మహా సంక్షోభంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

Supreme Court hearing of Shiv Sena, Congress, NCP plea against Fadnavis led government - Sakshi

న్యూఢిల్లీ: మహారాష్ట్ర సంక్షోభంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్రలో 24 గంటల్లోగా అసెంబ్లీలో బలపరీక్ష జరగాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. బలనిరూపణ జరగాల్సింది అసెంబ్లీలో కానీ, గవర్నర్‌ వద్ద కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రాజ్‌భవన్‌ మెజారిటీని నిరూపించజాలదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఫిరాయింపులు నిరోధించాలంటే వెంటనే బలపరీక్ష జరగాలని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే, బలపరీక్షకు రెండు, మూడు రోజుల సమయం కావాలని సొలిసిటర్‌ జనరల్‌ సుప్రీంకోర్టును కోరారు. 24 గంటల్లోగా బలపరీక్షకు ఆదేశాలు ఇవ్వరాదని, రాజ్యాంగ సంప్రదాయాల ప్రకారం కనీసం 7రోజుల గడువు ఇవ్వాలని బీజేపీ తరఫు న్యాయవాది కోరగా.. 24 గంటల్లో బలపరీక్ష నిర్వహించాల్సిందేనని, ఈ విషయంలో ఎంతమాత్రం జాప్యం చేయరాదని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీలు ధర్మసనాన్ని అభ్యర్థించాయి. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వ్‌లో ఉంచిన ధర్మాసనం.. మంగళవారం ఉదయం 10.30 గంటలకు తన తీర్పును వెలువరించనుంది.
చదవండి: ఒక పవార్‌ బీజేపీతో.. మరొక పవార్‌ ఎన్సీపీతో!

గవర్నర్‌ నిర్ణయంలో తప్పేముం‍ది?
కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల ముందు పొత్తులకు సంబంధించి గవర్నర్‌కు అన్ని విషయాలు తెలుసునని, కూటమి పొత్తుల గురించి కూడా ఆయనకు అవగాహన ఉందని తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు సమ్మతిస్తూ బీజేపీ గవర్నర్‌కు ఇచ్చిన లేఖను ఆయన సోమవారం సుప్రీంకోర్టుకు సమర్పించారు. ప్రభుత్వ ఏర్పాటుకు మొదట మూడు పార్టీలను గవర్నర్‌ ఆహ్వానించారని, ఏ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకురాకపోవడంతో విధిలేక రాష్ట్రపతి పాలన విధించారని వివరించారు.

అనంతర పరిణామాల్లో ఎన్సీపీ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ముందుకొచ్చిందని సొలిసిటర్‌ జనరల్‌ తెలిపారు. బీజేపీకి మద్దతునిస్తూ 54మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను అజిత్‌ పవార్‌ ఇచ్చారని, ఎన్సీపీ శాసనసభాపక్ష నేత హోదాలో అజిత్‌ లెటర్‌ హెడ్‌లో ఎమ్మెల్యేలతో సంతకాలతో ఈ లేఖ ఉందని వివరించారు.
చదవండి: వెంటనే బలపరీక్ష జరగాలి?

బీజేపీ ప్రభుత్వానికి 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ఈ 170 మంది ఎమ్మెల్యేల జాబితా గవర్నర్‌ వద్ద ఉందని వివరించారు. అందుకే ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని గవర్నర్‌ ఆహ్వానించారని తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు విషయమై గవర్నర్‌ విచక్షణాధికారాలు ఉంటాయని, గవర్నర్‌ నిర్ణయంపై న్యాయసమీక్ష చేసే అధికారం కోర్టుకు లేదని, వెంటనే ఈ పిటిషన్‌ను రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలని కోరారు.

ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీలను ఆహ్వానించే హక్కు గవర్నర్‌కు ఉందని, 170 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖ ఇచ్చాక దేవేంద్ర ఫడ్నవిస్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంలో తప్పేముందని,  ప్రశ్నించారు. గవర్నర్‌ విడివిడిగా ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడలేరు కదా అని వ్యాఖ్యానించారు. పార్టీలు సమర్పించిన జాబితానే గవర్నర్‌ విశ్వసిస్తారని తెలిపారు. ఆర్టికల్‌ 361 ప్రకారం గవర్నర్‌ ఎవరికీ జవాబుదారీ కాదని పేర్కొన్నారు. ఫిరాయింపులపై ఆలోచించాకే గవర్నర్‌ నిర్ణయం తీసుకున్నారని సొలిసిటర్‌ జనరల్‌ చెప్పారు.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ను గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోష్యారీ ఆహ్వానించడాన్ని సవాలు చేస్తూ శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.  ఈ పిటిషన్‌పై ఆదివారం సెలవురోజు అయినప్పటికీ విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఫడ్నవీస్‌ను ఆహ్వానిస్తూ గవర్నర్‌ పంపిన లేఖను, ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఫడ్నవీస్‌ గవర్నర్‌కు రాసిన లేఖను తమ ముందు ఉంచాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ లేఖలను సోలిసిటర్‌ జనరల్‌ సోమవారం న్యాయస్థానానికి అందజేశారు. ఈ రెండు లేఖలను పరిశీలించిన తరువాతే ఆ విషయంపై నిర్ణయం తీసుకుంటామని జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ అశోక్‌భూషణ్, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాల ధర్మాసనం ఆదివారం విచారణ సందర్భంగా పేర్కొన్న సంగతి తెలిసిందే. మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది ఎవరూ లేకపోవడంతో ఆ లేఖలను తమకు అందజేసే బాధ్యత తీసుకోవాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను కోరింది. అయితే, 24 గంటల్లో అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని ఫడ్నవీస్‌ను ఆదేశించాలన్న పిటిషనర్ల వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది.

ఆ లేఖలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం
‘24 గంటల్లోగా బల నిరూపణను ఆదేశించాలన్న వినతిని ఇప్పుడే పరిశీలించలేం. ప్రభుత్వ ఏర్పాటుకు ఫడ్నవీస్‌ను గవర్నర్‌ ఆహ్వానించే లేఖ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలనంటూ గవర్నర్‌కు ఫడ్నవీస్‌ పంపిన లేఖలను పరిశీలించిన తరువాతే ఆ విషయంపై నిర్ణయం తీసుకోగలం’ అని ఈ సందర్భంగా ధర్మాసనం తేల్చిచెప్పింది. అలాగే, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కూటమి ‘మహా వికాస్‌ అఘాడి’ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించేలా గవర్నర్‌ను ఆదేశించాలన్న వినతిని సైతం తోసిపుచ్చింది. ప్రస్తుతం ఆ వినతిని పరిశీలించలేమని స్పష్టం చేసింది. పిటిషనర్లు లేవనెత్తిన అంశాల ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని సెలవు రోజైనప్పటికీ ఆదివారం విచారణను కోర్టు ప్రారంభించడం విశేషం.
చదవండి: విశ్వాస పరీక్షపై ఇప్పుడే ఆదేశాలివ్వలేం!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top