వివక్షకు విరుగుడు పదవేనా?

వివక్షకు విరుగుడు పదవేనా? - Sakshi


కొత్త కోణం

గత మూడేళ్లుగా దళిత, ఆదివాసుల అభివృద్ధి లక్ష్యంగా కొత్త పథకాలేవీ ప్రారంభించిన దాఖలాలు లేవు. పైగా దేశవ్యాప్తంగానే కాదు, విశ్వవిద్యాలయాల్లో సైతం దళిత ఆదివాసీ, మహిళ, మైనారిటీలపై వేధింపులు పెరిగిపోయాయి.భారీ ప్రాజెక్టుల పేరిట దేశంలోని చాలా ప్రాంతాల్లో షెడ్యూల్డ్‌ కులాలు, తెగలను నిర్వాసితులను, నిరాశ్రయులను చేస్తున్నారు. దళితుడైన రామ్‌నాథ్‌ కోవింద్‌నుS రాష్ట్రపతిని చేస్తే చాలదు. అభద్రత, వెనకబాటుతనం, వివక్ష, దోపిడీల నుంచి వారికి విముక్తిని కలిగించాలి. అదే నిజమైన దళిత అభివృద్ధి.



‘‘ఎన్నికల సమయంలో మనమంతా హిందువులమేనని ఓట్లేయించుకున్నారు. గెలిచాక మమ్మల్ని బానిసలకన్నా హీనంగా చూస్తున్నారు. అందుకే మేం హిందూ మతాన్ని వదిలి బౌద్ధాన్ని స్వీకరించాలని నిర్ణయించుకున్నాం. మా గ్రామాల్లోని ఠాకూర్లు మాపై దాడులు జరిపినందుకుగాను బీజేపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం, పోలీసులు వారిపై చర్యలు తీసు కోవాల్సిందిపోయి, మమ్మల్నే నిర్బంధిస్తున్నారు. ఆదిత్యనాథ్‌ కూడా ఠాకూర్‌ అయినందువల్ల మాకు ఠాకూర్ల నుండి ఇంకా ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది.’’ తమను కాపాడలేకపోగా తమ జీవితాలను ఛిద్రం చేసిన ఆ హిందూ మతాన్నే త్యజించిన సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌ జిల్లా దళితోద్యమ నవ యువకుడు పాతికేళ్ల నరేంద్ర గౌతమ్‌ చేసిన వ్యాఖ్య లివి.


అప్పటివరకు తాము పూజించిన హిందూదేవతల విగ్రహాలను వంద లాది మంది దళితులు కాలువలో పారేసి, బౌద్ధాన్ని స్వీకరించిన సందర్భ మది. వారా నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? స్వాతంత్య్రానంతరం డెబ్భై ఏళ్లు గడుస్తున్నా దేశంలోని చాలా ప్రాంతాల్లో నెలకొన్న వివక్షాపూరిత, విద్వే షభరిత పరిస్థితులు దళితులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రజల ఓట్లతో ఎన్నికైన ప్రభుత్వాలు ఆర్థిక, సామాజిక ఆధిపత్యం గల కులాల చెప్పు చేత ల్లోనే పనిచేస్తున్నాయి. అప్పుడప్పుడూ ప్రభుత్వాలు, ప్రధాన రాజకీయ పార్టీలు ఓట్ల కోసం ఏవో నామమాత్రపు చర్యలు చేపట్టినా అవి కుల వివక్షకు, అణచివేతకు, దాడులకు, అత్యాచారాలకు గురవుతున్న దళితులకు ఎటు వంటి ఉపశమనాన్నీ కలిగించడం లేదు. పైగా కుల వివక్ష, అంటరానితనం, దళితులపై దాడులు పెచ్చుమీరి పోతున్నాయే తప్ప ఆగడం లేదు. ఆ క్రమం లోనే సహరాన్‌పూర్‌ దళితుల తిరుగుబాటును అర్థం చేసుకోవాలి.




దాడికి గురైన దళితులపైనే కేసులా?

