గాయంతో బాధపడుతున్న అశ్విన్!

గాయంతో బాధపడుతున్న అశ్విన్!


 కోల్‌కతా: గాయపడిన పేసర్ ఇషాంత్ శర్మ స్థానంలో రెండో టెస్టు కోసం ఆఫ్ స్పిన్నర్ జయంత్ యాదవ్‌ను ఎంపిక చేయడం ఆశ్చర్యం కలిగించింది. అయితే ప్రధాన స్పిన్నర్ అశ్విన్ చేతి వేలికి గాయంతో బాధపడుతుండటంతో ముందు జాగ్రత్తగా జయంత్‌ను పిలిపించినట్లు తెలిసింది. కుడి చేతి మధ్య వేలుకు గాయంతోనే అశ్విన్ కాన్పూర్ టెస్టులో బౌలింగ్ చేశాడు. టెస్టు ప్రారంభానికి కూడా నొప్పి తగ్గకపోతే జయంత్‌కు అవకాశం దక్కవచ్చు కూడా. బుధవారం జరిగిన ఆప్షనల్ ప్రాక్టీస్‌కు అశ్విన్‌తో పాటు మరికొందరు భారత ఆటగాళ్లు కూడా దూరంగా ఉన్నారు. అనూహ్య బౌన్‌‌సకు అలవాటు పడేందుకు కోహ్లి రబ్బర్ బాల్‌తో సాధన చేశాడు.

 

గంభీర్ జట్టులోకి వచ్చినా... రెండో టెస్టులో ధావన్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నారుు. అతను సుదీర్ఘ సమయం పాటు నెట్స్‌లో పాల్గొన్నాడు. కాన్పూర్ టెస్టు ముగిసిన తర్వాత కూడా ధావన్‌తో కుంబ్లే, బంగర్ ప్రత్యేకంగా సాధన చేయించారు. ప్రాక్టీస్ ముగిశాక కోహ్లి ఓ వాణిజ్య ప్రకటన షూటింగ్‌లో పాల్గొన్నాడు. మరోవైపు న్యూజిలాండ్ ఆటగాళ్లు ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్నారు. వారిలో చాలా మంది కోల్‌కతాలో షాపింగ్‌కు వెళ్లి సరదాగా గడిపారు.

 

 అశ్విన్‌కు రెండో ర్యాంక్

 దుబాయ్: కాన్పూర్ టెస్టులో పది వికెట్లతో అద్భుతంగా రాణించిన భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (871 పాయింట్లు) ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్‌‌సలో రెండో స్థానానికి ఎగబాకాడు. కోల్‌కతా టెస్టులోనూ రాణిస్తే అశ్విన్ మరోసారి టాప్ ర్యాంకుకు చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం 878 పాయింట్లతో డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ కేవలం ఒక పాయింట్ తేడాతో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో అశ్విన్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. టెస్టు బ్యాట్స్‌మెన్ జాబితాలో 906 పాయింట్లతో స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) అగ్రస్థానంలో ఉండగా..జో రూట్ (ఇంగ్లండ్)ను వెనక్కినెట్టి విలియమ్సన్ (న్యూజిలాండ్) రెండో స్థానాన్ని సంపాదించాడు. భారత ఆటగాళ్లలో రవీంద్ర జడేజా 7వ స్థానంలో, విజయ్, రాహుల్ సంయుక్తంగా 16వ ర్యాంకులో, కోహ్లి 20వ ర్యాంకులో ఉన్నారు.       

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top