ఆధిక్యం అడ్డం తిరిగింది!

ఆధిక్యం అడ్డం తిరిగింది!


ఆస్ట్రేలియా 505 ఆలౌట్   

 స్మిత్ సెంచరీ, చెలరేగిన జాన్సన్      

 రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 71/1   

 బ్రిస్బేన్ టెస్టు


 

 బ్రిస్బేన్: భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు మ్యాచ్ ఆసక్తికర స్థితిలో నిలిచింది. మ్యాచ్ మూడో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 23 ఓవర్లలో వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. విజయ్ (27) పెవిలియన్ చేరగా... ధావన్ (26 బ్యాటింగ్), పుజారా (15 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం భారత్ మరో 26 పరుగులు వెనుకబడి ఉంది.

 

  అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 97 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. ఆ జట్టు లోయర్ ఆర్డర్ అనూహ్య రీతిలో రాణించడంతో ఆసీస్ 109.4 ఓవర్లలో 505 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ స్మిత్ (191 బంతుల్లో 133; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) వరుసగా రెండో సెంచరీతో తన జోరు కొనసాగించాడు. స్మిత్‌కు తోడు జాన్సన్ (93 బంతుల్లో 88; 13 ఫోర్లు, 1 సిక్స్), స్టార్క్ (59 బంతుల్లో 52; 6 ఫోర్లు)ల మెరుపు అర్ధ సెంచరీలు భారత్‌ను వెనకడుగు వేసేలా చేశాయి.  

 

 అంపైర్‌కు ‘వాచిపోయింది’

 మూడో రోజు ఆటలో బ్యాట్స్‌మన్ షాట్ ఈసారి అంపైర్‌ను దెబ్బ కొట్టింది. ఆసీస్ ఇన్నింగ్స్ 91వ ఓవర్‌ను ఉమేశ్ బౌల్ చేశాడు. స్టార్క్ దానిని నేరుగా బలంగా కొట్టాడు. కష్టసాధ్యమైన ఆ క్యాచ్‌ను అందుకునే క్రమంలో ఉమేశ్ తన చేతిని అడ్డం పెట్టడంతో దానికి తగిలి బంతి దిశ మార్చుకుంది. అయినా ఏమాత్రం వేగం  తగ్గకుండా అంపైర్ ఎరాస్మస్ చేతికి బలంగా తాకింది. అప్పుడు సర్దుకున్నట్లు అనిపించినా... ఎరాస్మస్‌కు గట్టి దెబ్బే తగిలింది. దాంతో ఆ ఓవర్ ముగిసిన తర్వాత అతను చికిత్స తీసుకున్నాడు. ఆస్ట్రేలియా జట్టు ఫిజియో పరుగెత్తుకు వచ్చి ఐస్‌ప్యాక్‌తో నొప్పి తగ్గించే ప్రయత్నం చేశాడు. అయితే ఆ తర్వాత ఎరాస్మస్ మోచేయి ఒక్కసారిగా వాచిపోయి కనిపించింది.

 

 స్కోరు వివరాలు

 భారత్ తొలి ఇన్నింగ్స్: 408, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: రోజర్స్ (సి) ధోని (బి) ఉమేశ్ 55; వార్నర్ (సి) అశ్విన్ (బి) ఉమేశ్ 29; వాట్సన్ (సి) ధావన్ (బి) అశ్విన్ 25; స్మిత్ (బి) ఇషాంత్ 133; షాన్ మార్ష్ (సి) అశ్విన్ (బి) ఉమేశ్ 32; మిషెల్ మార్ష్ (బి) ఇషాంత్ 11; హాడిన్ (సి) పుజారా (బి) ఆరోన్ 6; జాన్సన్ (సి) ధోని (బి) ఇషాంత్ 88; స్టార్క్ (బి) అశ్విన్ 52; లయోన్ (సి) రోహిత్ (సి) ఆరోన్ 23; హాజల్‌వుడ్ (నాటౌట్) 32; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (109.4 ఓవర్లలో ఆలౌట్) 505

 వికెట్ల పతనం: 1-47; 2-98; 3-121; 4-208; 5-232; 6-247; 7-395; 8-398; 9-454; 10-505.

 

 బౌలింగ్: ఇషాంత్ 23-2-117-3; ఆరోన్ 26-1-145-2; ఉమేశ్ 25-4-101-3; అశ్విన్ 33.4-4-128-2; రోహిత్ 2-0-10-0.

 

 భారత్ రెండో ఇన్నింగ్స్: విజయ్ (బి) స్టార్క్ 27; ధావన్ (బ్యాటింగ్) 26; పుజారా (బ్యాటింగ్) 15; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (23 ఓవర్లలో వికెట్ నష్టానికి) 71

 

 వికెట్ల పతనం: 1-41. బౌలింగ్: జాన్సన్ 8-3-29-0; హాజల్‌వుడ్ 6-0-24-0; స్టార్క్ 4-1-10-1; వాట్సన్ 5-3-6-0.

