సీనియర్లు, జూనియర్లనే తేడా లేదు: రహానే

సీనియర్లు, జూనియర్లనే తేడా లేదు: రహానే


జింబాబ్వే బయలుదేరిన టీమిండియా

 ముంబై: భారత జట్టులో సీనియర్, జూనియర్ ఆటగాళ్లు అనే భేదాలను తాను నమ్మనని, టీమిండియాలోని 14 మంది సభ్యులూ సమానమేనని వన్డే జట్టు కెప్టెన్ అజింక్య రహానే వ్యాఖ్యానించాడు. ఎవరైనా బరిలోకి దిగిన తర్వాత వంద శాతం జట్టు విజయం కోసం రాణించాలని అతను అన్నాడు. రహానే నాయకత్వంలోని భారత జట్టు వన్డే, టి20 సిరీస్‌లలో పాల్గొనేందుకు సోమవారం రాత్రి జింబాబ్వే బయలుదేరింది. ఈ సందర్భంగా రహానే మీడియాతో మాట్లాడాడు. ‘నా దృష్టిలో జట్టు సభ్యులంతా సమానమే. నాకు అందరి సహకారం అవసరం.

 

  కెప్టెన్‌గా నాకంటూ సొంత ఆలోచనలు ఉన్నాయి. దానికి అనుగుణంగా పని చేస్తాను’ అని రహానే చెప్పాడు. అయితే అవసరమైతే హర్భజన్‌లాంటి సీనియర్ సలహాలు తీసుకునేందుకు వెనుకాడనని చెప్పాడు. ప్రతీ సిరీస్‌లాగే దీని కోసం 100 శాతం సిద్ధమయ్యామని, బాగా ఆడి జింబాబ్వేను ఓడిస్తామని అతను ఆత్మవిశ్వాసంతో చెప్పాడు. ‘తమ స్థానం సుస్థిరం చేసుకునేందుకు ఇది కుర్రాళ్లకు మంచి అవకాశం. వీరంతా ఐపీఎల్‌లో బాగా ఆడారు. ఇక్కడ కూడా బాగా ఆడతారని నమ్మకముంది’ అని అజింక్య పేర్కొన్నాడు.

 

 జట్టులో రెగ్యులర్ వికెట్ కీపర్ లేకపోవడంపై ఇప్పుడే ఏమీ చెప్పలేనన్న రహానే, ఓపెనర్‌గా బరిలోకి దిగడంపై కూడా ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదన్నాడు. ఉపఖండంలో తన బ్యాటింగ్‌పై ధోని చేసిన విమర్శపై వివాదం అనవసరమన్నాడు. ‘ధోని భాయ్ నా గురించి తన అభిప్రాయం చెప్పారు. దానిని నేను సూచనగానే భావిస్తున్నా. ముగిసిపోయిన బంగ్లాదేశ్ సిరీస్ గురించి మాట్లాడటం అనవసరం’ అని అతను స్పష్టం చేశాడు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top