సమాఖ్య స్ఫూర్తికి ‘హింస’

సమాఖ్య స్ఫూర్తికి ‘హింస’ - Sakshi


కేరళ, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్‌లలో మినహా మిగిలిన రాష్ట్రాలలో పశువధకు సంబంధించి కఠిన చట్టాలే ఉన్నాయి. వాటిలో గోవధ నిషేధం ఒకటి. కానీ గేదెలు, దున్నలు ఈ పరిధిలో లేవు. ఈ నేపథ్యంలోనే కేంద్రం విడుదల చేసిన నిబంధనలలో‘క్యాటిల్‌’ (పశువులు) నిర్వచనంలోకి ‘బఫెలో’ (దున్నలు, గేదెలు) కూడా చేరడంతో రగడ మొదలైంది. ఈ నిర్వచనం విషయంలో రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోకపోవడం ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధమే.



మనది వ్యవసాయాధార దేశం. పశువుల వినియోగం గురించి చేసే నిర్ణయాలు విశేష ప్రభావం చూపిస్తాయి. 1960 నాటి జంతు హింసా నిరోధక చట్టానికి అనుబంధంగా మే 23, 2017న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలతో దేశంలో కలకలం రేగడం అందుకే. వీటినే ‘లైవ్‌స్టాక్‌ మార్కెట్స్‌ రెగ్యులేషన్‌ రూల్స్‌ 2017’ అంటున్నారు. పశువుల సంతలు, వీటి క్రమబద్ధీకరణపై కేంద్రం విధించిన నిబంధనలివి. దేశంలో కోట్లాది మంది రైతులు, పాల ఉత్పత్తిదారులు ఉన్నారు. పశుమాంసం, ప్రాసెసింగ్‌ పరిశ్రమ, ఎగుమతి రంగాలలో లక్షలాదిమంది ఉపాధి పొందుతున్నారు.



కోట్లాది మందికి పశుమాంసమే ఆహారం. ఈ వర్గాలలో ఎవరినీ సంప్రతించకుండానే కేంద్రం ఆ నిబంధనలను వెలువరించింది. అదేకాకుండా, పశు సంరక్షణ కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖలోనిది. కానీ ఈ నిబంధనలకు సంబంధించిన ప్రకటన పర్యావరణ శాఖ ఇచ్చింది. ఈ నిబంధనలు వర్తించే వర్గాలనే కాదు, వాటిని అమలు చేయవలసిన రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కేంద్రం సంప్రతించలేదు. అయితే ఈ అంశాన్ని పునఃసమీక్షించేందుకు సిద్ధంగా ఉన్నట్టు, ప్రజల ఆహారపు అలవాట్లను మార్చడం ఈ నిబంధనల ఉద్దేశం కాదని ప్రకటించడం ఆహ్వానించదగినదే.



జంతు హింసా నిరోధక చట్టం (ప్రివెన్షన్‌ ఆఫ్‌ క్రూయెలిటీ టు యాని మల్స్‌ యాక్ట్‌– పీసీఏ యాక్ట్‌) సెక్షన్‌ 38లోని, సబ్‌ సెక్షన్‌ 1ని అనుసరించి కేంద్రం ఈ నిబంధనలను ప్రకటించింది. కానీ రాజ్యాంగంలోని 7వ షెడ్యూలులో, రాష్ట్ర జాబితాలోని 15 ఎంట్రీ ప్రకారం పశువుల ఆరోగ్య సంరక్షణ, నిర్వహణా తర్ఫీదు వంటి అంశాలు కూడా రాష్ట్రాల పరిధిలోనివే. ఇక ఆర్టికల్‌ 243 ప్రకారం పశు సంరక్షణ, డెయిరీ, టానరేస్‌ (తోళ్ల శుద్ధి) వంటి వాటి పర్యవేక్షణ, నియంత్రణ పంచాయతీలకూ పురపాలక సంస్థలకూ రాష్ట్ర ప్రభుత్వం బదలాయించాలి. కేంద్ర పరిధిలోని పీసీఏ చట్టాన్ని అమలు చేయవలసిన బాధ్యత మాత్రం రాష్ట్రాలదే. కేరళ, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్‌లలో మినహా మిగిలిన రాష్ట్రాలలో పశువధకు సంబంధించి కఠిన చట్టాలే ఉన్నాయి. వాటిలో గోవధ నిషేధం ఒకటి. కానీ గేదెలు, దున్నలు ఈ పరిధిలో లేవు. ఈ నేపథ్యంలోనే కేంద్రం విడుదల చేసిన నిబంధనలలో ‘క్యాటిల్‌’ (పశువులు) నిర్వచనంలోకి ‘బఫెలో’(దున్నలు, గేదెలు)కూడా చేరడంతో రగడ మొదలైంది. ఈ నిర్వచనం విషయంలో రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోకపోవడం ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధమే.



