ఇప్పుడేమంటారు మహాశయా!

ఇప్పుడేమంటారు మహాశయా! - Sakshi

‘చెవి కోసుకోవడం’ మన అచ్చ తెలుగు జాతీయం. అందుకని ఇక్కడ చెవి కోసుకోవడమంటే, ఫలితాలు వినడానికి ఆసక్తి చూపుతాననే అర్థంలో గ్రహించి, పుట్టుకతో వచ్చిన ఆయన చెవులను చెక్కు చెదరక పోనీయడం మంచిది.
 
 
చివరకు ఇలా జరిగింది!
ఆఖరికి ఇలాగే జరిగింది!
అనుకున్నంతా అయింది!
- ఎన్నికల ఫలితాలు వచ్చాక ఏకవాక్య విశ్లేషణ ఈ మూడింటిలోనే ఉంటుంది. ఎన్నికలు కూడా యుద్ధనీతిని అనుసరించి నడుస్తాయి. కాకపోతే, రణరంగంలో రెండే పక్షాలుంటాయి. ఎన్నికల పోరులో నాలుగైదు నుంచి పది పన్నెండు పక్షాలు బరిలో ఉంటాయి. ఓటర్లని ఓట్లని చీల్చేస్తూ కొన్ని పక్షాలు శ్రమిస్తుంటాయి. పాపం, వాళ్లు గెలవరు. కాని వాళ్లవల్ల మరెవరో గెలిచేస్తారు. ఇలా గెలుపు ఆశించకుండా చీల్చేసే వారిని ‘శిఖండిగాళ్లు’ అంటుంటారు.
 
వ్యూహాలు ప్రతివ్యూహాలు ఈ రెండు క్షేత్రాల్లోనూ తప్పదు. యుద్ధరంగంలో శక్తిహీనుడు కూడా ఊరికే విజయోత్సాహంతో రంకెలు వేస్తుంటాడు. అవతలివాడిని మానసికంగా దెబ్బతీయడానికి ఇదొక యుద్ధతంత్రం. ఎన్నికల క్షేత్రంలో కూడా అంతే. డిపాజిట్లు రావని తెలిసి కూడా పటాటోపపు ప్రసంగాలు చేస్తుంటారు.

శత్రుపక్షాలు అంతా ఒఠిదేనని తెలిసి కూడా భయం నటిస్తూ ఉంటారు. తీరా చూస్తే ఉన్నవారిలో గట్టిగా సగం మంది కూడా ఓట్లెయ్యరు. అందులో కొంతభాగం దొంగ ఓట్లు. మరికొంత శాతం కల్తీ బాపతు. అంటే ‘ఔట్ సోర్సింగ్’ అంటే కొనుగోలు చేసినవి. ఈ భాగ్యానికి దీన్నొక ప్రజాస్వామ్యంగా, ప్రజారాజ్యంగా అభివర్ణించుకు మురిసిపోవడం!
 
దీనిపై బెట్టింగులు, శపథాలు ఇదొక తంతు నడుస్తుంది. ఇన్ని సీట్లు రాకపోతే రాజకీయ సన్యా సం చేస్తానని ఒకాయన ప్రతిజ్ఞ చేస్తాడు. మీసాలు తీసేస్తానని మరికొందరు శపథం చేస్తారు. మొన్నటికి మొన్న ఒకాయన చెవి కోసుకుంటానని బహి రంగంగా ప్రకటించారు. నారాయణ! నారాయణ! ఈ చిన్న విషయానికి ఇంతటి ఘోర ప్రతిజ్ఞలు అవసరమా? అయితే ఒకటి, దీన్ని మరీ అంత మాటకి మాటగా తీసుకుని కత్తులు నూరి సిద్ధం చెయ్యక్కర్లేదు.
 
‘చెవి కోసుకోవడం’ మన అచ్చ తెలుగు జాతీయం. ‘సంగీతమంటే చెవి కోసుకుంటాడు’ అంటాం. ఎదుటివారి గొడవలంటే చెవి కోసుకుంటాడు! ఇలాంటి ప్రయోగాలున్నాయి. అందుకని ఇక్కడ చెవి కోసుకోవడమంటే, ఫలితాలు వినడానికి ఆసక్తి చూపుతాననే అర్థంలో  గ్రహించి, పుట్టుకతో వచ్చిన ఆయన చెవులను చెక్కు చెదరక పోనీయడం మంచిది. పైగా ప్రజా హక్కుల కమిటీ చూస్తూ ఊరుకుంటుందా? ఐచ్ఛికంగా చెవి కోసుకోవడానికి సిద్ధపడ్డా ఊరుకోరు గాక ఊరుకోరు. ఆనాడు యుద్ధ రంగాల్లో కూడా ఇలాంటి భీషణ ప్రతిజ్ఞలుండేవి.
 
సాయంత్రంలోగా సైంధవుణ్ణి చంపుతానని, లేకుంటే శిరసు ఖండించుకుంటానని అర్జునుడు ప్రకటించాడు. అది కృష్ణుడి పీకల మీదకి వచ్చింది. సూర్యుడికి చక్రం అడ్డువేసి  బామ్మరిదిని రక్షించుకున్నాడు. అంతపని అవసరమా? కృష్ణుడు దివ్య దృష్టితో సైంధవుడికి వేరెబౌట్స్ తెలుసుకుంటే అయిపోదూ! ఒక్కోసారి దేవుళ్లు కూడా కొన్ని తమాషాలు చేసి, వార్తల్లోకి ఎక్కుతుంటారు- మన పొలిటీషియన్స్‌లాగా!     

శ్రీరమణ

(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top