‘సమితి’కి చేరిన సంఘర్షణ

‘సమితి’కి చేరిన సంఘర్షణ


కొత్త కోణం



భారతదేశంలోని 25 కోట్ల మంది సమాన హక్కులకు దూరం కావడమే కాకుండా కనీసం మనుషులుగా కూడా పరిగణించని స్థితిలో ఉండటంపై ఐక్యరాజ్య సమితి స్పందించడం కానీ, ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించడం కానీ దేశ ద్రోహమో, నేరమో కాబోదు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఇదే విషయాన్ని 1947 జనవరి 17వ తేదీన పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ దక్షిణాఫ్రికాలోని భారతీయుల సమస్యలపట్ల స్పందిస్తున్న ఐక్యరాజ్య సమితి భారతదేశంలో దళితులెదుర్కొంటున్న వివక్ష పట్ల కూడా దృష్టి సారించాలని కోరారు.



ఆగ్రహంతోనో, విద్వేషంతోనో మనిషిని మనిషి, గుంపుని మరో గుంపు, ఓ సమూహాన్ని మరో సమూహం హతమార్చడాన్ని వాటి వెనుకనున్న వ్యక్తిగత, లేదా సామూహిక విద్వేషాల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక జాతిని మిగిలిన అన్ని జాతులూ, అన్ని గుంపులూ, అన్ని వర్గాలూ తరతరాలుగా అవమానిస్తుంటే, అణచివేస్తోంటే, హతమారుస్తుంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రపంచ ప్రజల దృష్టికి అందని రీతిలో సాటి మనుషులను అథములనీ, పంచములనీ, పాకీలనీ, అస్పృశ్యులనీ ఛీత్కారంతో, తృణీకారంతో మానప్రాణాలను హరిస్తోంటే... పెరిగిన ఆ అంతరాలు దేశ అభివృద్ధికి ఆటంకంగా మారుతున్న కఠోర వాస్తవాన్ని అంగీకరించాలి. ఇప్పటి వరకు దళితుల హక్కుల హరణ గురించి సొంతగడ్డపైనే చర్చించడం జరిగింది. ఇటీవల ఐక్యరాజ్యసమితిలో కూడా చర్చకు రావడం, కొన్ని దేశాలు దళిత హక్కులకు మద్దతును తెలియజేయడం మంచి పరిణామం.



సమితిలో దళిత హక్కుల వాణి

ఈనెల 4వ తేదీన ఐక్యరాజ్య సమితి మానవహక్కుల కమిషన్‌ 27వ సమీక్షా సదస్సులో పలు దళిత, మానవ హక్కుల సంఘాలు భారతదేశంలో దళితులపై జరుగుతున్న దాడుల గురించి ప్రస్తావించాయి. 2012లో మానవ హక్కుల సంఘం 169 సిఫారసులు చేయగా అందులో దళితులకు సంబంధించి పది అంశాలు ఉన్నాయని దళిత సంఘాలు ప్రకటించాయి. భారత ప్రభుత్వ ప్రతినిధులు మాత్రం తమ దేశంలో దళితులకు తగు రక్షణ చట్టాలున్నాయని, వాటిని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొనడం గమనార్హం. అందువల్ల దళితులకు సంబంధించిన అంశాల్ని ఇక్కడ చర్చించాల్సిన అవసరం లేదనికూడా భారత ప్రభుత్వ ప్రతినిధులు తెగేసి చెప్పారు. కానీ జెకోస్లొవేకియా, జర్మనీ, ఘనా, జపాన్, నార్వే, థాయ్‌లాండ్, అమెరికా లాంటి దేశాలు దళితుల వివక్షపై చర్చించి, తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాయి.



