విద్య ఘనం, విలువ శూన్యం

విద్య ఘనం, విలువ శూన్యం - Sakshi


విశ్లేషణ

ఉన్నత విద్య అనేది అందుకోగలిగేవారికే కాదు, అందరికీ అందుబాటులో ఉండాలి. ఈ లక్ష్యంతోనే 2006లో వీరప్ప మొయిలీ అధ్యక్షతన ఏర్పాటయిన పాలనా సంస్కరణల కమిటీ కొన్ని సూచనలు చేసింది. ఉన్నత విద్యలో విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా ప్రవేశాలు కల్పించాలని ఆ కమిటీ చెప్పింది. తగినన్ని కళాశాలలకు స్వయం ప్రతిపత్తిని కల్పించడం ద్వారా విశ్వవిద్యాలయాల మీద ఒత్తిడి తగ్గించాలన్నది మరొక సిఫారసు. అలా జరిగినప్పుడు ఎక్కువ మంది బడుగు, బీద దళిత, ఆదివాసీ వర్గాల పిల్లలు విశ్వవిద్యాలయాల ప్రాంగణాలలో ప్రవేశించగలుగుతారు. ఈ ఆశయాలూ, సిఫారసులూ ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుతం విశ్వవిద్యాలయాలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.



రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విశ్వవిద్యాలయాలు నిధులు లేక కునారిల్లిపోతున్నాయి. విశ్వవిద్యాలయాలు మూడు రకాలు. ఒకటి: రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, రెండు: కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, మూడు: డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలు. మూడో రకం విశ్వవిద్యాలయాలకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) గుర్తింపు ఉంటుంది.  ప్రపంచ వ్యాప్తంగా పేరెన్నికగన్న 200 విశ్వవిద్యాలయాలలో మన దేశానికి చెందిన విశ్వవిద్యాలయాలు ఒకటో, అరో మాత్రమే చోటు దక్కించుకున్నాయి. వీటిలో ఏ ఒక్క రాష్ట్ర విశ్వవిద్యాలయానికీ స్థానం లేకపోవడం మరింత శోచనీయం.



దీనికి కారణం కులపతి పదవి నుంచి కింది స్థాయి అధికారి వరకు నియామకం విషయంలో ప్రభుత్వ జోక్యం ఉండడమే. విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తికి విలువ లేకుండా చేయడం మరొక కారణం. విద్యార్థులకు రాజకీయాలు ఉండరాదని చెబుతూనే, విశ్వవిద్యాలయాలను రాజకీయ వేదికలుగా తయారు చేయడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? రాష్ట్ర ప్రభుత్వం నడిపే విశ్వవిద్యాలయాలు ఎదుర్కొంటున్న సమస్యలకు అనేక కారణాలు కనిపిస్తాయి. వాటిలో ఇవి ముఖ్యమైనవి మాత్రమే: విద్యార్థుల ప్రవేశ సంఖ్య, ముఖ్యంగా సామాజిక, ప్రాథమిక విజ్ఞానశాస్త్రాలలో తగ్గిపోవడం. ఇందువలన ఫీజుల రూపేణా వచ్చే ఆదాయం తగ్గిపోతున్నది. కొత్తగా విశ్వవిద్యాలయాలు వస్తున్నాయి. కానీ అవి ఒకటి రెండు జిల్లాలకే పరిమితమవుతున్నాయి.



దీనితో విద్యార్థుల సంఖ్య, కళాశాలల సంఖ్య తగ్గిపోతున్నది. ప్రభుత్వ రంగంలో ఉండడం వల్ల ఏ రకమైన వాణిజ్య ప్రకటనలు పత్రికా ముఖంగా గానీ, మీడియా ద్వారా గానీ ఇవ్వకపోవడంతో సమాచారం లోపిస్తున్నది. ఇది ఖర్చుతో కూడినదే కాకుండా, నైతికమైనవి కూడా. విశ్వవిద్యాలయాలు కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ను అనుసరించాలి. ఆయా రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు అంతర్భాగంగా పనిచేస్తున్న కళాశాలలకు సెంటర్‌ విత్‌ పొటెన్షియల్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ పర్టిక్యులర్‌ ఏరియా గుర్తింపు ఉంటే రాష్ట్రీయ ఉచ్ఛతర శిక్షా అభియాన్‌ (రూసా) నుంచి నిధులు వస్తాయి. ‘రూసా’అనేది ఒక కేంద్ర ప్రభుత్వ సహాయ పథకం. దాదాపు ఎలాంటి సహాయం లేనట్టే. పై వాటిని దృష్టిలో పెట్టుకుని విశ్వవిద్యాలయాలు సవ్యంగా పరిపాలన చేయవలసి ఉంటుంది.



