అజరామరం ఆయన కీర్తి

అజరామరం ఆయన కీర్తి - Sakshi


సందర్భం

తెలంగాణ, రాయలసీమలలోని కరువు పీడిత ప్రాంతాలకు నీటి సదుపాయాల కోసం కేంద్ర సహాయం లేకుండా రాష్ట్ర వనరుల నుంచే వేల కోట్లు వెచ్చించడం అపూర్వం కాదా? ప్రజా సంక్షేమానికి వైఎస్ పట్టంగట్టిన తీరు నేడు ఎక్కడైనా కనబడుతోందా?




 నిరంతర కరువు పీడిత ప్రాంతం నుంచి ఎదిగివచ్చిన రాజకీయవేత్తగా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి నీటి కోసమే అనుక్షణం పరితపించారు. అందుకే ఆయన ముఖ్యమంత్రిగా నీటి పారుదలకే ప్రథమ ప్రాధాన్యాన్నిచ్చారు. ప్రజా సంక్షేమమే  పాలనకు ప్రధాన కేంద్రంగా చేసుకొని అహరహం కృషిచేసిన వైఎస్... ఎన్ని కష్టనష్టాలు, అపనిందలు, అపవాదాలు ఎదురైనా ప్రజల పట్ల ఆ అంకిత భావాన్ని సడలించలేదు. నేటి పాలకుల తీరుతెన్నులను, విధానాలను చూస్తుంటే ప్రజ ల పట్ల అలాటి అంకిత భావం కొరవడటం కనిపిస్తుంది. దేశ ప్రధానిలోనూ, ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రుల లోనూ దీన్ని ప్రస్ఫుటంగా గమనించవచ్చు. జలవనరు ల వినియోగానికి వారు తగు ప్రాధాన్యం ఇవ్వకపోవడ మే కాదు... నిరుద్యోగ యువతను, రైతులు, మహిళలు, విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరించారు. ఇది చూస్తుంటే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు పట్టంగట్టిన వైఎస్ లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.




 ఇటీవల తెలుగు ముఖ్యమంత్రులు అట్టహాసంగా చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టుల్లో దార్శనికత, పారదర్శకత కొరవడ్డాయని, అక్రమ పద్ధతులకు చోటిచ్చాయని విమర్శలు రేగుతున్నాయి. ముఖ్యమంత్రిగా వైఎస్ నీటి పారుదల ప్రాజెక్టులకు ఇచ్చిన ప్రాధాన్యం, ప్రత్యేకించి వెనుకబడిన తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్రకు నీరందించాలని, కృష్ణా డెల్టాను స్థిరీకరించాలని చేసిన కృషి అజరామరం. తెలంగాణ, రాయలసీమలలోని కరువు పీడిత ప్రాంతాలకు నీటి సదుపాయాల కోసం కేంద్ర సహాయ, సహకారాలు లేకుండా రాష్ట్ర వనరుల నుంచే వేల కోట్ల రూపాయలను వెచ్చించిన ఘనత వైఎస్‌దే. ఆయనను విమర్శించే చంద్రబాబు, కేసీఆర్‌లు దానికి సాటిరాగల కృషిని ఆచరణలో చూపారా? మహిళా సంక్షేమానికి వైఎస్ పట్టంగట్టిన తీరు నేటి రాజకీయాల్లో ఎక్కడైనా కనబడుతోందా? జాతీయ ప్రాజెక్టు పోలవరంపట్ల నేడు ప్రధాని మోదీ ఉదాసీనతను, నిర్ల క్ష్యాన్ని ప్రదర్శించడం వైఎస్ బతికి ఉంటే జరిగేదా?




 ఇందిరాగాంధీ కుటుంబం అంటే గౌరవంతో వైఎస్ పలు పథకాలకు ఇందిర, రాజీవ్‌ల పేర్లు పెట్టారు. అదే కాంగ్రెస్ పార్టీ వైఎస్ మరణానంతరం తెలుగుదేశంతో, దాని ప్రచార మాధ్యమాలతో చేయిగలిపి ఆయనను దుమ్మెత్తిపోసింది. టీడీపీతో కలిసి ఆయనపైనా, ఆయన  కుటుంబంపైనా, ప్రత్యేకించి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పైనా సీబీఐ కేసులు పెట్టి వేధించడానికి నీచమైన పద్ధతులకు పాల్పడింది. ప్రజలు ఆ ప్రయత్నాలను తిరస్కరించారు, ఛీత్కరించారు. అయినా నేడు చంద్రబాబు అసెంబ్లీలోని వైఎస్, టంగుటూరి ప్రకాశం చిత్రపటాలను తొలగించడం లాంటి దివాలాకోరుతనానికి తెరలేపారు. ప్రజల హృదయాల నుంచి వైఎస్‌ను ఎవరూ దూరం చేయలేరని గుర్తించలేని అజ్ఞానం ఆయనది.  