నిబంధనలు ఏం చెబుతున్నాయి?

కొత్త నిబంధనల ప్రకారం జిల్లా స్థాయిలో పశువుల మార్కెట్‌ మానిటరింగ్‌ కమిటీలను ఏర్పాటు చేయాలి. పశువుల మార్కెట్‌ కమిటీలను నియంత్రించే అధికారాలు మానిటరింగ్‌ కమిటీలకు ఉంటాయి. పశువుల మార్కెట్ల వివరాలు మానిటరింగ్‌ కమిటీల దగ్గర విధిగా నమోదు కావాలి. మార్కెట్లలో పశువుల శాలలు, తాగునీరు, మేత ఏర్పాట్లు సహా నిర్దేశించిన సౌకర్యాలు/వసతులు కల్పించిన తరువాతనే జిల్లా పశువుల మార్కెట్‌ మానిటరింగ్‌ కమిటీలు పశువుల మార్కెట్ల వివరాల నమోదుకు ఆమోదించాలి. ఇతర రాష్ట్రాల సరిహద్దులకు 25 కిలోమీటర్ల లోపల, ఇతర దేశాల సరిహద్దులకు 50 కిలోమీటర్ల లోపల పశువుల మార్కెట్ల ఏర్పాటు నిషిద్ధం. పశువుల ఆరోగ్య స్థితిగతుల పర్యవేక్షణకు వెటర్నరీ ఇన్‌స్పెక్టర్లు ఉండాలి.



ముద్రలు వేయడం, కొమ్ములకు రంగులు పూయడం, వాటిని చెక్కడం, గేదెల చెవులకు బిళ్లలు వేయడం, గంగిరెద్దుల ఆట, కుచ్చులు, గంటలతో అలంకరణ కూడా నిషిద్ధమే. పాడిపశువులకు ఆక్సిటోసిన్‌ ఇంజెక్షన్లు ఇవ్వకూడదు. ఇవన్నీ పశు హింసకు దోహదం చేస్తాయి. కాబట్టి అనుమతించరాదు. నిబంధనల మేరకు పశువుల అమ్మకాలపై కొన్ని ఆంక్షలు విధించారు. అవి: ఆరు మాసాల లోపు వయసు ఉన్న పశువును మార్కెట్‌కు తీసుకురాకూడదు. తీసుకొచ్చిన పశువు యజమాని పేరు, చిరునామా సహా ఫొటో గుర్తింపు కార్డు, పశువు వివరాలు నమోదు చేయించాలి. వధ కోసం అమ్మేందుకు తీసుకు రాలేదని చెప్పే ప్రమాణపత్రం మార్కెట్‌ కమిటీ కార్యదర్శికి ఇవ్వాలి. కొనుగోలు చేసిన వారు ఆ పశువును ఆరు నెలలలోపున వేరే వారికి విక్రయించకూడదు. ఈ ఆంక్షల మేరకు ఆవులు, ఆంబోతులు, ఎద్దులు, గేదెలు, దున్నలు, ఒంటెలు వంటివన్నీ పశుగణం అన్న నిర్వచనం కిందకి వస్తున్నాయి. గోవధ మీద నిషేధం ఉన్నా గేదెలు/దున్నల వధ మీద నిషేధం లేదు. కాబట్టి కొత్త ఆంక్ష వలన ఎదురయ్యే సమస్యలను పరిశీలించాలి.



