ABCDE

ABCDE


AB Can Do Everything...

 

 

నిస్సందేహంగా ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అతనే’...డివిలియర్స్ గురించి బెంగళూరు కెప్టెన్ కోహ్లి చేసిన ప్రశంస ఇది. ఒక వైపు తాను పరుగుల వరద పారిస్తున్నా...సహచరుడు కాబట్టి మొహమాటానికో, ముఖస్తుతికో కోహ్లి ఈ మాట చెప్పినట్లు అనిపించవచ్చు. కానీ క్వాలిఫయర్‌లో డివిలియర్స్ ఆడిన ఇన్నింగ్స్ చూస్తే అలాంటి ఆటతీరు మరెవరికీ సాధ్యం కాదని అర్థమవుతుంది. ఇప్పుడు అతను ఏబీడీ మాత్రమే కాదు. ఎప్పుడైనా, ఏ అద్భుతాన్నయినా ఆవిష్కరించగలిగే ఏబీసీడీఈ అనేది నిజం!

 

 

ఐపీఎల్-9లో విరాట్ కోహ్లి అద్భుతాలను ఆస్వాదిస్తున్నవారికి అటు పక్క మరో మనిషి మెరుపులు కనిపించడం లేదు గానీ ఈ సీజన్‌లో డివిలియర్స్ ధ్వంస రచన తక్కువేమీ కాదు. ప్రస్తుతం అతను 682 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. పరుగులకంటే కూడా 170.07 స్ట్రైక్‌రేట్‌తో అతను పరుగులు బాదిన తీరు అందరికంటే అగ్రభాగాన నిలబెట్టింది. ఎక్కువ సిక్సర్ల (37) మోత మోగించిన ఘనత కూడా డివిలియర్స్‌దే. ప్రత్యర్థి బౌలింగ్‌పై జరిగిన సామూహిక హననంలో కొన్ని సార్లు కోహ్లికి భాగస్వామిగా నిలిచిన ఏబీ... మరి కొన్ని మ్యాచ్‌లలో ఒంటిచేత్తో తన పరాక్రమాన్ని ప్రదర్శించాడు. విరాట్ తరహాలో తాను అతిగా ఆలోచించనని, అప్పటికప్పుడు ఎలా అనిపిస్తే అలా షాట్ ఆడతానని స్వయంగా చెప్పుకున్నా... అసలు సమయంలో అతని ‘మాస్టర్ మైండ్’ మాత్రం అద్భుతంగా పని చేస్తుందని ఏబీ బ్యాటింగ్ చూస్తే చెప్పవచ్చు.





ప్రతీ సారి కొత్తగా...

 మంగళవారం మ్యాచ్‌లో తన బ్యాటింగ్ పవర్, పదును డివిలియర్స్ మళ్లీ చూపించాడు. జకాతి బంతిని విసరక ముందే ఆఫ్‌సైడ్‌కు వెళ్లి మోకాళ్లపై కూర్చుని బ్యాక్‌వర్డ్ స్క్వేర్‌లెగ్ మీదుగా కొట్టిన సిక్సర్ నిజంగా అద్భుతం. ఈ షాట్‌కు అచ్చెరువు పొందిన కోహ్లి కూడా గాల్లో పంచ్‌లు విసురుతూ తన ఆనందాన్ని ఆపుకోలేకపోయాడు. భిన్నంగా, ఎవరూ ఆడలేని వైవిధ్యమైన షాట్‌లు ఆడటం ఏబీకి అలవాటే. కానీ అలాంటి షాట్‌లు కూడా ఆడుతుంటే మళ్లీ కొత్త కొత్తగా కనిపించడం ఏబీ చేస్తున్న మాయ మాత్రమే! మ్యాచ్ చివర్లో ప్రవీణ్ కుమార్ లెగ్ స్టంప్ బయట వేసిన బంతిని రివర్స్ స్వీప్‌లో బ్యాక్‌వర్డ్ పాయింట్ మీదుగా బౌండరీకి తరలించడం క్లాసిక్ అంటే అతిశయోక్తి కాదు. తొలి ఇన్నింగ్స్‌లో లెక్కా పత్రం లేకుండా విరుచుకు పడటం ఒక శైలి. కానీ జట్టు ఆరు వికెట్లు కోల్పోయిన స్థితిలో టెయిలెండర్ సహాయంతో చివరి వరకు నిలిచి జట్టును గెలిపించడంలో ఆ బ్యాటింగ్ గొప్పతనం ఏమిటో కనిపిస్తుంది. ఈ రెండూ సందర్భాల్లోనూ ఏబీలోని హిట్టర్‌కు తెలిసింది ఒత్తిడికి లోను కాకుండా భారీ షాట్లతో పరుగులు రాబట్టడమే.





ఫైనల్ సవాల్...

అభిమానుల మది దోచిన పలు చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు డివిలియర్స్ ఖాతాలో ఉన్నాయి. కానీ అటు అంతర్జాతీయ మ్యాచ్‌లు మొదలు ఇటు లీగ్‌ల వరకు అతనికి ఫైనల్ మ్యాచ్‌లు ఆడే అవకాశం పెద్దగా రాలేదు. ఇప్పుడు ఆ చాన్స్ అతని ముందు నిలిచింది. గుజరాత్‌తో మ్యాచ్‌లో ఆడిన ఇన్నింగ్స్ దానికి సన్నాహకంగా చెప్పుకోవచ్చేమో. ‘నేను నా గణాంకాల గురించి అసలు పట్టించుకోను. నా సెంచరీ, హాఫ్ సెంచరీల గురించి ఏ మాత్రం ఆలోచించను. జట్టును లక్ష్యానికి చేర్చడమే నాకు ఆనందాన్నిస్తుంది తప్ప ఏ ఒక్క ఇన్నింగ్సో ప్రత్యేకమైంది కాదు. నేను క్రికెట్ ఆడేదే ఆ ఆనందం కోసం’ అంటూ ఏబీ చెప్పుకున్నాడు. అయితే అతను పట్టించుకోకపోయినా, అతని ప్రతీ పరుగు అభిమానులను మునివేళ్లపై నిలబెడుతుంది. సొంతగడ్డపై జరగనున్న ఫైనల్లో కూడా అతను బెంగళూరును గెలిపించగలిగితే ఆ ఆనందానికి ఇక హద్దు ఉండదు. - సాక్షి క్రీడా విభాగం

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top