కంగారూలు కసికసిగా...

కంగారూలు కసికసిగా...


ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా సెమీస్‌లో భారత్‌పై ఘన విజయంస్మిత్ ‘సూపర్’ సెంచరీ ఇక కివీస్‌తో అమీతుమీ నిప్పులు కురిపించే సూర్యుడు కూడా అలసిపోయి పశ్చిమానికి వాలినట్లే... అలుపెరుగని పోరాటం చేసిన భారత్ కూడా సెమీస్‌లో ‘ఒత్తిడి’ని జయించలేకపోయింది. సొంతగడ్డపై అభిమానులు ప్రత్యర్థికి జేజేలు పలుకుతున్నా... తమకు అలవాటైన పిచ్‌ను మార్చి స్పిన్ అన్నా... ఆస్ట్రేలియా మాత్రం వెనకి తగ్గలేదు. ఎదురెళ్లి యుద్ధం చేయాల్సిన భారత సిపాయిలు కదనరంగంలో కూలబడితే.. అదను కోసం వేచి చూసిన కంగారూలు కసి కసిగా కొట్టారు.



మద్దతు తెలపని అభిమానుల మధ్యకే ముద్దుముద్దుగా సిక్సర్లు బాదారు.... జయించలేరనుకున్న స్పిన్ అస్త్రాన్ని బౌండరీలతో తిప్పికొట్టారు. కుర్రాడు స్మిత్ సెంచరీతో దుమ్ముదులిపితే... ఫించ్ సహాయక పాత్రతో ఆటను రక్తికట్టించాడు. తర్వాత ‘ఆ నలుగురు’ చేసిన పేస్ దాడికి బెంబెలేత్తిన ధోనిసేన భారీ లక్ష్యం ముందు బొక్క బోర్లాపడింది. దీంతో టీమిండియా ప్రపంచకప్ ప్రస్థానం ముగిసింది. సొంతగడ్డపై ఆసీస్ సగర్వంగా ఫైనల్‌కు చేరింది.

 

సిడ్నీ: ఏడు మ్యాచ్‌ల జైత్రయాత్ర... ప్రతి మ్యాచ్‌లో ఎవరో ఒకరు ఆడారు... చేజారుతున్న మ్యాచ్‌లను సైతం నేర్పుగా ఒడిసిపట్టుకున్నారు. కానీ అసలు పోరులో మాత్రం అందరూ కలిసి కట్టుగా విఫలమయ్యారు. ఒక్కరు కూడా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చూపలేకపోయారు. బౌలర్లే విఫలమయ్యారనుకుంటే... భారీ లక్ష్య ఛేదనలో బ్యాట్స్‌మెన్ మరింత నిరాశపర్చారు. ఓవరాల్‌గా ‘ఒత్తిడి’ని జయించలేకపోయిన భారత్ ప్రపంచకప్ సెమీఫైనల్లో తడబడింది. దీంతో రెండో అడుగు వేయాల్సిన అవసరం లేకుండానే ధోనిసేన టైటిల్ పోరాటాన్ని ముగించింది.



గురువారం జరిగిన సెమీస్‌లో ఆస్ట్రేలియా 95 పరుగుల తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 7 వికెట్లకు 328 పరుగులు చేసింది. స్మిత్ (93 బంతుల్లో 105; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా, ఫించ్ (116 బంతుల్లో 81; 7 ఫోర్లు, 1 సిక్స్) సమయోచితంగా ఆడాడు. తర్వాత భారత్ 46.5 ఓవర్లలో 233 పరుగులకే ఆలౌటైంది. ధోని (65 బంతుల్లో 65; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా, ధావన్ (41 బంతుల్లో 45; 6 ఫోర్లు, 1 సిక్స్), రహానే (68 బంతుల్లో 44; 2 ఫోర్లు), రోహిత్ (48 బంతుల్లో 34; 1 ఫోర్, 2 సిక్సర్లు) ఓ మోస్తరుగా ఆడారు. స్మిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఆసీస్.. కివీస్‌తో తలపడుతుంది.   

 

స్కోరు వివరాలు

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ఫించ్ (సి) ధావన్ (బి) ఉమేశ్ 81; వార్నర్ (సి) కోహ్లి (బి) ఉమేశ్ 12; స్మిత్ (సి) రోహిత్ (బి) ఉమేశ్ 105; మ్యాక్స్‌వెల్ (సి) రహానే (బి) అశ్విన్ 23; వాట్సన్ (సి) రహానే (బి) మోహిత్ 28; క్లార్క్ (సి) రోహిత్ (బి) మోహిత్ 10; ఫాల్క్‌నర్ (బి) ఉమేశ్ 21; హాడిన్ నాటౌట్ 7; జాన్సన్ నాటౌట్ 27; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం: (50 ఓవర్లలో 7 వికెట్లకు) 328.

 వికెట్ల పతనం: 1-15; 2-197; 3-232; 4-233; 5-248; 6-284; 7-298.

