మొదట ఈ నరుడు వానరుడు!

మొదట ఈ నరుడు వానరుడు!


అక్షర తూణీరం: విశ్వవిజేత అలెగ్జాండర్ ఏం కావాలని అడిగితే ‘తమరు పక్కకు తప్పుకుంటే సూర్యనమస్కారాలు చేసుకుంటాను’ అన్న నాటి రుషి లాగా నేడు తెలుగు ప్రజలు నగరాలు, నజరానాలు వద్దు,  మమ్మల్నిలా వదిలేయమంటున్నారు.

 

 ఒకరు సింగపూర్ అంటారు. ఇంకొకరు ఇస్తాంబుల్ అంటారు. ఒకాయన వాటికన్ అన్నాడు. ఇంకొకాయన మక్కా, ఇది పక్కా అన్నాడు. ఒకరు రాష్ట్రానికి సంస్కృతం లో స్వర్ణ విశేషం తగిలిస్తే మరొకరు తెలుగులో బంగారు శబ్దం జోడించారు. ఆకాశహర్మ్యాలంటున్నాడొ కాయన. ఆ విధంగా అండర్‌గ్రౌండ్‌లో ముందుకు పోతాం. పాతాళలోకం తలుపులు తీస్తాం, తాళం నా దగ్గర ఉందటున్నాడొకాయన. ఇక పనిలేని వర్గం పవరున్న వారితో ఆడుకుంటూ ఉంది.

 

  ‘‘ఏది స్విస్ డబ్బు? ఎక్కడ రుణమాఫీ? మోదీ నిజంగా గాంధే యవాదే అయితే స్వచ్ఛ భారత్ కాదు, సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుచెయ్యాలి. సవాల్ విసు రుతున్నాం’’ అంటూ జనాన్ని ఆకట్టే ప్రయత్నంలో ఉన్నారు. పవర్‌లో లేనివారు ఎప్పుడూ ఎక్స్‌గ్రేషి యాలు ఉదారంగానే ప్రకటిస్తారు. సీటు దిగిపో యాక ఆదర్శాలకు పదును పెడతారు. ప్రజల చేత నిర్ద్వంద్వంగా తిరస్కరింపబడిన నేతలు కనీసం ఒక ఏడాది పాటు వార్తల్లోకి వచ్చే ప్రయత్నం చేయరా దని రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం ఉంది- అని ఓటర్లంటున్నారు.

 

 ఏమిటీ రాజ్యం ఇట్లా అఘోరించిందంటే, ముందటి పాలకుల అవినీతి అసమర్థ పాలన కార ణమంటారు. ముందటి పాలకులను నిలదీస్తే బ్రిటిష్ వలస సామ్రాజ్యవాద పాలనలో పీల్చి పిప్పి చేయబడ్డ రాజ్యాన్ని ఇంతకంటే ఉద్ధరించలేకపోయా మంటారు. సందర్భం దొరికి బ్రిటిష్ పాలకుల్ని అడిగితే, అసలు లోపం మహమ్మదీయ పాలనలోనే ఉందని గతం మీదకి తప్పుతోస్తారు. నడం నొప్పిగా ఉందని పేరు మోసిన డాక్టర్ దగ్గరకు వెళితే ‘‘ఉం టుందండీ! సహజం. మనిషి మొదట చతుష్పాది కదా! క్రమంగా రెండుకాళ్ల మీద నడవడం ఆరంభిం చాడు. అంచేత నడుంనొప్పి... నేచురల్లీ’’ అన్నాడు. ఆ మాటలు విన్నాక ఎవడికైనా అగ్గెత్తుకు రాదూ!

 

 జపాన్ టెక్నాలజీలో మన వాస్తుని మిళాయించి కేపిటల్ నిర్మాణమై వస్తుంది. అదొక అద్భుతం. ఇదిగో ఆ మూల ప్రపంచంలో ఎత్తై మహా శిఖరం వస్తోంది. అదసలు కేవలం వాస్తుకోసమే ఆవిర్భవి స్తోంది. మీరే చూస్తారు! ఇవన్నీ వింటుంటే నాకు ‘అలెగ్జాండర్-మహర్షి’ కథ గుర్తుకొస్తోంది. అలెగ్జాం డర్ మనదేశాన్ని జయించాక, ఇక్కడ తపస్సంపన్ను లైన రుషులుంటారని విని ఒక వేకువజామున బయ లుదేరి అడవిలోకి వెళ్లాడు.

 

 మర్యాదగా ఆశ్రమం బయటే గుర్రాన్ని వదలి, శిరస్త్రాణంతీసి లోనికి వెళ్లా డు. అప్పుడే స్నానాదికాలు పూర్తి చేసుకుని అంగో స్త్రంతో బయటకు వస్తున్న రుషి కనిపించాడు. నమ స్కరించి, ‘‘నన్ను అలెగ్జాండరంటారు. విశ్వ విజే తని. తమర్ని దర్శించవచ్చాను. చెప్పండి, మీకేం కావాలో! వజ్ర వైఢూర్యాలా, బంగారు గనులా, వెం డికొండలా, గోవులా... చెప్పండి! అన్నాడు. మహర్షి మాటా పలుకూ లేక మౌనంగా చూస్తూ నిలబడ్డాడు. ‘‘సందేహించకండి! అన్నింటినీ ఇమ్మన్నా ఇస్తాడీ గ్రీకువీరుడు. మీకేం కావాలి?’’ అన్నాడు. నోరు విప్పాడు రుషి, ఎట్టకేలకు- ‘‘తమరు కాస్త పక్కకు తప్పుకుంటే నాకు ఎండపొడ తగుల్తుంది.

 

 నేను సూర్యనమస్కారాలు చేసుకుంటాను. తమరా మేలు చేస్తే చాలు’’ అన్నాడు రుషి. ప్రస్తుతం తెలుగు ప్రజ రుషిలా అల్ప సంతోషులుగా ఆలోచిస్తున్నారు. నగ రాలూ వద్దు, నజరానాలూ వద్దంటున్నారు. ఆడలేక మద్దెలని ఓడు చెయ్యద్దంటున్నారు. అవినీతిని అరి కట్టడానికి పెట్టుబడులు అక్కర్లేదు కదా అని అడుగు తున్నారు.



రోజు వారీ పాలనలో పొదుపుకీ సమయ పాలనకీ క్రమశిక్షణకీ జవాబుదారీతనానికీ బడ్జెట్‌లో కేటాయింపులు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు ప్రజారుషులు. ఆధునిక వాహనాలను దింపితే సరి పోదు అందులో కూచునే పోలీసు అధికారుల నైజం మారాలంటున్నారు. దీన్ని న్యూయార్క్ సిటీని చేస్తే మన సిటీయే గొప్పదవుతుందన్నాడొక సిటిజనుడు. అదెట్లా అన్నాను, అర్థంకాక. ‘‘మూడు లక్షల ఇరవై వేల వీధికుక్కలు మన సిటీకి ఎగస్ట్రా..’’ అన్నాడు గర్వంగా. అవును, మొదట ఈ నరుడు వానరుడు.

 (వ్యాసకర్త ప్రముఖ కథా రచయిత)

 - శ్రీరమణ

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top