నాటకం ‘రుచి’

నాటకం ‘రుచి’


పసివాడి చెక్కిలి మీద ముద్దుకి పెట్టుబడి అక్కర లేదు. కానీ ఆత్మీయత కావాలి. అది అలరించే నాటకం ఇవ్వగలదు. మరొక్కసారి- నాటకం రుచి. ఆవకాయ, కొరివి కారం, గోంగూర పచ్చడి, అంబలి అనుపానంగా ఉన్న జొన్నరొట్టె.  

 

ఈ మధ్య ఓ చానల్‌లో ఓ అమ్మాయి నన్ను ఇంటర్వ్యూ చేస్తూ, ‘మన తెలుగు నాటకం ఎందుకు దిక్కుమాలిపోయిం ది సార్’ అని అడిగింది. నేను సమాధానం చెప్పేలోగానే మరోమాట చెప్పింది. ‘నేనిం తవరకు తెలుగు నాటకం చూడలే’దని. ఇంత పెద్ద ప్రశ్నకు సమాధానానికి ఇంత చిన్న కాలమ్ చాలదు. ఆంధ్రాకి కేవలం 80 కిలోమీటర్ల దూరంలో తమిళనాడు ఉంది. అక్కడి కథ చెప్పుకుం దాం. తమిళులకు ప్రియమైనవి- సంగీతం, నాటకం, దేవుడు. దాదాపు 47 సంవత్సరాల కిందట శివాజీ గణేశన్ ‘వియత్నాం వీడు’ నాటకం చూశాను. ఆర్.ఎస్. మనోహర్ చారిత్రక నాటకాలు ఆ మధ్యకాలంలో కూడా ప్రదర్శించారు. అద్భుతం. ఒక్క చెన్నైలోనే కొన్ని తరా లుగా నడుస్తున్న నాటక సమాజాలు ఉన్నాయి.

 

 వై.జి. పార్థసారథి కొడుకు మహేంద్రన్ ఇప్పటికీ నాటకాలు వేస్తాడు. అతని కూతురు వేస్తుంది. పూర్ణం విశ్వనాథన్ నాటకాలు చూశాం. గత 37 సంవత్సరాలుగా మిత్రుడు క్రేజీ మోహన్ నాటక సంస్థని నడుపుతున్నారు. ఇటీవల చెన్నై నారద గానసభలో ఆయన కొత్త నాటకం ‘గూగుల్ ఘటోత్కచ’ చూశాను. ప్రేక్షకులు విరగబడ్డారు. ఆయన ‘చాక్లెట్ కృష్ణ’ నాటకం 500వ ప్రదర్శన సందర్భంగా నేనూ, కె.బాలచందర్, కమల్‌హాసన్ పాల్గొన్నాం. ఒక రోజు నేను లేనప్పుడు మహేంద్రన్ మా ఇంటికి వచ్చాడు. మా పిల్లలు నా నాటకం ‘జగన్నాటకం’ కథ చెప్పారు. అంతే. ‘లైట్స్ ఆన్’ (Lights on) పేరుతో ఆ నాటకాన్ని తిరగ రాసుకున్నాడు. 100 ప్రదర్శనలిచ్చాడు. ఆనాటి సభకు శివాజీగణేశన్ అధ్యక్షులు. నాకు సన్మానం చేశాడు. ఏమిటీ ముమ్మరం? ఏమిటీ రహస్యం? ఒక్క చెన్నైలోనే కనీసం 100కు పైగా సభలున్నాయి.

 

 ఒక్కొక్క సభలో ఎంతలేదన్నా 1,500 మంది సభ్యులుంటారు. ఊళ్లో కొత్త నాటకం వేస్తే తప్పనిసరిగా తమ సభ దాన్ని ప్రదర్శింపచేయాలి. కనుక- ఒక నాట కానికి కనీసం 100 ప్రదర్శనలు ఖాయం. ఒక్క ‘చాక్లెట్ కృష్ణ’ నాటకంతోనే క్రేజీ మోహన్ చాలా సంపాదిం చాడని మా అబ్బాయి చెప్పాడు. భేష్! ఈ నాటకాన్ని ఒమన్, ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాలలో ఉన్న తమిళులు పిలిపించి ప్రదర్శన చూశారని విన్నాను. మంచి లేదా విజయవంతమైన నాటకానికి మూడు అవసరం: రాణింపు, ఆదరణ, ఆదాయం. దీనిలో ఏది లోపించినా నాటకం అంతంత మాత్రంగానే బతుకు తుంది. రాణింపునకు పెట్టుబడి రచన, నటులు, ప్రయోక్త, ప్రేక్షకులు. మొదటి మూడింటికీ తెలుగు నాట కరంగం ఏ నాటక రంగానికీ తీసిపోదు. రెండోది మొద టిది కావాలి; ఆదరణ.