 


బౌలింగ్: షమీ 10-0-68-0; ఉమేశ్ 9-0-72-4; మోహిత్ శర్మ 10-0-75-2; కోహ్లి 1-0-7-0; జడేజా 10-0-56-0; అశ్విన్ 10-0-42-1.

 భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) జాన్సన్ 34; ధావన్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) హాజల్‌వుడ్ 45; కోహ్లి (సి) హాడిన్ (బి) జాన్సన్ 1; రహానే (సి) హాడిన్ (బి) స్టార్క్ 44; రైనా (సి) హాడిన్ (బి) ఫాల్క్‌నర్ 7; ధోని రనౌట్ 65; జడేజా రనౌట్ 16; అశ్విన్ (బి) ఫాల్క్‌నర్ 5; షమీ నాటౌట్ 1; మోహిత్ (బి) ఫాల్క్‌నర్ 0; ఉమేశ్ (బి) స్టార్క్ 0; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం: (46.5 ఓవర్లలో ఆలౌట్) 233.

 వికెట్ల పతనం: 1-76; 2-78; 3-91; 4-108; 5-178; 6-208; 7-231; 8-232; 9-232; 10-233.

 బౌలింగ్: స్టార్క్ 8.5-0-28-2; హాజల్‌వుడ్ 10-1-41-1; జాన్సన్ 10-0-50-2; ఫాల్క్‌నర్ 9-1-59-3; మ్యాక్స్‌వెల్ 5-0-18-0; వాట్సన్ 4-0-29-0.

 

మ్యాచ్ సాగిందిలా...

 

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్

 

వార్నర్ విఫలం

పూర్తిగా బ్యాటింగ్ వికెట్ కావడంతో ఆరంభంలో భారత పేసర్లు పరుగులు నియంత్రించడంలో కాస్త ఇబ్బందిపడ్డారు. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో వార్నర్ (12)కు ఓ ఫోర్, సిక్సర్ సమర్పించుకున్న ఉమేశ్ నాలుగో ఓవర్‌లో అతన్ని అవుట్ చేశాడు. తర్వాత ఫించ్ నెమ్మదిగా ఆడినా... స్మిత్ దూకుడుగా ఆడాడు. ఉమేశ్ వేసిన 10వ ఓవర్‌లో నాలుగు ఫోర్లు బాదడంతో పవర్‌ప్లే ముగిసేసరికి ఆసీస్ స్కోరు 56/1.

 

సూపర్ భాగస్వామ్యం

ఫించ్, స్మిత్ జోడిని విడదీసేందుకు ధోని రెండు వైపుల నుంచి స్పిన్నర్లను రంగంలోకి దించినా ప్రయోజనం లేకపోయింది. ఇన్నింగ్స్ 25వ ఓవర్‌లో భారీ సిక్సర్‌తో రెచ్చిపోయిన స్మిత్... ఆ తర్వాత షమీని ఓ సిక్సర్, రెండు ఫోర్లతో చితకబాదాడు. 89 బంతుల్లో శతకం పూర్తి చేసిన కొద్దిసేపటికే అవుటయ్యాడు. ఈ ఇద్దరు రెండో వికెట్‌కు 31 ఓవర్లలో 182 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను పటిష్టపరిచారు.

 

పుంజుకున్న బౌలర్లు

మ్యాక్స్‌వెల్ (14 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్) వచ్చీ రావడంతోనే ఉమేశ్ వరుస ఓవర్లలో మూడు ఫోర్లు, సిక్స్ కొట్టి జోరు పెంచినా... అశ్విన్ బౌలింగ్‌లో డీప్ బ్యాక్‌వర్డ్‌లో రహానే చేతికి చిక్కాడు. మరో ఐదు బంతుల తర్వాత ఫించ్ కూడా వెనుదిరిగాడు. తర్వాత వాట్సన్ (30 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను తీసుకున్న క్లార్క్ (10) కూడా ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. దీంతో ఆసీస్ 248 పరుగులకు సగం జట్టు పెవిలియన్‌కు చేరుకుంది. ఫాల్క్‌నర్ (12 బంతుల్లో 21; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా వేగంగా ఆడే క్రమంలో అవుటయ్యాడు. 47 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ స్కోరు 288/6.

 

చెలరేగిన జాన్సన్

ఇక చివరి మూడు ఓవర్లలో జాన్సన్ (9 బంతుల్లో 27 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) విశ్వరూపమే చూపాడు. తన జోరైన బ్యాటింగ్‌తో జట్టు స్కోరును అమాంతం పెంచేశాడు. హాడిన్ (7 నాటౌట్)ను ఓ ఎండ్‌లో నిలబెట్టిన జాన్సన్... షమీ (49వ) ఓవర్‌లో వరుసగా మూడు ఫోర్లు బాదాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో ఓ సిక్సర్, ఫోర్‌తో రెచ్చిపోయాడు. దీంతో మూడు ఓవర్లలో 40 పరుగులు వచ్చాయి. ఉమేశ్ 4, మోహిత్ 2 వికెట్లు తీశారు.

