గతి తప్పిన గ్రామ స్వరాజ్యం


సమకాలీనం

‘స్మార్ట్ విలేజ్’, ‘గ్రామజ్యోతి’ పేరిట ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు గ్రామోద్ధరణకు దిగాయి. వాటి లక్ష్యాలు, ఆశయాలు అద్భుతం. ప్రచారంలోని ఆసక్తి అమలులో కూడా కనిపిస్తే వచ్చే ఫలితాల కోసం తెలుగు ప్రజ ఎదురుచూస్తోంది. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్రం నిధుల్ని పంచాయతీలకే ఇస్తానంటోంది. కాబట్టే రెండు ప్రభుత్వాలు గ్రామోద్ధరణ రాగమెత్తుకున్నాయా? లేక చిత్తశుద్ధితోనా? అమలులో తేలాల్సిందే. ప్రచారానికి, ఆచరణకి మధ్య అంతరాన్ని పూడ్చటానికి ప్రజలు పూనుకుంటేనే పల్లెలకు పూర్వ వైభవం.

 

ఈ వాక్యం రాయడం పూర్తిచేసినంత సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఎని మిది మంది గ్రామీణులు నగరాలకు వలస వెళుతున్నారు. ఇది ఏ రోజు కారోజు పెరుగుతోందే తప్ప తగ్గటంలేదు. మన వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇది మరీ ఎక్కువ. అందుకే గ్రామాలు నిస్తేజంగా, జీవకళ లేక దైన్యం గా కనిపిస్తున్నాయి. మెజారిటీ గ్రామాలు వన్నె తగ్గి వెలవెల బోతున్నాయి. ‘‘పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, తల్లి బందీ అయిపోయిం దో...’’ అన్న గోరటి వెంకన్న పాట కంట తడి పెట్టించి పుష్కర కాలం దాటిం ది. లక్షలాది కుటుంబాలకు జీవనోపాధి చూపిన చేతి వృత్తులు తెలుగునాట చేష్టలుడిగిపోయాయి. కోలుకునే యత్నంలో పల్లెలు పడిలేస్తూ, సాము గరిడీలు చేస్తున్నాయి. అయినా అక్కడే పడున్నాయి.



గంగలో కలిసిన గ్రామ స్వరాజ్యాన్ని ఒడ్డుకు చేర్చాల్సి ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గ్రామాలను బాగు చేయడానికి ప్రత్యేక కార్యక్రమాల్ని చేపట్టాయి. పాత ‘జన్మ భూమి’కి మెరుగులద్ది ‘స్మార్ట్ విలేజ్’ పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామోద్ధ రణకు బయలుదేరితే, చీకట్లు ముసిరిన పల్లెల్లో ‘గ్రామజ్యోతి’ వెలిగించడానికి తెలంగాణ ప్రభుత్వం కాగడా పట్టింది. రెండు కార్యక్రమాల లక్ష్యాలు, ఆశ యాలు అద్భుతం. పథకాల వెల్లడిలో, ప్రచారంలో కనిపిస్తున్న ఆసక్తి అమ లులో ప్రతిబింబిస్తే కలిగే ఫలితాల కోసం దాదాపు 22 వేల గ్రామ పంచాయ తీల ప్రజలు నిరీక్షిస్తున్నారు. పట్టణవాసుల్లోని అత్యధికుల మూలాలు గ్రామా ల్లోనే ఉన్నాయి లేదా ఒకప్పుడు ఉండేవి! అదే వారిని సైతం పల్లెల వైపు చూసేలా చేస్తోంది. రెండు రాష్ట్రాల సర్కార్లు, కేంద్రమూ నిబద్ధతతో గ్రామీణా భివృద్ధికి ప్రాధాన్యతనిస్తే... సగర్వంగా స్వస్థలాలకు తిరిగి వెళ్లే (రివర్స్ మైగ్రే షన్) మంచి రోజులొస్తాయనే ఆశలు వారిలో బలంగా ఉన్నాయి.



చిత్తశుద్ధా! చెత్తబుద్ధా?

