ఇవనోవిచ్ జోరు

ఇవనోవిచ్ జోరు


ప్రిక్వార్టర్స్‌లో సెర్బియా స్టార్  

షరపోవా, మకరోవా కూడా

11వ సీడ్ కెర్బర్‌కు షాక్  

ఫ్రెంచ్ ఓపెన్


 

 పారిస్ : తొలి రెండు రౌండ్లలో చెమటోడ్చిన మాజీ చాంపియన్ అనా ఇవనోవిచ్ మూడో రౌండ్‌లో మాత్రం చెలరేగింది. కేవలం 52 నిమిషాల్లో తన ప్రత్యర్థి ఆట కట్టించింది. సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్‌లో ఏడో సీడ్ ఇవనోవిచ్ 6-0, 6-3తో డోనా వెకిక్ (క్రొయేషియా)పై అలవోకగా గెలిచింది. 19 విన్నర్స్ కొట్టిన ఇవనోవిచ్ 11 అనవసర తప్పిదాలు చేసింది. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ షరపోవా (రష్యా), తొమ్మిదో సీడ్ మకరోవా (రష్యా), 13వ సీడ్ సఫరోవా (చెక్ రిపబ్లిక్) కూడా ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించారు.



మూడో రౌండ్‌లో షరపోవా 6-3, 6-4తో 26వ సీడ్ సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా)పై, మకరోవా 6-2, 6-4తో వెస్నినా (రష్యా)పై, సఫరోవా 6-3, 7-6 (7/2)తో 20వ సీడ్ సబీనా లిసికి (జర్మనీ)పై గెలిచారు. ఇతర మ్యాచ్‌ల్లో ముగురుజా (స్పెయిన్) 4-6, 6-2, 6-2తో 11వ సీడ్  కెర్బర్ (జర్మనీ)పై, ఫ్లావియా పెనెట్టా (ఇటలీ) 6-3, 6-4తో ఎనిమిదో సీడ్ కార్లా సురెజ్ నవారో (స్పెయిన్) పై సంచలన విజయం సాధించారు. రెండో రౌండ్‌లో మూడో సీడ్, నిరుటి రన్నరప్ సిమోనా హలెప్‌ను బోల్తా కొట్టించిన మిర్యానా లూసిచ్ బరోనీ (క్రొయేషియా) మూడో రౌండ్‌లో 6-4, 3-6, 5-7తో అలీజా కార్నె (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయింది.



 ఎదురులేని ఫెడరర్

 పురుషుల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) తన జోరును కొనసాగిస్తున్నాడు. మూడో రౌండ్‌లో ఫెడరర్ 6-4, 6-3, 6-2తో దామిర్ జుముర్ (బోస్నియా అండ్ హెర్జెగోవినా)పై గెలిచాడు. 20వ సీడ్ రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. మూడో రౌండ్‌లో నాలుగో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్) 6-1, 6-7 (5/7), 6-3, 6-4తో పెయిర్ (ఫ్రాన్స్)పై, ఎనిమిదో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 6-4, 6-3, 6-2తో జాన్సన్ (అమెరికా)పై, 12వ సీడ్ సిమోన్ (ఫ్రాన్స్) 6-2, 6-7 (6/8), 6-7 (6/8), 6-3, 6-1తో నికొలస్ మహుట్ (ఫ్రాన్స్)పై,  20వ సీడ్ రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్) 3-6, 6-3, 6-1, 4-6, 6-1తో బెర్లోక్ (అర్జెంటీనా)పై నెగ్గారు.



 సానియా జంట ముందంజ

 మహిళల డబుల్స్ రెండో రౌండ్‌లో సానియా మీర్జా (భారత్) -మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) ద్వయం 6-3, 6-4తో ఫోరెట్జ్-హెసి (ఫ్రాన్స్)లపై నెగ్గింది. పురుషుల డబుల్స్ రెండో రౌండ్‌లో పేస్ (భారత్)-నెస్టర్ (కెనడా) 7-6 (7/3), 6-2తో  బెగెమన్ (జర్మనీ)-నోల్ (ఆస్ట్రియా)లపై, రోహన్ బోపన్న (భారత్)-మెర్జియా (రుమేనియా) 3-6, 6-3, 7-5తో ఆస్టిన్ క్రాయిసెక్-డొనాల్డ్ యంగ్ (అమెరికా)లపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top