ఇది ‘ప్రత్యేక’పలాయనం

ఇది ‘ప్రత్యేక’పలాయనం - Sakshi


ఒక్క రక్తం బొట్టు కూడా లేని ఆకుపచ్చ తెలంగాణ నా లక్ష్యం అని ఉద్యమ చంద్రశేఖర్‌రావు ఉపన్యాసాలు ఇస్తుంటే,  రాష్ర్టం విడిపోయినంత మాత్రాన రాజ్య స్వభావం మారుతుందా అని తలలు పండిన మావో వాద మేధావులు ఆనాడు సందేహించినట్టు లేరు. రాబోయే రోజుల్లో తన అధికారాన్ని ఎదిరించే ఏ వ్యవస్థా ఉండకూడదన్న దూరాలోచన (లేదా దురాలోచన)తో సమరశీల పోరాటాలకు పెట్టింది పేరయిన బుద్ధిజీవుల సంఘాలను ఆయన చీల్చ చూసినప్పుడు అదే వేదికలు పంచుకుని వత్తాసు పలికిన వారు కూడా ఈ మావో వాద మేధావుల్లో ఉన్నారు.

 

 ‘ప్రతిపక్షాలు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు శాసనసభ సమావేశాలు నిర్వహించుకుందాం. అవసరమనుకుంటే రాత్రంతా కూర్చుందాం. ప్రజా సమస్యల మీద చర్చించడానికి మాకు అభ్యంతరం లేదు’ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటనను అందరూ ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాదిరిగా కాకుండా తెలంగాణ శాసనసభ ప్రజాసమస్యల మీద సమయం వెచ్చిస్తుందని సంతోషించారు. అన్నట్టుగానే శాసనసభ సమావేశాలు సెప్టెంబర్ 23న ప్రారంభమై, అక్టోబర్ 9న ముగియనున్నాయి. లెక్కకు పదిహేను రోజులన్న మాటే కానీ, వినాయక నిమజ్జనం, బక్రీద్ పండుగ, శని, ఆదివారాల సెలవులు  మినహాయిస్తే ఏడెనిమిది రోజులకు మించి సభ జరగడం లేదు. ఐదురోజుల ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల కంటే మెరుగే కదా అని సంతృప్తి పడొచ్చు, తప్పు లేదు. అయితే సభ ఎన్ని రోజులు జరిగింది అన్నది ముఖ్యం కాదు. సభలో ఏం జరిగింది అన్నది ప్రధానం. ప్రజాస్వామ్యంలో శాసనసభను మించిన వేదిక ఇంకొకటి ఉండదు ప్రజా సమస్యలను గురించి మాట్లాడటానికి, పరిష్కారాలు కనుగొనడానికి, నిర్ణయాలు తీసుకోడానికి.

 

 అందుకోసం సభలో అధికారపక్షంతో బాటు ప్రతిపక్షం కూడా ఉండాలి. అప్పుడే ప్రజా సమస్యల మీద అర్థవంతమయిన చర్చ జరిగి మంచి పరిష్కారాలు జరిగే అవకాశం ఉంటుంది. అయితే మన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ ప్రతిపక్షం పొడ అంటేనే పడటం లేదు.  ఇద్దరు ముఖ్యమంత్రులకూ ప్రతిపక్షాలన్నీ దిక్కుమాలినవీ, పనికిమాలినవిగా కనిపిస్తాయి. వ్యతిరేక స్వరం వినిపించడానికే వీలులేదు. అదే ధోరణిలో తెలంగాణ  అసెంబ్లీ సమావేశాలు సాగుతున్నాయి. ‘ఎన్ని రోజులయినా చర్చిద్దాం!’ అన్న తెలంగాణ సర్కార్ శాసనసభ నడుపుతున్న తీరు అందరూ ముక్కున వేలేసుకునే విధంగా ఉన్నది. గత 70 ఏళ్ల కాలంలో జరిగిన అత్యంత కీలక ఘట్టాలను శాసనసభ ఉమ్మడి రాష్ర్టంలో చూసి ఉంటుంది. హేమాహేమీలు ఈ సభలో తమ వాగ్ధాటితో, విషయ పరిజ్ఞానంతో ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తెచ్చిన వైనం, వాటి పరిష్కారాలు సాధించిన సందర్భాలు అనేకం. సభ ప్రారంభం అయిన ఏడు నిమిషాలకే మూడు రోజులు సభ వాయిదా వేసుకుని వెళ్లిపోయిన సంఘటన బహుశా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలోనే కాదు దేశంలో ఎక్కడా ఏ చట్ట సభలోనూ  జరిగి ఉండదు.

