భారత్‌కు చుక్కెదురు

భారత్‌కు చుక్కెదురు


సెమీస్‌లో బెల్జియం చేతిలో ఓటమి  

 ఫ్లోరెంట్ ‘హ్యాట్రిక్’  

 హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నీ


 

 యాంట్‌వార్ప్: ఊహించినట్లుగానే బెల్జియం స్ట్రయికర్ల దాడుల ముందు భారత డిఫెన్స్ మూగబోయింది. ఆరంభంలో చూపిన అలసత్వం నుంచి తేరుకునేలోపే ప్రత్యర్థి జట్టు మ్యాచ్‌ను ఎగురేసుకుపోయింది. దీంతో హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్‌లో భారత్‌కు ఫైనల్ బెర్త్ దూరమైంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో బెల్జియం 4-0తో భారత్‌పై నెగ్గి తుది పోరుకు అర్హత సాధించింది. వాన్ అబెల్ ఫ్లోరెంట్ (2వ, 41వ, 53వ ని.లో) ‘హ్యాట్రిక్’ గోల్స్ చేయగా, కొసిన్స్ టాంగే (8వ ని.లో) ఒక గోల్ సాధించాడు. భారత డిఫెన్స్ బలహీనంగా ఉండటంతో తొలి క్వార్టర్‌లో బెల్జియం ఆటగాళ్లు మెరుపు వేగంతో ఆడారు. షార్ట్ పాస్‌లతో బంతిని ఎక్కువసేపు ఆధీనంలో ఉంచుకుని అదను చూసి దెబ్బకొట్టారు.

 

  వాళ్ల వేగాన్ని అందుకోవడంలో విఫలమైన భారత్ 8 నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ సమర్పించుకుంది. లెఫ్ట్ ఫ్లాంక్‌లో టామ్ బూన్ అందించిన బంతిని డి-సర్కిల్‌లో ఫ్లోరెంట్ రివర్స్ షాట్‌తో గోల్‌గా మల్చాడు. తర్వాత జస్‌జీత్ కాలికి బంతి తగలడంతో లభించిన తొలి పెనాల్టీని స్ట్రయికర్ టాంగే నేర్పుగా గోల్‌గా మల్చాడు. ఇక స్కోరును సమం చేసేందుకు భారత్ చేసిన కౌంటర్ అటాక్‌ను ప్రత్యర్థి గోలీ సమర్థంగా తిప్పికొట్టాడు.

 

  మూడో క్వార్టర్‌లో భారత్‌కు రెండు పెనాల్టీలు లభించినా... రూపిందర్ వృథా చేశాడు, రెండుసార్లు బంతిని వైడ్‌గా కొట్టడంతో భారత్ ఆశలు సన్నగిల్లాయి. ఇక నాలుగో క్వార్టర్‌లో భారత్ ఎదురుదాడులు ప్రారంభించినా ప్రయోజనం లేకపోయింది.

 

 48వ నిమిషంలో బెల్జియంకు మూడో పెనాల్టీ లభించినా వృథా అయ్యింది. 52వ నిమిషంలో నాలుగో పెనాల్టీ కార్నర్‌ను ఫోర్లెంట్ గోల్‌గా మల్చడంతో బెల్జియం 4-0 ఆధిక్యంలోకి వెళ్లింది. 5-8 స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో ఐర్లాండ్ 1-0తో పాక్‌పై నెగ్గింది. దీంతో పాక్ జట్టు రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయింది.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top