వ్యక్తిగత స్వేచ్ఛకు కొత్త రెక్కలు

వ్యక్తిగత స్వేచ్ఛకు కొత్త రెక్కలు - Sakshi


కొత్త కోణం

కొంతకాలంగా ప్రజల ఆహారపుటలవాట్లు, మత స్వేచ్ఛ, నివాస స్వేచ్ఛ, వనరులను కలిగి ఉండే స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛలపై జరుగుతున్న దాడులకు పరోక్షంగా సుప్రీంకోర్టు  సమాధానమిచ్చింది. గోసంరక్షణ పేరుతో ఇతర వర్గాలపై దాడులకు తెగబడటం, తమకు నచ్చని ఆహారాన్ని తింటున్న వారిపై హత్యాకాండకు పాల్పడటం చూస్తున్నాం. స్వేచ్ఛగా చర్మవృత్తి చేసుకొంటున్న వారిపైనా, గోమాంసాన్ని విక్రయిస్తున్న వారిపైనా దాడులు చేయడం రాజ్యాంగాన్ని ధిక్కరించడమేనన్న సందేశాన్ని సుప్రీం కోర్టు ధర్మాసనం ఇచ్చింది.



‘వాస్తవానికి ప్రజాభిప్రాయాల వ్యక్తీకరణకు ప్రతిబింబమే ప్రభుత్వాలు. మన వెనుక ఉన్న ప్రజల శక్తే మనందరినీ ఇక్కడ సమావేశపరిచింది. మనం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలే కానీ పార్టీల, వర్గాల రాజకీయాల కోసం కాదు. ప్రజల మనసుల్లో ఏమి ఉందో గ్రహించి, వాటికనుగుణంగా పనిచేయాలి.’భారత రాజ్యాంగ సభ ప్రారంభ సమావేశంలో 1946, డిసెంబర్‌ 13వ తేదీన పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ ప్రవేశపెట్టిన లక్ష్య ప్రకటనలోని వాక్యాలివి. రాజ్యాంగ సభ ప్రారంభమైన నాలుగవ రోజునే నెహ్రూ చేసిన ప్రసంగం దేశ భవిష్యత్‌ చిత్రాన్ని నిర్దేశించింది. ఇటీవల భారత సుప్రీంకోర్టు వ్యక్తిగత స్వేచ్ఛపైన ఇచ్చిన తీర్పుకు జవం, జీవం ఎక్కడో లేదు. రాజ్యాంగ సభ అందించిన అపారమైన, లోతైన ఆ అవగాహనే ఆ తీర్పుకు పునాది. రాజ్యాంగ సభ దాదాపు మూడేళ్ల పాటు సుదీర్ఘంగా జరిపిన వివేకవంతమైన చర్చలే ఈరోజు ప్రజలకు హక్కులుగా సంక్రమించాయి.



రాజ్యాంగమే సర్వోన్నతం

సుప్రీంకోర్టు గత గురువారం వెలువరించిన తీర్పులో రాజ్యాంగం విశిష్టతను ధర్మాసనం సమున్నతంగా అభివర్ణించింది. భారత రాజ్యాంగం సజీవమైన, శక్తిమంతమైన కలకాలం చరిత్రలో నిలువగలిగే గొప్ప గ్రంథమని కూడా కొనియాడింది. నెహ్రూ ప్రతిపాదించిన తీర్మానం మొదలుకొని, రాజ్యాంగం సంపూర్ణ పాఠాన్ని సభకు అందించే వరకు జరిగిన చర్చలే ఇప్పటికీ భారత ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుతున్నాయి. రాజ్యాంగ సారాన్ని గమనిస్తే ప్రజల జీవనం, సంక్షేమం, భద్రత, ప్రగతి లాంటి అంశాలపైనే ఎక్కువగా చర్చ జరిగిన సంగతి అర్థమవుతుంది.



