వలస ప్రజలను ఆదరించే నగరమే రాజధాని...

వలస ప్రజలను ఆదరించే నగరమే రాజధాని... - Sakshi


ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన విశాఖపట్నం ఎప్పటినుంచో కాస్మోపాలిటన్ సిటీగా విదేశీయులను సైతం ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇది ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు కలిగి ఉన్న ప్రశాంత నగరం. రాష్ట్రానికి రాజధాని కాదగిన అనుకూలతలు దీనికి చాలానే ఉన్నాయి.

 

రాష్ట్ర రాజధానిగా ఏర్పాటు చేసే నగరం జాతీయ స్థాయిలోనే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రాముఖ్యత కలిగిన నగరమై ఉండాలి. తద్వారా బహుళజాతి సంస్థలను సులభంగా ఆకర్షించడం సా ధ్యపడుతుంది. ప్రశాంతతకు చిహ్నంగా, నేర రహితంగా, కాస్మోపాలిటన్ కల్చర్ కలిగి, ఇప్పటికే బ్రాండ్ ఇమేజ్ ఉన్న నగరాన్ని రాజధానిగా ఏర్పాటు చేయడం ప్రగతికి ఎంతగానో దోహదకారిగా మారుతుంది.

 ఏ రాష్ట్ర రాజధాని అయినప్పటికీ అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉండాలనేది ఒక సాధారణ అభిప్రాయం. దీంతోపాటు పరిపాలనా విభాగానికి కేంద్రంగా నిలుస్తూ, అ న్ని ప్రాంతాలను అనుసంధానించాలి, లేని పక్షంలో ఆయా ప్రాంతాలు నిస్తేజమైపోతాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో రాజధానికి కనెక్టివిటీ, యాక్టివిటీ అనేది ఉండాలి. అసమతుల్యత ఏర్పడితే సమ్మిళిత అభివృద్ధి సాధ్యం కాదు.

 రాజధాని నిర్మాణం జరిపే సమయంలో అనువైన ప్రాంత ఎంపికలో కొన్ని అంశాలు పరిశీలించాల్సిన అవసరం ఉంది. అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉండాలి. భౌతిక అనుసంధానం, ఈ-అనుసంధానం కలిగి ఉండాలి. భౌతిక అనుసంధానంలో రోడ్డు, వాయు, నీటి, రైలు ద్వారా రాజధానికి సులభంగా చేరుకోగలగాలి. ఎలక్ట్రానిక్ వ్యవస్థలతో ఏ ప్రాంతంతో అయినా సులభంగా సంప్రదించే విధంగా సాంకేతికంగా అనుసంధానం కలిగి ఉండాలి.



లొకేషన్ బ్రాండ్...



రాష్ట్ర గుర్తింపును తీసుకువచ్చేది కేవలం రాజధాని మాత్రమే. లొకేషన్ పరంగా బ్రాండ్ ఇమేజ్ ఉన్న ప్రాంతాలలో మాత్ర మే రాజధాని నిర్మాణానికి అన్ని విధాల అనుకూలంగా ఉం టుంది. తద్వారా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో తగిన గుర్తింపు, ప్రాధాన్యత సాధించడం సాధ్యపడుతుంది. నగరం కాస్మోపాలిటన్ సిటీగా ఉంటూ ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చే వారిని స్వీకరించే మనస్తత్వం కలిగి ఉం డాలి. పరిశ్రమలు, పర్యాటకం, వ్యాపారం విస్తరణకు అనువైనదిగా నిలవాల్సిన అవసరం ఉంది. ప్రజలు సౌకర్యవంతంగా జీవనం సాగించే విధంగా రాజధాని నిర్మితం కావాలి. రాజధాని నగరానికి నేర, ఉగ్రవాద చరిత్ర ఉండరాదు. బల మైన సాంప్రదాయ పునాదులపై నిర్మితమైనది కాకుండా అన్ని వర్గాలను ఆహ్వానించేదిగా ఉండాలి.