దేశ స్వరూప స్వభావాలెరిగిన వాడు కనుకే, భావి భారతం పల్లెల్లోనే ఉందని, గ్రామ స్వరాజ్యమే అంతిమ లక్ష్యమని బాపూజీ చెప్పారు. కానీ, రాజ్యాంగం లోని ఆదేశికసూత్రాలు, పంచవర్ష ప్రణాళికలు, గరీబీ హఠావో నినాదాల వల్ల ఆశించిన ఫలితాలు కలుగక గ్రామాలు ఆర్థిక స్వావలంబన సాధించక సమ స్యలతో కునారిల్లుతున్నాయి. గాంధీజీ తర్వాత భూదానోద్యమ సారథి ఆచా ర్య వినోభాబావే గ్రామీణ భారతంపై కొంత శ్రద్ధ చూపారు. గ్రామస్తుల సం ఘటిత, స్వయంకృషితో అన్నా హజారే రాలేగావ్ సిద్ధిని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్ది కొత్త ఆశలు రేపారు. అక్కడక్కడ ఒక రాజేందర్‌సింగ్, ఓ అరుణ రాయ్ లాంటి వాళ్లు రాజస్థాన్ గ్రామాల వికాసానికి తోడ్పాటును అందిం చారు. కేరళ వంటి రాష్ట్రాల్లో స్థానిక చైతన్యం, వరుసగా ప్రభుత్వాలు ప్రాధా న్యతనివ్వడం వంటి కారణాలవల్ల స్థానిక సంస్థలు బలోపేతమై గ్రామం కొం త నిబ్బరంగా ఉంది.



రాజ్యాంగంలోని అధికరణం 243 ‘బి’ ప్రకారం గ్రామ పంచాయతీ రాజ్యాంగ సంస్థే అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూవచ్చాయి. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలకు సంక్రమిం చిన 29 అధికారాల్ని బదిలీచేయని రాష్ట్ర ప్రభుత్వాల దుర్బుద్ధివల్ల గ్రామీణుల కలలు కల్లలే అయ్యాయి. స్వయం నిర్ణయం, నిధుల్లో తమ వాటా కోసం కేం ద్రంతో దెబ్బలాడే రాష్ట్ర ప్రభుత్వాలు... స్థానిక సంస్థలకి నిధులు, అధికారాల బదిలీకి ససేమిరా ఒప్పుకోవు. పదిరోజుల కింద ‘గ్రామజ్యోతి’ని ప్రారం భిస్తూ తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు గంగదేవిపల్లె గ్రామ వికాసమే తననిక్కడికి రప్పించిందన్నారు. ఒక గంగదేవిపల్లి (వరంగల్), ఓ ముల్క నూరు (కరీంనగర్), అంకాపూర్ (నిజామాబాద్), వెలివెన్ను (పశ్చిమగోదా వరి)... ఐదో పేరుకు తడుముకోవాలి. అవి నాలుగు కూడా గ్రామస్తుల ఐక్య తతో, సహకార స్ఫూర్తితో ఎదిగినవే తప్ప ప్రభుత్వాలు చేసిందేమీ లేదు.



ఏడు దశాబ్దాల స్వతంత్ర చరిత్రలో తెలుగునేలపై పట్టుమని పది గ్రామాలైనా చెప్పుకోదగ్గ స్థితిలో లేవు. ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధే ఉండుంటే వందల, వేల గంగదేవి పల్లెలు ఈ పాటికి కనబడాల్సింది. పథకాలు ప్రభుత్వ ప్రచారానికి, పాలకపక్షాల ఓట్ల వేటకే పనికొచ్చాయి. వివిధ పథకాలపై వెచ్చించే కోట్ల రూపాయల ప్రజాధనం ఉన్నత స్థాయిలో పాలకపక్షానికి మార్జిన్లిచ్చే కాంట్రా క్టర్ల బొక్కసాలను నింపేందుకు, దిగువ స్థాయిలో పార్టీ కార్యకర్తలను మేపేం దుకు కాకూడదు. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల తదుపరి కేంద్రం మొత్తం నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకే ఇస్తానంది. కాబట్టే రెండు ప్రభు త్వాలు గ్రామాలంటూ కొత్త రాగమెత్తుకున్నాయా? నిజంగానే చిత్తశుద్ధి తోనా? అన్నది అమలును బట్టి తేలుతుంది.



