భారత్‌ శుభారంభం

భారత్‌ శుభారంభం


ఆసియా మిక్స్‌డ్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌



హో చి మిన్‌ (వియత్నాం): స్టార్‌ ప్లేయర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌ లేకున్నా... ఆసియా మిక్స్‌డ్‌ టీమ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ శుభారంభం చేసింది. బుధవారం జరిగిన గ్రూప్‌ ‘డి’ తొలి లీగ్‌ మ్యాచ్‌లో టీమిండియా 4–1తో సింగపూర్‌ను ఓడించింది. తొలి మ్యాచ్‌గా జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్‌ చోప్రా ద్వయం 21–23, 17–21తో యోంగ్‌ కాయ్‌ టెర్రీ హీ–వీ హాన్‌ తాన్‌ జోడీ చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత రెండో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో సమీర్‌ వర్మ 21–9, 21–16తో కీన్‌ యూ లోపై గెలిచి స్కోరును 1–1తో సమం చేశాడు.



మూడో మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో సుమీత్‌ రెడ్డి–మనూ అత్రి జంట 21–12, 21–17తో డానీ బావా క్రిస్‌నాంతా–హెండ్రా విజయా జోడీపై గెలిచి భారత్‌కు 2–1తో ఆధిక్యాన్ని అందించింది. నాలుగో మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో జాతీయ చాంపియన్‌ రితూపర్ణ దాస్‌ 23–21, 21–18తో జియోయు లియాంగ్‌ను ఓడించి భారత్‌ విజయాన్ని ఖాయం చేసింది. నామమాత్రమైన మహిళల డబుల్స్‌ మ్యాచ్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జంట 19–21, 21–17, 21–17తో రెన్‌నె ఓంగ్‌–జియా యింగ్‌ క్రిస్టల్‌ వోంగ్‌ జోడీపై గెలిచింది. గురువారం జరిగే రెండో లీగ్‌ మ్యాచ్‌లో కొరియాతో భారత్‌ తలపడుతుంది.  

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top