భేషజాల మృత్యు వలయం

సియాచిన్ ప్రాంతం(పైన) విరిగిపడుతున్న మంచు చరియ(దిగువ ఎడమ) 2012 దుర్ఘటనలో సహాయక చర్యలు (దిగువ కుడి)


జాతిహితం

 

గత 14 ఏళ్లుగా సియాచిన్‌లో ఒక్క తుపాకీ గర్జించింది లేదు. అక్కడ పోరాటం జరుగుతుందనడం వాస్తవం కాదు. శిఖరాగ్ర శ్రేణిపై బైఠాయించిన మన సైన్యం పశ్చిమ పార్శ్వపు రక్షణ శ్రేణిగా ఉండి, ఆ హిమశైలం అంతటినీ తన అదుపులో ఉంచుకుంది. అయినా దుర్భర వాతావరణ పరిస్థితులకు ఇరుపక్షాలూ బలైపోతూనే ఉన్నాయి. రెండు సైన్యాలూ మరింత మెరుగైన సాధన సంపత్తిని సమకూర్చుకోవడంతో మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టిందే తప్ప ఆగిపోలేదు.

 

 

మీరు దేవానంద్ అభిమానులు అయినా కాకున్నా, సినీ నిర్మాతగా ఆయన నిర్లక్ష్యంగా తన కాలం కంటే ముందటి కథా వస్తువులతో దుస్సాహసాలు చేశారని ఒప్పుకోవాల్సిందే. 1965 నాటి అజరామర చిత్రం ‘గైడ్’... బాలీవుడ్ చరిత్రలోనే అత్యంత సుప్రసిద్ధ వివాహేతర ప్రేమ. ఎందువల్లనోగానీ, శత్రువు ముందు పిరికితనం చూపిన సైనిక లెఫ్టినెంట్‌గా ఆయన సైనిక న్యాయస్థానం శిక్షకు గురైన ‘ప్రేమ పూజారి’ (1970) చిత్రాన్ని తక్కువగా గుర్తుంచుకుంటారు. 1967లో నాథులా (సిక్కిం) వద్ద చివరిసారిగా భారత, చైనాల మధ్య పెద్ద సైనిక సంఘర్షణ జరిగింది. భారత సైన్యం 1962 నాటి అప్రదిష్ట తొలగిపోయే రీతిలో పోరాడినా ఇరువైపులా గణనీయంగా ప్రాణ నష్టాలు జరిగాయి. బహుశా ఆ ప్రాంతంలోనే ఆ సన్నివేశాన్ని చిత్రీకరించారు.




మనం చస్తేనేం ... వాళ్లూ చస్తున్నారుగా?

లెఫ్టినెంట్ రామ్‌దేవ్ బక్షీ (దేవానంద్) తన పెంపుడు కుక్కతో కలిసి శత్రువు జరుపుతున్న కాల్పులకు గురవుతాడు. బక్షీ, తిరిగి కాల్పులు జరపడానికి నిరాకరించి కుక్క మృతదేహం వద్ద ధిక్కారంగా నిలిచి, మరుపున పడి పోయిన సుప్రసిద్ధమైన ఈ మాటలు అంటాడు... వాళ్లు కాలుస్తారు, నేను కాలుస్తాను, వాళ్లు తిరిగి కాలుస్తారు, నేనూ కాలుస్తాను, మళ్లీ వాళ్లు కాలు స్తారు... ఈ విష వలయం ముగిసేది ఎన్నడు? బక్షీ మరెవరో కాదు, దేవానంద్ కాబట్టి జైలు నుంచి తప్పించుకుని భారత గూఢచారై పోతాడు.


తన గ్రామం వద్ద బహుశా పాకిస్తాన్ ట్యాంకుల రెజిమెంటు మొత్తాన్ని తుడిచి పెట్టేసి, తిరిగి కుటుంబ గౌరవాన్ని నిలబెడతాడు. సల్తోరో(సియాచిన్) పర్వత శిఖరాగ్రంపై పది మంది సైనికులు ఒక అధికారితో కూడిన భారత సైనిక బృందం మరణవార్తకు సమాంతర పోలికలా ఉన్నందునే ప్రేమ్ పూజారి చిత్ర సన్నివేశాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవాల్సి వచ్చింది.


