సాహిత్యంలో సెక్సూ క్రైమూ

సాహిత్యంలో  సెక్సూ క్రైమూ - Sakshi


‘‘లైంగికత దానంతటది సుఖ మూలకం కావడానికి నాగరికత ఇష్టపడదు. మానవ జాతి ప్రత్యుత్పత్తికి లైంగికత తప్ప వేరే ప్రత్యామ్నాయం లేనందువల్ల మాత్రమే లైంగికతను నాగరికత అంగీకరిస్తుంది.

(సివిలైజేషన్ అండ్ హిజ్ డిస్కంటెంట్స్ - ఫ్రాయిడ్)

(రాణి శివశంకర శర్మ స్వగతం)

 

 నా జననాంగం వొక మృదుపుష్పం

 అది స్పందిస్తుంది... స్రవిస్తుంది

 కోపిస్తుంది కూడా ద్రవాల ప్రకంపనల్తో నాతో మాట్లాడుతుంది

 అది నాలోని మరోస్వరం

 ఆనందమయమైన స్త్రీ వదనంలోని చిరునవ్వు

 గట్టి పడిన పురుషాంగాలన్నా దానికెంతో యిష్టం.

 ...యిలా సాగుతూ పోతుంది జయప్రభ అనువాద కవిత. సెక్స్ అనుభూతి గురించి సూటిగా మాట్లాడ్తుంది. ఆధునిక కాలంలో ప్రేమ అనే మార్మిక పదం కామాన్ని మింగేసింది. అందుకే యిది విప్లవాత్మక కవిత. స్త్రీవాదం గురించి మార్క్సిస్టు త్రిపురనేని మధుసూదనరావు అభిప్రాయం కూడా విప్లవాత్మకమైనది. ‘‘స్త్రీ విముక్తి ఉద్యమ ప్రారంభపు ఛాయలు శ్రీవైష్ణవం లోంచి ఉద్భవించి, ముద్దుపళనిలో స్వేచ్ఛాభోగంగా పరిణమించాయి. మధ్యలో వలసవాదులు వచ్చి మొత్తం సామాజిక వ్యవస్థని కంపింపజేయకపోతే ముద్దుపళని రాసిన స్వేచ్ఛా భోగమే స్త్రీ విముక్తి ఉద్యమంగా పరిణమించేది’’. యిదీ త్రిపురనేని వారి సిద్ధాంతం (అరుణ తార, జనవరి 1992). దీన్ని సంప్రదాయ మూర్ఖత్వంగా ఖండించేశారు జయప్రభ. కాని జయప్రభలోని ఒరిజినాలిటీ సంప్రదాయం నుంచి వచ్చిందే.

 

 తెల్లవాడు వచ్చాకే తెల్లారిందనే అభిప్రాయం కమ్యూనిస్టుల నుంచి, ఫెమినిస్టులకి వైరస్‌లా సోకింది. ఇంగ్లీషు తెచ్చిన సంస్కారమే లేకపోతే మన శరీరమూ, మన అవయవాలూ, వాటి స్పందనలూ మనకే అర్థం అయ్యేవి కావని భ్రమపడ్డారు. నిజానికి ఆంగ్ల మానసపుత్రులే స్త్రీల అభివ్యక్తికి అడ్డుపడ్డారు. వాళ్లది విక్టోరియన్ ప్యూరిటన్ నీతి. వీరేశలింగం పంతులుగారు ముద్దుపళని కవిత్వాన్ని ఇంగ్లిష్ దొరల చేత నిషేధింపజేశారు. దాంతో భావ కవులు ప్రేమ కవిత్వం రాస్తూ, కామానికి పాతరవేశారు. కేవీఆర్ లాంటి కమ్యూనిస్టు మేధావులు ముద్దుపళని మగవాళ్లని మించి బరితెగించి రాసిందని తూలనాడారు. చలం కామాన్ని తవ్వి తీసిన సనాతన వైష్ణవ ద్వైత వేదాంతి (గీతాంజలికి చలం ముందుమాట చూడండి). చలం, డి.హెచ్.లారెన్స్, గురజాడల కన్న, నేటి ఫెమినిస్టుల కన్న వైష్ణవ భక్త కవి అన్నమయ్య సృష్టించిన నాయికలే రాడికల్‌గా శృంగార భావనల్ని వ్యక్తం చేశారు. ఆయన వాడుక భాష కూడా గురజాడ లాంటి ఆధునికుల్ని తలదన్నింది. ఇవి జయప్రభ అభిప్రాయాలు. ఈ అభిప్రాయాలు త్రిపురనేనినే సమర్థిస్తున్నాయి (భావ స్వాతంత్య్రంలో అన్నమయ్య కాలం కంటే, ఆధునిక కాలం వెనుకబడి పోయిందంటారు జయప్రభ).

