దొనకొండను చూడరేం?

దొనకొండను చూడరేం? - Sakshi


ప్రయాణ సౌకర్యాలను బట్టి దొనకొండ ఎంతో అనువైనది. అక్కడ ప్రభుత్వ భూమే మొత్తం 54,483 ఎకరాలతో అనువుగా ఉంది. అటవీభూమి 20,248 ఎకరాలుంది. బీడుగా పడివున్న 10,037 ఎకరాలున్నాయి. ప్రకృతి రమణీయతతో కొండలు! రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు దొనకొండకు మధ్య దూరం ఎక్కువేమీ లేదు.

 

విశాఖ, విజయవాడ, గుంతకల్లు, మద్రాసు, బెంగళూరులకు ఇక్కడ నుంచి రైలు సౌకర్యాలున్నాయి. ప్రస్తుతం నంద్యాల-విజయవాడ మధ్య రైల్వే మార్గం ఉంది. నంద్యాల నుంచి ఎర్రగుంట్లకు నిర్మిస్తున్న రైలుమార్గం మరో 30 కిలోమీటర్లు నిర్మిస్తే ఈ పథకం పూర్తయినట్టే. ఆ పనులు పూర్తయితే హైదరాబాద్ - బెంగళూరులకు కనెక్టివిటీ ఏర్పడుతుంది.

 

 

‘ఈ విశ్వ ప్రపంచంలో చరిత్రలేని వస్తువేమున్నది? చరిత్ర రాయికున్నది, రప్పకున్నది. మనుషులకు ఉండటంలో ఆశ్చర్యమేమున్నది? (అందుకే)రాతికి సంబంధించిన చరిత్ర భూగర్భశాస్త్రంగా పరిణమించింది. రప్పకున్న చరిత్ర వృక్షశాస్త్రంగా వికసించింద’ని మన సుప్రసిద్ధ చరిత్రకారుడు, పరిశోధకుడు మల్లంపల్లివారు చెప్పారు. అలాగే శాసనాధారాలు లేని ప్రాంతంలేదు. పాలనకు అనువుగాని మండలాలు, గ్రామాలు, ప్రాంతాలూ ఉండవు. ఒక నాటి అశ్మక జనపదా నికి నేటి బోధన్ చిరు రాజధాని కాదా? 17-18 శతాబ్దాల్లో కర్నూలు చిన్నదైనా హైదరాబాద్ నవాబులకు రాజధానిగా పేరొందలేదా? 14వ శతాబ్దిలో నాటి విశాఖ, విజయనగరం జిల్లాలలోని వీర నారాయణం, గుడివాడ, లక్కవరపు కోట ప్రాంతాలు కలిపి ఏర్పడిన ‘జంతుర్నాడు’కు రాజ ధానిగా ఉన్న ఎలమంచలి చిన్నది కాదా? కందర రాజులకు నరసరావుపేటలోని ‘కపోత కందర పురం’గా పేరుపడిన చేజెర్ల గ్రామం రాజధానిగా లేదా? పూర్వ చాళుక్య రాజధానులుగా జననాథపురం (ద్రాక్షారామం), పెదవేగి కుగ్రామాలు లేవా?



పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు విభజనానంతరం పరిశేష రాష్ట్రంలో ఆ పదవి చేపట్టడం న్యూన తగా భావిస్తున్నట్టుంది! ఆ చూపే ప్రకాశం జిల్లా దొనకొండను చూడనివ్వదు! అన్నీ ఉన్నా ‘అల్లుడి నోట్లో శని’ అన్నట్టుగా ఈ రాష్ట్రానికి రాజధాని కొరత!  నేటి స్పెక్యులేటివ్ ధనస్వామ్య ఆర్థిక వ్యవస్థను సంక్షోభం దిశగా నడుపుతున్న నాయకుల హయాంలో ఏపీ రాష్ట్ర రాజధాని సమస్య కూడా ’చట్టా వ్యాపారం’లో భాగస్వామి అయిపోయింది! ప్రపంచంలో ఏ దేశంలోగానీ, ఏ రాష్ట్రంలోగానీ భారీ జనాభా సాంద్రతతో కిక్కిరిసిపోయిన పట్టణాలే, ప్రాంతాలే లేదా ప్రదేశాలే ఆ దేశాలకు గానీ, అక్కడి రాష్ట్రాలకు గానీ రాజధానులుగా ఎంపిక కాలేదు. చిన్న పట్టణాలు, లేదా ప్రాంతాలు కూడా రాజధానులై శోభించినవే. అమెరికాలోని న్యూయార్క్ రాజధాని ఆల్బనీ ఒకనాటి చిన్న సిటీ. కాలిఫోర్నియా రాజధాని శాన్‌ఫ్రాన్సిస్కో పెద్ద నగరం కాదు... పిట్టంత శాక్రమెంట్! అలాగే ఆస్ట్రేలియా రాజధాని ఓ చిన్నపాటి పాలనా కేంద్రం. కానీ ఆస్ట్రేలియా ఆర్థిక, పారిశ్రామిక కేంద్రాలు సిడ్నీ, మెల్‌బోర్న్! అదీ పాలనాకేంద్రాల వికేంద్రీకరణ అంటే!