ఆ జిల్లాలోని çషబ్బీర్‌పూర్‌ గ్రామంలో దళితులపైన ఠాకూర్లు దాడి చేసి 25 ఇళ్లను తగులబెట్టగా దళితులు తమ సర్వస్వాన్ని కోల్పోయారు. బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ప్రతిష్టించుకోవడానికి దళితులు చేసిన ప్రయ త్నాన్ని భూస్వాములైన ఠాకూర్లు అడ్డుకున్నారు. దళితవాడలోని రవిదాస్‌ మందిర్‌లో ఆ విగ్రహాన్ని పెట్టుకోవడానికి సైతం అడ్డుపడ్డారు. పైగా మే 5న రాణా ప్రతాప్‌ శోభాయాత్రను దళితుల వాడలో నుంచి తీసుకెళ్లడానికి ఠాకూర్లు పూనుకున్నారు. ఊరేగింపు జరుపుతూ ‘‘అంబేడ్కర్‌ ముర్దాబాద్‌’’ అంటూ నినాదాలు చేశారు. ఈ ఊరేగింపును ఆపాలని కోరుతూ దళితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు దాన్ని ఆపే ప్రయత్నం చేశారు. ఇంతలో పథకం ప్రకారమే పక్కనే ఉన్న మరో సిమ్లానా నుంచి ఠాకూర్లు మారణా యుధాలతో వచ్చి దళితులపై దాడులకు దిగారు.


పోలీసులు కూడా వారి చేతిలో గాయపడ్డారు. దళితులకు చెందిన 25 ఇళ్లను తగులబెట్టారు. మహి ళలను అవమానపరిచారు. లైంగికంగా వేధించారు. పొరుగు గ్రామమైన మహేష్‌పూర్‌లోని దళితులకు చెందిన ఐదు దుకాణాలను ధ్వంసం చేశారు. అయినా పోలీసులు ఈ దహన, విధ్వంస, దౌర్జన్య కాండలకు పాల్పడ్డ ఠాకూ ర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ దాడులను నిరసిస్తూ మే 21న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద భీమ్‌ ఆర్మీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన జరి గింది. అయితే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఈ సమస్యను పరిష్కరించడానికి పూనుకోకపోగా, మే 5 ఘటనలకు చంద్రశేఖర్‌ రావణ్‌ను బాధ్యుణ్ణి చేసి అరెస్టు చేయించాయి. చంద్రశేఖర్‌ 2015లో స్థాపించిన భీమ్‌ ఆర్మీ దళిత పిల్ల లకు విద్యను అందించే ప్రధాన లక్ష్యంతో పనిచేస్తూ వస్తున్నది.


జిల్లా వ్యాప్తంగా అది దాదాపు 300 పాఠశాలలను నిర్వహిస్తున్నది. చంద్రశేఖర్‌ అరెస్టు సహరాన్‌పూర్‌ దళితుల్లో తీవ్ర నిరసన జ్వాలలు రేపింది. వారు ఆయన స్థానంలో ఆయన తల్లి కమలేష్‌ దేవిని భీమ్‌ ఆర్మీ నాయకురాలుగా ఎన్నుకున్నారు. ఆమె పిలుపు మేరకు జూన్‌ 18న మరోసారి ఢిల్లీలో భారీ ప్రదర్శన జరిగింది. దాన్ని విఫలం చేయడానికి యూపీ పోలీసులు ఎన్నో అడ్డంకులు సృష్టించారు. వందలాది మందిని అరెస్టు చేశారు. కానీ దళితులు వాటిని తప్పించుకుని ఢిల్లీ ర్యాలీని విజయవంతం చేయడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సవాల్‌గా మారింది. అయితే సహరాన్‌పూర్‌ దళితులు అంత టితో ఆగలేదు. వేల ఏళ్లుగా సాగుతున్న బానిసత్వానికి చరమగీతం పాడాల నుకుని, కుల వ్యవస్థను పెంచిపోషిస్తున్న హిందూ మతంలో ఇమడలే మంటూ అంబేడ్కర్‌ బాటన బౌద్ధాన్ని తమ గమ్యస్థానంగా ఎంచుకున్నారు.


