ఉత్కంఠగా తొలి టెస్టు

ఉత్కంఠగా తొలి టెస్టు - Sakshi


పల్లెకిలా: మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇక్కడ శ్రీలంక-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఉత్కంఠగా మారింది. శ్రీలంక నిర్దేశించిన 268 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా 63 పరుగులకే మూడు కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆస్ట్రేలియా ఆటగాళ్లలో బర్న్స్(29), డేవిడ్ వార్నర్(1), ఖవాజా(18) పెవిలియన్ కు చేరారు.  స్టీవ్ స్మిత్(26 బ్యాటింగ్), వోజస్(9 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు. దీంతో నాల్గో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్ట్రేలియా 27.0 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది.



ఇంకా ఆస్ట్రేలియా విజయం సాధించడానికి 185 పరుగులు అవసరం కాగా, లంకేయుల గెలుపుకు ఏడు వికెట్లు అవసరం. ఇరు జట్ల మధ్య ఉత్కంఠగా సాగుతున్న టెస్టు మ్యాచ్కు ఈరోజు కూడా వరుణుడు ఆటంకం కల్గించాడు. దీంతో మ్యాచ్ను నిర్ణీత సమయం కంటే ముందే ముగించారు. కాగా, ఆటకు శుక్రవారం ఒక రోజే మిగిలి ఉండటంతో ఇరు జట్లు విజయం కోసం తీవ్రంగా శ్రమించే అవకాశం ఉంది.



అంతకుముందు 282/6తో నాలుగోరోజు బ్యాటింగ్ కు దిగిన లంకను స్టార్క్ మరోసారి దెబ్బతీశాడు. తొలి సెంచరీతోనే అతిపిన్న వయసులో ఈ ఫీట్ నమోదుచేసి రికార్డు సృష్టించిన కుశాల్ మెండిస్ (254 బంతుల్లో 176 పరుగులు; 21 ఫోర్లు, 1 సిక్స్)ను  త్వరగానే పెవిలియన్ బాట పట్టించాడు.ఓవర్ నైట్ స్కోరుకు మరో 7 పరుగులు జోడించి 290 పరుగుల వద్ద ఏడో వికెట్ గా వెనుదిరిగాడు. చివర్లో హెరాత్(34 బంతుల్లో 35 పరుగులు; 6 ఫోర్లు ) రాణించడంతో లంక 353 పరుగుల వద్ద ఆలౌటయ్యింది.


శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 117 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 353 ఆలౌట్


ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్  203 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్  83/3

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top