ప్రేమ వేరు, మోహం వేరు

ప్రేమ వేరు, మోహం వేరు


ప్రేమోన్మాది ఓ విద్యార్థినిని ఆమె క్లాసు రూంలో కత్తిపెట్టి పొడిచాడని పత్రికా వార్త. నిజానికి ఇది మోహం అనే ఉన్మాదంతో మనిషి చేసిన పని. దేనినైనా, ఎవరినైనా ‘ఇది నాది, నాకు కావాలి, నాకే చెందాలి’ అనే వాడు మోహ పీడితుడు. అవతలి మనిషి తనకే దక్కాలి, దక్కితీరాలి అనుకుంటూ, ఆ మనిషికి తనని తిరస్కరించే హక్కు, స్వతంత్రం లేదనే భావం. తాను మోహించాడు కాబట్టి, ఆ వ్యక్తి కూడా తనని మోహించాలి, ఇష్టపడాలి. తద్భిన్నంగా ప్రవర్తిస్తే వారిని బలాత్కరిస్తాడు. యాసిడ్ చిమ్ముతాడు. చంపే ప్రయత్నం చేస్తాడు. ఈ అవ్యక్తావస్థ, ఈ మోహం, ప్రేమ అనిపించుకోదు.



 ప్రేమ సంపూర్తిగా భిన్నమైనది. ప్రేమలో ఉండేది లాలిత్యం, సున్నితమైన స్పృహ. ప్రేమ అవతలి మనిషి వికసించాలి అని కోరుతుంది. తనకు దక్కకపోయినా, దౌర్జన్యం తలపెట్టదు. ప్రేమించడంతో ‘తాను’ ముఖ్యం కాదు; ప్రేమింపబడిన వ్యక్తి ముఖ్యం. ఆ వ్యక్తి క్షేమం ముఖ్యం. అది నాలుగు కాలాల పాటు వర్ధిల్లాలి అని కోరుకుంటుంది. ప్రేమలో ఆరాధనా భావముంటుంది. వేరొకరు ఆరాధిస్తున్నా వారికి అడ్డం రాదు. తాను ఆరాధించే దానినే ఇంకొకరు ఆరాధిస్తూ ఉంటే తన సంతోషం ఇనుమడిస్తుంది. ప్రేమలో అసూయ ఉండదు. ప్రేమించిన వస్తు వు తనకు చెందాలనే బలీయమైన కాంక్ష లేనప్పు డు, ప్రేమింపబడిన వారి సుఖసంతోషాలే తన సుఖ సంతోషాలుగా భావించినప్పుడు, అసూయకు స్థానమెక్కడుంటుంది? బృందావన మది అందరిదీ, గోవిందుడు అందరి వాడేననిపిస్తుంది. అంటే ఆ ప్రేమలో స్వార్థ భావముండదు.



శ్రీకృష్ణ పరమాత్మ మిత్రుడైన ఉద్ధవుడు, గోపికలకు శ్రీకృష్ణుని యెడల ఉండే ప్రేమ భక్తిని చూసి, తన భక్తి వారి భక్తితో సరితూగక పోయెనే అని చింతించాడు. దైవభక్తిలోని సారం ప్రేమ, ప్రేమ మనం ఊహించగలిగిన దానికన్నా మధురమైనది. మనిషి ఎరిగిన మోహావేశం కన్నా గుణాత్మకంగా విలువైనది, పవిత్రమైనది. కీచకుడికి సైరంధ్రి ఎడల కలిగిన మోహ పరవశత్వం, ఉద్రిక్తత, ప్రేమ అనిపించుకుంటుందా? ప్రేమ ప్రశాంతమైనది. శీతల కిరణాలను ప్రసరిస్తూ ఉంటుంది. పుష్పాన్ని చిదిమేద్దామనే ప్రయత్నం ఉండదు. ప్రేమలో హింసకు, దౌర్జన్యానికి తావులేదు. ప్రేమికుడు అనేకం త్యజించడానికి సిద్ధపడతాడు. మానసికంగా గాయపడడానికి అంగీకరి స్తాడు. అప్పుడు గాని, ప్రేమ అసలు స్వరూపం బయటికి రాదు. ఇదొక తీయని బాధ. కానీ ఈ బాధ మనిషిని ఉన్నతీకరిస్తుంది. నిజమైన మానవుణ్ణిగా చేస్తుంది. ప్రేమించి కోల్పోయినా నష్టం లేదు; ప్రేమించ కుండా బ్రతకడం నిరర్థకం.



 మోహం అలాంటిది కాదు. అది తాను, తన సుఖం సంగతి ఆలో చిస్తుంది. మనిషి యొక్క అనేక వికృతచేష్టలు, పనివారిని హింసించడం ఈ పెచ్చు పెరిగిన వాంఛ, స్వార్థంలో నుండి జనించినవే. ఇవన్నీ లోకానికి హానికరమైనవే. కోరిక తీరని చోట ఏదో ఘాతుకానికి పాల్పడతై; కోరిక తీరిన తర్వాత కూడా, సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడానికి ఘాతుకాలు చేస్తుంది. వాంఛ తీరకపోతే పగ సాధించడానికి వెనుకాడని ఈ మనస్తత్వం ప్రేమ అనిపించుకుంటుందా? అయితే మీరాబాయి, సక్కుబాయిల పవిత్ర భగవత్ ప్రేమను ఏ పేరు పెట్టి పిలవాలి?

 కనీసం వ్యామోహితుడికి కలిగే భావాలు ప్రేమ కానేకాదని తెలిస్తే, ఆ పవిత్ర పదాన్ని వ్యర్థంగా వాడము. సృష్టిలో మోహానికి తావు ఉండవచ్చు. భస్మాసురుడిని మట్టుపెట్టడానికి మోహినిని ప్రయోగించాల్సి వచ్చింది; రాక్షసులు అమరులు కాకుండా ఉండటానికి, మోహినీ అవతారంలో మోసంతో అమృతాన్ని దేవతలకు కేటాయించాల్సి వచ్చింది.ప్రేమ అనే పదాన్ని తేలికగా చులకనగా వాడద్దనే నా మనవి.

 

నీలంరాజు లక్ష్మీప్రసాద్

 

 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top