 

  నాటకానికి కావలసింది ఆకర్షణ మాత్రమే కాదు. నాటకం కేవలం ఆనందం కాదు. నాటకాన్ని సామా జికుడు తనది చేసుకుంటాడు. He owns the theatrical experience. నాటకంలో తన ఐడెంటిటీని వెదుక్కుం టాడు. ఎందుకంటే భారతీయ సంస్కృతిలో నాటకం సామాజిక చైతన్యంలోంచి సామాజిక చైతన్యం లక్ష్యంగా రూపుదిద్దుకుంది- భామా కలాపం, కుడియాట్టం, తిరు కూత్తు, గర్భా, బహురూపీ- ఏదైనా ఏదైనా. సినీమా జనరలైజేషన్. నాటకం ఆ ప్రాంతీయానికి ప్రత్యేకం- తమిళనాడుకి ఇడ్లీ, వడలాగా, ఆంధ్రదేశానికి ఉప్మా, పెసరట్టు లాగ, ఉత్తరప్రదేశ్‌కి సమోసా, పూరీలాగ, ఉత్త రాంచల్‌కి జిలేబీ, హల్వాలాగా- తనదైన ‘రుచి’ని ప్రతి ఫలిస్తుంది. ఓ మృచ్ఛకటికం, ఓ కన్యాశుల్కం, ఓ కట్ట బ్రహ్మన, ఓ శాంతతా కోర్ట్ చాలూ అహే - ఆయా ప్రాం తాల రుచులకి ప్రతీకలు. ఇటీవల నేను చూసిన క్రేజీ మోహన్ నాటకం నన్ను అలరిస్తూనే నాకు కొంత దూరంగా ఉంది. కాని చెన్నై ప్రేక్షకులకి అది మృష్టాన్న భోజనం. నాటకం ఆ దగ్గర తనాన్ని  సాధించినప్పుడే ప్రేక్షకుడు దాన్ని తన అక్కున చేర్చుకుంటాడు. తెలుగు ఉదాహరణలు: నిన్న మొన్నటి రక్తకన్నీరు. నాటకం బాగుండడం వేరు. ఆత్మీయం కావడం వేరు. బాగా తెలియాలంటే ఇంగ్లండ్ వెస్టెండ్‌లో ఇంగ్లిష్ నాటకం, అమెరికా బ్రాడ్వేలో నాటకం.

 

 సినీమా ఐదు నక్షత్రాల హోటల్లో బఫే డిన్నర్. నాటకం పూటకూళ్లమ్మ ఇంటి వసారాలో పుల్లట్టు. నాటక ప్రేక్షకుడు రంగస్థలం మీద నుంచి తనకు వచ్చే ఆనందంతో సరిపెట్టుకోడు. అంతకుమించిన ఆత్మీయ తని కోరుకుంటాడు. పాత్రలనీ, నటులనీ తనవారిని చేసుకుంటాడు. అందుకే అలనాడు కపిలవాయి వంటి వారి అక్రమ శిక్షణని కూడా సరిపెట్టుకుని వారిలో జీని యస్‌ని గుర్తుపట్టి తృప్తిగా ఇంటికి వెళ్లాడు. సినీమాకు ఆ బంధుత్వం లేదు. కనుక నాటకం విషయంలో ప్రేక్షకుల రాణింపు, అంగీకారం, వారి ఆదరణలో సంప్రదాయపు మన్నిక ఉంది.  కనుక ఆ టీవీ అమ్మాయి నాటకం బాగుండడం లేదంటే నేను క్షమించగలను. మన నాటక రంగంలో బోలెడు ప్రతిభ ఉంది. దాన్ని ఆవిష్కరించే ప్రయోక్తలున్నారు.

 

మంచిని అందిస్తే అందుకుని గుండెలకు హత్తుకునే ప్రేక్షకుల ఔదార్యం వారసత్వం. మరేది కావాలి? ఆదరణకి అలవాటు చేసే సభలు కావాలి. ‘రుచి’ని మప్పే ప్రయత్నం జరగాలి. నాటకం మంచి రుచిని ప్రేక్షకులకి ‘మప్పాలి’. Theatre must cultivate its audiences. ఓ వారం క్రితమే తమిళుల మధ్య కూర్చుని వారి నాటకాన్ని చూశాను. అది గొప్ప నాటకం కాదు. అల వాటు పడిన ప్రేక్షకులకు అలవాటు చేసిన నాటక సమాజం అలవాటైన ప్రాంతీయత కొరవడకుండా నిజాయితీతో అందించిన నాటకం. పసివాడి చెక్కిలి మీద ముద్దుకి పెట్టుబడి అక్కర లేదు. కానీ అనూహ్యమైన ఆత్మీయత కావాలి. అది అల రించే నాటకం ఇవ్వగలదు. మరొక్కసారి-నాటకం రుచి. ఆవకాయ, కొరివి కారం, గోంగూర పచ్చడి, అం బలి అనుపానంగా ఉన్న జొన్న రొట్టె.

 - గొల్లపూడి మారుతీరావు

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top