సున్నితమైన అంశం

వ్యవసాయం, పశుసంవర్ధకతలను అధునాతన, శాస్త్రీయ పద్ధతులలో అభివృద్ధి చేయాలనీ; ఆవులు, లేగదూడల వధను నిషేధించాలనీ, పాడిపశువులను, వ్యవసాయానికి పనికివచ్చే పశువులను కోతకు అనుమతించరాదనీ, వివిధ జాతుల పశువులను పరిరక్షిస్తూ మరింత అభివృద్ధి చేయటం ప్రభుత్వ బాధ్యత అని ఆదేశిక సూత్రాలు నిర్దేశిస్తున్నాయి. కేశవానంద భారతి కేసు సహా మరికొన్ని కేసులలో ప్రాథమిక హక్కులకు భంగం కలిగించని రీతిలో ఆదేశిక సూత్రాల మేరకు ప్రభుత్వాలు విధానాలను రూపొందించాలని సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చింది.



మన దేశం నుంచి దాదాపు రూ. 28 వేల కోట్ల విలువైన పశుమాంసం వియత్నాం, మలేసియా, ఈజిప్టు, సౌదీ అరేబియాలకు ఎగుమతి అవుతున్నది. ఇందులో అత్యధిక భాగం గేదెలు/దున్నల మాంసం. కొన్ని దేశాలతో పోలిస్తే మన దేశం ఎగుమతి చేసే పశుమాంసం ధర తక్కువ. ప్రభుత్వ సంస్థలు పర్యవేక్షించే పశు వధశాలలు (స్లాటర్‌ హౌసెస్‌) 5,000 ఉన్నాయి. అవ్యవస్థీకృత రంగంలో స్ట్రీట్‌కార్నర్‌ షాపులతో సహా 25 వేలకు పైగా జంతు వధశాలలు ఉన్నాయి. వాటిల్లో వేలాదిమంది ఉపాధి పొందుతూ ఉన్నారు. పాడి పశువులను సాధారణంగా కోతకు పంపరు. దున్నపోతులలో ఎక్కువ భాగం కోతలకు వెళుతూ ఉంటాయి.



పశువుల మార్కెట్‌కు తీసుకువచ్చే పశువులను వ్యవసాయ అవసరాలకు తప్ప కోతకు వినియోగించరాదనే నిబంధన ఉంది. రైతుల నుంచి, డెయిరీ ఫారాల నుంచి నేరుగా కోతకు పశువులను కొనుగోలు చేయడం పైన ఆంక్షలు లేవు. కానీ కోత కోసం జంతు వధశాలలు 90 శాతం పశువులసంత/పశువుల మార్కెట్ల నుంచి పశువులను కొనుగోలు చేస్తూ ఉంటాయి. పశువుల యజ మానులైన రైతులుకానీ, వ్యవసాయ కార్మికులుకానీ పశు పోషణతో జీవనం కొనసాగిస్తూ ఉన్న పేదలు కానీ అమ్మదలచినప్పుడు పశువుల సంతలో పోటీ ఉంటుంది. కాబట్టి అధిక ధర లభిస్తుందన్న నమ్మకంతో అక్కడకు తోలుకెళ్లేం దుకే ఇష్టపడతారు. ప్రాసెసింగ్‌ చేసి ఎగుమతిచేసే సంస్థలలో ఎక్కువ భాగం ముస్లిం సామాజిక వర్గానికి చెందినవారివి. ఇప్పటివరకు దున్నలు, గేదెలు వధపైన పెద్దగా ఆంక్షలు లేవు. కాబట్టి ఈ మాంసాన్ని ఎగుమతి చేస్తూ ముస్లిం సామాజిక వర్గంలో కొంతమంది ఆర్థికంగా బలపడి, తమ తమ ప్రాంతాలలో కొంతమేరకు ప్రజలపైన ప్రభావం కలిగి ఉన్నారు. ఆ వర్గాలను దెబ్బతీసేందుకు కేంద్రం ఈ నూతన నిబంధనలను తీసుకువచ్చిందనే అభిప్రాయం ఉంది.



ఈ వాస్తవాలను మాత్రం గమనించాలి.

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌)ను సంతోషపెట్టడానికే బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొన్నదనే భావన కూడా ఉంది. ఆరెస్సెస్, బీజేపీ గోవుకు ప్రాధాన్యం ఇస్తాయి. అందులో తప్పేమీ లేదు. రాజ్యాంగ రచనా సమయంలో కూడా గోవధపైన సుదీర్ఘ చర్చ జరిగి, ఈ అంశాన్ని ప్రాథమిక హక్కులలో కాకుండా ఆదేశిక సూత్రాల జాబితాలో చేర్చడం జరిగింది. ఆవుపాలలోని సుగుణాలు అందరికీ తెలుసు. పెరుగు, నెయ్యి వినియోగం కూడా విరివిగా జరుగుతుంది. ఆవు పేడ, మూత్రాలను కలిపి ‘పంచగవ్య’ తయారు చేయటం, ఆ ప్రక్రియతో భూసారాన్నీ, పంట దిగుబడినీ పెంచటానికి ఉపయోగిస్తున్నారు.