భౌగోళికంగా ప్రజల విద్యా, వైద్య, వ్యాపార, పారిశ్రామిక రంగాల అవసరాలు తీర్చగలిగే భూభాగం కలిగి ఉండాలి. విశాలమైన రోడ్డు, పారిశుధ్య వ్యవస్థ, పాలనా వ్యవస్థ, వ్యాపారం, పరిశ్రమలు ఏర్పాటు కావాలి. అంతర్జాతీయ విమానాశ్రయం, తగినంత నీటి వనరులు ఉండాలి. కనీసం రానున్న 50 సంవత్సరాల అభివృద్ధికి సరిపోయేటంతగా ఇవి ఉండాలి.



ప్రస్తుతం భౌగోళికంగా రాష్ట్రానికి కేంద్రంగా ఉన్న విజయవాడ నగరం కాస్మోపాలిటన్ సిటీకాదు. ఇది నేర చరిత్ర కలిగి, బలమైన సాంప్రదాయ మూలాలు కలిగిన ప్రజలు నివసించే నగరం. అంతర్జాతీయ విమానాశ్రయం, పరిశ్రమలు లేవు. ప్రధానంగా తగినంత భూములు, పుష్కలంగా నీటి వనరులు కలిగి ఉన్న నగరంగా మాత్రమే ఇది ప్రాచుర్యం కలిగి ఉంది. అంతర్జాతీయ స్థాయిలో విజయవాడ స్థానం అంతంత మాత్రమే.



విజయవాడతో పోలిస్తే, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెంది న విశాఖ ఎప్పటినుంచో కాస్మోపాలిటన్ సిటీగా ఇతర రాష్ట్రా ల ప్రజలనే కాకుండా, విదేశీయులను సైతం ఎంతగానో ఆకట్టుకుంటోంది. పారిశ్రామిక, వ్యాపార, విద్యా రంగాలకు ఎంతో పేరు గాంచింది. ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు కలి గి ఉన్న ప్రశాంత నగరం. అయితే ఇక్కడ భవిష్యత్ అవసరాలకు సరిపడినన్ని నీటి వనరుల లభ్యత అనేది ప్రశ్నార్థకం.

 రాష్ట్రానికి మరో మూలన ఉన్న కర్నూలు ప్రాంతం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎటువంటి ప్రాధాన్యతను సంతరించుకోలేకపోయింది. శాంతిభద్రతలు, కనెక్టివిటీ లేవు. ఇక్కడి ప్రతి రంగాన్ని నూతనంగా నిర్మించాల్సిన అవసరం ఉంది. నీటి వనరుల లభ్యత చాలా కష్టతరం.

 రాష్ట్ర రాజధానిలో కేవలం పరిపాలనా వ్యవస్థ, రెవెన్యూ, శాంతి భద్రతలు, పన్నులు, శాసనసభ, మండలి, సాధారణంగా నిరంతరం పర్యవేక్షించాల్సిన ప్రధాన అంగాలు ఉం డాలి. వ్యవసాయ, విద్య, పారిశ్రామిక, గనుల శాఖ, న్యాయస్థానాలు, సముద్ర, మత్స్య పరిశ్రమలు తదితర అంగాలను ఆయా ప్రాంతాల భౌగోళిక వసతులు, వనరుల లభ్యత తదితర అంశాల ఆధారంగా విభజించి సమ ప్రాధాన్యం అందిస్తూ ఏర్పాటు చేయడం ద్వారా అన్ని ప్రాంతాల మధ్య సమతూకం, అభివృద్ధి సిద్ధిస్తుంది. సహజ వనరుల లభ్యత ఆధారంగా వీటిని కేటాయించడం ఎంతో మేలుచేస్తుంది.    



 (వ్యాసకర్త ఆంధ్ర విశ్వవిద్యాలయం  వాణిజ్య నిర్వహణ శాస్త్ర విభాగం ఆచార్యులు)

 

 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top