‘చైనామన్‌’ చేతికి చిక్కారు

‘చైనామన్‌’ చేతికి చిక్కారు


కుల్దీప్‌ యాదవ్‌కు 4 వికెట్లు

ఆస్ట్రేలియా 300 ఆలౌట్‌

స్మిత్‌ వీరోచిత సెంచరీ

రాణించిన వార్నర్, వేడ్‌  




ధర్మశాలలో కుల్దీప్‌ యాదవ్‌ రూపంలో భారత్‌ సంధించిన కొత్త అస్త్రం ఆస్ట్రేలియాను కూల్చింది. ‘చైనామన్‌’ శైలి బౌలింగ్‌కు సిద్ధం కాక, దానిని అర్థం చేసుకోలేక ఆ జట్టు కంగారు పడింది. ఆసీస్‌ టాస్‌ గెలిచింది, పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది, వార్నర్‌ కూడా ఫామ్‌లోకి వచ్చాడు... ఎప్పటిలాగే స్మిత్‌ తనదైన శైలిలో దూసుకుపోయాడు. తొలి సెషన్‌లో తుఫాన్‌ వేగంతో పరుగులు నమోదయ్యాయి. అన్నీ అనుకూలంగా సాగిపోతున్న వేళ తొలి టెస్టు ఆడుతున్న 22 ఏళ్ల కుర్రాడు విసిరిన బంతుల ముందు ప్రత్యర్థి తడబడింది. కోహ్లి స్థానంలో ఏ బ్యాట్స్‌మెనో వస్తాడని అనుకుంటే భారత్‌ కొత్త బౌలర్‌ను బరిలోకి దింపి మాస్టర్‌ స్ట్రోక్‌ ఇచ్చింది.



ఫలితంగా ఒక దశలో 144/1తో భారీ స్కోరు దిశగా సాగిపోతున్నట్లు అనిపించిన కంగారూలు కుల్దీప్‌ జోరు ముందు తలవంచారు. రెండో సెషన్‌లో పరుగులు తీయలేక స్మిత్‌ సేన టపటపా వికెట్లు కోల్పోయింది. వేడ్‌ పుణ్యమా అని చివర్లో కోలుకున్నా... మొత్తానికి ఆధిపత్యం మాత్రం భారత్‌దే. మొదటి రోజు ఆటలో బ్యాట్స్‌మెన్, పేసర్లు, స్పిన్నర్లు అందరికీ అనుకూలించిన చోట రెండో రోజు మన బ్యాట్స్‌మెన్‌ నిలబడితే టెస్టు మన చేతుల్లోకి వచ్చినట్లే. అయితే కొత్త బంతితో తొలి సెషన్‌లో హాజల్‌వుడ్, కమిన్స్‌లను ఎదుర్కోవడమే కీలకం.  




ధర్మశాల: బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీ నిర్ణయాత్మక టెస్టులో తొలి రోజు భారత్‌ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. భారీ స్కోరు చేయకుండా ఆసీస్‌ను కట్టి పడేసింది. శనివారం ఇక్కడ ప్రారంభమైన నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 300 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (173 బంతుల్లో 111; 14 ఫోర్లు) సిరీస్‌లో మూడో సెంచరీ సాధించగా,  మ్యాథ్యూ వేడ్‌ (125 బంతుల్లో 57; 4 ఫోర్లు, 1 సిక్స్‌), డేవిడ్‌ వార్నర్‌ (87 బంతుల్లో 56; 8 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలు నమోదు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ (4/68) నాలుగు వికెట్లతో రాణించగా... ఉమేశ్‌కు రెండు వికెట్లు, భువనేశ్వర్, రవీంద్ర జడేజా, అశ్విన్‌లకు ఒక్కో వికెట్‌ లభించాయి. అనంతరం ఆట ప్రారంభించిన భారత్‌ ఒక ఓవర్‌ ఆడి పరుగులేమీ చేయలేదు.



సెషన్‌ 1: ఆసీస్‌ దూకుడు

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా గత టెస్టులో ఆడిన జట్టునే కొనసాగించింది. వంద శాతం ఫిట్‌గా లేని కోహ్లి తప్పుకోగా, అతని స్థానంలో కుల్దీప్‌కు అవకాశం దక్కగా... ఇషాంత్‌కు బదులుగా భువనేశ్వర్‌ భారత జట్టులోకి వచ్చాడు. భువనేశ్వర్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి బంతికే మూడో స్లిప్‌లో కరుణ్‌ నాయర్‌ క్యాచ్‌ వదిలేయడంతో వార్నర్‌ బతికిపోయాడు. అయితే తర్వాతి ఓవర్లోనే రెన్‌షా (1)ను బౌల్డ్‌ చేసి ఉమేశ్‌ ఆసీస్‌ను దెబ్బ తీశాడు. అయితే ఈ దశలో వార్నర్, స్మిత్‌ కలిసి భారత బౌలర్లను ఆడుకున్నారు. స్మిత్‌ తన అద్భుత ఫామ్‌ను కొనసాగించగా, సిరీస్‌లో తొలిసారి వార్నర్‌ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆస్ట్రేలియాలోని వికెట్‌ల తరహాలో పిచ్‌పై చక్కటి బౌన్స్‌ ఉండటంతో వీరిద్దరు స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేశారు. ఈ క్రమంలో ముందుగా 67 బంతుల్లో స్మిత్, ఆ తర్వాత వార్నర్‌ 72 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఈ సెషన్‌లో ఆస్ట్రేలియా వేగంగా 4.22 రన్‌రేట్‌తో పరుగులు చేయడం విశేషం.