రాజ్యాంగ సభ ప్రారంభంలో నెహ్రూ ప్రతిపాదించిన తీర్మానంలోనే ‘అణగారిన, వెనుకబడిన కులాలు, ఆదివాసులు, మైనారిటీల రక్షణకు రాజ్యాంగంలో హక్కులు పొందుపరుస్తాం.’అని హామీ ఇచ్చారు. దేశ ప్రజలకు సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయాన్ని అందించడం, అందరికీ సమాన అవకాశాలు, సమాన హోదాతో పాటు చట్టం ముందు అందరూ సమానులేనని, రాజ్యాంగంలో అవకాశాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. భావ ప్రకటన, మత, ఉద్యోగ, నివాసం, సంఘం పెట్టుకునే స్వేచ్ఛను కల్పించాలని కూడా స్పష్టం చేశారు. ఆ తీర్మానం వెలుగులోనే బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ సారథ్యంలో భారత రాజ్యాంగం రూపుదిద్దుకున్నది. రాజ్యాంగంలోని ప్రకరణాలలో మూడు, నాలుగు భాగాలు ముఖ్యమైనవి. మూడోభాగం లో ప్రాథమిక హక్కులను, నాలుగో భాగంలో ఆదేశిక సూత్రాలను చేర్చారు.



చర్చంతా ఆర్టికల్‌ 21 పైనే

ఆధార్‌ అంశం మీద సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు సాంకేతికంగా ఆ‡కార్డు వినియోగం విషయమే అయినప్పటికీ, చర్చంతా ప్రధానంగా రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21పైన జరిగింది. ఈ ఆర్టికల్‌ వ్యక్తిగత స్వేచ్ఛ, ఆత్మగౌరవంతో జీవించే హక్కులకు హామీ ఇస్తున్నది. ఏ ఒక్క వ్యక్తి స్వేచ్ఛనైనా ప్రభుత్వం హరించదలుచుకుంటే చట్టపరమైన అన్ని సంప్రదాయాలు పాటించాల్సి ఉంటుందని ఆ ఆర్టికల్‌ స్పçష్టం చేసింది. ఈ ఆర్టికల్‌ పైన రాజ్యాంగ సభలో జరిగిన చర్చను గమనిస్తే వ్యక్తి స్వేచ్ఛ, ఆత్మగౌరవంతో జీవించే హక్కుల గురించి నాటి న్యాయ నిపుణులు ఎంతటి శ్రద్ధ వహించారో అర్థం చేసుకోవచ్చు. 1948 డిసెంబర్‌ 6, 13 తేదీల్లో రాజ్యాంగ సభలో జరిగిన సుదీర్ఘమైన చర్చ ప్రతిఫలమే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుగా భావించవచ్చు. ఈ చర్చలో సెంట్రల్‌ ప్రావిన్స్‌ నుంచి కాజీ సయ్యద్‌ కరీముద్దీన్, మద్రాస్‌ నుంచి మహబూబ్‌ అలీబేగ్‌ సాహెబ్‌ బహద్దూర్, పంజాబ్‌ నుంచి పండిట్‌ ఠాకూర్‌దాస్‌ భార్గవ, సౌరాష్ట్ర నుంచి చిమన్‌లాల్‌ చిక్కూ బాయ్‌షా, యునైటెడ్‌ ప్రావిన్సెస్‌ నుంచి శ్రీకృష్ణచంద్ర శర్మ, బొంబాయి నుంచి హెచ్‌వి పటాస్కర్, కె.యం. మున్షీ, అల్లాడి కృష్ణ స్వామి అయ్యర్, జడ్‌హెచ్‌ లారి, డాక్టర్‌ బీఆర్‌. అంబేడ్కర్‌ పాల్గొన్నారు.



ముఖ్యంగా ఈ చర్చలో ప్రభుత్వాలు ప్రజల స్వేచ్ఛకు సంబంధించి వ్యవహరించే తీరుపైన అనుమానాలను వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడానికి ప్రజలకు ఎన్నో హామీలను, వాగ్దానాలను ఇస్తూ ఉంటాయనీ, ఆచరణలో విఫలమైనప్పుడు ప్రజల్లో చెలరేగే నిరసనలను అణచిపెట్టడానికి ప్రజల స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేస్తుంటారనీ, అందువల్ల రాజ్యాంగంలో వ్యక్తిస్వేచ్ఛకు జీవన భద్రతకు స్పష్టమైన గ్యారంటీ ఉండాలనీ రాజ్యాంగ సభ సభ్యులు సుస్పష్టంగా మాట్లాడారు. ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మీద ప్రజల హక్కులు ఆధారపడి ఉండకూడదని, అది ఎప్పటికైనా వ్యక్తి స్వేచ్ఛకు ప్రమాదకరమేనని ఆనాడే న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై డాక్టర్‌ అంబేడ్కర్‌ సమాధానమిస్తూ ప్రభుత్వాలు ఏ విధానాలు అవలంభించినా చట్టసభల్లో శాసనాలు చేసినా వాటిని సమీక్షించే బాధ్యత, ప్రభుత్వాల పనితీరు రాజ్యాంగం నిర్దేశించిన ప్రాథమిక విలువలకు అనుగుణంగా ఉందా లేదా అని తేల్చే అధికారం న్యాయస్థానాలకు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వాలు తమ తమ రాజకీయ ప్రయోజనాల కోసం కొన్నిసార్లు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక సూత్రాలను మర్చి పోయి ప్రవర్తిస్తున్నప్పుడు వారిని అదుపుచేసే అధికారం న్యాయస్థానాలకు ఉండాలని కూడా అంబేడ్కర్‌ పేర్కొన్నారు. రాజ్యాంగం అందించే విలువలు ప్రభుత్వ పాలనలో భాగంగా ఉన్నాయా, లేవా అనే అంశాన్ని కూడా న్యాయస్థానాలు నిత్యం పరిశీలించాలని కూడా అంబేడ్కర్‌ స్పష్టం చేశారు.