 మానవ వనరుల అభివృద్ధికి వైఎస్ ఇచ్చినంతటి ప్రాధాన్యాన్ని మరెవరూ ఇవ్వలేదు. ఇడుపులపాయ, నూజివీడు, బాసరలలో గ్రామీణ విద్యార్థుల ప్రతిభకు పదును పెట్టేందుకు స్థాపించిన విద్యాలయాలు ఆయన దార్శనికతకు నిదర్శనాలు. రైతు సంక్షేమానికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యం అంతకు ముందు ఏ ముఖ్యమంత్రీ ఇవ్వలేదు. భూమిలేని నిరుపేదలకు నాలుగు విడతలుగా భూ పంపిణీ కార్యక్రమాలు చేపట్టి ఐదు లక్షల ఎకరాలు, దాదాపు ఏడు లక్షల ఎకరాలకు గిరిజనులకు పట్టాలను పంపిణీ చేశారు. అంతేగాక ఆ భూములను చదును చేసుకోవడానికి ‘ఇందిరప్రభ’ ద్వారా వందల కోట్ల రూపాయలు వెచ్చించిన ఘనత ఆయనది. అనంతపురం, ప్రకాశం జిల్లాలలో వైఎస్ హయాంలో ప్రభు త్వం పారిశ్రామిక అవసరాలకు కేటాయించిన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చినా అందుకు రైతులు అంగీకరించలేదు. రైతుల బాగోగులను ఆయన అంతగా పట్టించుకొని పారిశ్రామిక అవసరాలను తీర్చడానికి పునాదులు వేశారు. తెలు గు ప్రజల సమైక్యతకు, సంక్షేమానికి ఆయన ఎంతగానో తపించారు. నేటి తెలంగాణలో, ఏపీలో ప్రత్యేకించి ఉత్తరాంధ్ర, రాయలసీమలలో జరుగుతున్న పరిణాలమాలను చూస్తే వైఎస్ కార్యక్రమాలు ఎంత ముందు చూపు తో చేపట్టినవో అర్థమవుతుంది. వైఎస్ బాటలోనే అభి వృద్ధి-సంక్షేమ సాధన కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన నాయకత్వంలోని వైఎస్సార్‌సీపీ చేస్తున్న రాజకీయ పోరాటాలను ప్రజలు ఆదరిస్తున్నారు, వెంట నడు స్తున్నారు. తెలంగాణలో వైఎస్ తనయ వైఎస్ షర్మిల జరుపుతున్న ఓదార్పుయాత్రను ప్రజలు ఆదరిస్తుండటం గమనార్హం. నేటి దౌర్భాగ్యకర పరిస్థితులను చూస్తుంటే ప్రజలకు వైఎస్ గుర్తొకొస్తున్నారు. 108, 104 సర్వీసులు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత వివాహాలు, మైనార్టీలకు  4 శాతం రిజర్వేషన్‌లు, ఇందిరమ్మ ఇల్లు, జలయజ్ఞం, వ్యవసాయ రంగానికి విశేష ప్రాధాన్యం ఆయన కృషిని గుర్తుకు తెస్తున్నాయి. ఇక రుణాల రద్దు, ఉచిత విద్యుత్, విద్యుత్ బకాయిల రద్దు, మున్సిపాలిటీలలో పన్నుల పెంపుదల లేకపోవడం, ఆర్టీసీ చార్జీల మోతలు లేకుండా చేయడం, కేంద్ర గ్యాస్ ధర పెంచితే పెంచిన గ్యాస్ భారం రాష్ట్ర ప్రభుత్వమే భరించడం అపూర్వం. పన్నులు వేయకుండా, ఆదా యం సమకూర్చుకుంటూ కనీవిని ఎరుగని రీతిలో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను పెంచిన అసాధారణ పాలనాదక్షుడు వైఎస్. రాష్ట్ర సంపదను పెంచారు, దాన్ని ప్రజలకు పంచారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వైఎస్ అభిమానులు ఆయన కలలను సాకారం చేయడానికి నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైంది.  



ఇమామ్ - వ్యాసకర్త కదలిక సంపాదకులు: 99899 04389

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top