అనుభవంతో అన్నీ నేర్చుకుంటా

అనుభవంతో అన్నీ నేర్చుకుంటా - Sakshi


ప్రతిసారీ 100 శాతం ప్రదర్శన ఇవ్వలేం  

 బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వ్యాఖ్య


 

 సాక్షి, హైదరాబాద్: గత ఏడాది కాలంగా తన ఆటలో ఎంతో మార్పు వచ్చిందని, తప్పులు సరిదిద్దుకొని భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తానని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు వ్యాఖ్యానించింది. డెన్మార్క్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన సింధు, మంగళవారం స్వస్థలం చేరుకున్న అనంతరం మీడియాతో మాట్లాడింది. ‘ఏడాది కాలంలో ఎంతో మంది అగ్రశ్రేణి క్రీడాకారిణులను ఓడించాను. నా ఆట కూడా ఎంతో మెరుగైంది.

 

 అయితే ప్రతిసారీ 100 శాతం ప్రదర్శన ఇవ్వడం సాధ్యం కాదు. అనుభవం పెరిగిన కొద్దీ తప్పులనుంచి పాఠాలు నేర్చుకుంటున్నాను. నా మొదటి కాంస్యంతో పోలిస్తే ఇదే నాకు ఎక్కువ సంతృప్తినిచ్చింది’ అని సింధు చెప్పింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో వరుసగా రెండో ఏడాది పతకం సాధించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ‘చాలా ఆనందంగా ఉంది. సెమీస్‌కు ముందు మ్యాచ్‌లలో అలసిపోవడం వల్ల ఓడానని సాకు చెప్పను. కరోలినా చాలా బాగా ఆడింది. ఆసియా క్రీడల్లో పతకం సాధించడమే ప్రస్తుత నా లక్ష్యం’ అని సింధు వెల్లడించింది.

 

 సంతృప్తిగా ఉంది

 టోర్నీలో భారత ఆటగాళ్ల ప్రదర్శన ఓవరాల్‌గా తనకు సంతృప్తినిచ్చిందని జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు.  ‘సింధు పతకం నిలబెట్టుకోవడం సాధారణ విషయం కాదు. సైనాకు అదృష్టం కలిసి రాలేదు. కశ్యప్, శ్రీకాంత్‌ల నుంచి మరింత మంచి ఫలితాలను ఆశించినా సాధ్యం కాలేదు’ అని గోపి చెప్పారు. మరో వైపు పెద్ద టోర్నీలలో చైనా క్రీడాకారిణులను పరిమిత సంఖ్యలో అనుమతించాలన్న సైనా వ్యాఖ్యలపై స్పందిస్తూ...ఆ అవసరం లేదని, టాప్ టోర్నీల్లో టాప్ ప్లేయర్లు ఆడటం సరైందేనని అభిప్రాయ పడ్డారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top