పట్టాలెక్కిన యుద్ధ స్మృతులు

పట్టాలెక్కిన యుద్ధ స్మృతులు


థాయ్‌లాండ్ , బర్మాల మధ్య తలపెట్టిన రైలు మార్గం నిర్మాణాన్ని రచయిత ఇందులో వర్ణించారు. ఇందుకోసం లక్షా ఎనభైవేల మంది ‘రూమూషా’ (జపాన్ భాషలో శ్రామికులు)లను సమకూర్చారు. ఇందులో 60,000 మంది యుద్ధఖైదీలు ఉన్నారు. వీరంతా జపాన్‌కు పట్టుబడిన మిత్రరాజ్యాల సైనికులే.

 

గాయం కంటే, గాయం మిగిల్చిన గాథకే పదునెక్కువ. అందుకే, దుఃఖాన్ని దిగుమింగుకుని చరిత్ర పుటల అట్టడుగున మణిగిపోయిన గాయాలకు రచయితలు గొంతును ఇస్తారు. ఈ సంవత్సరం మ్యాన్‌బుకర్ పురస్కారానికి ఎంపికైన రిచర్డ్ ఫ్లానన్ అలాంటి ఒక లోతైన గాయం చేత మాట్లాడించారు. ఆ మాటలే ‘ది నేరో రోడ్ టు ది డీప్ నార్త్’ నవలగా ఆవిర్భవించాయి.  



అమెరికా రచయితలను కూడా మ్యాన్ బుకర్ పరిధిలోకి తెచ్చిన తరువాత మొదటిసారి ప్రకటించిన ఈ పురస్కారం ఆస్ట్రేలియాకు చెందిన ఫ్లానన్‌కు దక్కింది. అలాగే, పోటీలో చివరిదాకా నిలిచిన మరో రచన ‘ది లైవ్స్ ఆఫ్ అదర్స్’.  కోల్‌కతాకు చెందిన నీల్ ముఖర్జీ రాసిన నవల ఇది. పన్నెండేళ్లలో, ఐదు పర్యాయాలు తిరగరాసిన ఈ నవలను ఇటీవలే ఫ్లానన్ బుకర్ పోటీకి పంపారు. ఆ రోజునే 93 ఏళ్ల ఆయన తండ్రి కన్నుమూశారు. రెండో ప్రపంచ యుద్ధఖైదీల దుస్థితే నవల ఇతివృత్తం. నవలాకాలం కూడా అదే. థాయ్‌లాండ్, బర్మాల మధ్య తలపెట్టిన రైలు మార్గం నిర్మాణాన్ని రచయిత ఇందులో వర్ణించారు. ఇందుకోసం లక్షా ఎనభైవేల మంది ‘రూమూషా’ (జపాన్ భాషలో శ్రామికులు)లను సమకూర్చారు. ఇందులో 60,000 మంది యుద్ధఖైదీలు ఉన్నారు. వీరంతా జపాన్‌కు పట్టుబడిన మిత్రరాజ్యాల సైనికులే. ఆసియా రాజ్యాలకు చెందిన మరో 90 వేల మంది సాధారణ పౌరులు కూడా దీని కోసం చెమటోడ్చారు. నిజానికి అంతా కలసి రక్తమోడ్చారు. ఆ సమయంలో జపాన్ సేనలు చేసిన అకృత్యాల నే రచయిత వర్ణించారు. ఆ రాక్షసత్వాన్ని తట్టుకోలేక, వాతావరణ పరిస్థితులను భరించలేక వారిలో 12,399 మంది దయనీయ స్థితిలో కన్నుమూశారు. పరిస్థితులు మారిన తరువాత బతికి బయటపడిన వారిలో ఒక యుద్ధఖైదీ సాన్ బయాకు జుగో. అతడి వరస సంఖ్య 335. ఈ యుద్ధఖైదీ కొడుకే రిచర్డ్ ఫ్లానన్. అయితే ఇది తన తండ్రి కథ కాదని రచయిత చెప్పారు. కానీ ఒక పుస్తకం రాయమని ఫ్లానన్‌కు తండ్రి సలహా మాత్రం ఇచ్చారు. కొడుకు రచన ప్రారంభించాక అందులో ఇతివృత్తం ఏమిటి అని ఏనాడూ అడగలేదు.  