ఓవర్లు: 31, పరుగులు: 131, వికెట్లు: 1



సెషన్‌ 2: కుల్దీప్‌ మాయ

విరామం తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. బ్యాటింగ్‌కు అనుకూలంగానే ఉన్న పిచ్‌పై ప్రత్యర్థిపై భారత్‌ ఆధిపత్యం ప్రదర్శించింది. అద్భుత బంతితో వార్నర్‌ను అవుట్‌ చేసి కెరీర్‌లో తొలి వికెట్‌ సాధించిన కుల్దీప్‌ ఆటను మలుపు తిప్పగా,  ఆ వెంటనే ఉమేశ్‌ బౌలింగ్‌లో షాన్‌ మార్‌‡్ష (4) వెనుదిరిగాడు. ఆ తర్వాత కుల్దీప్‌ మిస్టరీ బౌలింగ్‌ను ఆడలేక నాలుగు పరుగుల వ్యవధిలో హ్యాండ్స్‌కోంబ్‌ (8), మ్యాక్స్‌వెల్‌ (8) క్లీన్‌బౌల్డయ్యారు. మరో ఎండ్‌లో తన జోరు కొనసాగించిన స్మిత్‌ 150 బంతుల్లో తన కెరీర్‌లో 20వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. భారత్‌పై ఆడిన గత ఎనిమిది టెస్టుల్లో స్మిత్‌కు ఇది ఏడో సెంచరీ. అయితే కొద్దిసేపటికే చక్కటి బంతితో స్మిత్‌ను అశ్విన్‌ పెవిలియన్‌ పంపించడంతో ఆసీస్‌ కష్టాలు మరింత పెరిగాయి.

ఓవర్లు: 30, పరుగులు: 77, వికెట్లు: 5



సెషన్‌ 3: ఆదుకున్న వేడ్‌

చివరి సెషన్‌లో ఆసీస్‌ కోలుకుంది. చివరి 4 వికెట్లకు ఆ జట్టు మరో 92 పరుగులు జోడించగలిగింది. సిరీస్‌లో తొలిసారి మెరుగైన ప్రదర్శన కనబర్చిన వికెట్‌ కీపర్‌ వేడ్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. అతనికి కొద్దిసేపు కమిన్స్‌ (21), లయన్‌ (13) అండగా నిలిచారు. కమిన్స్‌ను అవుట్‌ చేసి మరోసారి కుల్దీప్‌ భారత్‌కు బ్రేక్‌ అందించగా... సబ్‌స్టిట్యూట్‌ శ్రేయస్‌ అయ్యర్‌ చక్కటి ఫీల్డింగ్‌కు ఒకీఫ్‌ (8) రనౌటయ్యాడు. 113 బంతుల్లో వేడ్‌ అర్ధసెంచరీ పూర్తయింది. ఆరు బంతుల తేడాతో వేడ్, లయన్‌ వెనుదిరగడంతో ఆసీస్‌ ఆలౌటైంది. ఆ తర్వాత భారత్‌ తొలి రోజు ఒకే ఒక ఓవర్‌ ఎదుర్కొని పరుగులేమీ చేయకుండా ముగించింది.

ఓవర్లు: 27.3, పరుగులు: 92, వికెట్లు: 4 (ఆస్ట్రేలియా)

ఓవర్లు: 1, పరుగులు: 0, వికెట్లు: 0 (భారత్‌)




ఒకే సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అశ్విన్‌ (79) రికార్డు. స్టెయిన్‌ (దక్షిణాఫ్రికా–78 వికెట్లు; 2007–08 సీజన్‌) పేరిట ఉన్న రికార్డు తెరమరుగు.



భారత్‌పై ఒకే సిరీస్‌లో 3 సెంచరీలు చేసిన తొలి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్మిత్‌. గతంలో హర్వే, ఓనీల్, హేడెన్, మార్టిన్‌ రెండేసి సెంచరీలు చేశారు.



స్కోరు వివరాలు

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) రహానే (బి) కుల్దీప్‌ 56; రెన్‌షా (బి) ఉమేశ్‌ 1; స్మిత్‌ (సి) రహానే (బి) అశ్విన్‌ 111; షాన్‌ మార్ష్ (సి) సాహా (బి) ఉమేశ్‌ 4; హ్యాండ్స్‌కోంబ్‌ (బి) కుల్దీప్‌ 8; మ్యాక్స్‌వెల్‌ (బి) కుల్దీప్‌ 8; వేడ్‌ (బి) జడేజా 57; కమిన్స్‌ (సి అండ్‌ బి) కుల్దీప్‌ 21; ఒకీఫ్‌ (రనౌట్‌) 8; లయన్‌ (సి) పుజారా (బి) భువనేశ్వర్‌ 13; హాజల్‌వుడ్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (88.3 ఓవర్లలో ఆలౌట్‌) 300.



వికెట్ల పతనం: 1–10; 2–144; 3–153; 4–168; 5–178; 6–208; 7–245; 8–269; 9–298; 10–300.



బౌలింగ్‌: భువనేశ్వర్‌ 12.3–2–41–1; ఉమేశ్‌ 15–1–69–2; అశ్విన్‌ 23–5–54–1; జడేజా 15–1–57–1; కుల్దీప్‌ 23–3–68–4.



భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రాహుల్‌ (బ్యాటింగ్‌) 0; విజయ్‌ (బ్యాటింగ్‌) 0; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (1 ఓవర్లో) 0.

బౌలింగ్‌: హాజల్‌వుడ్‌ 1–1–0–0.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top