విశ్వవిద్యాలయాలకిచ్చే స్వయంప్రతిపత్తి రెండు రకాలు. ఒకటి పాలనా సంబంధమైనది. రెండోది ఆర్థికపరమైనది. ఎన్నడూ లేనిది ఇటీవల ప్రభుత్వ అధికారిని విశ్వవిద్యాలయం ఫైనాన్స్‌ ఆఫీసరుగా నియమించారు. ఇక మిగిలింది పాలనా స్వయంప్రతిపత్తి. ఇదీ నామమాత్రంగా మారిపోతున్నది. విశ్వవిద్యాలయాలు అధికార పార్టీకి వేదికలుగా మారిపోతున్నాయి. విశ్వవిద్యాలయాలలో జరిగే అన్ని మతాల పండుగలకు స్వయంగా ఉపకులపతి, రిజిస్ట్రార్‌లు, అధికారులు హాజరవడాన్ని చూస్తూనే ఉన్నాం. తమ రాజకీయాలకు వేదికగా ఉపయోగించుకోవడానికి రేపు అన్ని పార్టీలు ప్రయత్నం చేయవచ్చు.



ఎనభై దశకంలో మొదలైన ఉదార ఆర్థిక విధానాలు తొంభయ్యవ దశకం వచ్చినప్పటికి పూర్తి రూపాన్ని సంతరించుకున్నాయి. నూతన ఆర్థిక విధానాల ఆధారంగా 1986లో ‘నూతన విద్యా విధానాన్ని’ఆనాటి కేంద్రంలోని కాంగ్రెసు ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దానికి 1992లో కార్యాచరణను తయారుచేసి వ్యవస్థాగత సర్దుబాటులో భాగంగా ఉన్నత విద్యలో సరళీకరణ తీసుకొని రావడంతో ప్రైవేటీకరణ మొదలైంది. ఉన్నత విద్యారంగంలో ఇబ్బడిముబ్బడిగా కళాశాలలు, విశ్వవిద్యాలయాలు పెరిగాయి. ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు దారి సుగమమయ్యింది.



ప్రపంచ మార్కెట్‌కు అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలు అందిస్తే సరిపోతుందనే సంకేతాలను కేంద్ర ప్రభుత్వమిచ్చింది. దీనితో ఉన్నత విద్య మార్కెట్‌ సరకుగా తయారైంది. పబ్లిక్‌ రంగంలోని రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ఆ అవకాశం లేదు. అవి కొన్ని పరిధులలోనే పనిచేయాలి. ఆర్థిక వనరులను తమకు తామే సమీకరించుకొనడంలో ఈ విశ్వ విద్యాలయాలు వెనుకబడి పోతున్నాయి. దీనికితోడు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు తగ్గిపోతున్నాయి. అరకొర నిధులతో కాలం వెళ్లదీస్తున్నాయి. దీనిని రాజకీయ నాయకులు ఆసరాగా తీసుకొంటున్నారు.  ప్రశ్నించే గొంతులను ‘జాతీ యత’ పేరుతో నొక్కి ఉంచుతున్నారు. మత రాజకీయాలకు అతీతంగా విశ్వవిద్యాలయాలు పనిచేస్తేనే వాటికి భవిష్యత్తు ఉంటుంది.




వ్యాసకర్త గౌరవ ఆచార్యులు, ఆంధ్రా విశ్వవిద్యాలయం

ప్రొ‘‘ కేపీ సుబ్బారావు

మొబైల్‌ : 99633 66788

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top