ఆసీస్ను చుట్టేశారు..

ఆసీస్ను చుట్టేశారు..


ధర్మశాల: ఆసీస్ తో చివరిటెస్టును గెలిచి సిరీస్ ను ఎలాగైనా సొంతం చేసుకోవాలనే పట్టుదలగా ఉన్న భారత క్రికెట్ జట్టు అందుకు తగ్గట్టుగానే రాణిస్తోంది. ఆస్టేలియా తొలి ఇన్నింగ్స్ ను మొదటి రోజే కూల్చేసి శుభారంభం చేసింది. ఈ టెస్టు మ్యాచ్ ద్వారా భారత జట్టులోకి అరంగేట్రం చేసిన కుల్దీప్ యాదవ్ విశేషంగా రాణించి నాలుగు వికెట్లు సాధించాడు. ఆసీస్ కీలక వికెట్లను తన ఖాతాలో వేసుకుని ఆ జట్టు భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు. అతనికి సాయంగా ఉమేశ్ యాదవ్ రెండు వికెట్లు తీయగా, అశ్విన్, జడేజా, భువనేశ్వర్ కుమార్లు లు తలో వికెట్ తీశారు.  డేవిడ్ వార్నర్(56), కెప్టెన్ స్టీవ్ స్మిత్(111),మాథ్యూ వేడ్(65)లు మాత్రమే రాణించడంతో ఆసీస్ 88.3 ఓవర్లలో 300 పరుగుల వద్ద ఆలౌటైంది.







తొలి సెషన్ లో ఆసీస్ జోరు..



టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ తొలి సెషన్ లో అత్యంత దూకుడు ఆడింది. ఆసీస్ ఓపెనర్ రెన్ షా(1)ను ఉమేశ్ యాదవ్ ఆదిలోనే పెవిలియన్ కు పంపి చక్కటి ఆరంభాన్నిచ్చినా ఆ తరువాత డేవిడ్ వార్నర్-స్టీవ్ స్మిత్ల జోడి సమయోచితంగా బ్యాటింగ్ చేసింది. వీరు వందకు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి ఆసీస్ ను పటిష్ట స్థితిలోకి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే స్మిత్, వార్నర్లు హాఫ్ సెంచరీలు సాధించారు. తొలుత స్మిత్ 67 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ సాధించగా, ఆపై వార్నర్ 72 బంతుల్లో అర్ధ శతకం చేశాడు. దాంతో లంచ్ సమయానికి వికెట్ మాత్రమే కోల్పోయిన ఆసీస్ 131 పరుగులు చేసింది.





కుల్దీప్ మ్యాజిక్..



తొలి సెషన్లో ఆసీస్ జోరు కొనసాగడంతో భారత్ వెనుకబడింది. అయితే రెండో సెషన్ లో కుల్దీప్ యాదవ్ తన స్పిన్ మ్యాజిక్ ను చూపించాడు. అత్యంత తక్కువ ఎత్తులో బంతుల్ని సంధిస్తూ ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ను కకావికలం చేశాడు. ప్రత్యేకంగా రెండో సెషన్ లో ఆసీస్ ఐదు వికెట్లను కోల్పోతే అందులో కుల్దీప్ మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. దాంతో టీ విరామానికి ఆస్ట్రేలియా ఆరు వికెట్లను కోల్పోయి 208 పరుగులు చేసింది. ఈ రోజు మూడో సెషన్లో మరో వికెట్ను సాధించిన కుల్దీప్.. ఓవరాల్గా నాలుగు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించాడు.





వేడ్ పోరాటం



చివరి సెషన్ లో ఆసీస్ వికెట్ కీపర్ మాథ్యూ వేడ్  ఒంటరి పోరు చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఆసీస్ ఇన్నింగ్స్ కు మరమ్మత్తులు చేపట్టాడు.125 బంతులను ఎదుర్కొని నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 57 పరుగులు చేశాడు. అతనికి జతగా కమిన్స్(21;40 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్)తో ఫర్వాలేదనిపించాడు. ఈ జోడి ఏడో వికెట్ కు 37 పరుగులు జోడించిన తరువాత కమిన్స్ అవుటయ్యాడు. ఆపై ఓకీఫ్(8) ఎనిమిదో వికెట్ గా అవుటవ్వగా, వేడ్ తొమ్మిదో వికెట్ గా అవుటయ్యాడు.లియాన్(13) చివరి వికెట్ గా పెవిలియన్ చేరడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన భారత్ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 0/0తో ఉంది. క్రీజ్ లో కేఎల్ రాహుల్, మురళీ విజయ్ లు ఉన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top