అధ్వాన పాలనకు నిలువుటద్దం

అధ్వాన పాలనకు నిలువుటద్దం


ఢిల్లీ నగరానికి ఉన్నవి మూడు ప్రభుత్వాలు, మూడూ వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనాలే! మరిక ఓటరు ఏం చేయాలి? సాధారణంగా ఢిల్లీ ప్రజలు తమ జీవనంతో నేరుగా ముడివడి ఉన్న మున్సిపల్‌ ఎన్నికల పట్ల అతి తక్కువ ఆసక్తిని చూపుతారు, పోలింగూ తక్కువగానే ఉంటుంది. ఈసారి కూడా వారు ఉదా సీనంగానే వ్యవహరిస్తారా? లేదా నగరాన్ని ఈ దుస్థితిలోకి నెట్టిన పార్టీలనే గత్యంతరం లేక తిరిగి ఎన్ను కుంటారా? లేదా భవిష్యత్తు వైపు ముందడుగు వేస్తూ ఒక కొత్త ప్రత్యామ్నాయానికి అవకాశం ఇస్తారా?  జవాబు ఢిల్లీతో పాటు దేశ రాజకీయాలకు కూడా ఒక ముఖ్య సంకేతంగా నిలుస్తుంది.



మన దేశంలో మహానగరాలు ఎంత అధ్వానమైన స్థితిలో ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే మీరు ఢిల్లీకి రండి. ప్రభుత్వం పరిష్కారంలో భాగస్వామి కావడానికి బదులు సమస్యకు మూలం కావడం అంటే ఏమిటో చూడాలనుకుంటే ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్ను చూడండి. దీనిని మార్చడంలో ప్రజాస్వామిక ప్రక్రియగా ఎన్నికలు సైతం ఎందుకు విఫలమవుతున్నాయో అర్థం చేసుకోవాలనుకుంటే ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికలను పరిశీలించండి.



మూడు ప్రభుత్వాల మహా నగరం

మన నగరాలలో, మహానగరాలలో ప్రభుత్వం అనేది ఒక పజిల్‌ లాంటిది. ఎవరిపై ఏ బాధ్యత ఉందో, ఎవరి అధికార పరిధి ఏమిటో అధికారులకు తప్ప మరో మానవుడికి తెలియదు. ఢిల్లీవాసులకు అది ఒక నగరం. కానీ ఈ ఒక్క నగరంలో ఏక కాలంలో మూడు ప్రభు త్వాల పాలన నడుస్తుంది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ద్వారా కేంద్ర పాలన, ముఖ్యమంత్రి ద్వారా రాష్ట్ర పాలన, మేయర్, కమిషనర్ల ద్వారా ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పాలన. భూముల నిర్వహణను కేంద్ర ప్రభుత్వం తర ఫున డీడీఏ పర్యవేక్షిస్తుంది. భవనాల నిర్మాణాలకు కార్పొరేషన్‌ అనుమతి మంజూరు చేస్తుంది.



కానీ దానికి సంబంధించిన నియమాలను మాత్రం రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తుంది. రోడ్లు రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది. గల్లీ రోడ్లు నిర్మించే పనిని కార్పొరేషన్‌ చూసుకుంటుంది. కొన్ని ప్రాథమిక పాఠశాలలు, ఆసుపత్రులు కార్పొరేషన్‌ నిర్వహణలో ఉంటాయి. కొన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం చూసుకోగా, మరి కొన్నింటిని నేరుగా కేంద్రమే చూసు కుంటుంది. మురుగు కాల్వలు మొదలయ్యే చోట బాధ్యత కార్పొరేషన్‌ది కాగా, అవి అంతమయ్యే దశలో ఆ తలనొప్పిని భరించేది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి, ఇలాంటి గందరగోళం మధ్య ప్రభుత్వం నడపడం కన్నా ఖోఖో ఆడుకునే అవకాశాలే ఎక్కువగా ఉంటాయనేది స్పష్టం.



ఎవరికీ పట్టని సామాన్యుని గోడు

ఇలాంటి పరిస్థితిలో సామాన్యులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో గత సంవత్సర కాలపు అను భవం నుంచి అర్థం చేసుకోవచ్చు. నిరుడు వర్షాకాలం తర్వాత ఢిల్లీలో డెంగ్యూ, చికున్‌గున్యా వంటి అంటు వ్యాధులు ప్రకోపించాయి. ప్రభుత్వ లెక్కల్లో కేవలం 15 వేల మందికి ఈ వ్యాధులు సోకినట్టు నమోదైనా, వాస్తవానికి వీటి బారిన పడ్డవారి సంఖ్య 35–40 వేల దాకా ఉంటుంది. తగిన వేతనాలు లభించక పోవడం మూలంగా పారిశుధ్య కార్మికులు పలుమార్లు సమ్మె చేశారు. తూర్పు, ఉత్తర ఢిల్లీలలోని రోడ్లపై చెత్త కుప్పలు పేరుకుపోయాయి.



