టీమిండియాపై ఆసీస్ ఘనవిజయం

టీమిండియాపై ఆసీస్ ఘనవిజయం


 బ్రిస్బేన్:ఆసీస్ గడ్డపై టీమిండియా మరోసారి చతికిలబడింది. ఆసీస్ అటాకింగ్ ను ఎదుర్కోవడంలో విఫలమైన టీమిండియా ఆటగాళ్లు బొక్కబోర్లా పడ్డారు. తొలి టెస్టు ఓటమితో పాఠాలు నేర్వని భారత్ పేలవమైన ఆటతో రెండో టెస్టులో ఘోర ఓటమిని మూటగట్టుకుంది.  రెండో టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి తమకు తిరుగులేదని నిరూపించింది. 128 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ కు ఆదిలో రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించింది. అయితే ఓపెనర్ రోజర్స్(55)పరుగులతో రాణించడంతో ఆసీస్ కుదుటపడింది.


 


అంతకుమందు ఆసీస్ డేవిడ్ వార్నర్ (6), షేన్ వాట్సన్ (0) లను పెవిలియన్ కు పంపిన ఇషాంత్ శర్మ అదే ఊపును కొనసాగించి రోజర్స్ ను అవుట్ చేశాడు.  అటు తరువాత కెప్టెన్ స్టీవెన్ స్మిత్(28)పరుగులు చేసి రనౌట్ రూపంలో పెవిలియన్ కు చేరగా హడిన్ (1) కూడా అవుట్ అయ్యాడు. 122 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయిన ఆసీస్.. ఇంకా ఒక రోజు ఆట మిగిలి ఉండగానే విజయం సాధించింది.  నాల్గో రోజు ఆటలో టీమిండియా పూర్తి స్థాయిలో వైఫల్యం చెందింది .


 


వికెట్టు నష్టానికి 71 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా  వరుస వికెట్లను కోల్పోయింది. లంచ్ సమయానికే ఏడు వికెట్లను నష్టపోయిన టీమిండియా ఒక్కసారిగా చతికిలబడింది. అజ్యింకా రహానే (10) పరుగులు చేసి పెవిలియన్ చేరగా, రోహిత్ శర్మ, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ డకౌట్ లుగా వెనుదిరిగి టీమిండియా ఆశలపై నీళ్లు చల్లారు. అనంతరం ఓపెనర్ శిఖర్ కు ఉమేశ్ యాదవ్ జతకలిసి కాసేపు మరమ్మత్తులు చేపట్టాడు.

 

ఇరువురూ కలిసి 60 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో టీమిండియాకు కాస్త ఊరట లభించింది. ఉమేశ్ యాదవ్ ను అవతలి ఎండ్ లో ఎక్కువ సమయం ఉంచిన శిఖర్ థావన్ చక్కటి ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఉమేశ్ యాదవ్ (30) పరుగులు చేసి చివరి వికెట్టుగా పెవిలియన్ చేరాడు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 408 పరుగులు, సెకెండ్ ఇన్నింగ్స్ లో 224 పరుగులు చేసింది. ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్ లో  505 పరుగులు చేసింది. నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో తొలి టెస్టులో స్వల్ప తేడాతో ఓటమి పాలైన భారత్.. రెండో టెస్టులో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. దీంతో ఆసీస్ కు 2-0 ఆధిక్యం లభించింది.


మరిన్ని చిత్రాలకు క్లిక్ చేయండి

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top