మూడేళ్లు–మూడు దారులు

మూడేళ్లు–మూడు దారులు - Sakshi


త్రికాలమ్‌

సార్వత్రిక ఎన్నికల అనంతరం అన్నిచోట్లా ప్రభుత్వాలు ఏర్పడి మూడేళ్ళు పూర్తవుతున్న సందర్భంలో ఒక వైపు ఆనందం, మరో వైపు ఆందోళన కలగడం శోచనీయం. ఢిల్లీలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ సర్కార్‌ అప్రతిహ తంగా దూసుకుపోతున్నది. మోదీ తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పని నల్లేరు మీద బండి చందం. చివ రిగా ప్రమాణం చేసిన నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసి రికార్డు నెలకొల్పబోతున్నారు.  ముగ్గురి పరిపాలననూ సమీక్షించవలసిన సమయం.



గురువారం నాడు రామనాథ్‌ గోయెంకా స్మారకోపన్యాసంలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ రెండు ముఖ్యమైన అంశాలు ప్రస్తావించారు. ప్రశ్నించడం ప్రజా స్వామ్యానికి మూలాధారం అన్నది ఒకటి. ప్రధాని మోదీలో నెహ్రూ, ఇందిరా గాంధీ  కనిపిస్తున్నారనేది రెండోది. ఈ రెండు అంశాలకూ సంబంధం ఉంది. రెండో అంశం ముందు పరిశీలిద్దాం. మోదీ నిస్సందేహంగా ఒక విలక్షణమైన ప్రధాని. మాటల మాంత్రికుడు. ప్రగతిపథ నిర్దేశకుడు. ధైర్యశాలి. నెహ్రూ వలె మంచి వాగ్ధాటి కలిగిన నాయకుడు. ఇందిరాగాంధీ లాగా రాజకీయ ప్రత్య ర్థులపైన పూర్తి ఆధిక్యం సంపాదించే శక్తి దండిగా ఉంది. ఆర్థికాభివృద్ధి 2013–14 కంటే ఇప్పుడు ఎక్కువ వేగం పుంజుకుంది.



జీడీపీ వృద్ధి రేటు అప్పుడు 6.5 శాతం ఉండగా ఇప్పుడు 7 శాతం ఉంది. 7.5 శాతం వరకూ పెరిగే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం అప్పటి కంటే బాగా తగ్గింది. ప్రపం చంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం మనది. మోదీ సమ ర్థుడైన ప్రధాని అనడంలోనూ, ఇంతవరకూ ఒక్క అవినీతి ఆరోపణ రాకుండా మచ్చలేని ప్రభుత్వానికి ఆయన సారథ్యం వహిస్తున్నారనడంలోనూ ఏ మాత్రం సందేహం లేదు. ప్రతిపక్షం బలహీనంగా ఉండటం కూడా మోదీకి కలసి వచ్చిన అంశం. ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపించడంలో, ప్రత్యర్థి దేశా లకు తగ్గకుండా వాటికి దీటుగా వ్యవహరించడంలో మోదీ తనదైన శైలిని అల  వరచుకున్నారు. మోదీ హయాంలో చైనాతో, పాకిస్తాన్‌తో సంబంధాలు దెబ్బ తిన్నాయి. కశ్మీర్‌లో పరిస్థితి దిగజారింది. అయినా సరే,  మోదీ మూడేళ్ళ పాలన ప్రశంసనీయంగానే సాగింది. మున్ముందు కూడా ఇదే విధంగా సాగుతుంది.  ఇందుకు ఆనందం.



ప్రశ్నించే స్వేచ్ఛ

ప్రణబ్‌ ముఖర్జీ ప్రస్తావించిన మొదటి అంశం ప్రశ్నించే స్వేచ్ఛ. ప్రశ్న లేకపోతే ప్రజాస్వామ్యం లేదు. (The need to ask questions of those in power is fundamental for the preservation of our nation and of a truly democratic society-Pranab). ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి ప్రకటిం చిన తర్వాత కూడా ప్రశ్నించేవాళ్ళం. ముఖ్యంగా రామనాథ్‌ గోయెంకా ఆధ్వ ర్యంలోని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్, ఆంధ్రప్రభ, ఇతర అనుబంధ పత్రికలలో ప్రభు త్వాన్ని ప్రశ్నించడం కోసం తెగువ ప్రదర్శించేవాళ్ళం. గోయెంకా స్మారకోపన్యా సంలో రాష్ట్రపతి ప్రశ్నించడం గురించి నొక్కిచెప్పడం సందర్భోచితంగా ఉంది. రాజకీయ ప్రత్యర్థుల ప్రశ్నలు సహించలేక  వాజపేయి, అడ్వాణీ, ఫెర్నాండెస్‌ వంటి అనేకమంది ప్రతిపక్ష నాయకులను ఇందిరాగాంధీ కటకటాల వెనుక పెట్ట వలసి వచ్చింది. 



