రాయని డైరీ

రాయని డైరీ - Sakshi


మధ్యాహ్నం రాజ్‌నాథ్‌ సింగ్, వెంకయ్య నాయుడు వచ్చారు.

‘‘ఇల్లు కనుక్కోవడం చాలా కష్టమైపోయింది సోనియాజీ’’ అన్నారు వెంకయ్య నాయుడు.

‘‘వెళ్లేటప్పుడు ఈజీగానే ఉంటుంది లెండి వెంకయ్యాజీ. కూర్చోండి’’ అన్నాను.

‘‘ఎలా ఉన్నారు సోనియాజీ’’ అని అడిగారు రాజ్‌నాథ్‌ సింగ్‌. ‘‘బాగున్నాను రాజ్‌నాథ్‌జీ. దయచేసి కూర్చోండి’’ అన్నాను.

ఇటువైపు మావాళ్లు గులాం నబీ ఆజాద్, మల్లికార్జున్‌ ఖార్గే కూర్చొని ఉన్నారు.

‘‘చూసి చాలా రోజులైనట్లుంది సోనియాజీ’’ అన్నారు వెంకయ్య నాయుడు.

‘‘నేను ప్రజల్లోనే ఉన్నాను వెంకయ్యాజీ. బహుశా మీరు ప్రజల్ని చూసి చాలా రోజులైనట్లుంది’’ అన్నాను.

‘‘కానీ సోనియాజీ.. ఇప్పుడు ప్రజలు కాంగ్రెస్‌తో లేరు కదా’’ అన్నారు వెంకయ్య నాయుడు.

‘‘ప్రజలు కాంగ్రెస్‌తో లేకపోతే, ఇప్పుడు మీరెందుకు కాంగ్రెస్‌ లీడర్‌ ఇంటికి వస్తారు నాయుడూజీ’’ అన్నారు గులాం నబీ ఆజాద్‌.

‘మధ్యలో ఈయనెవరూ!’ అన్నట్లు ఆజాద్‌ వైపు చూసి, నావైపు చూశారు వెంకయ్య నాయుడు.

‘‘రాజ్యసభలో ఆయన మా ఫ్లోర్‌ లీడర్‌ వెంకయ్యాజీ. మా ఇంటికి దారి మరిచిపోయినట్లు రాజ్యసభకూ మీరు దారి మర్చిపోయినట్లున్నారు’’ అన్నాను.   

‘‘సోనియాజీ మీరు మా రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలి’’ అన్నారు రాజ్‌నాథ్‌ సింగ్‌.

‘‘మీరు అడగడానికి వచ్చారా? చెప్పడానికి వచ్చారా రాజ్‌నాథ్‌జీ’’ అని అడిగారు ఖార్గే.  

‘మధ్యలో ఈయనెవరూ!’ అన్నట్లు ఖార్గే వైపు చూసి, నా వైపు చూశారు వెంకయ్య నాయుడు.

‘‘వెంకయ్యాజీ.. లోక్‌సభలో ఆయన మా ఫ్లోర్‌ లీడర్‌. మీరు రాజ్యసభకు దారి మర్చిపోయినట్లుగా రాజ్‌నాథ్‌జీ లోక్‌సభకు దారి మర్చిపోయి ఉంటారని నేను అనుకోను’’ అన్నాను.

‘‘చెప్పండి రాజ్‌నాథ్‌జీ, రాష్ట్రపతి అభ్యర్థిగా మీరు ఎవర్ని అనుకున్నారు?’’ అని అడిగాను.

‘‘మీరు చెప్పండి సోనియాజీ.. మీ క్యాండిడేట్‌గా మీరు ఎవర్ని పెట్టబోతున్నారు’’ అన్నారు వెంకయ్య నాయుడు.

‘‘నాయుడూజీ.. మీరు సోనియాజీ ఇంట్లో ఉన్నారు. సోనియాజీ మీ ఇంట్లో లేరు. ముందు మీ క్యాండిడేట్‌ ఎవరో చెప్పండి?!’’  అన్నారు ఆజాద్‌.

‘‘ఒకరో, ఇద్దరో, ముగ్గురో ఉంటారు సోనియాజీ మా క్యాండిడేట్‌లు. వారిలో ఒకరికి మీరు సపోర్ట్‌ ఇవ్వాలి’’ అన్నారు వెంకయ్య నాయుడు.

ఆజాద్, ఖార్గే లేచి వెళ్లిపోయారు.

‘‘అదేంటి సోనియాజీ.. వాళ్లిద్దరూ అలా వెళ్లిపోయారు?’’ అని అడిగారు వెంకయ్య నాయుడు.

‘‘బయటికి ఎలా వెళ్లాలో మీకు దారి చూపించాలి కదా వెంకయ్యాజీ..’’ అన్నాను.

ఆయన నవ్వలేదు. నవ్వే ప్రయత్నం ఏదో చేసినట్లున్నారు.  



                                             -  మాధవ్‌ శింగరాజు

 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top