 

 బాధాకర పరిణామం

 ప్రతిపక్షాల దాడిని ఎదుర్కోలేక ఇంత బాహాటంగా తన బలహీనతను బయట పెట్టుకున్న సర్కార్- వీరోచిత పోరాటాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్ట మొట్టమొదటి సర్కార్ కావడం బాధాకరం. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తరువాత కూడా రైతు ఆత్మహత్యలు కొనసాగడం మీద రెండురోజుల పాటు శాసనసభలో సుదీర్ఘ చర్చ జరగడం ఆహ్వానించదగ్గదే. కానీ సంతృప్తి చెందని ప్రతిపక్షాలు రుణమాఫీ బకాయిల మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తామని ప్రకటించి, రైతుకు ఆత్మవిశ్వాసం కల్పించాలని కోరినందుకు ఏడు నిమిషాలలో సభ వాయిదా వేసుకుని వెళ్లిపోవడం విడ్డూరం. అందుకు కావలసిన నిధులు మీరు కేంద్రం నుంచి ఇప్పిస్తారా అని ఒక సీనియర్ మంత్రి శాసనసభ వేదిక సాక్షిగానే ప్రతిపక్షాన్ని అడిగారంటే సమస్య తీవ్రతను ఎంత చులకన చేస్త్తున్నారో అర్థం అవుతుంది. మరో సీనియర్ పాత్రికేయుడు, ఆయనకు బోలెడంత సామాజిక స్పృహ, చైతన్యం ఉన్నాయని పేరు. నిధులు ఎక్కడి నుంచి తేవాలో చెప్పండి అని ప్రతిపక్షాలను ప్రశ్నిస్తాడు, ఒక తెలంగాణ పత్రికకు రాసిన వ్యాసంలో. డబ్బులు ఎక్కడి నుంచి తెస్తామనుకుని ఎన్నికల సమయంలో లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేశారని ప్రభుత్వంలో ఉన్న పార్టీని మాత్రం ఆయన నిలదీయరు.

 

 ఎన్నికల వాగ్దానాలు ప్రతిపక్షాలను అడిగి, వారి భరోసాతోనే చేసిందా తెలంగాణ రాష్ర్ట సమితి? ఏడు నిమిషాలలో సభను వాయిదా వేసుకుని పోయిన అధికారపక్షం మూడు రోజుల తరువాత సమావేశమై, మళ్లీ కొన్ని నిమిషాలలోనే ప్రతిపక్షాలన్నిటినీ సభ నుంచి మొత్తం సమావేశాల కాలానికి సస్పెండ్ చేసి బయటికి నెట్టేసింది. సభ ఎన్ని రోజులయినా జరుపుకుందాం, ఎన్ని గంటలయినా చర్చిద్దాం అన్న మాటకు అర్థం ఇదన్న మాట. తెలంగాణ రాష్ర్టంలో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు శాసనసభ నుంచి నెట్టేస్తే ప్రతిపక్షాలు జనంలోకి వెళ్లి తమ పద్ధతుల్లో, తాము రైతు సమస్యలు సమాజం దృష్టికి తెచ్చే పనిలో పడ్డాయి. ఇది శాసనసభలో తమకు ఎదురులేకుండా చేసుకున్న విజయం అయితే కావచ్చు ప్రభుత్వానికి. కానీ ప్రజాక్షేత్రంలో ఎంత అప్రతిష్ట పాలవుతారో ఆలోచిస్తున్నట్టు లేరు.

 

విద్యార్థుల ఆత్మహత్యలు పట్టవేం?

రైతు రుణమాఫీతో బాటు కేజీ నుండి పీజీ దాకా ఉచిత నిర్బంధ విద్య తెలంగాణ రాష్ర్టంలో నిజం చేయబోతున్నామని ఎన్నికల సమయంలో మరో వాగ్దానం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక వరంగల్, కరీంనగర్ జిల్లాలో ఇద్దరు పేద విద్యార్థులు ఫీజులు కట్టలేక, విద్యా సంస్థల యాజమాన్యాలు అవమానిస్తే భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. విద్యాశాఖ మంత్రి శాసనసభలో కనీసం ప్రకటన చెయ్యడు. ఉద్యమకాలంలో, ఎన్నికల ప్రచార సమయంలో టీఆర్‌ఎస్ అధినేత, ప్రస్త్తుత ముఖ్యమంత్రి పదే పదే చెప్పారు. తెలంగాణ రాష్ర్టం వచ్చిన తరువాత ఎవరి ఇళ్లలోనూ పిల్లలు ఉండరు, వారందరినీ నిర్బంధంగానయినా సరే తీసుకుపోయి కేజీ నుండి పీజీ వరకు చదివిచ్చాకనే ఇళ్లకు తిరిగి పంపుతాం అని. అందుకు అవసరం అయితే పోలీసుల సాయం కూడా తీసుకుంటామని ఒక సందర్భంలో చెప్పారు. అది సాధ్యమా కాదా అన్న విషయం పక్కన పెడదాం. కనీసం పేద విద్యార్థులకు భరోసా కలిగించే చర్యలయినా ప్రారంభించగలిగారా ఈ పదిహేను మాసాలలో? కార్పొరేట్ విద్యా సంస్థల కబంధహస్తాల్లో చిక్కి విలవిలలాడు తున్న విద్యార్థులూ, వారి తల్లిదండ్రులను వారి ఖర్మానికి వదిలేస్తున్నాయి రెండు తెలుగు ప్రభుత్వాలు. ఆంధ్రప్రదేశ్‌లో అటువంటి ఒక కార్పొరేట్ యజమాని ఏకంగా మంత్రివర్గంలోనే తిష్ట వేస్తే, తెలంగాణలో ప్రైవేటు విద్యావ్యవస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి చుట్టూ ఉంటారు.