వ్యక్తి స్వేచ్ఛకే పెద్ద పీట

వ్యక్తి స్వేచ్ఛకూ, సామాజిక ప్రయోజనానికీ మధ్య ఘర్షణ తలెత్తినప్పుడు వ్యక్తిస్వేచ్ఛ ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. సమాజానికి ప్రాధాన్యం పెరిగి, వ్యక్తి ప్రయోజనాలు అప్రధానమైనప్పుడు రాజ్యాంగం అనుసరించాల్సిన విధానాలను కూడా ఆ రెండురోజుల చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి. అప్పుడు కూడా సాధ్యమైనంత వరకు వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలగకుండా రాజ్యాంగం హామీ యివ్వాలనే నిపుణులు అభిప్రాయపడ్డారు. అందువల్లనే ఈ రోజు ఏ వ్యక్తి ఆస్తికి గానీ, ప్రాణానికి గానీ, జీవన భద్రతకు గానీ భంగం కలిగితే న్యాయస్థానాలను ఆశ్రయించడం చూస్తున్నాం. సరిగ్గా ఇదే విషయం ఆధార్‌ వివాదంలో సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించిన తీర్పులో చూడవచ్చు. సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పులోని కొన్ని భాగాలను పరిశీలిస్తే రాజ్యాంగం విశిష్టత, రాజ్యాంగ నిర్మాతల దూరదృష్టి అర్థం కాగలవు. ఆర్టికల్‌ 14, ఆర్టికల్‌ 21 రాజ్యాంగానికి హృదయ కవాటాల్లాంటివని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వ్యక్తి స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వం, గౌరవప్రదమైన జీవితం ప్రధానమైన రాజ్యాంగ విలువలని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే వ్యక్తిగత జీవితాల్లోకి రాజ్యంగానీ, మరేయితర సంస్థలుగానీ, వ్యక్తులుగానీ చొరబడకుండా రాజ్యాంగం తగు రక్షణలు కల్పించిందని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది.



అందుకనుగుణంగానే రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు వ్యక్తి స్వేచ్ఛకు హామీ పడుతున్నాయని తేల్చి చెప్పింది. ఆర్టికల్‌ 14 నుంచి, ఆర్టికల్‌ 35 వరకు కల్పించిన హక్కులను పరిశీలిస్తే రాజ్యాంగ నిపుణులు వ్యక్తిగత స్వేచ్ఛపట్ల చూపిన ముందుచూపు, శ్రద్ధ అర్థం అవుతుంది. చట్టం ముందు అందరినీ సమానంగా పరిగణించాలని, సమానత్వ హక్కును ఎటువంటి పరిస్థితుల్లోనూ రాజ్యం నిరాకరించకూడదని ఆర్టికల్‌ 14 పేర్కొంటున్నది. కాగా, కుల, మత, జాతి, ప్రాంత, లింగ వివక్షలను నిషేధించాలని ఆర్టికల్‌ 15 స్పష్టం చేసింది. పబ్లిక్‌ స్థలాలైన హోటళ్లు, రెస్టారెంట్లు, పాఠశాలలను ఎట్టి పరిస్థితుల్లోనూ వివక్షారహితంగా ఉంచాలని ఆదేశిస్తున్నది.



