కోహ్లితో 'స్వీట్'గా.. మరి ధోనితో..

కోహ్లితో 'స్వీట్'గా.. మరి ధోనితో.. - Sakshi


ఫ్లోరిడా (యూఎస్): ఒకరు దూకుడుకు మారు పేరైతే.. మరొకరు మిస్టర్ కూల్. ఒకరిది ఓటమని అంగీకరించని తత్వమైతే.. మరొకరది దేన్నైనా సవాల్గా స్వీకరించే తత్వం. ఆ ఇద్దరు టీమిండియాకు వెన్నుముక. ఒకరు విరాట్ కోహ్లి కాగా, మరొకరు మహేంద్ర సింగ్ ధోని.  ఆ ఇద్దరు స్టార్ కెప్టెన్లది భిన్నమైన వ్యవహార శైలి. అయితే ప్రధాన కోచ్ గా  అనిల్ కుంబ్లే ఎంపికైన తరువాత విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా జట్టు విండీస్లో పర్యటించింది. నాలుగు టెస్టుల సిరీస్ను 2-0 తో కైవసం చేసుకున్న ఈ 'జోడి' సక్సెస్ అయ్యింది. ఈ తన తొలి పర్యటనలో తీపి జ్ఞాపకాలే మిగిలాయని కుంబ్లే స్పష్టం చేయడమే ఇందుకు నిదర్శనం. తాను ఏదైతై టెస్టు జట్టు నుంచి కోరుకున్నానో, అదే చూశానంటూ విరాట్ అండ్ గ్యాంగ్కు కుంబ్లే కితాబిచ్చేశాడు. టెస్టు జట్టులోని ఆటగాళ్లంతా చాలా క్రమశిక్షణగా వారికి నిర్దేశించిన లక్ష్యాలను చేరుకున్నారన్నాడు.



అయితే టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్రుడితో మొదటిసారి కుంబ్లే తన అనుభవాల్ని పంచుకునేందుకు సిద్దమయ్యాడు. అమెరికాలో ట్వంటీ 20 సిరీస్లో భాగంగా భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య రెండు మ్యాచ్లు జరుగనున్నాయి. ఈ సందర్భంగా స్పందించిన కుంబ్లే.. ధోనితో మొదటిసారి పని చేయబోతున్న ఈ సిరీస్ కూడా ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోవాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. తామిద్దరం కలిసి సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడిన విషయాన్ని కుంబ్లే ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. ధోనితో కలిసి పని చేయడానికి తాను ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు కుంబ్లే పేర్కొన్నాడు. కోహ్ల నేతృత్వంలో టెస్టు జట్టును స్వీట్ అంటూ ప్రశంసించిన కుంబ్లే.. ధోని సారథ్యంలోని టీ 20 జట్టును ఏమంటాడో సిరీస్ అయ్యాక కానీ తెలియదు. అమెరికాలో క్రికెట్ పై ఆదరణ పెంచడంతో పాటు అక్కడ మార్కెట్ ను కూడా విస్తరించే యోచనలో భాగంగా భారత-వెస్టిండీస్ క్రికెట్ బోర్డులు టీ 20 సిరీస్ ను నిర్వహిస్తున్నాయి. ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవర్డ్ రీజినల్ పార్క్ స్టేడియంలోని శని, ఆదివారాల్లో జరిగే రెండు మ్యాచ్ల టీ 20 సిరీస్కు అధిక సంఖ్యలో అభిమానులు హాజరయ్యే అవకాశం ఉంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top