తర్వాత బ్యాటింగ్ వచ్చిన కోహ్లి(1) వెంటనే అవుటయ్యాడు. కొద్ది సేపటికే రోహిత్(34), రైనా(7) అవుటవడంతో టీమిండియా కష్టాల్లో పడింది.



ఈ దశలో రహానే, ధోని జాగ్రత్తగా ఆడి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. 178 పరుగుల వద్ద రహానే(44) ఐదో వికెట్ గా అవుటయ్యాడు. ధోని అర్ధసెంచరీ ఒంటరి పోరాటం చేసినా జట్టును ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయాడు. ధోని 65 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 65 పరుగులు చేసి రనౌటయ్యాడు. అంతకుముందు జడేజా(16) రనౌటయ్యాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఫాల్కనర్ 3 జాన్సన్ 2, స్టార్క్ 2 వికెట్లు పడగొట్టాడు. హాజిల్ వుడ్ ఒక వికెట్ తీశాడు.



అంతకుముందు స్మిత్(105) సెంచరీ, ఫించ్(81) అర్థసెంచరీలతో రాణించడంతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 328 పరుగులు చేసింది. స్మిత్ కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ తో ఆస్ట్రేలియా తలపడుతుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top