100 మీటర్ల రేసు విజేత.. 101 ఏళ్ల బామ్మ!

100 మీటర్ల రేసు విజేత.. 101 ఏళ్ల బామ్మ! - Sakshi


ఆమె వయసు అక్షరాలా 101 ఏళ్లు. అంత వయసులో కూడా న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో నిర్వహించిన వరల్డ్ మాస్టర్స్ గేమ్స్‌లో 100 మీటర్ల పరుగుపందెంలో పాల్గొని విజేతగా నిలిచింది. మన్ కౌర్ తన కెరీర్‌లో సాధించిన 17వ బంగారు పతకం ఇది. పతకం సాధించిన తర్వాత త్రివర్ణ పతాకం పట్టుకుని ఆమె సంబరంతో డాన్సులు చేసింది. ఆమె ఈ రేసును కేవలం ఒక నిమిషం 14 సెకండ్లలో పూర్తిచేసింది. ఉసేన్ బోల్ట్ 2009లో నెలకొల్పిన రికార్డు కంటే ఇది 64.42 సెకండ్లు మాత్రమే ఎక్కువ! ఇంతకీ ఈ పరుగు పందెంలో ఎంతమంది పోటీ పడ్డారో తెలుసా... కేవలం ఆమె ఒక్కరే!! అవును.. వందేళ్లకు పైబడిన కేటగిరీలో పరుగులు తీయడానికి వేరెవ్వరూ రాలేదు. కేవలం ఆమె మాత్రమే రావడంతో మొత్తం పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన 25వేల మంది ప్రేక్షకులుగా మారి.. బామ్మగారు ఎప్పటికి ఫినిష్ లైన్ చేరుకుంటారా అని ఆశ్చర్యంగా చూశారు.



ఆమె ఎంత సమయంలో రేసు పూర్తిచేశారన్నది ఇక్కడ సమస్య కాదని, ఎక్కడో చండీగఢ్ నుంచి వచ్చి మెరుపులా ఇక్కడ పోటీలో పాల్గొనడమే చాలా ఎక్కువని న్యూజిలాండ్ మీడియా కూడా ఆమెను ప్రశంసలలో ముంచెత్తింది. తాను ఈ రేసును ఎంతగానో ఎంజాయ్ చేశానని, చాలా సంతోషంగా ఉందని మన్ కౌర్ చెప్పారు. తాను మళ్లీ మళ్లీ పరుగెడతానని, ఎక్కడ రేసు పెట్టినా తప్పకుండా పాల్గొంటానని, దీనికి ఫుల్‌స్టాప్ లేదని తెలిపారు. ఎనిమిదేళ్ల క్రితం తనకు 93 ఏళ్ల వయసు ఉండగా ఆమె అథ్లెటిక్స్‌లోకి ప్రవేశించారు. అంతకుముందు ఆమెకు అసలు క్రీడల్లోనే ప్రవేశం లేదు. అంతర్జాతీయ మాస్టర్స్ గేమ్స్‌లో పాల్గొనాల్సిందిగా ఆమె కొడుకు గురుదేవ్ సింగ్ సూచించడంతో ఆమె సై అన్నారు. ముందుగా మెడికల్ చెకప్ చేయించిన తర్వాత అప్పటినుంచి తన తల్లి పోటీలలో పాల్గొంటున్నారని, ఇప్పటివరకు తాను, తన తల్లి కలిసి ప్రపంచవ్యాప్తంగా కొన్ని డజన్ల మాస్టర్స్ టోర్నమెంట్లలో పాల్గొన్నామని గురుదేవ్ చెప్పారు. ఈసారి 200 మీటర్ల స్ప్రింట్, 2 కిలోల షాట్‌పుట్, 400 గ్రాముల జావెలిన్ త్రోలలో పాల్గొనాలని ఆమె చూస్తున్నారు. వాటన్నింటిలో కూడా పతకాలు వస్తే ఆమె పతకాల లెక్క 20కి చేరుకుంటుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top