నిలబెట్టే ‘ఇంజినీర్’

నిలబెట్టే ‘ఇంజినీర్’ - Sakshi


ఏడాది కాలంగా అశ్విన్ నిలకడ                          

భారత్ ప్రధానాస్త్రంగా ఎదుగుదల


 

క్రీడా విభాగం శ్రీలంకతో సిరీస్‌లో అశ్విన్ తన స్పిన్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను భయభ్రాంతులకు గురి చేశాడు. తొలి టెస్టులో 6, 4 వికెట్లు... రెండో టెస్టులో 2, 5 వికెట్లు... మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు కీలక వికెట్లతో విజయంలో కీలక పాత్ర. ఈ సిరీస్‌లో సంగక్కరతో పాటు తిరిమన్నెను కూడా అతను నాలుగు సార్లు అవుట్ చేశాడు. ముఖ్యంగా ఎడమచేతి వాటం ఆటగాళ్లు అశ్విన్ బంతుల్ని ఆడలేకపోయారు. సిరీస్ అనంతరం లంక దిగ్గజం సనత్ జయసూర్య మాట్లాడుతూ...‘మా జట్టు సాధారణంగా స్పిన్‌ను బాగా ఆడుతుంది. కానీ స్పిన్ బౌలింగ్ కూడా ఇంత ప్రమాదకరంగా ఉంటుందని అశ్విన్ చూపించాడు’ అంటూ ప్రశంసలు కురిపించాడు. ఈ ఏడాది ఐదు టెస్టుల్లో కలిపి అశ్విన్ 38 వికెట్లు తీశాడు.



 ప్రాక్టీస్...ప్రాక్టీస్...

 కెరీర్ ఆరంభంలో సంప్రదాయ ఆఫ్ బ్రేక్ బంతులపైనే దృష్టి పెట్టిన అశ్విన్ తర్వాత వైవిధ్యం కోసం తీవ్రంగా శ్రమించాడు. ఆర్మ్ బాల్, క్యారమ్ బాల్ టాప్ స్పిన్‌లతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టి పడేశాడు. ఐసీసీ ప్రకారం నిషేధం బారిన పడకుండా ప్రస్తుతం క్రికెట్‌లో ఉన్న అసలైన ఆఫ్‌స్పిన్నర్‌గా అతను కితాబందుకున్నాడు. అందు కోసం దూస్రాను పక్కన పెట్టేసినా...  పరిమిత ఓవర్ల మ్యాచ్‌లతో పోలిస్తే టెస్టుల కోసం అతను తీవ్రంగా శ్రమించాడు. ఇటీవల జింబాబ్వే టూర్‌కు దూరంగా ఉన్న అతను శ్రీలంక సిరీస్ కోసం ప్రత్యేకంగా తన సొంత అకాడమీలో సాధన చేశాడు. ‘గత ఏడాది కాలంగా నేను టెస్టుల కోసం ఎంతో కష్టపడ్డాను. టెస్టు మ్యాచ్‌లంటే చిన్న పిల్లల ఆట కాదు. ఆటకు సంబంధించి ప్రతీ చిన్న అంశంపై కూడా పట్టు సాధించాలని, ఎలాంటి లోపాలు లేకుండా ఉండాలని ప్రయత్నించా. అది ఈ సిరీస్‌లో ఫలితాన్ని ఇచ్చింది’ అని అశ్విన్ వ్యాఖ్యానించాడు.  ఈ సిరీస్‌లో స్పిన్, బౌన్స్, పేస్... ఇలా మూడు రకాలుగా భిన్నంగా స్పందించిన మూడు వేదికలపై కూడా అతను రాణించడం విశేషం. భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ఇటీవలి తన ఎదుగుదలలో కీలక పాత్ర పోషించారని అతను చెప్పుకున్నాడు.



