ఆమె పలుకే ‘బంగారం’!

ఆమె పలుకే ‘బంగారం’! - Sakshi


నివాళి: ‘‘సాహిత్యం అంటే సమాజానికి హితవు చేసే రచన అని అర్థం. పద్యం, గద్యం ఆఖరికి సినిమా పాటల్లో కూడా ఒక ప్రయోజనం ఉండాలి. అదీ సాహిత్యం అంటే’’

 - మాలతీ చందూర్

 

 కొత్త కెరటం హొయలునీ, ఉధృతినీ స్వాగతిస్తూనే పాత కెరటాల పదునునీ, లోతునీ కూడా పలకరించడం ప్రవాహగమనం తెలి సిన వారే చేయగలరు. జలరాశి అనంతత్వం బోధపడేది కూడా అప్పుడే. అనంతమైన ఈ సాహితీ ప్రవాహాన్నీ, సృజనరాశినీ అలాంటి దృష్టితో చూసిన అరుదైన తెలుగు రచయిత్రి మాలతీ చందూర్ (1930-2013).‘ఆంధ్రప్రభ’ సచిత్రవారపత్రికలో ఐదు దశాబ్దాల పాటు నిరంతరాయంగా ఒకే శీర్షికను (ప్రమదావనం) నిర్వహించిన ఘనత ఆమె ఒక్కరి సొంతం. ప్రపంచ మహారచయితలందరి నవలలను మూడు దశాబ్దాల పాటు తెలుగు వారికి పరిచయం చేసిన మాలతీచందూర్‌కు తెలుగు పాఠకలోకం సదా రుణపడి ఉంటుం ది. దాదా పు 150 నవలా పరిచయాలు ఆమె కలం నుంచి జాలువారాయి. మాలతీచందూర్ కథకురాలు, నవలా రచయిత్రి, వ్యాసకర్త. అరుదైన కాలమిస్ట్.

 

 ‘రవ్వలడ్డూలు’పేరుతో మాలతీ చందూర్ తన తొలి కథను ‘ఆంధ్రవాణి’లో ప్రచు రించారు. ‘లజ్ కార్నర్’, ‘నీరజ’ కథలు ‘భారతి’లో అచ్చయ్యాయి. ‘‘సాహిత్యం అంటే సమాజానికి హితవు చేసే రచన అని అర్థం. పద్యం, గద్యం ఆఖరికి సినిమా పాటల్లో కూడా ఒక ప్రయోజనం ఉండాలి. అదీ సాహిత్యం అంటే’’ అని, ‘నన్ను అడగండి’ అనే మాలతీ చందూర్ నిర్వహించిన శీర్షిక కోసం పాఠకుడి ప్రశ్నకు సమాధానంగా చెప్పారామె.

 

 ఆమె ప్రతి రచన ఈ ఆశయాన్నే ప్రతిఫలిస్తుం ది. జాతీయోద్యమం, మధ్యతరగతి జీవితం, మహిళల దుస్థితి ఆమె నవలలకు ఇతివృత్తాలు. అలనాటి రచయిత్రులందరిలోనూ కని పించే మహిళా పక్షపాతం ఆమె రచనలలో కూడా గమనిస్తాం. శీర్షికల ద్వారా ఇచ్చిన సమాధానాలలో ఆమె తరచు ముగ్గురు మహి ళా నేతల జీవితాలను ప్రస్తావించేవారు. వారే ప్రపంచ రాజకీయాలలో విశిష్టంగా కనిపిం చిన సిరిమావో బండారునాయకే (శ్రీలంక), ఇందిరాగాంధీ (భారత్), గోల్డామీర్ (ఇజ్రాయెల్). చాలా సులభశైలిలో సవివరంగా ఆమె సమాధానాలు ఉండేవి. ‘రాముడత్తయ్య’ ప్రధాన పాత్రగా ఆమె రాసిన ‘హృదయనేత్రి’ నవల జాతీయోద్యమ నేపథ్యంలో సాగుతుంది.


 


రాముడత్తయ్య రాట్నం వడుకుతుంది. పిల్లలు అడిగితే జాతీయోద్యమాన్ని కథలుగా చెబుతుంది. గాంధీజీ తెల్లవాళ్లను తరిమేసి దేశానికి స్వాతంత్య్రం తెస్తారని ఘంటాపథంగా చెప్పేదామె. రాముడత్తయ్యను ఖద్దరు చీరలో చూపారామె. ఈ నవలకే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ‘శతాబ్ది సూరీడు’ నవలలో మారుతున్న కాలంలో మహిళలు సాధించిన పురోగతిని ఆవిష్కరించారు. బండెడు చాకిరిని మౌనంగా చేసే నాటి వితంతువుల దుస్థితితో మెదలుపెట్టి నాలుగుతరాల తరువాత అక్షరానికి నోచుకున్న మహిళ ప్రయాణం ఇందులో కని పిస్తుంది.