మోదీకి అటువంటి అగత్యం లేదు. ఆత్యయిక పరిస్థితి ప్రకటిం చకుండానే ప్రత్యర్థులను నోరు మూయించేందుకు మోదీకి తోడుగా మీడియా నిలబడింది. మోదీ ఢిల్లీ రాకముందు అంతా శూన్యమనే అభిప్రాయం మీడియా సమర్పకులలో స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీ నాయకులు సరేసరి. మోదీ దేవుడిచ్చిన వరం అంటూ వెంకయ్యనాయుడు ప్రకటించారు.  మొన్న అమిత్‌ షా హైదరాబాద్, విజయవాడలలో చేసిన ప్రసంగాలలో కూడా ఇతరులు డెభ్బై ఏళ్ళలో చేయలేని పని మోదీ మూడేళ్ళలో చేశారని చెప్పారు. కడచిన డెభ్బై ఏళ్ళలో వాజపేయి అయిదేళ్ళ పైచిలుకు పాలన కూడా ఉన్నదనే స్పృహ లేకుండా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. వాజపేయిని కూడా కాంగ్రెస్‌ ప్రధానుల గాటనే కట్టివేస్తున్నారు. మోదీ నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నా, సర్జికల్‌ స్ట్రయిక్స్‌ అన్నా, లాహోర్‌ వెళ్ళి పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ను పలకరించి వచ్చినా, బలూచిస్తాన్‌లో మానవహక్కుల గురించి ప్రస్తావించినా మీడియా సమర్థిస్తుంది.



ఇంత అనుకూలమైన మీడియా, ఇంత శక్తిమంతమైన మీడియా సహకారం ఇందిరకు లేదు. 1975–77లో టీవీ చానళ్ళు లేవు. పత్రికలు ఒక స్థాయికి మించి ప్రభుత్వాన్ని మోసేవి కావు. పాఠకులు ఏమనుకుంటారో  నన్న బెరకు ఉండేది. జాతీయతా భావాన్ని ఇందిర ఉద్దీపనం చేసిన విధంగానే మోదీ కూడా చేయగలిగారు. మోదీకి ఇది వెన్నతో పెట్టిన విద్య. అండగా ఆర్‌ఎస్‌ఎస్‌ శ్రేణులు ఉండనే ఉన్నాయి. హిందూత్వ భావజాలాన్ని గుండెల నిండా నింపుకున్న మధ్యతరగతి మేధావుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ‘టైమ్స్‌నౌ’ చానల్‌ ‘ది వోన్లీ నేషనలిస్ట్‌ చానల్‌’ అంటూ చాటుకుంటోంది. పాకిస్తాన్‌ను తిట్టడం, భారత సైన్యాన్ని పొగడడం విధిగా జరగాలి. లేకపోతే యాంకర్లు  క్షమించరు. పొరపాటున కశ్మీర్‌లో పరిస్థితి క్షీణిస్తోందని అంటే జాతికి క్షమాపణ చెప్పాలంటూ యాంకర్లు గుడ్లురుముతున్నారు. పాకిస్తాన్‌ని తిట్టని వాడు దేశద్రోహి.



కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్‌ అయ్యర్‌ కశ్మీర్‌ వెళ్ళి వేర్పాటువాది గిలానీనీ, షబ్బీర్‌షానీ, ఇతర హురియత్‌ నాయకులనూ కలుసుకున్న వీడియో చిత్రాలు చూపిస్తూ, మణిశంకర్‌ దేశద్రోహులతో కరచాలనం చేస్తున్నాడనీ, తనను తాను శాంతికాముడిగా భావించుకుంటూ దేశానికి తీరని అపకారం చేస్తున్నాడనీ పరుష పదజాలంతో నిందలు మోపుతూ ఈ పీస్నిక్‌లను (శాంతి కాముకులుగా చెప్పుకునేవారిని) ఏమి చేయాలంటూ యాంకర్‌ అడుగుతుంది. అదే చానల్‌లో కేరళకు చెందిన సీపీఎం నాయకుడిని యాంకర్‌ చివాట్లు పెడు తుంది. మరో యాంకర్‌ ఫోన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చిన వ్యక్తిపై గావు కేకలు పెడతాడు. మన కేకలు మరొకరి భిన్నమైన అభిప్రాయం వినిపించకుండా చేయకూడదని (loudest noise should not drown those who disagree) రాష్ట్రపతి చెప్పింది అందుకే. మన జాతీయ (ఇంగ్లీషు) చానళ్ళు చేస్తు న్నది సరిగ్గా అదే.  ఇవన్నీ ఒకే రోజు జరిగినవే. రోజూ జరుగుతున్నవే. మూడేళ్ళ కిందట చానళ్లు ఇంత అహంకార పూరితంగా, ఇంత ధ్వని ప్రధానంగా, ఇంత నిరంకుశంగా, ఇంత ఏకపక్షంగా, ఇంత అసహనంగా ఉండేవి కావు. అందుకే ఆందోళన.