చలికాలం మొదలవుతూనే వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిని సైతం మించిపోయింది. ఆ రోజుల్లో ఢిల్లీలో నివసించే ప్రతి వ్యక్తీ నలభై సిగరెట్లకు సమానమైన పొగను పీల్చాల్సి వచ్చింది. ఐఐటీ నిర్వ హించిన పరిశోధనలో ఢిల్లీలో కాలుష్య దుష్ప్రభావం ఫలితంగా గత సంవత్సరం 50 వేల మరణాలు సంభ వించాయని తేలింది. ఈ మహానగరంలో ప్రతి ముగ్గురు పిల్లలలో ఒకరు శ్వాస సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నారు.



పరిస్థితులు ఇంత ప్రమాదకరంగా ఉన్నా ప్రభు త్వాలు ఇంకా మేల్కోవడం లేదు. ఢిల్లీ నగరాన్ని నడి పించాల్సిన బాధ్యత గల నేతలూ, అధికారులంతా తమ తమ జేబులు నింపుకోవడంలో తీరిక లేకుండా ఉన్నారు లేదా పరస్పర రాజకీయ దూషణల్లో మునిగి ఉన్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని అంతమొందించేందుకు సుప్రీంకోర్టు ఒక ఏడాది క్రితం 42 మార్గదర్శకాల్ని జారీ చేసింది. కానీ ఢిల్లీలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం, బీజేపీ చేతిలో ఉన్న మున్సిపల్‌ కార్పొరేషన్‌ వీటిలో ఒక్క మార్గదర్శకాన్నయినా సరిగా అమలు చేయలేదు.



కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం కోసం ఢిల్లీకి రూ. 336 కోట్లు కేటాయించగా, మూడు మునిసిపల్‌ కార్పొ రేషన్లు కలసి ఖర్చు చేసింది కేవలం రెండు కోట్లు మాత్రమే. ఢిల్లీలో డెంగ్యూ, చికున్‌గున్యా విలయ తాండవం చేస్తున్న రోజుల్లో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తన వైద్యం కోసం బెంగళూరు వెళ్లగా, ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా ఫిన్లాండ్‌ విద్యా వ్యవస్థను అధ్యయనం చేయడం కోసం అక్కడకు వెళ్లారు. అదే సమయంలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌ అమెరికా పర్యటనను ముగించుకొని రాగా, ఉత్తర మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ యూరప్‌ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీ నగరం మురికికీ, రోగాలకూ నెలవుగా మారిపోతోంది. ప్రభుత్వాలూ, పార్టీలూ నువ్వంటే నువ్వంటూ పరస్పర నిందారోపణల్లో మునిగి తేలు తున్నాయి.



స్థానిక ఎన్నికలకైనా గుర్తురాని పౌర సదుపాయాలు

ఇలాంటి పరిస్థితిలో ఎన్నికలు జరిగితే ఏం జరుగు తుంది? అన్ని పార్టీలూ ఢిల్లీలో మురికీ, చెత్తా లేకుండా చేయడానికి సంబంధించిన పథకాల్ని ప్రతిపాదించ వచ్చనీ, మురికికి తావులేని ఢిల్లీ అనే నినాదంతో కార్య క్రమాల్ని చేపట్టవచ్చనీ మీరు భావిస్తున్నారు కదా! కానీ ఏప్రిల్‌ 23న జరుగనున్న మున్సిపల్‌ ఎన్నికల తీరు తెన్నులెలా ఉన్నాయో గమనించండి. ఢిల్లీలోని మూడు మున్సిపల్‌ కార్పొరేషన్లలోని 273 వార్డులకు ఎన్నికలు జరుగ బోతున్నాయి. రానున్న ఐదేళ్లలో నగరం స్వరూప స్వభావాల్లో రాగల మార్పు లేమిటో నిర్ణయించు కోవా ల్సిన తరుణమిదే. కానీ పెద్ద పార్టీలన్నీ మురికి, పారి శుధ్యం వంటి సమస్యలు మినహా అప్రధానమైన విష యాలన్నింటి గురించీ మాట్లాడుతున్నాయి.