భారతదేశంలో ఉద్దేశపూర్వకంగా జరిగే ప్రతి దాడివెనుక కులం ఉంటుంది. అది ఖైర్లాంజి కావచ్చు, కందమాల్‌ కావచ్చు. దాడులకు గురయ్యేవాళ్ళు ఎప్పుడూ ఒకే వర్గానికి చెందినవారై ఉంటారు. ఒకే జెండర్‌కి చెందినవారై ఉంటారు. అణచివేసేవారు ఎప్పుడూ అధికారంలో ఉంటారు. అందుకే ఈ దేశంలో దళితులు, స్త్రీలు, ఆదివాసీలు వ్యక్తులుగా, సామూహికంగా అంతమవుతుంటారు. సామూహిక అత్యాచారాలకు గురౌతుంటారు. ఇదే నేపథ్యంలో దేశంలో గత కొన్నేళ్లుగా నమోదవుతోన్న నేరాలను పరిశీలించాలి. ఇతర మహిళల కన్నా అధికంగా దళిత స్త్రీలలో 41.7 శాతం మంది 15 ఏళ్లలోపే భర్తల చేతిలోనూ, లేదా వేరే వ్యక్తుల చేతిలోనూ లైంగిక హింసకు గురవుతున్నారు. 2005–2006 నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే ఇదే తేల్చి చెప్పింది.



సాధారణ మహిళల్లో 7.8 శాతం మంది లైంగిక హింసకు గురౌతోంటే, అది దళిత మహిళల్లో 11.0 శాతం. 2014లో దళిత స్త్రీలపై నమోదైన 2,233 అత్యాచార కేసులను బట్టి చూస్తే ప్రతిరోజూ ఆరుగురు అత్యాచారానికి గురైన వాస్తవం తెలుస్తుంది. దీనిని నేషనల్‌ క్రైం రిపోర్టు బ్యూరో స్పష్టం చేసింది. నమోదైన గణాంకాలను బట్టి చూస్తే దళిత స్త్రీలపై అత్యాచార కేసులు గణనీయంగా పెరుగుతున్న విషయాన్ని గమనించవచ్చు. ఉదాహరణకు 2003లో 1,089 దళిత స్త్రీలపై జరిగిన అత్యాచార కేసులు నమోదైతే, 2013కి ఆ సంఖ్య 2,073కి పెరిగింది. అంటే దశాబ్దకాలంలో 47.5 శాతం పెరిగాయి. దళిత స్త్రీలపై జరిగిన అత్యాచారాలు అత్యధికంగా 81.6 శాతంగా ఉంటే ఆయా కేసుల్లో శిక్ష పడినవారు ప్రభుత్వ లెక్కల ప్రకారం 34.9 శాతం. నమోదైన కేసుల్లో ఇది సగం కూడా కాదు.



దేవదాసీ, జోగిని లాంటి దళిత కమ్యూనిటీల్లో 90 శాతం మంది స్త్రీలు మూఢాచారాలకు బలౌతున్నారు. గత పదిహేనేళ్లలో 2,500 మంది దేవదాసీ లేదా జోగినీ స్త్రీలు విషాదకర పరిస్థితులలో చనిపోయినట్టు లెక్కలు చెబుతున్నాయి. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం హైకమిషనర్‌ నావి పిల్లే దళితులైన మాన్యువల్‌ స్కావెంజర్స్‌లో 90 శాతం మంది హింస, దోపిడీ లాంటి బహుముఖ వివక్షనెదుర్కుంటున్నారని వెల్లడించారు. అలాగే అనేక రాష్ట్రాల్లో గ్రామీణ ఆరోగ్య కమిటీల్లోని సభ్యులు దళిత స్త్రీల ఆరోగ్యాన్ని గురించి విచారించిన సందర్భాలు చాలా అరుదు అని కూడా నివేదికలు చెబుతున్నాయి. జాతీయ సగటు కన్నా దళిత కుటుంబాల పిల్లల్లోనే ఎక్కువ మంది మధ్యలో బడి మానేస్తున్నవారు ఉన్నారని, దీనిపై తగు చర్యలు తీసుకోకపోతే అందరికీ విద్య అనే నినాదం నిరర్థకంగా మారుతుందని సర్వశిక్షా అభియాన్‌ నివేదికలో హెచ్చరించింది.