 రెండు ప్రాంతాలకు చేరువగా...



ఇలా చూసినపుడు నూతన రాజధాని ఎంపికను ఆర్థిక ‘సామ్రాజ్యాలు’ సృష్టించుకున్న మోతుబరుల కార్పొరేట్ ప్రయోజనాల రీత్యా నిర్ణయించ కూడదు. ప్రైవేట్ భూముల క్రయవిక్రయాల స్పెక్యులేషన్‌కు తావివ్వరాదు. పైగా రాయలసీమవాసులు యావదాంధ్రజాతి ఐక్యత కోసం ఒకసారి కర్నూలును కోల్పోయి, రాజధాని ప్రతిపత్తిని త్యాగంచేశారు. కాబట్టి అటు రాయలసీమకు, ఇటు కోస్తాంధ్రకు అందుబాటులో ఉన్న దొనకొండ పట్టణం రాష్ట్ర రాజధానిగా పరిశీలనార్హమైనదే. ప్రకాశం జిల్లాకు తూర్పున సముద్ర తీరం, కొత్తపట్నం, చీరాల దగ్గర ఓడరేవు, నౌకా కేంద్రాలున్నాయి.



 పుష్కలంగా ఉన్న భూవసతి



దమ్మిడీ ఖర్చు లేకుండా ప్రభుత్వభూమే మొత్తం 54,483 ఎకరాలతో అను వుగా ఉంది.  అటవీభూమి 20,248 ఎకరాలుంది. బీడుగా పడివున్న 10,037 ఎకరాలున్నాయి. ప్రకృతి రమణీయతతో కొండలు! రాష్ట్రంలోని వివిధ జిల్లా లకు దొనకొండకు ఉన్న దూరం ఎక్కువేమీ లేదు. జిల్లాలోని పెద్ద పట్టణా లలో దొనకొండ ఒకటి. మైదాన ప్రాంతం. సముద్రమట్టానికి 446 అడుగుల ఎత్తులో ఉంది. వ్యవసాయం, దానిపై ఆధారపడిన అనుబంధ ఉత్పత్తులు ప్రధాన వర్తక, వాణిజ్యాలు. ప్రసిద్ధ వ్యవసాయ క్షేత్రం ఆరవల్లిపాడు దగ్గరే ఉంది.  వైశాల్యంతో పోలిస్తే జన సాంద్రత తక్కువ!  రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నిర్మించిన విమానాశ్రయం నిరుపయోగంగా ఉంది. వ్యూహాత్మ కంగా కీలకం కనుక ఇక్కడ ఇంధనం నింపుకునే కేంద్రంగా ఏరోడ్రోమ్‌ను నిర్మించారు. కోస్టల్ కారిడార్ ఏర్పడితే రోడ్డు మార్గం కూడా అందుబాటు లోకి వస్తుంది. అంతా రాజధానిగా భావిస్తున్న గుంటూరుకు ఇది 140 కిలో మీటర్లలోనే ఉంది. దొనకొండకు 10 కి.మీ. దూరంలో జాతీయ రహదారి ఉంది. భూకంప మండలానికి కూడా చాలా దూరంగా ఉన్న పట్టణం దొనకొండ అని భూగర్భ శాస్త్రవేత్తల అంచనా. ఇక వరదలకూ అది దూరమే!  అలాంటి దొనకొండ కోస్తాంధ్ర, రాయలసీమల సాంస్కృతిక బంధాలకు ఏపీ నడిబొడ్డుగా ఉంటుందని వివిధ ప్రజా సంఘాలు కూడా భావిస్తున్నాయి.