గోమూత్రానికి ఆయుర్వేద వైద్యంలో ప్రాధాన్యం ఉంది. కొన్ని యాంటీ బయోటిక్స్‌తో ఆవు మూత్రాన్ని కలిపి వాడితే క్షయవ్యాధి నివారణకు ఉపయోగపడుతుందని, క్యాన్సర్‌ వ్యాధిని అరికట్టేందుకు కూడా దోహదం చేస్తుందని ‘కేంద్ర శాస్త్రీయ పారిశ్రామిక పరిశోధనా సంస్థ (సీఎస్‌ఐఆర్‌) విస్తృత పరిశోధనలలో తేల్చింది. ఆ పరిశోధనా ఫలితాన్ని అమెరికాలోని పేటెంట్‌ సంస్థ అంగీకరించింది. ఈ వాస్తవాలను గమనించాలి. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా అధిక పాల దిగుబడులనిచ్చే జెర్సీ, హాల్‌స్టీన్‌ రకాలతో దేశీయ జాతులను సంకరింప చేసి అధిక దిగుబడులను సాధించాలనే పథకాలను చాలాకాలం నుంచి కేంద్రం అమలు చేస్తున్నది. ఇది దురదృష్టకరం. బ్రెజిల్‌లో గిర్‌ ఆవులే కాక మన ఒంగోలు (బ్రాహ్మన్‌) ఆవులు రికార్డు స్థాయిలో పాల దిగుబడులను ఇచ్చాయి. ప్రత్యేక శ్రద్ధతో దాణాను, పశుగ్రాసాన్ని అందచేయగలిగితే మన దేశంలో కూడా ‘సాహివాల్, గిర్, రెడ్‌సింథీ’వంటి రకాల ఆవులు దాదాపు సంకర ఆవులతో సమానంగా పాల దిగుబడులను ఇవ్వగలుగుతాయి. ఈ దిశగా కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి.



పది ఎకరాల భూమిలో ఒకే ఒక ఆవుపేడ, మూత్రం వినియోగించి సేంద్రియ పద్ధతులలో పంటలు పండించవచ్చని నిరూపించారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించే క్రమంలో రైతులకు ముఖ్యంగా సన్న, చిన్నకారు రైతులకు సబ్సిడీతో దేశీయ ఆవులను అందచేయటం ద్వారా సత్ఫలితాలను సాధించే వీలుంటుంది. నిషేధం ఉన్నప్పటికీ ఎద్దులు వయోభారంతో వ్యవసాయ పనులకు ఉపయోగపడని పరిస్థితులలో వాటిని కబేళాకు తరలించటం జరుగుతూ ఉంటుంది. దీనిని అరికట్టడం సాధ్యం కాదు. అమ్ముకోకపోతే పోషణ రైతుకు పెనుభారమవుతుంది. తగిన సంఖ్యలో గోశాలలు లేవు. పై అంశాలను పరిశీలించి, నూతన నిబంధనలలో పశువుల కొనుగోలు–అమ్మకాల నిబంధనలను సడలించి, ‘క్యాటిల్‌’నిర్వచనం నుంచి బఫెలోను తొలగించటం ద్వారా కొన్ని వర్గాలలో, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలలో నెలకొన్న అపోహలను తొలగించి సర్వజనామోదంతో ముందుకు అడుగు వేయటం సముచితం. నానాటికీ తగ్గిపోతూ ఉన్న వివిధ జాతులకు చెందిన దేశీ ఆవులను పరిరక్షించటమేకాక వాటి పెరుగుదలకు, అభివృద్ధికి తద్వారా సేంద్రియ/పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు తగిన చర్యలు చేపట్టడం కూడా తక్షణావసరమే.



  

      - వ్యాసకర్త మాజీ వ్యవసాయ మంత్రి


      వడ్డే శోభనాద్రీశ్వరరావు


    ఈ–మెయిల్‌ : vaddesrao@yahoo.co.in


                                                                                                                                                               

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top