 

 కాలం గురించి నాచన సోమనాథుని ఉత్తర హరివంశంలో ఒక కథ ఉంది. కృష్ణుడు అర్జునుడితో కలిసి కాలంలో వెనక్కి ప్రయాణం చేసి, సృష్ట్యాదికి వెళ్లి చనిపోయినవాణ్ణి బతికించి తెస్తాడు. దీనిపై కవిత రాసిన సంప్రదాయజ్ఞురాలు జయప్రభ. సనాతన యుగానికి ప్రయాణించి నిజమైన సహజమైన స్త్రీ స్వేచ్ఛా కవిత్వాన్ని వెలికి తేలేరా? ఆవిడ కూడా గురజాడ లాగే సమయానికి అంటే వర్తమానానికి బానిస అయ్యారా? (అన్నమయ్య గురించి రాసిన కవితలో ఆవిడ అలాగే చెప్పుకున్నారు) ‘క్రోనలాజికల్ టైమ్’ నుంచి బయటపడాలి కవులు. చరిత్ర, చరిత్ర పురోగతి అనే భావనని పక్కన పెట్టాలి. సిద్ధాంతం ప్రకారం చేస్తే గాడిద పిల్లలు పుట్టాయి అన్నట్లు ఉంది నేటి స్త్రీవాద సాహిత్యం. ఫక్తు నీరస వచనంలోకి దిగజారింది. కాని జయప్రభని ఆమె సంప్రదాయ ప్రియత్వమే బతికించింది. అందుకే ఆవిడ స్పష్టత, కాల్పనికతారాహిత్యం, శుద్ధ వాస్తవికతలపై కత్తి దూసింది. వాటిని జీవితాంతం మోసిన కొడవటిగంటిని తరిమికొట్టింది. నిజానికి చాలామంది ఫెమినిస్టులకి ఆరాధ్య దైవం ఆయన.

 

 ‘‘లైంగికత దానంతటది సుఖ మూలకం కావడానికి నాగరికత ఇష్టపడదు. మానవ జాతి ప్రత్యుత్పత్తికి లైంగికత తప్ప వేరే ప్రత్యామ్నాయం లేనందువల్ల మాత్రమే లైంగికతను నాగరికత అంగీకరిస్తుంది (సివిలైజేషన్ అండ్ హిజ్ డిస్కంటెంట్స్ - ఫ్రాయిడ్). లైంగికత మీద తీవ్ర అణచివేతను అమలు చేయడం ద్వారా మాత్రమే నాగరికత అభివృద్ధి చెందిందని ఫ్రాయిడ్ అంటాడు. నిజానికి ఉత్పత్తి పెంపుదల అనే అభివృద్ధి నినాదం ప్రధానమై శృంగార జీవితాన్ని మటుమాయం చేసేస్తోంది. క్లోనింగ్ లాంటి సైన్సు ఆవిష్కరణలు జండర్‌నే నిర్మూలించి స్త్రీ విముక్తికి అర్థం లేకుండా చేయవచ్చునంటారు జయప్రభ వొక కవితలో. జననాంగాలు వ్యర్థ అవశేషాలుగా మిగిలిపోవచ్చు.