32 ఏళ్ల క్రితం మన సేనలు మొదటిసారిగా ఆ శిఖరాగ్రాన్ని అధిరోహించి, ఇది మా మాతృభూమి అని చాటాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిస్థితి సరిగ్గా దేవానంద్ డైలాగ్‌లాగే ఉంది. మొట్టమొదటిసారే మనం దాదాపు 30 మందితో కూడిన ఒక ప్లటూన్‌ను కోల్పోయాం. ఆ తర్వాత పాకిస్తానీలు కూడా ఆ పైకి చేరాలనే  విఫలయత్నంలో వారి సొంత పగుళ్లలోపడి, మంచు, కొండ చరియలు విరిగి పడి, ఊపిరితిత్తులలో నీరు చేరడం వంటి జబ్బులు చేసి చనిపోయారు.




ఆ తర్వాత మనవాళ్లూ కొంత మంది చనిపోయారు. వాళ్లూ అలాగే చనిపోయారు. కొన్ని వారాల క్రితమే పాకిస్తానీలు కొందరిని కోల్పోతే, ఇప్పుడు మనం పది మందిని పోగొట్టుకున్నాం. గత 32 ఏళ్లలో కెల్లా అలాంటి అతిపెద్ద విషాద ఘటన 2012లో జరిగింది. సల్తోరో మూడవ శిఖరానికి అటువైపున గ్యారీ వద్ద పెద్ద మంచు చరియ విరిగిపడి ఒక పాకిస్తానీ సైనిక స్థావరమే సమాధైపోయింది.


129 సైనికులు, 11 మంది పౌరులు చనిపో యారు. సియాచిన్‌లో భారత్ దాదాపు 9,000 మందిని కోల్పోయింది. అటు పాకిస్తానీలు కూడా దాదాపు అంతమందే చనిపోయి ఉంటారు. ఈ ప్రాణ నష్టాలలో 90 శాతానికిపైగా దుర్భర వాతావరణం వల్ల సంభవించినవే తప్ప, శత్రువు కాల్పుల వల్ల కాదని ఇరు పక్షాలూ నిజమే చెబుతాయి.




సియాచిన్ స్థానంలో ప్రేమ్ పుజారిలోని నాథులా సన్నివేశాన్ని ఉంచి చూడండి. మంచు చరియ విరిగిపడి మేం చస్తాం, తర్వాత వాళ్లూ మంచు చరియ విరిగిపడి చస్తారు, తర్వాత మేం మంచు చరియ పడి చస్తాం... ఈ విషవలయం ముగిసేది ఎన్నడు? సైనిక విష వలయాలన్నింటిలోకీ అత్యంత క్రూరమైనది ఇదే. గత 14 ఏళ్లుగా ఆ హిమశైలం పరిసరాల్లో ఎక్కడా ఒక్క తుపాకీ అగ్రహంతో గర్జించింది లేదు.


అక్కడ పోరాటం సాగుతోందనడం వాస్తవాన్ని సరిగ్గా చెప్పకపోవడమే. సొల్తోరో శిఖరాగ్ర శ్రేణి పొడవునా బైఠా యించిన మన సైన్యం పశ్చిమ పార్శ్వపు రక్షణ శ్రేణిగా ఉండి, ఆ హిమశైలం అంతటినీ తన అదుపులో ఉంచుకుంది. పాకిస్తానీలు ఆ దిగువ ఉన్న వాలు ప్రాంతాల్లో వారి స్థావరాలకు సమీపంలో ఉన్నారు. 2002లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం దీన్నే  ఆధీన రేఖగా గుర్తించింది. అయినా దుర్భర వాతావరణ పరిస్థితులకు ఇరుపక్షాలూ బలైపోతూనే ఉన్నాయి.  రెండు సైన్యాలూ మరింత మెరుగైన సాధన సంపత్తిని సమకూర్చుకోవడంతో మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టిందే తప్ప ఆగిపోలేదు.