 అత్యుత్తమ దశ

 భారత అత్యుత్తమ ఓపెనింగ్ బౌలర్ ఎవరు... గత ఐదేళ్లలో ప్రపంచ క్రికెట్‌లో రెండో అత్యుత్తమ ఓపెనింగ్ బౌలర్ ఎవరు... ఈ రెండింటికి సమాధానం ఒక్కటే. అది ఒక స్పిన్నర్ అయిన రవిచంద్రన్ అశ్విన్ కావడం విశేషం. కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. 14 ఇన్నింగ్స్‌లలో ఓపెనింగ్ బౌలింగ్ చేసిన అశ్విన్ 21.48 సగటుతో 45 వికెట్లు తీశాడు. నాటి అమర్ సింగ్, కపిల్‌దేవ్‌ల కాలంనుంచి ఇటీవలి పంకజ్ సింగ్ వరకు కూడా ఇదే బెస్ట్. గత ఐదేళ్లలో స్టెయిన్ (20.69) తర్వాత ఒక ఆరంభ బౌలర్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. పేసర్‌లను వెనక్కి తోసి కొత్త బంతితో కూడా అద్భుతాలు చేయగల అశ్విన్ విలువేమిటో ఇది చూపిస్తుంది. బంతి పాతబడినా, కొత్తదైనా అతను మాయ చేయగలడనేది నిజం. ‘30 టెస్టులు కూడా ఆడక ముందే దాదాపు 150 వికెట్లు తీయడం గొప్ప ప్రదర్శన. ఇలాగే ఆడితే అతను దిగ్గజాలలో ఒకడిగా నిలుస్తాడు’ అని స్పిన్ మాంత్రికుడు మురళీధరన్ అభిప్రాయ పడ్డారు.



 సింగిల్ హ్యాండ్

 ఒకప్పుడు అనిల్ కుంబ్లే, ఆ తర్వాత హర్భజన్ సింగ్‌లాగే ఇప్పుడు అశ్విన్ భారత జట్టు ప్రధానాయుధం. లంక సిరీస్‌లో లోయర్ ఆర్డర్ వికెట్లతో మరో వైపు మిశ్రా అండగా నిలిచినా... ఇతర సిరీస్‌లలో అశ్విన్ ఒంటి చేత్తో జట్టును గెలిపించాడు. స్పిన్ వికెట్టే కాదు, కాస్త బౌన్స్ ఉన్నా... మంచి ఫలితం రాబట్టగల నైపుణ్యం అశ్విన్‌లో ఉంది. ఇటీవల ఆస్టేలియాలో జరిగిన సిరీస్‌లోనూ మూడు టెస్టుల్లో 12 వికెట్లు తీసిన అతను ఆ తర్వాత వరల్డ్ కప్‌లోనూ సత్తా చాటాడు. ‘ప్లేయర్ విత్ బ్రెయిన్’ అనేది అతని సన్నిహితులు అశ్విన్ తెలివితేటల గురించి చెప్పే మాట. నిజంగానే అంతర్జాతీయ మ్యాచ్‌లనుంచి ఐపీఎల్ వరకు కీలక సమయాల్లో ఒత్తిడికి తలవంచకుండా అతను అనేక సార్లు తీసిన వికెట్లు మ్యాచ్‌లను మలుపు తిప్పాయి. కుంబ్లేలాగే తన ఇంజినీరింగ్ విద్య అప్పుడప్పుడు ఆటలోనూ అక్కరకు వచ్చిందని ఈ చెన్నై బౌలర్ సరదాగా చెబుతాడు.

 

అశ్విన్ టెస్టు క్రికెట్‌లో అడుగు పెట్టి నాలుగేళ్లు కూడా కాలేదు. అతను వచ్చాక భారత్ ఐదు సిరీస్‌ల్లో గెలిచింది. అందులో నాలుగింటిలో అతనే మ్యాన్ ఆఫ్ ద సిరీస్. భారత్ తరఫున నాలుగు లేదా ఐదు సార్లు మ్యాన్ ఆఫ్ సిరీస్ గెలిచిన మిగతా ఐదుగురు ఆటగాళ్లు కనీసం 100 టెస్టులు ఆడారు. అశ్విన్ కెరీర్ వయసు ఇంకా 28 టెస్టులే. ఈ గణాంకాలు చాలు అతను భారత టెస్టు విజయాల్లో ఎంత కీలక ఆటగాడో చెప్పడానికి. ఇప్పటి వరకు సొంతగడ్డపైనే చెలరేగుతూ వచ్చిన అశ్విన్... తాజాగా శ్రీలంకలోనూ సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. భారత టెస్టు జట్టును ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఒంటిచేత్తో నిలబెడుతున్నాడు.