 

ఎన్‌కౌంటర్ల మీద విపరీత వ్యాఖ్యలు

 నక్సలైట్ల సిద్ధాంతమే మాది కూడా అన్న ఉద్యమ చంద్రశేఖర్‌రావు ముఖ్య మంత్రి అయ్యాక ఇద్దరు విద్యావంతులయిన యువ నక్సలైట్లు ఆయన రాజ్యంలో బూటకపు ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. అందులో ఒక ఆడపిల్ల కూడా ఉంది. ఆ అమ్మాయిని శారీరకంగా హింసించి చంపారు. దీని మీద ముఖ్యమంత్రి పెదవి విప్పరు. ఒక్క రక్తం బొట్టు కూడా లేని ఆకుపచ్చ తెలంగాణ నా లక్ష్యం అని ఉద్యమ చంద్రశేఖర్‌రావు ఉపన్యాసాలు ఇస్తుంటే ఆనాడు రాష్ర్టం విడిపోయినంత మాత్రాన రాజ్య స్వభావం మారుతుందా అని తలలు పండిన మావో వాద మేధావులు సందేహించినట్టు లేరు. రాబోయే రోజుల్లో తన అధికారాన్ని ఎదిరించే ఏ వ్యవస్థా ఉండకూడదన్న దూరాలోచన (లేదా దురాలోచన)తో సమరశీల పోరాటాలకు పెట్టింది పేరయిన బుద్ధిజీవుల సంఘాలను ఆయన చీల్చ చూసినప్పుడు అదే వేదికలు పంచుకుని వత్తాసు పలికిన వారు కూడా ఈ మావో వాద మేధావుల్లో ఉన్నారు. వరంగల్ ఎన్‌కౌంటర్ మీద కనీసం విచారం వ్యక్తం చెయ్యక పోగా మంత్రులు, అధికారపక్ష నేతలు విపరీత వ్యాఖ్యానాలు చేశారు. స్వయానా ముఖ్యమంత్రి కుమార్తె, పార్లమెంటు సభ్యురాలు ఈ విషయం ముఖ్య మంత్రి దృష్టికి తీసుకుపోతానంటే, ఆమె సోదరుడు, రాష్ర్ట మంత్రి అది పోలీసుల విధి నిర్వహణలో భాగంగా జరిగిందంటాడు.

 

ఆ ఎన్‌కౌంటర్ జరిగినప్పుడు ముఖ్యమంత్రి చైనా పర్యటనలో ఉన్నారు, ఆయనకు సమాచారం కూడా లేదు అని మరో ముఖ్యుడు సమర్థించుకోజూస్తాడు. మన పోలీసు వ్యవస్థ ఆత్మస్థయిర్యం దెబ్బతినకుండా ప్రభువులు చాలా జాగ్రత్త పడతారన్న మాట నిజమే కానీ, వారికే సమాచారం లేకుండా పోలీసులు సర్వ స్వతంత్రులుగా వ్యవహరిస్తారంటే ఎలా నమ్మడం? నమ్మకపోవడానికి కారణాలున్నాయి. గతంలో ఎన్‌కౌంటర్‌లు ఉండవు అని ముఖ్యమంత్రులు ప్రకటించిన ప్రతిసారీ అవి తాత్కాలికంగానే అయినా ఆగాయి కనుక. వరంగల్ ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా చలో అసెంబ్లీ పిలుపు ఇచ్చిన ప్రతి పక్షాలను, ప్రజా సంఘాలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిన ప్రభుత్వం సభలో అయినా ఒక ప్రకటన విడుదల చేసే సంప్రదాయాన్ని పాటించలేదు. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయిస్తూ కూర్చున్నట్టుగా ఉంది మన సర్కార్ వైఖరి.

 datelinehyderabad@gmail.com

 - దేవులపల్లి అమర్

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top