‘సమాధాన్‌’ కాదు ఫాసిస్టు దూకుడు!

‘సమాధాన్‌’ కాదు ఫాసిస్టు దూకుడు! - Sakshi


ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా ప్రాంతంలో మావోయిస్టులు పారామిలటరీ బలగాలపై జరిపిన దాడి తరువాత మే 7న కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఆయా రాష్ట్రాల సీఎంలు, హోం మంత్రులు, డీజీపీల భేటీ ఏర్పర్చారు. ఈ భేటీలో ‘ప్రతి అంశంలోను దూకుడుగా వెళ్లాలని’ రాష్ట్ర ప్రభుత్వాలకు పిలుపు ఇచ్చారు. ‘చాలా జాగ్రత్తగా ఉండడం’, ‘రక్షణాత్మక ధోరణిలో వ్యవహరించడం’ అన్నది అంతిమంగా ‘ఎదురుదాడి సామర్థ్యాన్ని కుంగదీస్తున్న’ విషయాన్ని గుర్తించాలి’ అని చెప్పారు.


ఈ ప్రకటనలోని ‘దూకుడు’ (అఫెన్స్‌) అనే పదం కేవలం మిలటరీ రంగానికే పరిమితమైనది కాదు. దానితో పాటు ప్రధానంగా భావజాల రంగానికి కూడా వర్తిస్తుంది. ఇప్పటికే కాషాయ సేవ ఈ దాడి ప్రారంభించింది. రాజ్యాంగయంత్రం నుంచి కూడా ఈ దాడి ప్రారంభమైంది. ఈ దాడిలో భాగంగానే ‘మావోయిస్టుల కన్నా మావోయిజం ప్రచారం చేõ¯ వాళ్లే ప్రమాదకరం అనే’ ప్రకటన వెలువడింది. ఈ మధ్య ఒక టీవీ చానల్‌లో హరగోపాల్‌తో చర్చలో పాల్గొన్న ఒక పోలీసు అధికారి ‘మావోయిస్టుల కన్నా పౌరహక్కుల సంఘాల వాళ్లే ప్రమాదకరమ’ని మాట్లాడడం గమనించవచ్చు.



ఈ దాడి కేవలం మావోయిజంపైనే కాదు. మొత్తంగా ప్రగతిశీల భావాలపైనే, చివరకు లిబరల్‌ డెమోక్రసీ ఆలోచనలపై కూడా దాడి ప్రారంభమైంది. బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ రచనల్లో ఈ విషయాలు స్పష్టంగా స్పష్టమవుతున్నాయి. మావోయిస్టు పార్టీ నేతృత్వంలో జరుగుతున్న ప్రజాయుద్ధం పోరాడుతున్న ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గంగా క్రమక్రమంగా పెరుగుతున్నది. ఈ పరిస్థితిని వాళ్లు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిగా భావిస్తున్నారు. దీన్ని మన్మోహన్‌ సింగ్‌ ముందుగానే గుర్తించి మావోయిస్టు పార్టీ దేశ (పాలకవర్గాల) అంతర్గత భద్రతకు అత్యంత ప్రమాదకారి అని ప్రకటించాడు. ప్రస్తు తం మోదీ అండ్‌ కో కూడా ప్రజాయుద్ధ ప్రమాదాన్ని తీవ్రంగా భావిస్తున్నది. రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడిన ‘అఫెన్స్‌’ను ఈ కోణంలోంచే అర్థం చేసుకోవాలి. అఫెన్స్‌ చేయడం అంటే వాళ్లు రూపొందించుకున్న రాజ్యాంగాన్ని, చట్టాలను కూడా అవతల పడేసి,ఫాసిజాన్ని అమలు చేయడం అనే. ఇందుకు అనుగుణంగా వాళ్లు భావజాల రంగంలో ఫాసిస్టు శక్తులను (మేధావులు, యువతను) సంఘటిత పరుస్తున్నారు. అయితే రాబోయే ఎన్నికలను (పార్లమెంట్‌ ఎన్నికలు) దృష్టిలో పెట్టుకొని కొంత సంయమనాన్ని పాటిస్తున్నట్లుగా నటిస్తున్నారు. అయితే తీవ్రతరం అవుతున్న వర్గయుద్ధం వాళ్ల అంతరంగాన్ని బయటపెడుతున్నది.



పై పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రజాస్వామ్య శక్తులు రంగంలోకి దిగాల్సి ఉన్నది. ప్రజలను ఎవరు గెలుచుకోగలిగితే వాళ్లు యుద్ధంలో గెలుస్తారనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలను గెలుచుకునేందుకు విప్లవ, ప్రజాస్వామిక శక్తులు కలిసి పోటీపడాలి. గతంలో కొంతమేరకు కుదేలైన బ్రాహ్మణవాద శక్తులు నేడు మోదీ పాలనలో దేశ వ్యాపితంగా సంఘటితపడి విప్లవ, పురోగామి భావాలపైన, శ్రామిక సంస్కృతిపైన దూకుడుగా దాడి చేస్తూ ప్రజలను పక్కదారి పట్టించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో విప్లవ, ప్రజాస్వామ్య శక్తులు రాజ్య నిర్బంధాన్ని ఎదుర్కొంటూ ప్రజలలో సిద్ధాంత, రాజకీయ కృషిని వేగిరపరచాలి. హిందూ ఫాసిజానికి, రాజ్య నిర్బంధానికి వ్యతిరేకంగా కలిసివచ్చే శక్తులన్నింటినీ కలుపుకొని పోరాడాలి.



              – జగబంధు, సీపీఐ ఎం–ఎల్‌ (మావోయిస్టు) పార్టీ

                   అధికార ప్రతినిధి






 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top