అంపశయ్యపై విశ్వవిద్యాలయ విద్య

అంపశయ్యపై విశ్వవిద్యాలయ విద్య - Sakshi


కొత్త వర్సిటీల స్థాపన కట్టిపెట్టి, ఉన్న వర్సిటీలను పునరుజ్జీవింపజేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అప్పుడే నేటి అవసరాలకు తగిన నాణ్యమైన ఉన్నత విద్యను అందించే విజ్ఞాన నిలయాలుగా మన వర్సిటీలు విలసిల్లగలుగుతాయి.  

 

 తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల పరిస్థితి, పనితీరు అధ్వానంగా ఉన్నాయి. కనీస వసతులు లేకపోగా అవినీతికి అడ్డాలుగా మారాయి. దాదాపు ఏ ఒక్క వర్సిటీకి తగి నంత మంది అధ్యాపకులు లేకపోవడమే కాదు వైస్ చాన్స్లర్‌లైనా లేకపోవడం ఈ దుస్థితికి పరాకాష్ట. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ఎలాం టి ప్రయత్నం లేకుండానే కొత్తగా ఐదు వర్సిటీలను స్థాపిస్తామని ప్రభుత్వం ప్రకటించడం ఉన్నత విద్యపట్ల ఉన్న అలసత్వానికి నిదర్శనం. అనుభవజ్ఞులైన అధ్యా పకులు పెద్ద సంఖ్యలో వివిధ వర్సిటీల నుంచి ఏటా పదవీ విరమణ చేస్తున్నా పలు సంవత్సరాలుగా వర్సిటీ అధ్యాపకుల నియామకాలను జరపడంలేదు. వైఎస్ హయాంలో ఒకేసారి పాలమూరు, తెలంగాణ, శాతవా హన, మహాత్మాగాంధీ వర్సిటీలను ప్రారంభించారు. వాటిలో ఏ ఒక్కదానికి కనీస మౌలిక సదుపాయాలు లేవు.

 

 అధ్యాపకులే కాదు, శాఖాధిపతులు సైతం లేకుం డా... తగు అనుభవమూ, అర్హతలు లేకున్నా తక్కువ వేతనాలకు నియమించిన అకడమిక్ కన్సల్టెంట్లతోనే నడిపిస్తున్నారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్య త్తును నిర్దేశించేవారు వారే అవుతున్నారు. మారుతున్న కాలమాన పరిస్థితులకనుగుణంగా, ప్రత్యేకించి ప్రపంచీ కరణ నేపథ్యంలో నేటి విద్యార్థుల భవితకు అవసరమైన విజ్ఞానం, నైపుణ్యం అందించే కోర్సుల రూపకల్పనలో మన విశ్వవిద్యాలయాలు విఫలమవుతున్నాయి. కాబట్టే లక్షలకు లక్షలు పోసి కార్పొరేట్ విశ్వవిద్యాలయాలకు  విద్యార్థులు ఎగబడుతున్నారు. ప్రభుత్వ విశ్వవిద్యాల యాల్లోని వివిధ కోర్సుల్లో సగానికిపైగా సీట్లు మిగిలిపో తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఒక వర్సి టీ ప్రవేశాలకు కనీస మార్కులను సైతం రద్దు చేసింది.

 

 రాష్ట్రంలో పరిశోధనలో ఆసక్తి ఉన్న విద్యార్థులు చాలా మందే ఉన్నా, ఉస్మానియా, కాకతీయ వంటి వర్సి టీలలో సైతం వారిని గైడ్ చేసేవారు కరువయ్యారు. అక డమిక్ కన్సల్టెంట్లు పీజీ విద్యార్థుల బోధనకు ఉపయోగ పడుతున్నా... పరిశోధక విద్యార్థులకు వారు మార్గదర్శ కత్వం వహించలేరు. ఉన్న కొద్దిమంది సీనియర్ అధ్యా పకులపై ఇప్పటికే ఎక్కువ భారం పడుతుండటంతో కొత్తగా పరిశోధక విద్యార్థులను తీసుకునే పరిస్థితి లేదు. ప్రయోగశాలల వంటి మౌలిక సదుపాయాలే లేని ఆరేళ్ల క్రితం ఏర్పాటుచేసిన కొత్త వర్సిటీల్లో పరిశోధనల గురిం చి చెప్పనవసరం లేదు. ఇక అంబేడ్కర్, తెలుగు వర్సి టీలు చుక్కానిలేని నావల్లా దిశ, నిర్దేశన లేకుండానే నడు స్తున్నాయి. కాగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలోనే భాగంగా ఉన్న వెటర్నరీ, హార్టికల్చర్ విభాగాలను వేరు చేసి ఆర్భాటంగా ప్రత్యేక వర్సిటీలను ఏర్పాటు చేశారు. కానీ పశుపోషణ, పండ్లతోటల పెంపకం వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు మాత్రమే. కాబట్టి వాటిపై పరిశోధనలు వ్యవసాయ వర్సిటీలో భాగంగా సాగితేనే సమన్వయంతో ఫలితాలను సాధించగలుగుతాయనేది పాలకులకు పట్టడం లేదు.