 

 బ్యాటింగ్‌లోనూ బహు బాగు

 శ్రీలంకతో మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ చేసిన అర్ధ సెంచరీ జట్టు భారీ స్కోరుకు ఉపయోగపడింది. ఈ ఆఫ్ స్పిన్నర్ బ్యాటింగ్ జట్టుకు ఎంతో అండగా మారుతోంది.  టెస్టుల్లో 32.44 సగటుతో అతను 2 సెంచరీలు, 5 అర్ధ సెంచరీలు చేయడం అతని బ్యాటింగ్ బలాన్ని చూపిస్తుంది. ఈ నైపుణ్యమే కోహ్లి ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగేలా ప్రోత్సహిస్తోంది. అశ్విన్ బ్యాటింగ్ శైలిని ముచ్చటగా కొంత మంది కామెంటేటర్లు వీవీఎస్ అశ్విన్ అంటూ మెచ్చుకున్నారు. నెట్స్‌లో కూడా బౌలింగ్‌కు ముందే అతను బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తాడు. పేస్, స్పిన్ రెండింటినీ సమర్థంగా ఎదుర్కోగల అశ్విన్ జూనియర్ క్రికెట్ తరహాలో ఏదో ఒక రోజు టాప్-4లో బ్యాటింగ్ చేయడమే తన లక్ష్యమని చెప్పుకోవడం విశేషం.

 

 టాప్-20లోకి ఇషాంత్, పుజారా

 దుబాయ్: శ్రీలంకతో సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన భారత ఆటగాళ్లు ఇషాంత్ శర్మ, చతేశ్వర్ పుజారా ఐసీసీ టెస్టు ర్యాం కింగ్స్‌లో టాప్-20లోకి చేరుకున్నారు. బౌలర్ల జాబితాలో మూడు స్థానాలు మెరుగు పర్చుకున్న ఇషాంత్ 18వ స్థానంలో నిలిచాడు. బ్యాట్స్‌మెన్ ర్యాంకుల్లో నాలుగు స్థానాలు ముందుకు వచ్చిన పుజారా 20వ స్థానంలో నిలిచాడు. అతను టాప్-20లోకి రావడం కెరీర్‌లో ఇదే తొలిసారి. కోహ్లి 11వ స్థానానికి దిగజారడంతో భారత్‌నుంచి ఒక్కరూ కూడా టాప్-10 జాబితాలో లేరు.

 

 సవాల్ సిద్ధంగా ఉంది

 అశ్విన్ తన 28 టెస్టుల కెరీర్‌లో 15 సొంతగడ్డపైనే ఆడాడు. ఇక్కడే 24.12 సగటుతో 95 వికెట్లు తీశాడు. అయితే రానున్న దక్షిణాఫ్రికా సిరీస్ అతనికి చాలెంజ్. గతంలో భారత్‌లో పర్యటించిన అన్ని టెస్టు జట్లలోకి దక్షిణాఫ్రికా పటిష్టం. స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కోగల బ్యాట్స్‌మెన్ ఆ జట్టులో ఎక్కువ మంది ఉన్నారు. దాదాపు రెండేళ్ల క్రితం దక్షిణాఫ్రికాతో జొహన్నెస్‌బర్గ్‌లో తన ఏకైన టెస్టు ఆడిన అశ్విన్ 42 ఓవర్లు వేసినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇప్పుడు దానికి బదులు తీర్చుకునే సమయం వచ్చింది. రెండో స్పిన్నర్‌గా ఎవరు ఉన్నా... అశ్విన్ ప్రదర్శనపైనే జట్టు ఆధారపడుతుంది. 2012లో అశ్విన్ వైఫల్యం (4 టెస్టుల్లో 14 వికెట్లు) ఇంగ్లండ్ చేతిలో భారత్‌కు సొంతగడ్డపై ఓటమిని మిగిల్చింది. ఈ సారి అలాంటి భంగపాటు ఎదురు కాకుండా అశ్విన్ చెలరేగాలి. లేకపోతే దక్షిణాఫ్రికాను భారత్ ఓడించడం చాలా కష్టం.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top