సమ్మతి సృష్టి

మీడియా మద్దతుతో మోదీ ప్రభుత్వం నామ్‌ చామ్‌స్కీ చెప్పినట్టు సమ్మతి సృష్టిని (manufacture of consent) తేలికగా చేయగలుగుతున్నది. ఉదాహర ణకు పాకిస్తాన్‌పై ఆధిక్య ప్రదర్శన. పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పడానికి ఇందిరా గాంధీ అన్ని దేశాలూ తిరిగి దౌత్యం చేయడమే కాకుండా క్షేత్రంలో యుద్ధం చేయవలసి వచ్చింది. ముక్తిబాహిణిని నిర్మించవలసి వచ్చింది. ఒక ఇస్లామిక్‌ దేశాన్ని ముక్కలు చేసిన ఒక హిందూ యోధగా ఆమెను హిందూత్వవాదులు సైతం కీర్తించారు. దుర్గగా వాజపేయి అభివర్ణించారు. మోదీకి యుద్ధం చేయ వలసిన అవసరం లేదు. సర్జికల్‌ స్ట్రయిక్స్‌ ద్వారా ఉగ్రవాద స్థావరాలు విధ్వంసం చేయించగలరు. యుద్ధంలో పాకిస్తాన్‌ను చిత్తు చేశామనే అనుభూతిని ప్రజలకు కలిగించే పని మన టీవీ చానళ్ళు అత్యంత శక్తిమంతంగా చేయగలవు.



టాక్‌షోలలో మన మాజీ సైనికాధికారులతో పాటు పాకిస్తాన్‌కు చెందిన ఇద్దరు ముగ్గురు మాజీ జనరల్స్‌ను కూడా  కూర్చోబెట్టుకొని మాటల ఈటెలతో పాక్‌ జనరల్స్‌ని పొడిచి, వేధించి, ఓడించి మన గుండెలలో భారత పతాకను రెపరెప లాడించే యాంకర్లకు ప్రేక్షకాదరణ విపరీతంగా పెరిగిపోతోంది. కులభూషణ్‌ జాధవ్‌ కేసులో  అంతర్జాతీయ న్యాయస్థానం పదకొండుమంది న్యాయమూర్తుల పీఠం  తీర్పు వాయిదా వేసినా  సరే ఒకటి, రెండు సానుకూలమైన వ్యాఖ్యలను పట్టుకొని మనమే గెలిచినట్టు ఢంకా బజాయించి చెప్పేందుకు సమర్పకులు పోటీపడటం విశేషం. సెక్యులరిస్టు అన్నా, వామపక్షవాది అన్నా, మానవ హక్కుల కార్యకర్త అన్నా, ప్రశ్నించేవారన్నా మీడియా ప్రతినిధులలో అసహనం పెరిగిపోతున్నది. ఆత్యయిక పరిస్థితి విధించకుండా, ప్రతిపక్ష నేతలను జైళ్ళలో కుక్కకుండా, సెన్సార్‌షిప్‌ లేకుండా ఆత్యయిక పరిస్థితి నాటి ఫలితాలు సాధించ గలగడం విశేషం.



ఏది నిజమో తెలియక, నిజం కాదేమోనన్న అనుమానం వెలి బుచ్చే సాహసం చేయలేక మౌనంగా సమ్మతి ప్రకటిస్తున్నవారు దేశంలో అత్యధి   కులు. ఇవన్నీ ఒక పథకం ప్రకారం మోదీ పర్యవేక్షణలో జరుగుతున్నాయని చెప్పడం లేదు. మోదీ తన పని తాను ఏకోన్ముఖ దీక్షతో  చేసుకొని పోతున్నారు. జాతీయ మీడియా తన పని తాను చేసుకొని పోతున్నది. సమ్మతి సృష్టి కోసం అహరహం శ్రమిస్తున్నది. ఊపిరి సలపకుండా ఒక సంచలనం తర్వాత మరో సంచలనం సంభవించడంతో ప్రజలకు వెనక్కు తిరిగి చూసుకునే అవకాశం లేదు. ప్రగతిపథంలో పరుగులు తీయవలసిందే. ఇదే ధోరణి కొనసాగితే 2019లో కూడా బీజేపీదే విజయం. మోదీదే పీఠం.



