సీబీఐకి ఎందుకీ ‘రక్షణ’ కవచం?

సీబీఐకి ఎందుకీ ‘రక్షణ’ కవచం?


మనం ఇప్పటికీ అవినీతి గుట్టు వెల్లడించే వారిని వెంటాడి వేధిస్తున్నామే గాని, బయటకు వచ్చిన సమాచారం మేరకు పరిశోధన చేసి అవినీతిని ఆపడానికి ఏమీ చేయడం లేదు. అక్రమమో, సక్రమమో కీలకమైన అవినీతి సమాచారం వెల్లడిస్తే, ఆ క్లూను మరింత తవ్వి అవినీతిని వేళ్లతో సహా పెకిలించడం దర్యాప్తు సంస్థల బాధ్యత, వారిని పాలించే ప్రభుత్వాల ధర్మం.

 

బోఫోర్స్ లంచాల గుట్టు బయటపడడానికి మూలం సమాచార హక్కు. స్వీడన్‌లో సమాచార స్వాతంత్య్రం 1766 నుంచి ఉన్న ది. అందుకే, తుపాకులు అమ్ము కోవడానికి భారత్‌లో పెద్దలంద రికీ స్వీడన్ భారీ ముడుపులు అందజేసిందని ఆ దేశ అధికారిక రేడియో చెప్పగలిగింది. భార త్‌లో ఆనాడు సమాచార స్వేచ్ఛా చట్టం లేకపోయినా, స్వీడన్‌లో ఉండడం వల్ల ఈ వ్యవ హారం బయటపడింది. బోఫోర్స్ కుంభకోణం బయట పడడానికి స్వీడన్‌లోని 1766 నాటి తొలి సమాచార హక్కు చట్టం ఉపయోగపడితే, అదే బోఫోర్స్ సమాచారం దాచ డానికి 2005 నాటి సమాచార హక్కు చట్టం నుంచి మన కేంద్ర ప్రభుత్వం ిసీబీఐని తొలగించడమే విషాదం.  

 

  ఇప్పటి లక్షల కోట్ల వ్యాపార రాజకీయాల ముందు, బోఫోర్స్ కుంభకోణంలో చెల్లించినట్టు చెప్పే 64 కోట్లు చాలా తక్కువే. ‘మిస్టర్ క్లీన్’ రాజీవ్ గాంధీ పాలనను కుది పివేసిన కుంభకోణమిది. ఉన్నత స్థానాలలో పెద్దల అవి నీతిని ప్రశ్నించడమే గాక, ఈ దేశ రాజకీయ స్వరూపాన్నే మార్చింది. ఏక పార్టీ పాలన ముగిసి సంకీర్ణకూటముల, ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యం మొదలైంది. అవినీతి మాత్రం తగ్గలేదు. కానీ పత్రికా స్వాతంత్య్రం, ప్రజా ైచైతన్యం, న్యాయస్థానాల సమీక్షతో అవినీతిపైన  పోరాడ వచ్చని తేలింది. బోఫోర్స్ కేసు చార్జిషీటు వరకు రాకముందే నిందితులంతా చనిపోయారు. ఇటాలియన్ వ్యాపారి కత్రోచీ మరణించే దాకా దర్యాప్తు వాయిదా పడిం ది. కత్రోచీతోనే బోఫోర్స్ న్యాయసాధనోద్యమం కూడా మరణించింది.  

 

 మనం ఇప్పటికీ అవినీతిని వెల్లడించే వారిని వెంటాడి వేటాడి వేధిస్తున్నామే గాని బయటకు వచ్చిన సమాచారం మేరకు పరిశోధన చేసి అవినీతిని ఆపడానికి ఏమీ చేయడం లేదు. అక్రమమో సక్రమమో కీలకమైన అవినీతి సమాచారం వెల్లడిస్తే,  ఆ క్లూను మరింత తవ్వి అవినీతిని వేళ్లతో సహా పెకిలించడం దర్యాప్తు సంస్థల బాధ్యత, వారిని పాలించే ప్రభుత్వాల ధర్మం. వెల్లడయిన సమా చారం నమ్మదగినదయితే తదుపరి చర్య తీసుకోవాలి. గుట్టు రట్టు  చేసిన వారిని గుర్తించాల్సిన అవసరం లేదు. ప్రాథమిక విచారణలో నిజమని తేలితే బయటపడిన సమాచారాన్ని ఒప్పుకోవాలి. ఇవి రెండు కీలకమైన న్యాయసూత్రాలు.