ప్రభుత్వ ఉద్యోగాల్లో సమానావకాశాల్ని కల్పించాలని, ఇందులో ఎటువంటి వివక్ష పాటించకూడదని ఆర్టికల్‌ 16 నిర్దేశిస్తున్నది. సమాజానికీ, ఊరికీ దూరంగా తరిమివేసిన అస్పృశ్యులను సంఘంలో సభ్యులుగా గుర్తించడానికి హామీనిస్తూ ఆర్టికల్‌ 17 ద్వారా రాజ్యాంగం అంటరానితనాన్ని నిషేధించింది. ఆర్టికల్‌19లో వ్యక్తిగత స్వేచ్ఛను మరింత విస్తృతంగా రాజ్యాంగం నిర్వచించింది. అందులో భావప్రకటనా స్వేచ్ఛ, సమావేశపు హక్కు, సంఘ నిర్మాణం లాంటి కార్యక్రమాలకు స్వేచ్ఛనిస్తూనే దేశంలో ఎక్కడైనా జీవించే హక్కును, నివాసం ఉండే హక్కును, తనకు ఇష్టమైన ఉపాధిని పొందే హక్కును, వ్యాపారాన్ని నిర్వహించే హక్కును రాజ్యాంగం కల్పించింది.



బడుగులకు గొంతునిచ్చిన రాజ్యాంగం

ప్రాథమిక హక్కుల్లో వ్యక్తిగత స్వేచ్ఛను పకడ్బందీగా పొందుపర్చడం వల్ల భారత ప్రజలందరికీ ముఖ్యంగా హక్కులను పొందలేకపోతున్న వారికీ రాజ్యాంగం ఒక ఆయుధంగా మారింది. అదే ఆయుధం ఈ రోజు సుప్రీంకోర్టు ధర్మాసనం మరొక్కసారి శక్తిమంతంగా ప్రయోగించి, దేశంలో క్రమంగా పెరుగుతున్న పెడధోరణులపై గొడ్డలివేటు వేసింది. కొంతకాలంగా ప్రజల ఆహారపుటలవాట్లు, మత స్వేచ్ఛ, నివాస స్వేచ్ఛ, వనరులను కలిగి ఉండే స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛలపై జరుగుతున్న దాడులకు పరోక్షంగా సుప్రీంకోర్టు బలమైన సమాధానమిచ్చింది. ముఖ్యంగా మత స్వేచ్ఛపై దాడులు మితిమీరిపోతున్నాయి. గోసంరక్షణ పేరుతో ఇతర వర్గాలపై దాడులకు తెగబడటం, తమకు నచ్చని ఆహారాన్ని తింటున్న వారిపై సైతం హత్యాకాండకు పాల్పడటం చూస్తున్నాం. స్వేచ్ఛగా చర్మవృత్తి చేసుకొంటున్న వారిపైనా, గోమాంసాన్ని విక్రయిస్తున్న వారిపైనా దాడులు చేయడం రాజ్యాంగాన్ని ధిక్కరించడమేనన్న సందేశాన్ని సుప్రీం కోర్టు ధర్మాసనం చెప్పకనే చెప్పింది. రాజ్యాంగం కేవలం న్యాయ సూత్రాల పుస్తకం మాత్రమే కాదని, ప్రజలందరి ఆశల, ఆకాంక్షల, ఆశయాల సమాహారమని; ఇది జాతి జీవనచక్రమని ధర్మాసనం స్పష్టం చేసింది.



రాజ్యాంగం మంచిచెడులను ప్రస్తావిస్తూ అంబేడ్కర్‌ రాజ్యాంగ సభలో ఉటంకించిన విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించడం విశేషం. ఒక దేశ రాజ్యాంగం మంచిదా కాదా? అనే విషయం రాజ్యాంగంపైన ఆధారపడి లేదని, దానిని అమలుపరిచే వారి మంచి చెడులపైననే రాజ్యాంగం అమలు ఆధారపడి ఉంటుందని అంబేడ్కర్‌ చెప్పారు. ఆ గొప్ప సూక్తిని రాజ్యాంగ ధర్మాసనం సొంతం చేసుకొని, మరొక్కసారి దేశంలోని కోట్లాది ప్రజల హక్కుల గొంతుకగా మారిన వాస్తవాన్ని ఇక్కడ ప్రస్తావించాలి. రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన ఈ తీర్పు ఎంతో విస్తృతమైనది, మరెంతో శక్తిమంతమైనది మాత్రమే కాకుండా ప్రజల భవిష్యత్తు జీవన గమనానికి రక్షణ ఛత్రమై నిలుస్తుందని ఆశిద్దాం.

 

వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు 97055 66213  

మల్లెపల్లి లక్ష్మయ్య

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top