ప్రత్యేక హోదా భిక్ష కాదు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయం ‘కేంద్రానికి చెలగాటం, రాష్ట్రానికి ప్రాణసంకటం’గా మారడం శోచనీయం. ఏపీకి ప్రత్యేకహోదా అనేది నాటి ప్రధాని నోటి మాటగానే చెప్పారంటూ’ గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఏకరువు పెడుతున్నారు. వారు తప్పు చేసారు సరే, నేడు తప్పు దిద్దాల్సిన భాద్యులు, పాలకులు వీరే కదా! పస్తులున్న వారికి తిండి పెట్టడం ముఖ్యం గానీ, ముందున్న వారు వండిపెట్టలేదని నిందలేస్తూ కూర్చోడం ఏం సబబు? విభజన చట్టంలో హోదా ఊసు లేకపోతే, సవరించి ప్రవేశపెట్టడం ప్రభుత్వానికి చిటికెలో పని.

 

దానికేమీ పార్లమెంటులో అసాధారణ మెజారిటీగానీ, ఇతర రాష్ట్రాల మద్దతు గానీ అవసరం లేదే! గత ప్రధాని నోటి మాటకు విలువలేదంటే అది ప్రధాని పీఠాన్ని అవమానించినట్టే గదా! ఇతర రాష్ట్రాల ఎన్నికలూ, లాభనష్టాలు బేరీజు వేసుకొంటూ ఆంధ్రకి అన్యాయం చెయ్యడంలో భాజపాకు రాజకీయ లబ్ధి ఉండొచ్చుగాక, కానీ ఇచ్చిన మాట తప్పడంలో దిగజారే నైతిక స్థాయి మాటో? వీటన్నింటికీ మించి-ప్రత్యేకహోదా అన్నది దయాభిక్ష కాదు. రాష్ట్రానికి రావాల్సిన హక్కు. అడ్డగోలు విభజన వ్యవహారంలో కేంద్రం నుండి లభించిన అధికార హామీ. పొందాల్సిన ఊరట. రాష్ర్ట... కేంద్ర పాలకులు ఏ పార్టీ వారైనా ఔదలదాల్చాల్సిన నిర్ణయం.  

 - డా.డి.వి.జి.శంకరరావు  మాజీ ఎంపీ, పార్వతీపురం,

 విజయనగరం, జిల్లా. ఫోన్:94408 36931

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top