‘బంగారు’ చేపలు

‘బంగారు’ చేపలు


* స్విమ్మింగ్‌లో భారత్‌కు ఏడు  స్వర్ణాలు

* దక్షిణాసియా క్రీడలు

* ఆర్చరీ, అథ్లెటిక్స్‌లో ఐదేసి పసిడి పతకాలు


గుహవాటి / షిల్లాంగ్: దక్షిణాసియా క్రీడల్లో భారత క్రీడాకారుల ఆధిపత్యం కొనసాగుతోంది. మంగళవారం స్విమ్మింగ్‌లో సంచలన ప్రదర్శనతో చెలరేగిన స్విమ్మర్లు ఏడు స్వర్ణాలతో మెరవగా, ఆర్చరీ, అథ్లెటిక్స్‌లో చెరో ఐదు పసిడి పతకాలతో కనువిందు చేశారు. ఓవరాల్‌గా నాలుగో రోజుకు  భారత్ 124 (78 స్వర్ణాలు, 36 రజతాలు, 10 కాంస్యాలు) పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

 

స్విమ్మింగ్‌లో 400 మీ. ఫ్రీస్టయిల్‌లో సౌరభ్ సంగ్వేకర్ (3:58.84 సెకన్లు) గేమ్స్ రికార్డుతో తొలి స్వర్ణాన్ని అందించాడు. మహిళల కేటగిరీలో మాల్విక (4:30.08 సెకన్లు) మీట్ రికార్డుతో పసిడిని సాధించింది. పురుషుల 200 మీటర్ల బటర్‌ఫ్లయ్‌లో సాజన్ ప్రకాశ్ (2:03.08 సెకన్లు), మహిళల్లో దామిని గౌడ (2:21.12 సెకన్లు) స్వర్ణాలు నెగ్గారు. పురుషుల 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో పీఎస్. మధు (28.26 సెకన్లు) స్వర్ణం గెలిచాడు.  4ఁ200 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో పురుషుల, మహిళల జట్లకు పసిడి పతకాలు లభించాయి.

 

ఆర్చరీలో మహిళల రికర్వ్‌లో దీపికా, లక్ష్మీరాణి, బాంబేలాదేవి బృందం, పురుషుల్లో తరుణ్‌దీప్ రాయ్, గురుచరణ్ బెస్రా, జయంత్ తాలుక్‌దారుల జట్టు స్వర్ణాలు గెలిచాయి. రికర్వ్ మిక్స్‌డ్ పెయిర్‌లో తరుణ్‌దీప్, దీపిక స్వర్ణం నెగ్గారు. మహిళల వ్యక్తిగత రికర్వ్‌లో దీపిక, పురుషుల రికర్వ్‌లో తరుణ్‌దీప్ బంగారు పతకాలు నెగ్గారు.  

 ట్రాక్ అండ్ ఫీల్డ్‌లోనూ భారత అథ్లెట్ల హవా కొనసాగింది. తొమ్మిది ఈవెంట్లలో ఐదు స్వర్ణాలు, ఆరు రజతాలు, మూడు కాంస్యాలతో సత్తా చాటారు.



మహిళల షాట్‌పుట్‌లో మన్‌ప్రీత్ కౌర్ (17.94 మీటర్లు)కు స్వర్ణం, మన్‌ప్రీత్ కౌర్ జూనియర్ (15.94 మీటర్లు) రజతం దక్కాయి. పురుషుల హామర్ త్రోలో నీరజ్ కుమార్ (66.14 మీటర్లు), మహిళల లాంగ్ జంప్‌లో మయూకా జానీ (6.43 మీటర్లు) స్వర్ణాలతో మెరిశారు. జానీ సహచరిణి శ్రద్ధ (6.19 మీటర్లు) రజతం నెగ్గింది. పురుషుల 5 వేల మీటర్లలో మాన్ సింగ్ (14:02.04 సెకన్లు) కనకం, సురేష్ కుమార్ (14:02.70 సెకన్లు) రజతం సాధించారు.



మహిళల్లో సూర (15:45.75 సెకన్లు), స్వాతే గధావే (16:14.56 సెకన్లు) వరుసగా స్వర్ణం, రజతం సంపాదించారు. పురుషుల హైజంప్‌లో తేజస్విన్ శంకర్ (2.17 మీటర్లు) రజతం, మహిళల 800 మీటర్లలో గౌతమి (2:19.99 సెకన్లు), పురుషుల్లో అజయ్ కుమార్ (2.17 మీటర్లు) కాంస్యాలను గెలుచుకున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top