 

 ఎప్పటికప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం ఏర్పరుస్తున్న విశ్వవిద్యాలయాలు ప్రమాణాలు కొరవడి నిర్జీవంగా నామమాత్రపు అస్తి త్వంతో నెట్టుకొస్తున్నాయి. ఇది మొత్తంగా రాష్ట్ర ఉన్నత విద్యపైనా దుష్ర్పభావాన్ని చూపుతోంది. దీంతో విద్యా ర్థులు ఇతర రాష్ట్రాలు, దేశాల బాట పట్టాల్సివస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరి ఫలితంగా కొన్ని కోర్సులలో సగం సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. ఇదేమీ పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాద్, సిద్దిపేట, కొత్తగూడెం లలో సాధారణ వర్సిటీలను, హైదరాబాద్, నల్లగొండ లలో క్లస్టర్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయడం వల్ల మహా అయితే  ఐదుగురు ప్రొఫెసర్లకు ప్రిన్సిపల్ పద వులు లభిస్తాయేమో తప్ప అంతకు మించి ఒరిగేదేమీ ఉండదు. 



ప్రభుత్వ విద్యపై నిర్లక్ష్యం దేశవ్యాప్తమైన రుగ్మత. కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వాల వరకు ఏ ఒక్క వర్సి టీకి తగినన్ని నిధులను ఇవ్వరు. ఇచ్చేవైనా సకాలంలో ఇవ్వరు. వీసీలు, రిజిస్ట్రార్లు తమ విధులను వదిలి ఫైళ్లు మోసుకుంటూ నిధులు, నియామకాల కోసం ఏలికల వెంట తిరుగుతూ, వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ గడ పాల్సి రావడం సర్వసాధారణం. కొన్ని సందర్భాలలో నెల జీతాలు సైతం ఇవ్వలేని దుస్థితిలో వర్సిటీలు నడు స్తున్నాయి.

 

 ఈ దుస్థితిని సరిదిద్ది, విద్యార్థులకు మంచి భవిష్య త్తుకు హామీనిచ్చే నాణ్యమైన ఉన్నత విద్యను అందిం చాల్సిన ప్రాముఖ్యతను ఇప్పటికైనా తెలంగాణ ప్రభు త్వం గుర్తించడం మంచిది. వైస్ చాన్స్‌లర్ నియా మకాలలో రాజకీయ జోక్యం, వర్సిటీల పాలనలోని అవినీతి ఇప్పటికే తీవ్ర సమస్యలుగా ఉన్నాయి. దీనికి తోడు అన్ని విశ్వవిద్యాలయాలకు రాష్ట్ర గవర్నరే చాన్స్ లర్‌గా ఉండే విధానానికి గుట్టు చప్పుడు కాకుండా స్వస్తి చెప్పడం కోసం 28, 29 జీవోలను తెచ్చారు.

 

తద్వారా వర్సిటీలపై రాజకీయ పెత్తనం నెలకొల్పాలని ఆరాట పడుతున్నారు. అదే జరిగితే తెలంగాణ విశ్వవిద్యాల యాల పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది, కాబట్టి తక్షణమే ఆ జీవోలను ఉపసంహరించుకోవాలి. పాత పద్ధతిలోనే తక్షణమే అన్ని వర్సిటీలకు వీసీలను నియమించాలి. మరిన్ని కొత్త విశ్వవిద్యాలయాల స్థాప నను వాయిదా వేసి, ఉన్న వర్సిటీలకు నిధులను అం దించడం, మౌలిక సదుపాయాలను కల్పించడం, అర్హత, అనుభవం గల అధ్యాపకులను తగినంత మందిని నియమించడంపై దృష్టిని కేంద్రీకరించాలి. అప్పుడే కాలం చెల్లిన కోర్సుల బూజు దులిపి నేటి అవసరాలకు తగిన నాణ్యమైన ఉన్నత విద్యను అందించే విజ్ఞాన నిల యాలుగా తెలంగాణ  వర్సిటీలు విలసిల్లగలుగుతాయి.

 వ్యాస రచయిత్రి సోషల్ ఎవేర్‌నెస్ క్యాంపెయిన్ కార్యకర్త,

మొబైల్: 94410 48958

 - రోజాలక్ష్మి

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top