ఫ్లానన్ తన తొలి నవల ‘డెత్ ఆఫ్ ఎ రివర్‌గైడ్’ను 1994లో వెలువరించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా నవలాకారులలో అగ్రస్థానంలో ఉన్న ఫ్లానన్ ‘ది సౌండ్ ఆఫ్ వన్ హ్యాండ్ క్లాపింగ్’ (1997), ‘గౌల్డ్స్ బుక్ ఆఫ్ ఫిష్: ఎ నోవెల్ ఇన్ ట్వెల్వ్ ఫిష్’ (2001), ‘ది అన్నౌన్ టైస్ట్’(2006), ‘వాంటింగ్’ (2008) వంటి నవలలు రాసి ఎంతో ఖ్యాతి పొందారు. ఈ ఏటి బుకర్ పురస్కారానికి ఎంపికైన నవల ‘ది నేరో రోడ్ టు ది డీప్ నార్త్’ను నిరుడే రాశారు. ఆయన సినిమా దర్శకుడు, చిత్రానువాదకుడు. చరిత్ర, ప్రకృతి పర్యావరణాల మీద మమకారంతోనే వీటన్నిటినీ ఆయన అక్షరబద్ధం చేశారు. ఫ్లానన్ పత్రికా రచయిత కూడా.



‘డెత్ ఆఫ్ ఎ రివర్‌గైడ్’లో కథానాయకుడు ఎజాజ్ కోసిని తన అనుభవాలను వివరిస్తాడు. తన స్వస్థలం తస్మానియా దగ్గరి నదిలో మునిగి, బతికి బయటపడిన తరువాత ఈ కథ చెబుతాడు. ఆస్ట్రేలియా వలసగా ఉన్నప్పుడు తన పూర్వీకులు పడిన ఇక్కట్లనే ఇందులో ఇతివృత్తంగా తీసుకున్నారు రచయిత. ‘గౌల్డ్స్ బుక్ ఆఫ్ ఫిష్: ఎ నోవెల్ ఇన్ ట్వెల్వ్ ఫిష్’ నవలకు కూడా 19వ శతాబ్దమే నేపథ్యం. బుకర్ న్యాయనిర్ణేతలు ఎంపిక చేసిన ‘ది నేరో రోడ్ టు ది డీప్ నార్త్’కు మూలం 1689లో జపాన్ కవి రాసిన ఒక రచన ఆధారం. దాని పేరు కూడా అదే. రైలుమార్గం నిర్మాణం కోసం తీసుకువచ్చిన 2,815 మంది ఆస్ట్రేలియా యుద్ధఖైదీల కోసం వచ్చిన వైద్యుడు డోరిగో ఇవాన్స్. ఇతడి చుట్టూ ఇతివృత్తం సాగుతుంది. ఈ ఉద్యోగానికి వచ్చే ముందు తన సమీప బంధువుతో నడిపిన శృంగారాన్ని తలుచుకోవడం, ఎదురుగా కనిపిస్తున్న రక్తసిక్త ఘటనలను చూసి కుమిలిపోవడం అనే రెండు పట్టాల మీద కథ నడుస్తుంది. ఈ నిర్మాణానికి బర్మా రైల్వే నిర్మాణమని, డెత్ రైల్వే నిర్మాణమని కూడా పేర్లు ఉండేవి. ఇక్కడి దృశ్యాలు నాజీల శిబిరాలలో జరిగిన దారుణాలను మరిపించేవిగానే ఉంటాయి. ఎక్కడ చూసినా మానవ కంకాళాలకు తోలు తొడిగినట్టు ఉండే మనుషులే. వారి చేతే పని చేయించారు. కేవలం ఆస్ట్రేలియన్లకే కాకుండా, మిగిలిన బాధితులకు కూడా సేవలు చేసి, ఒక ధీరోదాత్త కథానాయకునిలా డోరిగో స్వదేశానికి వెళతాడు. రెండో ప్రపంచ యుద్ధంలో తన దేశ యుద్ధఖైదీలు పడిన వెతల మీద వెలుగులు ప్రసరింప చేయాలనుకున్న ఫ్లానన్ ఆకాంక్ష ఈ నవలతో తీరింది.

 

డాక్టర్ గోపరాజు నారాయణరావు

 

 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top