సుప్రీంకోర్టు నియమాలకు సమాచార హక్కు చట్టం విజిల్ బ్లోయర్స్ చట్టంలోని నియమాలు విరుద్ధంగా ఉన్నాయి. వ్యక్తిపేరు చెబితే భద్రతకు ప్రమాదకరం అను కున్నపుడు ఆ విషయం వెల్లడి చేయడానికి వీల్లేదని సెక్షన్ 8(1) (జి) నియమం ఆదేశిస్తున్నది. సీబీఐ మాజీ డెరైక్టర్ రంజిత్ సిన్హా వివాదంలో డైరీని లీక్ చేసిన వ్యక్తి భద్రతకు అత్యంత ప్రమాదం ఉన్నదని తెలిసి కూడా వెల్లడి చేయాలని ఎందుకు ఆదేశించారు?  

 విజిల్ బ్లోయర్స్ ప్రొటెక్షన్ చట్టం 2011 సెక్షన్ 4(6) పేరు చెప్పని వారు వెల్లడించే సమాచారాన్ని దర్యాప్తు చేయకుండా ఫిబ్రవరి 2014లో నిషేధం విధించింది. ప్రాణాలకు తెగించి గుట్టు బయటపెట్టిన వారి ప్రాణాలను ఈ చట్టం రక్షిస్తుందని నమ్మాలి. అదే సమయంలో పేరు చెప్పకుండా లంచగొండులను బయటపెడితే అసలు పరిశీలించడం కూడా నిషేధించడం ఎంత వరకు న్యా యం?  పేరు చెప్పకుండా, కారణాలు చెప్పకుండా సమాచారం కోరవచ్చునని సమాచార హక్కు చట్టం 2005లో హక్కు కల్పించారు.

 

  కాని ఆకాశరామన్న ఉత్తరాలను పట్టించుకోనవసరం లేదని అందుకు విరుద్ధమైన నియ మాలను విజిల్ బ్లోయర్స్ చట్టంలో చేర్చారు.  రంజిత్ సిన్హా ఇంటి డైరీ గుట్టు బయటపెట్టిన వారిని గుర్తించాలని సుపీంకోర్టు ఆదేశించిన తరువాత చెలరేగిన వివాదాల ఘర్షణ నుంచి  ఈ రెండు సూత్రాలు రూపొందాయి. రంజిత్ సిన్హా సీబీఐ డెరైక్టర్ హోదాలో ఉండి, తన అధి కారిక నివాసంలో రాత్రి వేళలో రకరకాల కేసుల్లో నిందితులైన వారిని మే 2013 నుంచి ఆగస్ట్  2014 మధ్య రాడాగ్ అధికారులతో 15 నెలల్లో 50 సార్లు సమావేశాలు జరపడం అనేక అనుమానాలకు దారితీస్తుంది. ఈ డైరీ నకిలీదని ముందు వాదించి తరవాత ఎవరో తెలియని వారు దానిని లీక్ చేశారని అన్నారు.

 

 సుప్రీంకోర్టుకు సమర్పించే పత్రాలను పిటిషనర్ ప్రమాణ పత్రం ద్వారా ఇవ్వాలని, అందులో తనకు వ్యక్తి గతంగా అందిన సమాచారం ఆధారంగా ఇచ్చిన పత్రాలా లేకా తాము నమ్మిన అంశాలా అనేవి వివరించాలని, తనకు విషయాలు తెలిపిన వారి పేర్లు  వెల్లడించాలని సుప్రీంకోర్టు  నియమాలు ఆర్డర్ 9 రూల్ 13 నిర్దేశిస్తు న్నదని, కనుక తనకు డైరీ ఇచ్చిన వారి పేరు చెప్పాలని సుప్రీంకోర్టు  సెప్టెంబర్ 15, 2014న ఆదేశించింది. ఈ ఆదేశాన్ని  నవంబర్ 20 న ఉపసంహరించింది. సుప్రీం కోర్టు  తాజా ఉత్తర్వులు  విజిల్‌బ్లోయర్ల రక్షణకు ముంద డుగు అనవచ్చు.



లీక్ అయిన ైడైరీ నిజమో కాదో అని పరిశీలించడానికి ఒకే అవకాశం సమాచార హక్కు కింద అధికారికంగా పౌరులు ఆ ైడైరీ పొందే అవకాశం కల్పిం చడమే. కాని ప్రస్తుతం డైరీ అధికారిక ప్రతిని అడగడానికి వీల్లేదు.  సమాచార హక్కు చట్టం సెక్షన్ 24 కింద దేశ భద్రతకు సంబంధించిన సంస్థలను మినహాయించడానికి వీలు కల్పించారు. సీబీఐ కూడా ఒక పోలీసు సంస్థ. పోలీస్ శాఖలు ఈ చట్టం కింద సమాచారం ఇస్తుంటే సీబీఐని తప్పించడం అసమంజసం.  జనం అడుగుతారనే భయం రగిల్చితే తప్ప దర్యాప్తు సంస్థలు ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయవు.

 (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్)

 professorsridhar@gmail.com

 డా॥మాడభూషి శ్రీధర్

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top