 మాటనీ, దృశ్యాల్నీ, మనుషుల్నీ, స్థలకాలాల్నీ శకల శకలాలుగా చేసేస్తోంది ఆధునికత (టీవీ, ఫోన్, ఇంటర్నెట్ వగైరా). కుటుంబం చుట్టూ అల్లుకున్న కాల్పనికత కరిగిపోయి, కుటుంబం అస్తిపంజరంలా మారిపోయింది. శృంగారం గొప్ప అనుభవంగా ఊహగా కల్పనగా కాక, వృత్తిపరమైన వొత్తిడుల మధ్య తాత్కాలిక విరామంగా మారింది. చివరికి మానవుడికీ యంత్రానికీ మధ్య దూరం చెరిగిపోవచ్చు.

 

 ఇలా నేను జయప్రభ కవిత నుంచి రకరకాల ఆలోచనల్లో కొట్టుకుపోతున్నాను. దీనిలో భాగంగా కొంత సనాతన సంస్కృతి గురించి అలవాటు ప్రకారం ఆలోచిస్తూ వచ్చాను. ఇంతలో జయప్రభ రాసిన ఒక కవితలోంచి ముక్కుపచ్చలారని పసిపిల్లలు బయటకు వచ్చి చెంప పగలగొట్టారు. వాళ్లు వ్యభిచార కూపంలోకి నెట్టబడినవాళ్లు. పార్వతీ, కనక, పుష్ప, హేమ... ‘మానవజాతి ఆర్జించిన సిఫిలిస్ నీ వారసత్వం’ అంటూ కవి బైరాగి లోపల్నుంచి కేకలు పెట్టాడు. యింతటి నిర్దయకి మూలాల్ని ఎక్కడ వెదకాలి? కాలంలో ముందుకు నడిచేకొద్దీ మనం వ్యాపారాత్మకంగా మారి మరింత క్రూరంగా ఘనీభవించేమా? గత కాలమె మేలు వచ్చు కాలముకంటెన్ అని భావించాలా? ఆధునిక సమాజం అభద్రతనీ హింసనీ పెంచిందా? జయప్రభగారన్నట్లు అన్నమయ్య కాలమే అన్ని విధాలా మేలా?

 

అసలు మానవ పరిణామంలోనే లోపం దాగి వుందా? అసలు మానవ అనుభూతుల్లోనే హింస కలగలసిపోయి వున్నట్లు కనబడ్తుంది. జంతు స్థితి నుంచి బయటపడి, జంతువులనే మచ్చిక చేసుకోవడంతో పురోగమించిన మానవ నాగరికతలో - జంతువుల పట్ల లాగే ద్విపాద పశువుల పట్ల కూడా హింస-ప్రేమ కలగలిసిపోయాయి. తోటి మనుషుల్ని కూడా భార్యలుగా సేవకులుగా బలవంతులు మచ్చిక చేస్తూ వచ్చారు. అదర్స్ ఆర్ హెల్ అని, మనిషి మరొక మనిషి అస్తిత్వాన్ని దొంగిలించే దొంగ అని అస్తిత్వవాదులు అన్నారు. సృష్టిలో రెండవది ఉండటమే భయకారకం అన్నారు అద్వైత వేదాంతులు. అసలు విషయం ఏమిటంటే, వ్యభిచార గృహాల్లోని పిల్లల విషయంలో క్రూర జుగుప్సావహ హింస మాత్రమే మిగిలింది. ప్రేమ శూన్యం. సెక్సులో ఎంత ఆనందం, ఎంత హింస, ఎంత క్రైమ్!

 - రాణి శివశంకర శర్మ

 ఫోన్: 7396666942

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top