పదే ళ్లుగా మునిసిపల్‌ కార్పొరేషన్ను ఏలుతున్న బీజేపీ ఈ దుస్థితికి తనదే బాధ్యత అని గుర్తించడానికి బదులు మోదీ వెల్లు వను అడ్డు పెట్టుకొని గెలుపు కోసం ప్రయ త్నిస్తోంది. అపఖ్యాతి పాలైన కార్పొరేటర్లను వదిలించుకోవడానికి బీజేపీ పాత కార్పొరేటర్లందరికీ టికెట్లు నిరాకరించే ఎత్తు గడను చేపట్టింది. ఈ కసరత్తుతో ప్రజలు బీజేపీ ఆధ్వ ర్యంలో ఢిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ అసమర్థతలనూ, మురికినీ, చెత్తనూ, అవినీతినీ మర్చిపోతారని అది ఆశిస్తోంది.



మరోవైపు ఢిల్లీని పాలిస్తున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా గత రెండేళ్లలో చేశామని చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. అందుకే అది కూడా రోజుకో కొత్త హామీతో ముందుకొస్తోంది. తమ పార్టీ గెలిస్తే ఇంటి పన్నును రద్దు చేస్తుందనీ, పాత బకాయిల్ని మాఫీ చేస్తుందనీ అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. దీని వల్ల పేదలకు ఒరిగే లాభ  మేమీ లేదు. ఎందుకంటే గుడిసెల్లో నివసించే వారు, అధికారిక గుర్తింపులేని కాలనీల్లో ఉండేవారు అసలు ఇంటి పన్ను కట్టనే కట్టరు. కానీ ఈ ఇంటిపన్ను మాఫీ  పథకంతో మున్సిపల్‌ కార్పొరేషన్‌ నడుం విరగడం మాత్రం ఖాయం. పారిశుధ్య కార్మికులకు వేతనాలు చెల్లించడానికే అగచాట్లు పడుతున్న కార్పొరేషన్‌ ఈ మాఫీతో దివాళా తీయక తప్పదు. ఇంతవరకు ఏదో మేరకు జరుగుతున్న పనులు కూడా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఎన్నికల్లో ఓటమి తప్పదనే అంచ నాతో, నిరాశ మూలంగానే కేజ్రీవాల్‌ అమలుకు సాధ్యం కాని హామీలు ఇస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కూడా పోటీ పడుతోంది–అరిగి పోయిన అవే వాగ్దానాలతో, ఓటమి అలుముకున్న అవే ముఖాలతో.



రాజధాని ఓటరు కొత్త దారి పట్టేనా?

ఒక నగరానికి మూడు ప్రభుత్వాలు, మూడూ వైఫల్యా నికి నిలువెత్తు నిదర్శనలే! కాబట్టి ఇప్పుడు ఓటరు ఏం చేయబోతున్నాడనేది అసలు విషయం. సాధారణంగా ఢిల్లీలో మునిసిపల్‌ ఎన్నికల్లో పెద్దగా ఉత్సాహం కని పించదు. ప్రజలు తమ జీవనంతో నేరుగా ముడివడి ఉన్న ఈ ఎన్నికలపట్ల అతి తక్కువ ఆసక్తిని చూపుతారు, పోలింగూ తక్కువగానే ఉంటుంది. కాబట్టి ఈసారి కూడా ప్రజలు ఎన్నికల్లో ఉదాసీనంగా వ్యవహరించి, ఆ తర్వాత ఫిర్యాదులు చేస్తారా? లేదా ఢిల్లీని ఈ దుస్థితి లోకి నెట్టిన పార్టీలనే గత్యంతరం లేక మరోసారి ఎన్ను కుంటారా? లేదా ఢిల్లీ ప్రజలు తిరిగి ఆ పాత బాటనే సాగడానికి బదులు భవిష్యత్తు వైపు ముందడుగు వేస్తూ ఒక కొత్త ప్రత్యామ్నాయానికి అవకాశం ఇస్తారా?. ఈ ప్రశ్నకు జవాబు ఢిల్లీతో పాటు దేశ రాజకీయాలకు సంబంధించి కూడా ఒక ముఖ్యమైన సంకేతంగా నిలు స్తుంది.



వ్యాసకర్త స్వరాజ్‌ అభియాన్, జైకిసాన్‌ సంస్థల్లో సభ్యుడు

యోగేంద్ర యాదవ్‌

మొబైల్‌ : 98688 88986

Twitter : @_YogendraYadav

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top