పాక్ సైనిక స్కూల్‌కు బాక్సర్ ఆమిర్ చేయూత

పాక్ సైనిక స్కూల్‌కు బాక్సర్ ఆమిర్ చేయూత


లండన్: తాలిబన్లు నరమేధం సృష్టించిన పాకిస్తాన్ సైనిక స్కూల్ పునర్నిర్మాణానికి పాక్ సంతతికి చెందిన ఇంగ్లండ్ విఖ్యాత బాక్సర్ ఆమిర్ ఖాన్ చేయూత ఇవ్వనున్నాడు. ఇందుకోసం 30 వేల పౌండ్లు విలువ చేసే తన దుస్తులను పాఠశాలకు విరాళంగా ఇవ్వనున్నాడు. గత వారం లాస్‌వేగాస్‌లో ప్రపంచ వెల్టర్ వెయిట్ టైటిల్‌ను నిలబెట్టుకున్నప్పుడు ఆమిర్ ఈ దుస్తులు ధరించి బౌట్‌లో పాల్గొన్నాడు. విజేతగా నిలిచిన ఆమిర్‌కు 24 క్యారెట్ల బంగారు పూతతో కూడిన బెల్ట్‌ను అందజేశారు. మే నెలలో ఓ కూతురుకి తండ్రి అయిన ఈ 28 ఏళ్ల బాక్సర్... పెషావర్ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ‘పిల్లల తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. మేం ఇంగ్లండ్‌లో ఉంటున్నందుకు అదృష్టవంతులం. ఇక్కడ భద్రత చాలా బాగుంటుంది. నా కూతుర్ని ఎలాంటి భయం లేకుండా పాఠశాలకు పంపించగలను. కానీ పాక్‌లో అలా లేదు. పిల్లలను బయటకు పంపిస్తే తిరిగి వస్తారో లేదో కూడా తెలియదు. ఇది చాలా బాధాకరమైన అంశం. అక్కడ భద్రతను మరింత పెంచాల్సిన అవసరం ఉంది’ అని ఆమిర్ అన్నాడు.

 

 స్కూల్‌ను సందర్శించనున్న పాక్ క్రికెటర్లు

 కరాచీ: తాలిబన్ల దాడి జరిగిన సైనిక స్కూల్‌ను పాక్ క్రికెటర్లు సందర్శించనున్నారు. ఉగ్రవాదుల దాడిలో మరణించిన చిన్నారులకు నివాళులు ఆర్పించనున్నారు. ప్రస్తుతం కివీస్‌తో వన్డే సిరీస్ ఆడుతున్న ఆఫ్రిది నేతృత్వంలోని జట్టు పెషావర్ వెళ్లాలన్న కోరికను పీసీబీ ముందు ఉంచింది. దీనికి బోర్డు కూడా సుముఖత వ్యక్తం చేయడంతో ఏర్పాట్లు చేస్తున్నారు. ‘క్రికెట్‌ను పాక్‌లో బాగా ఇష్టపడతారు. సంఘటనలో మరణించిన విద్యార్థులు కూడా జాతీయ జట్టుకు వీరాభిమానులు. కాబట్టి వాళ్లను గుర్తుంచుకొని నివాళులు అర్పిస్తాం’ అని హైయర్ కంపెనీ సీఈఓ జావేద్ ఆఫ్రిది అన్నారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top