మొక్కిన మొక్కులు చల్లంగుండి...

మొక్కిన మొక్కులు చల్లంగుండి... - Sakshi


హేతువాదులు ఏమంటున్నారంటే- అసలు మొక్కే ఒక మిథ్య. అసలీ మొక్కు ఎవరు మొక్కారు? ఉద్యమ నేత వ్యక్తిగతంగానా? సకుటుంబంగానా? ఉద్యమకారులంతా సమష్టిగా మొక్కారా? ముందు అది తేలాలి.

 

 

 ఎనక్కి తిరక్క జలుక్కు మంటే

 కనక తప్పెటలు ఘణఘణ మ్రోగగ

 శంఖనాదములు శివమెత్తింపగ

 భక్తితోడ నీ విగ్రహానికి

 బంగరు తొడుగేయించెదనమ్మా

 జేబులో బొమ్మ! జేజేల బొమ్మ!

 

ఆనాటి ‘రాజు-పేద’లో పాట చెవుల్లో రిం గుమంటోంది. కేవలం ముఖకవళికలతో, హస్త ముద్రలతో రేలంగి నటించి ఈ పాటను రక్తి కట్టించారు.

మొక్కిన మొక్కులు చల్లంగ తీరినాయని అవి తీర్చడానికి తెలంగాణ సర్కార్ నడుం బిగించింది. అజ్మీర్  క్వాజా మొయినుద్దీన్ చిస్తి దర్గాకి ‘చదార్’ని సమర్పించనున్నారు. వడ్డి కాసులవాడు బంగరు సాలగ్రామ దండతో పాటు, ఐదు పేటల స్వర్ణహారాన్ని స్వయంగా ధరించనుండగా, అందుకయ్యే అయిదు కోట్లూ తెలంగాణ సర్కార్ భరించనుంది. తిరుచా నూరు అలమేల్ మంగని ముక్కు పుడకతో అర్చించ నున్నారు. బెజవాడ కనకదుర్గమ్మకి ముక్కెర అర్పిస్తారు.

 

ఇవీ ఆంధ్రాదేవుళ్లకి దక్కనున్న కానుకలు. ఇక వరంగల్ భద్రకాళీ మాతకు స్వర్ణ కిరీటం, కురవీరభద్రునికి బంగారు మీసాలూ రానున్నాయి. భద్రాచలం జహ్వరి యావత్తూ నైజాం సొత్తే కాబట్టి ప్రస్తుతానికి అటేమీ లేదు. యాదగిరి స్వామిది వెయ్యికోట్ల మెగా మొక్కు. అది వాయిదాల్లో చెల్లిస్తూనే ఉన్నారు. ఇంక దేవుడు మేలు చేస్తే - మెదక్ చర్చ్ కానుకల ప్రస్తావన రాలేదు. నాందేడ్ గురుద్వారాని తలుచుకోలేదు. కొలనుపాక జైన దేవాలయం మాట వినిపించలేదు. తెలంగాణ సంస్కృ తికి మూలపు టమ్మలైన పెద్దమ్మ, మైసమ్మ ఆదిగా గల అమ్మలకు మాతృవందనం ఏదీ? మనకు దేవుళ్ల కొరత లేదు. మన దేవుళ్లకు మహిమల కొరత లేదు. ‘ముప్పది మూడు కోట్ల దేవతలెగబడ్డ దేశమున క్షుధార్తుల క్షుత్తు లారునే’ అన్నారు మహాకవి జాషువా.

పాటలో మరో చరణానికి వస్తే-

‘మారాజులకు మనసులు మారి/ మంత్రి పదవి నా తలపైకొస్తే/ వేడుక తీరగ పూత కూర్పుతో జోడు ప్రభల కట్టించెదనమ్మా!/ జేబులో బొమ్మ! జేజేల బొమ్మ!’

ఆ తర్వాత చెక్కభజనలూ అవీ కూడా మొక్కులో వస్తాయి. ఆంధ్రుడు కొసరాజు రాఘవయ్య చౌదరి వెయ్యేళ్లక్కూడా చెక్కుచెదరని పాట రాశాడు. అయితే, ఎవరి నమ్మకాలు వాళ్లవి. నగల మజూరీతో సహా అయ్యే ఆరు కోట్లూ సర్వ శ్రేయోనిధిలోంచి చెల్లిస్తారట. ఇక్కడే వస్తుంది తిరకాసు. ‘కామన్ గుడ్‌ఫండ్’ అందరిదీ. నాస్తి కులు, అన్యులు కూడా ఉన్న ఉమ్మడి నిధిలోంచి ఇలా కైంకర్యం చేయడం ధర్మసమ్మతమేనా? హేతువాదులు ఏమంటున్నారంటే- అసలు మొక్కే ఒక మిథ్య. అసలీ మొక్కు ఎవరు మొక్కారు? ఉద్యమ నేత వ్యక్తిగతం గానా? సకుటుంబంగానా? ఉద్యమకారులంతా సమ ష్టిగా మొక్కారా? ముందు అది తేలాలి.

 

ఏదో టెంకా యలూ, కర్పూరాలూ అంటే ఫర్వాలేదు. పొర్లుదం డాలు, ఎదురు నడవడాలు లాంటి శ్రమదానాలు ఓకే. అగ్నిగుండాలు దాటడం, గుండ్లు గీయించు కోవడం, దీక్షలు, రుద్రాక్షలు, ఉప వాసాలు వగైరాలు వారిష్టం. కానీ ఇది ప్రజాధనం. వీటికి ‘ప్రీసిడెంట్లు’ ఉన్నాయా? స్వాతంత్య్రం రాగానే గాంధీ, నెహ్రూ ఇలాంటి మొక్కులు ఏమైనా చెల్లించారా? విశాలాంధ్ర నుంచి విడివడి నప్పుడు ఇలాంటి మహా కైంకర్యాలేమైనా జరి గాయా? ఇలా ప్రశ్నలు సంధిస్తున్నారు. ‘ఇదొక పెనుమాయ. చివరకు ఆ దేవుళ్లూ, ఈ దేవుళ్లూ ఏకమై రాష్ట్రాన్ని విడగొట్టారు. ఏ ఒక్కరు అడ్డం పడ్డా కథ కంచికి చేరేది కాదు కదా! దేవుళ్లంతా ఒకటే- మనుషులే వేరువేరు!’ అన్నాడు మా గుడి అర్చకస్వామి.

 

దేవుళ్లకి చేసిన వాగ్దానాలను గుర్తుపెట్టుకుని మొక్కుబడిగా కాక అణాపైసలతో చెల్లించడం సత్సాంప్రదాయం. శ్రేయోదాయకం. పాపం, ఓటరు దేవుళ్లకిచ్చిన మాటలని కూడా మొక్కుగా తీరిస్తే ఎంత బావుండు!?


శ్రీరమణ


(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top