ఇద్దరు శత్రువులది ఒకటే  మాట

అయినా, దృఢసంకల్పంగలిగి యుద్ధాలలో రాటుదేలిన  సేనలు ఏవైనా ఎప్పుడూ చేసేట్టుగానే ఇరు సేనలూ ఈ రంగంలో పనిచేయడాన్ని గౌరవ సూచకంగా భావిస్తాయి.  కాబట్టే అక్కడ పనిచేస్తున్న లేదా పదవీ విరమణ చేసిన భారత లేదా పాకిస్తానీ సైనికులు ఎవరూ అక్కడి పోరాటమే ఓ ప్రహ సనమని, నిజంగా మనం నష్టాలకు గురవుతున్నామని చెప్పడం ఎరుగం. వాళ్లు ఆ పని చేయరు కూడా. అందుకు రెండు కారణాలు. ఒకటి, అది సైనిక ప్రవృత్తికి విరుద్ధమైనది.


రెండవది, అంతకంటే ముఖ్యమైనది... అవతలి పక్షం తమ కంటే మరింత ఎక్కువగా బాధపడుతోందని వారు విశ్వసించడం. మనం అక్కడ మకాం చేసి ఉన్నామని మన పక్షం సంతృప్తి చెందుతుంది. ఇందిరాగాంధీ చివరిరోజుల్లో, 1984లో చేపట్టిన రెండు పెద్ద సైనిక చర్యల్లో ‘ఆపరేషన్ మేఘదూత్’ ఒకటి. ‘ఆపరేషన్ బ్లూస్టార్’ మరొకటి. పాకిస్తానీలు ఆ శిఖరాగ్రాలకు చేరలేకపోవడంతో అక్కడి నుంచి మనల్ని ఒక్క అంగుళం కూడ కదల్చలేకపోయారు.


పాకిస్తానీల యాజమాన్యంలోని ఒక శ్రేణిని స్వాధీ నం చేసుకుని భారత్ కీలక పాయింట్‌ను సాధించింది. ఆ దాడి సందర్భం గానే సుబేదార్ బనా సింగ్‌కు పరమ వీర చక్ర లభించింది. ఈ వారం విషాదం జరిగినది సరిగ్గా ఆ ప్రాంతానికి పక్కనే. కాబట్టి పాకిస్తానీలు ఇంత కంటే ఎక్కువగా నష్టపోతుంటే, వారిని ఓటమిని అంగీకరించమనండి అనేదే మన వైఖరిగా ఉంటుంది.




అటు పాకిస్తాన్ నుంచీ ఇదే మాట ప్రతిధ్వనిస్తుంటుంది. మంచిదే, భారతీయులు శిఖరాగ్రం ఆక్రమించారు. మూర్ఖులు, తమ స్థావరాలకు అతి సుదూరంలోని ఎక్కడో ఎత్తున కూచున్నారు. అక్కడి దుర్భర వాతావరణ పరిస్థితుల కారణంగా వాళ్లనే బాధపడుతూ, చస్తూ ఉండనిద్దాం, అలాగే అలసి వాళ్లే స్పృహలోకి వస్తారు. రెండు సేనలూ దీన్ని ప్రపంచంలోనే అతి ఎత్తున ఉన్న యుద్ధ రంగమని గర్వంగా చాటుకుంటాయి. సియాచిన్‌లో పని చేసిన కాలానికి గానూ ఇరు పక్షాలూ తమ సైనికులకు ప్రత్యేక పతకాలను ఏర్పాటు చేశాయి. అది ప్రతి కాల్బల సైనిక దళమూ కావాలని కోరుకునేది. ఈ పరస్పర విద్వేషాలు, డాబుసరుల విషవలయాన్ని బద్ధలు కొట్టాలని ఎవరి నోటా మాట మాత్రంగానైనా వినరాదు.




