ఆఖరి వన్డేలో లంక విజయం

ఆఖరి వన్డేలో లంక విజయం


సిరీస్ 4-2తో న్యూజిలాండ్ కైవసం

వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరిగిన ఏడు వన్డేల సిరీస్‌ను శ్రీలంక జట్టు ఓదార్పు విజయంతో ముగించింది. గురువారం జరిగిన చివరిదైన ఏడో వన్డేలో పర్యాటక జట్టు 34 పరుగులతో నెగ్గింది. అయితే సిరీస్‌ను మాత్రం ఆతిథ్య జట్టు  4-2తో దక్కించుకుంది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది.



సీనియర్ బ్యాట్స్‌మన్ కుమార సంగక్కర (105 బంతుల్లో 113 నాటౌట్; 14 ఫోర్లు) అజేయ సెంచరీతో పాటు ఫామ్‌లో ఉన్న దిల్షాన్ (98 బంతుల్లో 81; 5 ఫోర్లు; 1 సిక్స్) మరోమారు బ్యాట్ ఝుళిపించడంతో లంక 50 ఓవర్లలో 6 వికెట్లకు 287 పరుగులు చేసింది. రెండో వికెట్‌కు వీరు 104 పరుగులు జోడించారు. అండర్సన్ 3 వికెట్లు తీశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 45.2 ఓవర్లలో 253 పరుగులకు ఆలౌట్ అయ్యింది.



కెప్టెన్ కేన్ విలియమ్సన్ (83 బంతుల్లో 54; 4 ఫోర్లు), రోంచి (42 బంతుల్లో 47; 4 ఫోర్లు; 1 సిక్స్) టాప్ స్కోరర్లు. ఈ మ్యాచ్ ద్వారా సంగక్కర వన్డేల్లో అత్యధిక (474) అవుట్‌లలో పాలుపంచుకున్న వికెట్ కీపర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు గిల్‌క్రిస్ట్ (472) పేరిట ఉండేది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా సంగక్కర, మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా కేన్ విలియమ్సన్ ఎంపికయ్యారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top