ఇప్పటికీ తాగునీరు లేదు

భారత రాజ్యాంగం ప్రజలందరికీ జీవించే హక్కును కల్పించినప్పటికీ ఆచరణలో ప్రతిరోజూ పదుల సంఖ్యలో దళితులు హత్యలకు గురౌతున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. తాగడానికి సరైన నీరు కూడా దొరకని స్థితి ఇప్పటికీ గ్రామాల్లో వారు ఎదుర్కొంటున్నారు. చాలా గ్రామాల్లో ప్రజలందరూ వాడుకునే బావులు, చెరువులు ఈ రోజుకీ దళితులు అంటరానివే. మహబూబ్‌నగర్‌ లాంటి జిల్లాలోని ఒక గ్రామంలో దళితులు బోరుబావిని తవ్వారు. కానీ వారి నివాసాల మధ్యన తవ్విన బావినీళ్లు దళితులే తాగడానికి గానీ, బావిని తాకడానికి గానీ అనర్హులు. దళితుల హక్కులను మానవహక్కులుగా గుర్తించడం లేదని చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు.



దళితులపై దాడులను నివారించడంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిర్లక్ష్యవైఖరికి ఇది పరాకాష్ట. 2015వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా 707 హత్య కేసులు నమోదైతే అందులో 619 కేసుల్లో చార్జిషీట్లు నమోదైనాయి. కానీ 180 కేసుల్లో మాత్రమే నిందితులకు శిక్షలు పడ్డాయి. మహిళలపై జరిగిన అత్యాచారాల కేసులు, పరిణామాలను చూద్దాం. ఈ గణాంకాలను పరిశీలిస్తే 2015లో 2,326 అత్యాచార కేసులు నమోదైనాయి. 1891 కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేశారు. అందులో కేవలం 345 కేసుల్లోనే శిక్షలు పడ్డాయి.





ఇందులో చిన్న తిరకాసు కూడా ఉంది. చాలా కేసుల్లో కింది కోర్టులు శిక్షలు విధించినప్పటికీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో దాదాపు 90 శాతం కేసుల్లోని నిందితులు నిర్దోషులుగా విడుదలవుతున్నారు. దీనికి చుండూరు కేసు ప్రబల ఉదాహరణ. దళితులను అత్యంత అమానుషంగా చంపి, గోనెసంచుల్లో మూటగట్టి పారేసిన అమానవీయ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. కానీ చివరకు నిందితులెవ్వరూ దోషులుగా తేలలేదు. ఒకవేళ వారంతా నిర్దోషులైతే దళితులను హత్యచేసినవారెవ్వరో తేల్చే బా«ధ్యతను మాత్రం కోర్టులు స్వీకరించలేదు. మహారాష్ట్రలోని ఖైర్లాంజి గ్రామంలో అత్యాచారం, హత్యలు జరిగిన కేసులో కూడా దళితులకు దక్కింది ఇలాంటి న్యాయమే. అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ఎటువంటి రక్షణను కల్పించడం లేదనేది ఈ సంఘటనలను బట్టి తెలుస్తోంది. భారతదేశంలో 2001 నుంచి 2015 వరకు దళితులపై జరిగిన హత్యలు, అత్యాచారాలను పరిశీలిస్తే మనకు అసలు విషయం బోధపడుతుంది. మహిళలపై జరిగిన అత్యాచారాలు రెట్టింపయ్యాయి. 2001లో దళిత మహిళలపై జరిగిన అత్యాచారాల సంఖ్య 1,316. 2015 నాటికి ఆ సంఖ్య 2,326కి పెరిగింది.



దళితులపై జరిగే అత్యాచారాలపై స్పందన ఏది?