చిత్తశుద్ధి కొరవడితే రాష్ట్రపతి ఎవరైనా ఒకటే

యూపీ సహా చాలా రాష్ట్రాల్లో, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం దళితుల రక్షణకు, వారి ఆత్మగౌరవ పరిరక్షణకు చర్యలు చేపట్టకపోగా రాజ కీయక్రీడను మొదలుపెట్టింది. అది, దళితుడైన రామ్‌నాథ్‌ కోవింద్‌ను రాష్ట్ర పతి అభ్యర్థిగా ప్రకటించడం ఆహ్వానించదగినదే. రాజకీయాల్లో ప్రాతిని«ధ్యం వహించడానికి వివిధ వర్గాలకు చెందినవారు ఉన్నత పదవులను అధిష్టిం చడం మంచిదే. దానితో ఆ వర్గాల్లో ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. తాము ఎవ రికీ తీసిపోమని, ఎవరికన్నా తక్కువ కామనే భావన వస్తుంది. గతంలో భారత రాష్ట్రపతిగా కె.ఆర్‌. నారాయణన్‌ దేశ రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు. అయితే విధాన నిర్ణయాల్లో రాష్ట్రపతి పాత్ర బహుస్వల్పం. ఏదేమైనా బీజేపీ నిర్ణయం ఒక ముందడుగే. ఇంతటితోనే మొత్తం సమస్యలు పరి ష్కారం కావు. దళితుల సమస్యల పరిష్కారం వైపు కేంద్రం దృష్టి సారిం చాలి. ముఖ్యంగా వారిపై జరుగుతున్న అత్యాచారాల విషయంలో చిత్త శుద్ధితో చర్యలు తీసుకోకపోతే రాష్ట్రపతిగా ఎవరు ఉన్నా ఒరిగేదేమీ ఉండదు.




గత మూడు సంవత్సరాలుగా కేంద్రంలో మోదీ ప్రభుత్వం అనుసరి స్తున్న విధానాలు దళితులకు ఏ మాత్రం ప్రయోజనకరంగా లేవు. ముఖ్యంగా బడ్జెట్‌లో దళితులకు చెందాల్సిన వాటా లభించడం లేదు. గత మూడేళ్లలో మోదీ ప్రారంభించిన పథకాల్లో దళిత, ఆదివాసీ, వెనుకబడిన కులాల అభి వృద్ధికి ఉద్దేశించినవి ఏవీ లేవు. అయితే ఆయన 2016, సెప్టెంబర్, 15న ‘న్యూస్‌ 18’కు ఇచ్చిన సుదీర్ఘమైన ఇంటర్వూ్య కుల సమస్యపట్ల, దళితులపై జరుగుతున్న దాడుల పట్ల ఆయన దృక్పథం ఎలాంటిదో అర్థం అవుతుంది. ఆ ఇంటర్వూ్యలో మోదీ ఇలా అంటారు: ‘‘వేల ఏళ్ల సంస్కృతి మనది. కొన్ని అసమానతలున్నాయి. తెలివిగా మనం వాటి నుంచి బయటపడాలి. ఇది ఒక సామాజిక సమస్య. ఇది చాలా లోతైన అంశం’’ అంటూ దళితుల, ఆది వాసీల సమస్యలను వివరించారు. అంటరానితనం, కులవివక్షల ప్రస్తావన ఎక్కడా తేలేదు.


పైగా గత ప్రభుత్వాలతో పోలిస్తే తమ హయాంలో దళి తులపై అత్యాచారాల సంఖ్య బాగా తగ్గిపోయిందన్నారు. కానీ అది నిజం కాదు. ఎన్‌డీఏ హయాంలో దళితులపై అత్యాచారాల సంఖ్య, హత్యలు, మహిళలపై అత్యాచారాలు పెరిగాయి. 2012లో దళితులపై జరిగిన మొత్తం నేరాల సంఖ్య 33,655, 2013లో 39,408 కాగా, 2015లో 45,003కు పెరి గింది. అదేవిధంగా దళితుల హత్యలు 2012లో 651, 2013లో 676 కాగా, 2015లో 707కు చేరాయి. మహిళలపై అత్యాచారాలు 2012లో 1,570, 2013లో 2,073, కాగా 2015లో 2,326కు పెరిగాయి. ఇవి ప్రభుత్వంవారి  నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో చెప్పిన లెక్కలే. కానీ ప్రధాని మోదీ అలవోకగా దళితులపై అత్యాచారాలు తగ్గాయని అబద్ధమాడారు. ఇది ఆయనకు దళిత ఆదివాసీల çసమస్య పట్ల ఉన్న తేలిక భావాన్ని వెల్లడి చేస్తుంది.




