28 సంవత్సరాల తర్వాత...



 


- పతకం ఖాయం చేసుకున్న బ్యాడ్మింటన్ జట్టు

- సెమీస్‌కు చేరిన మహిళలు స్క్వాష్‌లోనూ పతకం ఖాయం  

- కల్పనకు చేజారిన కాంస్యం

ఇంచియాన్:
ఆసియా గేమ్స్‌లో భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు చరిత్ర సృష్టించనుంది. తొలి రోజు శనివారం జరిగిన క్వార్టర్  ఫైనల్లో థాయ్‌లాండ్ జట్టును 3-2తో నిలువరించి సెమీస్‌కు చేరింది. దీంతో ఈ జట్టుకు కనీసం కాంస్య పతకం ఖాయమైంది. 1986 సియోల్ గేమ్స్ అనంతరం భారత్‌కు ఈ క్రీడలో ఏ విభాగంలోనూ ఇప్పటిదాకా పతకం రాలేదు. 28 ఏళ్ల క్రితం పురుషుల టీమ్ ఈవెంట్లో భారత్‌కు కాంస్యం లభించింది. క్వార్టర్స్ తొలి సింగిల్స్ మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ 21-15, 17-21, 21-18 తేడాతో ప్రపంచ మాజీ చాంపియన్ రత్చనోక్ ఇంటనోన్‌ను కంగుతినిపించి అదిరిపోయే ఆరంభాన్నిచ్చింది.



రెండో సింగిల్స్‌లో సింధు 21-15, 21-13 తేడాతో సునాయాసంగా పోర్న్‌టిప్ బురానాప్రసెర్సుక్‌ను ఓడించి 2-0 ఆధిక్యాన్ని అందించింది. కానీ మూడో సింగిల్స్‌లో మాత్రం తులసి చంద్రిక 12-21, 14-21 తేడాతో బుసానన్‌పై ఓడింది. ఆ తర్వాత డబుల్స్‌లోనూ సిక్కి రెడ్డి, ప్రద్న్యా గాద్రే నిరాశపరచడంతో చివరిదైన ఐదో మ్యాచ్ కీలకంగా మారింది. ఇందులో సింధు, అశ్విని జోడి ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా ఆడి భారత శిబిరంలో ఆనందం నింపింది. సరళీ, సప్సిరీని 21-16, 21-17 తేడాతో ఓడించి భారత్‌ను సెమీస్‌కు చేర్చింది. ఆదివారం జరిగే సెమీస్‌లో భారత్.. కొరియాను ఢీకొంటుంది. అంతకుముందు జరిగిన పురుషుల ప్రిక్వార్టర్స్ పోరులో భారత్ 0-3తో  కొరియా చేతిలో ఘోరంగా ఓడింది.

 

‘ఇప్పుడు నేను కోర్టులో వేగంగా కదలగలుగుతున్నాను. ఈ లోపాన్ని సరిదిద్దుకునేందుకే నేను మూడు వారాల పాటు బెంగళూరులో కోచ్ విమల్ దగ్గర శిక్షణ తీసుకున్నాను. అందుకే ఆసియా గేమ్స్‌లో గోపీచంద్‌కన్నా ఆయనే నా పక్కన ఉంటే బావుంటుందనిపించింది’    - సైనా నెహ్వాల్

 

ఇతర క్రీడల్లో భారత్ ఫలితాలు

జూడో: మహిళల 52 కేజీ విభాగం కాంస్య పతక పోరులో కల్పనా దేవి 1-2 తేడాతో లెనరియా (కజకిస్థాన్) చేతిలో ఓడింది. పురుషుల 60 కేజీ ఎలిమినేషన్ రౌండ్ క్వార్టర్స్‌లో నవ్‌జ్యోత్ చనా 0-2 తేడాతో బోల్డ్ బాతర్ (మంగోలియా) చేతిలో ఓడాడు.



 స్క్వాష్: మహిళల విభాగంలో దీపిక పల్లికల్, జోష్నా చిన్నప్పలు క్వార్టర్స్‌లో తలపడేందుకు సిద్ధమయ్యారు. తమ తొలి రౌండ్స్‌లో వీరు విజయాలు సాధించారు. దీంతో భారత్‌కు కనీసం కాంస్యం ఖాయమైంది. అలాగే పురుషుల విభాగంలో సౌరవ్ ఘోషాల్, హరీందర్ పాల్ సింగ్ కూడా క్వార్టర్స్‌కు చేరారు.

 

టెన్నిస్: మహిళల టెన్నిస్ టీమ్ ఈవెంట్ తొలి రౌండ్‌లో భారత జట్టు 3-0 తేడాతో నెగ్గింది. తొలి మ్యాచ్‌లో ప్రార్థన, రెండో మ్యాచ్‌లో అంకిత రైనా నెగ్గగా మూడో మ్యాచ్‌లో రిషిక సుంకరకు ప్రత్యర్థి నుంచి వాకోవర్ లభించింది.

 

వెయిట్‌లిఫ్టింగ్: గేమ్స్ తొలి రోజు బరిలోకి దిగిన ముగ్గురు భారత లిఫ్టర్లు నిరాశపరిచారు. మహిళల 48 కేజీ విభాగంలో సంజిత చాను 166 కేజీల బరువునెత్తి 10వ స్థానం, మీరాబాయి చాను 171 కేజీలతో 9వ స్థానంలో నిలిచారు. పురుషుల 56 కేజీ విభాగంలో సుఖేన్ డే 12వ స్థానంలో నిలిచాడు.

 

బాస్కెట్‌బాల్: పురుషుల గ్రూప్ ‘బి’ క్వాలిఫయింగ్ రౌండ్‌లో భారత జట్టు 89-49 తేడాతో పాలస్తీనాపై నెగ్గింది.

 

హ్యాండ్‌బాల్: పురుషుల ప్రిలిమినరీ రౌండ్‌లో చైనీస్ తైపీ చేతిలో భారత్ 20-39 తేడాతో ఓడింది. అలాగే మహిళల ప్రిలిమినరీ రౌండ్‌లో కొరియా చేతిలో 11-47 తేడాతో ఓడింది.

 

వాలీబాల్: పురుషుల ప్రిలిమినరీ రౌండ్‌లో భారత్ 3-1 తేడాతో హాంకాంగ్‌పై, మహిళల ప్రిలిమినరీ రౌండ్‌లో కొరియాపై 0-3 తేడాతో ఓడింది.

 

ఈక్వెస్ట్రియన్: మహిళల డ్రెసేజ్ టీమ్ ప్రిక్స్ సెయింట్ జార్జెస్‌లో భారత జట్టు ఆరో స్థానంలో నిలిచింది.

 

వుషు: పురుషుల సాండా 60 కేజీ విభాగంలో నరేందర్ గరేవాల్, మహిళల సాండా 52 కేజీ విభాగంలో సనతోయ్ దేవి క్వార్టర్స్‌కు చేరారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top