తెలుగు రాష్ట్రాలలో అప్రజాస్వామిక ధోరణి

ఆంధ్రప్రదేశ్‌లో అరాచకం, అవినీతి అట్టహాసం చేస్తున్నాయి. చంద్రబాబు 1995–2004లో రెండు విడతల ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కొన్ని ఒప్పులూ, కొన్ని తప్పులూ ఉండేవి. ఏ ముఖ్యమంత్రికైనా అది సహజం. ఈసారి తప్పుల సంఖ్య పెరిగిపోవడానికి కారణం ఆయన పెట్టుకున్న లక్ష్యాలే. ఎన్నికలు పూర్తయి అధికారంలోకి వచ్చిన వెంటనే అయిదేళ్ళ తర్వాత జరిగే ఎన్నికల కోసం ప్రణాళిక వేసుకోవడం, డబ్బు సంపాదించే అవకాశం పార్టీ నాయకు లకూ, కార్యకర్తలకూ ఇవ్వాలని నిర్ణయించుకోవడంతో మూడేళ్ళూ అవినీతి కార్యకలాపాలతోనే గడిచిపోయాయి. మోదీ లాగానే చంద్రబాబుకు కూడా జాతీయ మీడియా సహకారం ఉంది.



పాతికమంది కూలీలను శేషాచలం అడవులలో కాల్చి చంపినా, గోదావరి పుష్కరాలలో షూటింగ్‌ సంరంభంలో ఇరవై మంది చనిపోయినా, ఏర్పేడులో ఇసుక మాఫియా దురాగతం వల్ల చాలామంది అమాయక పౌరులు మరణించినా జాతీయ మీడియా పట్టించు కోదు. స్థానిక మీడియా కొమ్ముకాస్తుంది. పట్టిసీమ నదుల అనుసంధానం అని కొన్ని పత్రికలు రాయవచ్చును.  కానీ పట్టిసీమ నిరర్థకమైన ప్రాజెక్టు అన్నది ప్రవీణుల అభిప్రాయం. అమరావతిలో ఎక్కడ వేసిన రాయి అక్కడే ఉంది. తాత్కాలిక నిర్మాణాలే కానీ శాశ్వత నిర్మాణాలు ప్రారంభం కాలేదు. అభివృద్ధి క్రమంలో జాప్యం జరగవచ్చు. అభివృద్ధి అద్భుతంగా ఉన్నప్పటికీ ప్రజలకు ప్రశ్నించే హక్కు లేకపోతే పాలకులకు ఆదరణ ఉండదు. వ్యంగ్య వ్యాఖ్యలు చేసినవారిని జైలులో పెట్టే సంస్కృతికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు.



తెలంగాణలోనూ ప్రశ్నిస్తే సహించే స్వభావం కనిపించడం లేదు. ఆంధ్ర ప్రదేశ్‌తో పొల్చితే తెలంగాణలో చెప్పుకోదగిన ప్రాజెక్టులు ఉన్నాయి. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ మంచి ప్రాజెక్టులు. సంక్షేమ కార్యక్రమాలలో కూడా కొంత విస్తృతి పెరిగింది. కానీ ప్రశ్నిస్తున్న కోదండరామ్‌ని శత్రువుగానే చూస్తు న్నారు. ప్రశ్నించే స్వభావం ఉన్నవారిని దూరంగానే పెడుతున్నారు. ప్రజాస్వా మ్యాన్ని అపహాస్యం చేసే ఫిరాయింపులు వగైరాలు రెండు రాష్ట్రాలలోనూ నిస్సంకోచంగా జరిగాయి. మొత్తంమీద ధోరణి ప్రజాస్వామ్య వ్యవస్థను బలో పేతం  చేసే విధంగా లేదు. తెలంగాణలో అభివృద్ధి జరగడం లేదని అనడం లేదు. కానీ అభివృద్ధి నమూనాను ప్రశ్నించే స్వేచ్ఛ లేదు. అందుకే ఆందోళన.

కె. రామచంద్రమూర్తి

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top