రైల్వే సౌకర్యాల నిలయం



విశాఖ, విజయవాడ, గుంతకల్లు, మద్రాసు, బెంగళూరులకు ఇక్కడ నుంచి రైలు సౌకర్యాలున్నాయి. ప్రస్తుతం నంద్యాల - విజయవాడ మధ్య రైల్వే మార్గం ఉంది. నంద్యాల నుంచి ఎర్రగుంట్లకు నిర్మిస్తున్న రైలు మార్గం మరో 30 కిలోమీటర్లు నిర్మిస్తే ఈ పథకం పూర్తయినట్టే. ఆ పనులు పూర్తయితే హైదరాబాద్ - బెంగళూరులకు కనెక్టివిటీ ఏర్పడుతుంది. విజయవాడ నుంచి చెన్నై, విశాఖలకు కనెక్టివిటీ ఉంది. బనగానపల్లె (కర్నూలు జిల్లా) వరకూ రైలుపట్టాలు నిర్మించారు. రాయలసీమ, కర్ణాటక, ఆంధ్ర ప్రాంతాలను కలిపే ప్రధాన రైలుమార్గం ఉంది.



దొనకొండలోనే స్టీమ్ ఇంజిన్ లోకోషెడ్ కూడా ఉంది. దొనకొండ మీదుగా వెళ్లే ప్రతి రైలుకూ స్టీమ్ లోకో మీటర్ గేజ్ ఉన్నప్పుడు అందుబాటులో ఉండేది. అప్పట్లో రైల్వే ఎస్టాబ్లిష్ మెంట్ దొనకొండ పట్టణ వ్యవస్థకు జీవనాడిగా వర్ధిల్లింది. అలాంటిది మీటర్‌గేజ్ నుంచి బ్రాడ్ గేజ్‌కు మార్చడంవల్ల స్టీమ్ ఇంజిన్లకు బదులు డీజిల్ లోకోలు రావడంతో స్టీమ్ లోకో షెడ్డు మూతబడింది. రైల్వే ఉద్యోగులంతా ఇతర రైల్వే డివిజన్లకు వలసపోవడంతో దొనకొండ పట్టణం  ప్రధానమైన ఒక ఆర్థిక సౌలభ్యాన్ని కోల్పోవలసివచ్చింది. ఇప్పుడు రైల్వే క్వార్టర్స్ నిర్మానుష్యంగా ఉండిపో యాయి. రైల్వేస్టేషన్ కోడ్‌లో ఒకప్పుడు ‘డి.కె.డి’గా ప్రసిద్ధి కెక్కిన దొనకొండను అందరం కాపాడుకోవాలి. ఒక ప్రధాన కేంద్రంగా కోల్పోయిన ప్రతిష్టను తిరిగి సాధించేందుకు ఎంపీలు కృషిచేయాలి.



నీరూ సమస్య కాదు



మండల కేంద్రమైన దొనకొండకు కేవలం వంద కిలోమీటర్లలోనే ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్ వద్ద కృష్ణా నదీజలాలు తేలిగ్గా చేరతాయి. సాగర్ కాలువ ప్రవహించే లక్ష్మీపురం పంచాయతీ దొనకొండ మండలంలోనిదే. అంతేగాదు రెండు సొరంగాల ద్వారా కృష్ణా జలాలను పారించడానికి ఉద్దేశించిన వెలుగొండ ప్రాజెక్టు త్వరలోనే పూర్తికావస్తోంది. అలాగే నీటి సరఫరాను గుండ్లకమ్మ నది ద్వారా కూడా పెంచుకోవచ్చు. దొనకొండకు  కృష్ణా నుంచి 10 టీఎంసీల నీరు ఇప్పించడం సాధ్యమే. ఎందుకంటే, దొనకొండ పక్క నుంచే ప్రవహించే దర్శి బ్రాంచి కెనాల్ ఈ నీటిని రాజధానికి చేర్చడం చాలా సులభమని నిపుణుల అంచనా! నాయకులు పిదప ఆలోచనలు మాని కోస్తా, రాయలసీమ ప్రజాబాహుళ్యపు విశాల ప్రయోజనా లను దృష్టిలో పెట్టుకుని తద్వారా మిగిలిన రాష్ట్ర గౌరవ, ప్రపత్తులనైనా నిలబెట్టగలరని ఆశిద్దాం!  



 (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు)      ఏబీకే ప్రసాద్

 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top