దళితుల సమస్యల పట్ల చిన్న చూపు

అదే ఇంటర్వూ్యలో ఆయన ‘‘దళితుల అభివృద్ధికి నేను కట్టుబడి ఉన్నాను. అదేవిధంగా ఆదివాసీల విషయంలో కూడాను. అణగారిన వర్గాలకు, వివక్షకు గురవుతున్న వారికి, మహిళలకు అండగా ఉంటాను’’ అని హామీ ఇచ్చారు. కానీ గత మూడేళ్లలో కేంద్రం ప్రారంభించిన డిజిటల్‌ ఇండియా, మేకిన్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా, స్టార్టప్, స్టాండప్, పవర్‌ సెక్టార్, రహదారులు, గంగా ప్రక్షాళన తదితరాలు, జన్‌ధన్, పెద్దనోట్ల రద్దు కార్యక్రమాల్లో ఏ ఒక్కటీ ఆయన హామీని అమలు చేయడానికి ఉద్దేశించినది కాదు. పైగా గత 45 ఏళ్లుగా కొనసాగుతున్న ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులకు మంగళం పాడారు. ఈ నిధుల కేటాయింపు, వినియోగం, పర్యవేక్షణలకు చట్టబద్ధత కల్పించాలని గత పదేళ్లుగా చేస్తున్న డిమాండ్‌ను కేంద్రం పట్టించుకోవడం లేదు. ఈ ఏడాది రాష్ట్రాలకు అందించాల్సిన పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లలో కోత పెట్టారు. విశ్వ విద్యాలయాల్లో చదువుకునే స్కాలర్ల ఫెలోషిప్‌లను గణనీయంగా తగ్గిం చారు. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులను బాగా తగ్గించారు. ఇది వాస్తవ పరిస్థితి.




దళిత, ఆదివాసుల అభివృద్ధి ప్రధానంగా విద్య, ఉపాధి రంగాలతో ముడిపడినది. అలాగే ఆర్థిక సహాయక, స్వయం ఉపాధి కార్యక్రమాల మీద ఆధారపడి ఉంటుంది. అటువంటి పథకాలేవీ కొత్తగా ప్రారంభించిన దాఖ లాలు లేవు. పైగా విశ్వవిద్యాలయాల్లో దళిత ఆదివాసీ, మహిళ, మైనారిటీ విద్యార్థులపై వేధింపులు పెరిగిపోయాయి. రోహిత్‌ వేముల బలిదానం అందులో భాగమే. గత రెండేళ్లకు పైగా దేశంలోని వివిధ జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాల్లో దళితులు, ఆదివాసీ విద్యార్థులు చేస్తున్న ఆందోళనలను ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం చేస్తోందనే విమర్శలున్నాయి.




అంతేకాదు భారీ ప్రాజెక్టుల పేరిట దేశంలోని చాలా ప్రాంతాల్లో షెడ్యూల్డ్‌ కులాలు, తెగలను నిర్వాసితులను చేస్తున్నారు. వారి భూముల నుంచి, వారి సంస్కృతి నుంచి, వారి అడవులను నుంచి దూరంగా విసి రేస్తున్నారు. ముఖ్యంగా ఆదివాసీలు చివరకు అన్నీ కోల్పోయి నిరాశ్రయు లుగా మారుతున్నారు. కొన్ని జాతులు, తెగలు ఉనికినే కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ఎంపిక చేసిన రామ్‌నాథ్‌ కోవింద్‌ కోల్‌ అనే కులానికి చెందినవారు. యూపీలో ఎక్కువగా ఉండే ఆ కులం నేతపని మీద ఆధారపడినది. ఆ కులం ఈ రోజు ఆ వృత్తిని కోల్పోయి వ్యవసాయ కూలీలుగా మారారు. అటువంటి కులాల మనుగడ గురించి ఆలోచించాలి. రామ్‌నాథ్‌ కోవింద్‌ను రాష్ట్రపతిని చేయడంతో సరిపెట్టుకోకుండా దళితులకు అభద్రత, వెనకబాటుతనం, వివక్ష, దోపిడీల నుంచి విముక్తి కలిగించాలి. అదేనిజమైన దళిత అభివృద్ధి అవుతుంది. అంతేగానీ, కొద్దిమందికి పదవులి వ్వడం దళితుల అభివృద్ధికి తార్కాణంగా నిలవదని ఏలినవారు అర్థం చేసుకోవాలి.



- మల్లెపల్లి లక్ష్మయ్య


వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు


 మొబైల్ : 97055 66213

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top