 

 ‘భారత్ ప్రస్తుతం మంచి స్థితిలో ఉంది. కనీసం వంద పరుగుల ఆధిక్యం దక్కించుకుంటే మ్యాచ్‌పై ధోని సేనకు పట్టు దొరికినట్లే...’ మూడో రోజు ఆటకు ముందు విశ్లేషకుల అంచనా. నిజంగానే దాదాపు 100 పరుగుల ఆధిక్యం దక్కింది... అయితే అది భారత్‌కు కాదు ఆస్ట్రేలియాకు!

 

 ఒక దశలో ఆసీస్ స్కోరు 247/6... టీమిండియాకు ఆధిక్యం ఖాయంగా అనిపించింది. అయితే స్మిత్, జాన్సన్ ఆ అంచనాలను తలకిందులు చేశారు. వీరిద్దరు 26 ఓవర్లలోనే 148 పరుగులు జత చేయడం మ్యాచ్ దిశను మార్చేసింది. గతి తప్పిన బంతులతో మన నలుగురు బౌలర్లు ‘సెంచరీ’ నమోదు చేస్తే... కంగారూలు పండగ చేసుకున్నారు.

 

 ప్రత్యర్థి ‘తోక’ను కత్తిరించలేని బలహీనతను, రికార్డును కొనసాగిస్తూ భారత జట్టు ఆసీస్‌కు కోలుకునే అవకాశం ఇచ్చింది. ఆతిథ్య జట్టు తొలి 6 వికెట్లకు 61.1 ఓవర్లలో 247 పరుగులు చేస్తే... ఆ జట్టు బౌలర్లు ‘బ్యాట్స్‌మెన్’గా మారి చివరి 4 వికెట్లకు 48.3 ఓవర్లలోనే 258 పరుగులు జోడించగలిగారంటే లోయర్ ఆర్డర్ జోరు ఎలా సాగిందో అర్థమవుతోంది.

 

 అయినా... మ్యాచ్ చేజారలేదు. ఇంకా 9 వికెట్లున్నాయి... 26 పరుగుల లోటు సమస్య కాదు. రెండో రోజు ఉదయం తరహాలో వరుస కట్టకుండా భారత్ నిలబడి ఆడి ఎన్ని పరుగులు చేస్తుంది... ప్రత్యర్థికి ఎంతటి భారీ లక్ష్యం నిర్దేశిస్తుంది అనేదే ఇప్పుడు ఆసక్తికరం. చెప్పుకోదగ్గ స్కోరు సాధిస్తే చివరి రోజు ‘గాబా’ మన వైపూ తిరుగుతుందేమో!

 

 జాన్సన్ ఆటకు భారత్ వద్ద సమాధానం లేకుండా పోయింది. మొదటి బంతి నుంచే అతను అద్భుతంగా ఆడాడు. టెయిలెండర్ల వల్లే 90కి పైగా ఆధిక్యం లభించింది. మూడో రోజు మాదేనని చెప్పగలను. మ్యాచ్‌కు ముందు కూడా నేను బాగా ఆడి ముందుండి నడిపిస్తానని చెప్పాను. అది నిజం కావడం సంతోషకరం. తీవ్రమైన ఎండ, వేడిలో మా లోయర్ ఆర్డర్ ఆటతో భారత్‌లో అసహనం పెరిగి ఉండవచ్చు. ఇంకా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్ పై నాలుగో రోజు మేం చాలా సహనంతో, బాగా బౌలింగ్ చేయాల్సి ఉంది.’

 - స్టీవెన్ స్మిత్, ఆస్ట్రేలియా కెప్టెన్

 

 మేం అనుకున్నదానికంటే కనీసం 50 పరుగులు ఎక్కువగా ఇచ్చాం. ఆట  ఆరంభంలో ఉదయం లైన్‌కే కట్టుబడ్డాం. ఆ తర్వాతే టెయిలెండర్లు బౌన్సర్లు ఆడలేరని భావించే షార్ట్ బంతులు సంధించాం. ఒక దశలో ఎక్కువ బౌన్సర్లే వేశాం. అదేమీ తప్పు కాదు. మా వ్యూహంలో భాగంగానే అలా చేశాం. అయితే జాన్సన్‌పై మాత్రం అది పని చేయలేదు. దూకుడుగా ఆడినప్పుడు కొన్ని సార్లు వ్యతిరేక ఫలితం కూడా రావచ్చు. బౌలర్లకు ఇంకా సహకారం లభిస్తోంది. నాలుగో రోజంతా మేం బ్యాటింగ్ చేస్తే ఆ తర్వాత పిచ్ పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటాం.        