ఇందులో గమనించాల్సిన విషయం మరొకటుంది. దళితేతర స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలపైనా, హత్యలపైనా మధ్యతరగతి ప్రజానీకం నుంచి వస్తున్న ప్రతిఘటనకూ దళితులపై జరుగుతున్న అత్యాచారాలు, దారుణాల సంఘటనల సందర్భంగా వస్తున్న ప్రతిఘటనకూ చాలా అంతరం ఉంది. దళితులపై జరిగే దురాగతాల పట్ల సమాజంలో కనీస ప్రతిఘటన కూడా కనిపించడంలేదని చెప్పడానికి సందేహించనక్కరలేదు. నిర్భయ లాంటి ఘటనలు జరిగినప్పుడు యువతరం కానీ, సాధారణ ప్రజానీకం కానీ తమకు తాముగా ఉద్యమంలో భాగం అయ్యింది. కానీ ఖైర్లాంజిలో దళిత స్త్రీలపై జరిగిన అత్యాచారాలు కానీ, ఛత్తీస్‌గఢ్‌లో నిత్యం ఆదివాసీలపై జరుగుతోన్న అత్యాచారాలపై కానీ, మతంపేరుతో ఒడిశాలోని కందమాల్‌లో ఎందరో దళిత మహిళలపై జరిగిన అత్యాచారాలపై కానీ పౌరసమాజం స్పందన అదే స్థాయిలో ఎందుకు లేదో అర్థం చేసుకోవచ్చు.



ఈ అనుభవాలను పరిశీలిస్తే భారత ప్రభుత్వాలు దళితుల జీవించే హక్కు నుంచి మొదలు అన్ని రకాల హక్కుల పరిరక్షణలో విఫలమవుతున్నట్టు కనిపిస్తున్నది. అందువల్లనే దళిత హక్కుల సంఘాలు ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించాల్సి వస్తోంది. 1948 డిసెంబర్‌ 10వ తేదీన ఐక్యరాజ్య సమితి ప్రకటించిన మానవహక్కుల జాబితాలో మొట్టమొదటి అంశమే ఇందుకు ఉదాహరణ. మానవులందరూ పుట్టుకతోనే స్వేచ్ఛా జీవులని, వారు గౌరవంగా అందరితో సమానంగా జీవించే హక్కును కలిగి ఉన్నారని ఆ ప్రకటనలో మొదటి ఆర్టికల్‌ సారాంశం.



అటువంటప్పుడు భారతదేశంలోని 25 కోట్ల మంది సమాన హక్కులకు దూరం కావడమే కాకుండా కనీసం మనుషులుగా కూడా పరిగణించని స్థితిలో ఉండటంపై ఐక్యరాజ్య సమితి స్పందించడం కానీ, ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించడం కానీ దేశ ద్రోహమో, నేరమో కాబోదు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఇదే విషయాన్ని 1947 జనవరి 17వ తేదీన పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ దక్షిణాఫ్రికాలోని భారతీయుల సమస్యలపట్ల స్పందిస్తున్న ఐక్యరాజ్య సమితి భారతదేశంలో దళితులెదుర్కొంటున్న వివక్ష పట్ల కూడా దృష్టి సారించాలని కోరారు. అదేవిధంగా 1917లో అమెరికాలో లాలా లజపతిరాయ్‌తో జరిగిన చర్చను ప్రస్తావిస్తూ అమెరికాలోని బానిసత్వంకన్నా వర్ణ వివక్షకన్నా అంటరానితనం పరమదుర్మార్గమైందని కూడా ఆయన పేర్కొన్నారు.



బానిసలు యజమానులకు ఆస్తులుగా, సంపదలుగా ఉంటూ వారి ఇళ్లలోనే వారితో పాటు జీవిస్తారని, బానిసల ఆరోగ్యం కూడా యజమానులు బాధ్యతగా చూసుకుంటారని, కానీ మన దేశంలో దళితులను పశువులకన్నా హీనంగా, తాకడానికి కూడా వీలులేని వారిగా పరిగణించి, వారి ఉనికినే ప్రమాదంగా గుర్తించి దాడులకు దిగడం ఒక్క భారతదేశంలోనే సాధ్యమయ్యే అమానుషమని అంబేడ్కర్‌ ఆ రోజుల్లోనే చెప్పిన విషయాన్ని నేటికీ అనుభవిస్తున్నాం.

వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు

మొబైల్‌ : 97055 66213  






మల్లెపల్లి లక్ష్మయ్య

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top