 

  సంసారంలో, సమాజంలో ఎవరిది తప్పయినా స్త్రీయే ఎందుకు సర్దుకుపోవాలి? స్త్రీపురుషుల ఘర్షణలో ఎప్పుడూ ఓటమి భావన స్త్రీకే ఎందుకు? వంటి ప్రశ్నలతో సాగే నవల ‘ఆలోచించు!’. ఇంకా ‘చంపకం’, ‘వైశాఖి’, ‘శిశిర వసంతం’, ‘ఎన్ని మెట్లెక్కినా...’, ‘భూమిపుత్రి’, ‘మనసులోని మనసు’ వంటి నవలలు రాశారు. పలువురి చరిత్రపురుషుల, మహిళల జీవిత చిత్రాలను కూడా మాలతి రాశారు. ‘వినదగు విషయాలు’ వంటి సాహిత్యేతర పుస్తకాలు కూడా వెలువరించారు.  నవలా పరిచయానికి సాహితీ ప్రక్రియ గౌరవాన్ని తెచ్చిన రచయిత్రి మాలతీచందూర్. ఈ ప్రక్రియతో ఆధునిక ప్రపంచ నవలను తెలుగువారికి పరిచయం చేయడానికి ఆమె చేసిన కృషి అసాధారణమైనది. 1845 నాటి ‘ది కౌంట్ ఆఫ్ మాంటీ క్రిష్టో’ (అలెగ్జాండర్ డ్యూమాస్), 1859 నాటి ‘ఎ టేల్ ఆఫ్ టూ సిటీస్’ (చార్లెస్ డికెన్స్) మొదలు, నిన్న మొన్న వచ్చిన ‘లజ్జ’ (తస్లీమా నస్రీన్) వరకు ఈ నవలా పరిచయాలు సాగాయి.

 

  ప్రపంచ భాషలతో పాటు కొన్ని భారతీయ భాషా నవలలను కూడా పరిచయం చేశారు. ‘పాత కెరటాలు’ శీర్షికతో వచ్చిన ఈ పరిచయాలే పాతకెరటాలు 1, 2; నవలా మంజరి 1, 2, 3, 4, 5 సంకలనాలుగా వెలువడ్డాయి.ది పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే (ఆస్కార్ వైల్డ్), పెయింటెడ్ వెయిల్, ఆఫ్ హ్యూమన్ బాం డేజ్ (మామ్), రాజశేఖర చరిత్రము (వీరేశలింగం), ఎ ఫేర్వెల్ టు ఆర్మ్స్ (హెమింగ్వే), సైలాస్ మారినర్ (జార్జి ఎలియెట్), ది ఫౌం టెన్ హెడ్ (అయ్న్ ర్యాండ్), చమ్మీన్ (తగళి శివశంకర్ పిళ్లై), డాక్టర్ ఝివాగో (బోరిస్ పాస్టర్‌నాక్), స్ప్రింగ్‌స్నో (యుకెయో మిషి మా), గుడ్ ఎర్త్, ది ఎగ్జయిల్ (పెర్ల్ ఎస్ బక్), ఎయిర్‌పోర్ట్ (ఆర్థర్ హెయిలీ), కొన్ని సమయాలలో కొందరు వ్యక్తులు (జయకాంతన్), అసురవిత్తు (ఎంటీ వాసుదేవన్ నాయర్), గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ (అరుంధతీ రాయ్); ఇంకా థామస్ హార్డీ, జేబీ ప్రీస్ట్లీ, మార్గరెట్ మిశ్చెల్, ఆనె ఫ్రాంక్, మేరియో పూజో, ఎలెక్స్ హెలీ, జెఫ్రీ ఆర్చర్ వంటి రచయిత నవలలు కూడా పరిచయం చేశారు. మాలతీ చందూర్ భర్త, ‘జగతి’ మాసపత్రిక సంపాదకుడు ఎన్ ఆర్ చందూర్ కొద్దికాలం క్రితమే కన్నుమూశారు.నూజీవీడు మామిడిపళ్లని నెహ్రూ బెర్నార్డ్‌షాకు కానుకగా ఇచ్చారట. మాలతీ చందూర్ అక్కడ పుట్టిన మావిచిగురే!

 - డా॥గోపరాజు నారాయణరావు

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top