 

 భారత్ ఇన్నింగ్స్


 

ఓపెనర్ల నిలకడ

కుదురుకోవడానికి కాస్త సమయం తీసుకున్నా భారత ఓపెనర్లు ధావన్, రోహిత్ క్రమంగా బ్యాట్ ఝుళిపించారు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లోనే ధావన్ క్యాచ్ అవుట్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. జాన్సన్ బౌలింగ్‌లో రోహిత్ భారీ సిక్సర్ కొడితే... ఫాల్క్‌నర్‌కు ధావన్ వరుసగా రెండు ఫోర్లు, ఓ సిక్సర్ రుచి చూపాడు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి భారత్ 55 పరుగులు చేసింది.

 

కోహ్లి నిరాశ

జోరు తగ్గకుండా ఆడుతున్న ధావన్‌ను 13వ ఓవర్‌లో హాజల్‌వుడ్ అవుట్ చేశాడు. దీంతో తొలి వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో వచ్చిన కోహ్లి క్రీజులో అసహనంగానే కదిలాడు. జాన్సన్ వేసిన 14వ ఓవర్‌లో ఐదు బంతులను వృథా చేసి సింగిల్‌తో మళ్లీ స్ట్రయికింగ్‌కు వచ్చాడు. కానీ హాజల్‌వుడ్ ఓవర్ మెయిడెన్ చేసి మరింత ఒత్తిడిలోకి వెళ్లాడు. చివరకు జాన్సన్ విసిరిన బౌన్సర్‌ను ఆడి కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

 

ఫాల్క్‌నర్ జోరు

రోహిత్‌తో జత కలిసిన రహానే నెమ్మదిగా ఆడాడు. జాన్సన్  (17.5) బంతిని సిక్సర్‌గా మలిచిన రోహిత్ ఆ తర్వాతి బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఇన్నింగ్స్‌ను కాపాడే బాధ్యతను రైనా సమర్థంగా నిర్వహించలేకపోయాడు. ఫాల్క్‌నర్, జాన్సన్ నిప్పులు చెరగడంతో బ్యాట్స్‌మన్ పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోయారు. చివరకు ఫాల్క్‌నర్ వేసిన షార్ట్ బంతి రైనా బ్యాట్‌ను తాకుతూ కీపర్ చేతిలోకి వెళ్లింది.  

 

ధోని ధమాకా

ఈ దశలో వచ్చిన ధోనితో పాటు రహానే నిలకడకు ప్రాధాన్యమిచ్చారు. హాజల్‌వుడ్ బౌలింగ్‌లో కెప్టెన్ రెండు ఫోర్లు కొట్టడంతో భారత్ 32 ఓవర్లలో 150 పరుగులకు చేరుకుంది. ఇక ఈ జోడీ వేగం పెంచే క్రమంలో మరో స్పెల్‌కు బౌలింగ్‌కు వచ్చిన స్టార్క్.. రహానేను బోల్తా కొట్టించాడు. ఈ అవుట్ విషయంలో ఆసీస్ రివ్యూకు వెళ్లి సఫలమైంది. ధోని, రహానే మధ్య ఐదో వికెట్‌కు 70 పరుగులు సమకూరాయి.



42 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్యాచ్ అవుట్ నుంచి ధోని తప్పించుకోగా, కొద్దిసేపటికే జడేజా (16) అనూహ్యంగా రనౌటయ్యాడు. తర్వాత వాట్సన్ ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదిన కెప్టెన్ 45వ ఓవర్‌లో రనౌటయ్యాడు. ఇక భారత్ విజయలక్ష్యం 30 బంతుల్లో 97 పరుగులు. 46వ ఓవర్‌లో ఫాల్క్‌నర్ వరుస బంతుల్లో అశ్విన్ (5), మోహిత్ (0)ను, తర్వాతి ఓవర్‌లో స్టార్క్.. ఉమేశ్ (0)లను అవుట్ చేయడంతో భారత్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఫాల్క్‌నర్ 3, జాన్సన్, స్టార్క్ చెరో రెండు వికెట్లు తీశారు.

 

 1 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఒక జట్టు 300కు పైగా పరుగులు చేయడం ఇదే తొలిసారి.

 

 1 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఎక్కువ పరుగుల తేడాతో (95) ఓడిన జట్టు భారత్. 2003 సెమీస్‌లో భారత్, కెన్యాపై 91 పరుగులతో నెగ్గింది.

 

 3 కెప్టెన్‌గా వన్డేల్లో 6 వేలకు పైగా పరుగులు చేసిన మూడో ఆటగాడు ధోని (6022). పాంటింగ్ (8497), ఫ్లెమింగ్ (6295) ముందున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top