 నాకు గుర్తున్నంతలో ఒకే ఒక్కసారి, 2012 నాటి గ్యారీ దుర్ఘటన సంద ర్భంగా పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ పర్వేజ్ అష్రాఫ్ కయానీ ఈ విషయం గురించి మాట్లాడారు. గ్యారీ దుర్ఘటనకు సంబంధించి భారత్ అందిస్తానన్న సహాయా నికి తమ వైపు నుంచి మంచి స్పందన లభించలేదని ఆయన అన్నారు. ఈ వారం మనం ఎదుర్కొన్న దుర్ఘటన విషయంలో పాకిస్తాన్ సహాయం అంది స్తానన్నా మనం ఎలాంటి సానుకూలతను కనబరచకుండా సరిగ్గా అలాగే వ్యవహరించాం. నిర్లిప్తంగా నో థ్యాంక్స్ అనేశాం. మనం మాట్లాడకుండా ఉండిపోయినది ఏమన్నా ఉందంటే... మాట్లాడుతున్నదెవరో చూడు. మీరె క్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీరీ హిమశైలాన్ని చూడనైనా లేదు!




 ఎప్పటికి తెగుతుంది ఈ పీటముడి

1984 ఏప్రిల్ (?)లో నేను మొదటిసారిగా ‘ఇండియా టుడే’లో సియాచిన్ కథనాన్ని వెలువరించాను. అప్పుడు భారత సైన్యం, ఇది మా భూభాగమని ప్రకటించుకునేంతగా అక్కడ తన ఉనికిని విస్తరింపజేసుకుంది. ఇరు పక్షాల సైనికులు మారు మాట్లాడకుండా ఎదుర్కొంటున్న క్రూర వాతావరణ పరిస్థి తుల గురించి నాకు తెలుసు.


కాబట్టి ఆ కథనాన్ని వెలువరించినప్పటి నుంచీ ఇది పూర్తి నిరర్థక యుద్ధమనే అభిప్రాయం బలపడుతూ వచ్చింది. పాకిస్తాన్ తిరిగి అక్కడికి వచ్చే ప్రయత్నం చేయదనే భరోసా ఉంటే ఇరు పక్షాలూ తమ సేనలను ఉపసంహరించుకోవడం తెలివైన పని అనిపించసాగింది. సియా చిన్ సమస్య పరిష్కారం వరకు వచ్చిన 1989 చర్చలు చివరి క్షణంలో విఫలం కావడంతో నిరుత్సాహపడ్డాను. ఎప్పటికి తెగుతుందీ ముడి అని అప్పటి నుంచి శాంతి కాముకునిగా నేను సుదీర్ఘంగా ఎదురుచూస్తూనే ఉన్నాను.




ఇంకా అలా ఎదురు చూడాల్సిన పని లేదేమోనని నా అనుమానం. భారత సైనికుల మరణానికి ప్రగాఢ సంతాపం తెలుపుతూ, వారి ధైర్యానికి శాల్యూట్ చేస్తూ కూడా నే నీ మాట అంటున్నాను. 1989కి, నేటి కి మధ్య ఇరు దేశాల మధ్య పరస్పర విశ్వాసం పూర్తిగా అదృశ్యమైంది. కశ్మీర్ తనువెల్లా గాయాలు చేసి నెత్తురోడేలా చేస్తూ పాకిస్తాన్/ఐఎస్‌ఐ అఫ్ఘాన్ వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభించిన ఏడాది నుంచే సరిగ్గా అది  అదృశ్యమవుతూ వచ్చింది.


ఆ తర్వాత వారా వ్యూహాన్ని దేశంలోని ఇతర ప్రాంతాలకు, ప్రత్యే కించి ముంబైకి విస్తరింపజేశారు. కాబట్టి స్థూలంగా సాధారణ పరిస్థితులను నెలకొల్పడంలో భాగంగా తప్ప స్థానిక పరిష్కారాలు ఇకనెంత మాత్రమూ  సాధ్యం కావు. అప్పటి వరకు, సియాచిన్‌ను తిరిగి స్వాధీనం చేసుకోలేక పోవడం పాకిస్తాన్ సైన్యానికి ఆందోళనను కలిగిస్తూనే ఉంటుంది. మన బలగాలు ఆ సవాలును సులువుగానే ఎదుర్కోగలవు.  27 ఏళ్ల పరోక్ష యుద్ధం  కారణంగా నాలోని శాంతికాముకుడి చింతన కూడా ఆ మేరకు మారింది. ప్రేమ్ పుజారీలోని రామ్‌దేవ్ భక్షీని గుర్తుచేసుకోవడానికి ఇది కూడా ఒక కారణం.  


శేఖర్ గుప్తా


twitter@shekargupta

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top