 - ఉమేశ్ యాదవ్, భారత బౌలర్

 

 ఆస్ట్రేలియా తరఫున కెప్టెన్‌గా తొలి టెస్టులోనే సెంచరీ సాధించిన పదో ఆటగాడు స్మిత్. 1978లో గ్రాహం యాలాప్ తర్వాత ఈ ఘనత సాధించడం ఇదే తొలిసారి.

 

 2014లో భారత్‌పై ప్రత్యర్థి జట్ల టెయిలెండర్లు 44.84 సగటు భాగస్వామ్యంతో పరుగులు చేశా రు. ఇతర ఏ జట్టుపైనా ఇంత సగటుతో పరుగులు రాలేదు.

 

 సెషన్-1   మెరుపు భాగస్వామ్యం

 మూడో రోజు ఉదయం భారత బౌలర్లు చక్కటి నియంత్రణతో ప్రత్యర్థిని కట్టడి చేశారు. తొలి గంట పాటు ఒక్క బౌండరీ ఇవ్వలేదు. పేసర్లు 140 కి.మీ వేగానికి తగ్గకుండా, షార్ట్, వైడ్ బంతులు కూడా విసరకుండా చక్కటి నియంత్రణతో  బౌలింగ్ చేస్తూ ఇచ్చినవి 39 పరుగులే! దీంతో పాటు 15 పరుగుల వ్యవధిలో మిషెల్ మార్ష్ (11), హాడిన్ (6) వికెట్లు కూడా తీశారు. అయితే తర్వాతి గంటలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

 

  స్మిత్, జాన్సన్ షాట్లతో చెలరేగిపోయారు. ఫలితమే 14 బౌండరీలు... వికెట్ కోల్పోకుండా 91 పరుగులు. ముఖ్యంగా జాన్సన్‌కు షార్ట్ బంతులు వేయాలన్న వ్యూహం వికటించింది. వాటిని సమర్థంగా ఎదుర్కొన్న జాన్సన్... ఉమేశ్ ఒకే ఓవర్లో మూడు, ఆరోన్ ఓవర్లో మూడు, ఇషాంత్ ఓవర్లో రెండు చొప్పున వరుసగా ఫోర్లు బాదాడు. ఈ జోరులో జాన్సన్ 37 బంతుల్లో అర్ధ సెంచరీ, స్మిత్ 147 బంతుల్లో సెంచరీలు పూర్తి చేసుకున్నారు.                            

 ఓవర్లు: 23, పరుగులు: 130, వికెట్లు: 2

 

 

 సెషన్-2   ఆసీస్ అదే దూకుడు

 లంచ్ తర్వాత కొద్ది సేపటికే ఇషాంత్ ఒకే ఓవర్లో జాన్సన్, స్మిత్‌లను అవుట్ చేయడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. ఇక ప్రత్యర్థి ఇన్నింగ్స్ ముగించడం లాంఛనమే అనుకున్నా... ఆ తర్వాత కూడా ఆసీస్ తమ ధాటిని కొనసాగించింది. బౌలింగ్‌లో రాణించలేకపోయిన స్టార్క్ తన బ్యాటింగ్ ప్రతిభతో ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఇషాంత్, ఉమేశ్‌ల వరుస ఓవర్లలో రెండేసి ఫోర్లు కొట్టి దూకుడు ప్రదర్శించాడు.

 

 గతంలో ఎప్పుడూ పెద్దగా బ్యాటింగ్‌లో ఆకట్టుకోని లయోన్ (23 బంతుల్లో 23; 3 ఫోర్లు), తొలి మ్యాచ్ ఆడుతున్న హాజల్‌వుడ్ (50 బంతుల్లో 32 నాటౌట్; 7 ఫోర్లు) కూడా స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించి స్టార్క్‌కు అండగా నిలిచారు. లయోన్‌తో 9వ వికెట్‌కు 56, హాజల్‌వుడ్‌తో చివరి వికెట్‌కు 51 పరుగులు జోడించిన స్టార్క్ జట్టు స్కోరును 500 పరుగులు దాటించిన అనంతరం చివరి వికెట్‌గా వెనుదిరిగాడు.

 ఓవర్లు: 34.4, పరుగులు: 154, వికెట్లు: 4

 

 సెషన్-3    విజయ్ అవుట్

 విరామం తర్వాత భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. ధావన్ సంయమనం పాటించగా... తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో విజయ్ మరోసారి వేగంగా ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అయితే స్టార్క్ బంతిని సరిగ్గా అంచనా వేయలేక వదిలేయడంతో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. అయితే ధావన్, పుజారా ప్రమాదం లేకుండా జాగ్రత్తగా ఆడి రోజును ముగించారు. మధ్యలో కొన్ని సార్లు ఆసీస్ బౌలర్లు చక్కటి బంతులతో భారత బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టగలిగినా... వికెట్ మాత్రం పడగొట్టలేకపోయారు.

 ఓవర్లు: 23, పరుగులు: 71, వికెట్లు: 1

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top