చీకట్లు తొలగించేందుకే గ్రామ జ్యోతి

ఈ కార్యక్రమం కింద వచ్చే నాలుగేళ్లలో రూ.25 వేల కోట్లు ఖర్చు చేయనున్నా రు. గ్రామాభివృద్ధి ప్రణాళికలను పంచాయతీ స్థాయిలోనే రూపొందించడం, గ్రామాల సంపూర్ణ అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములుగా చేయడమే గ్రామజ్యోతి ప్రధాన ఆశయమని సర్కారు చెబుతోంది. గ్రామాల సాధికార తకు ఏడు కీలక రంగాలలో అభివృద్ధి నిలకడగా జరగాలని ప్రభుత్వం భావి స్తోంది. తాగునీరు-పారిశుద్ధ్యం, ఆరోగ్యం-పౌష్టికాహారం, విద్య, మౌలిక సదుపాయాలు, సహజ వనరుల నిర్వహణ, సామాజిక భద్రత-పేదరికాన్ని తగ్గించడం, వ్యవసాయం ప్రధానాంశాలు. సమగ్రాభివృద్ధికి అవసరమైన ప్రణాళికా రూపకల్పనలో గ్రామ స్వయం సహాయక గ్రూపులు, శ్రమశక్తి సం ఘాలు, యువజన సమూహాలు, కుల సంఘాలు, స్వచ్ఛంద  సంస్థలు, రిటై ర్డు ఉద్యోగులు, వివిధ రంగాల్లో అనుభవం ఉన్న వ్యక్తులను భాగస్వాము లను చేయాలని గ్రామజ్యోతి మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.



ప్రతి అంశానికీ ఒక కార్యనిర్వాహక కమిటీని వేసి నిరంతరం పర్యవేక్షణ చేసేలా చూడటం ఈ కార్యక్రమం ప్రత్యేకత. సర్పంచ్, ఉపసర్పంచ్, మహిళా సభ్యురాలు, ఎస్సీ- ఎస్టీ మహిళా సభ్యురాలు ఈ కమిటీలకు నేతృత్వం వహిస్తారు. మండల/ గ్రామ పంచాయతీ స్థాయి అధికారి కన్వీనర్‌గా ఉండే ఈ క మిటీలో ఒకరు, అంతకుమించి వార్డు సభ్యులు, ఎస్‌హెచ్‌జీ గ్రూపు లీడరు, కుల సంఘం, గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేసే ఎన్‌జీవో ప్రతినిధి సభ్యులుగా ఉంటా రు. గ్రామంలోని ప్రతి అభివృద్ధి కార్యక్రమం సకాలంలో పూర్తయ్యేలా ఈ కమిటీలు పర ్యవేక్షిస్తాయి. ప్రణాళికల రూపకల్పనకు ఆయా రంగాల సమగ్ర సమాచారాన్ని సేకరించి, ప్రస్తుత పరిస్థితిని సమీక్షించాలి. గ్రామంలో ప్రతిచో టికి నడిచివెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి విశ్లేషణలు చేయాలి.



నిర్ణయాలు తీసుకోవడంలో అంతా భాగస్వాములయ్యే పద్ధతులను పాటించాలి. సమష్టి అవసరా లను అంచనా వేయాలి. అలా రూపొందిన ప్రణాళిక గ్రామసభ ఆమోదం పొందాలి. పంచాయతీ కార్యదర్శి నుంచి జిల్లా కలెక్టర్ దాకా పాలనాధికారు లను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు(జీఓ ఎంఎస్ నం:63, 64) జారీ చేసింది. కేంద్ర నిధులపై పరోక్ష పెత్తనానికై రాష్ట్ర ప్రభుత్వం ఎత్తుగడ వేసిందే తప్ప, గ్రామజ్యోతిలో కొత్తదనమేమీ లేదని, పైగా స్థానికసంస్థల స్వేచ్ఛకు ప్రతిబంధకమని విపక్షాల విమర్శ. నోడల్ అధికారుల రూపంలో అధికార వ్యవస్థ పెత్తనం చలాయించే ఎత్తుగడ అని అవి అంటున్నాయి. గ్రామసభ చెరువు మరమ్మతు చేయాలంటే దాన్ని మిషన్ కాకతీయలో చేపడతామని, రక్షిత నీటి ట్యాంక్ కడతామంటే వాటర్ గ్రిడ్‌లో ఇస్తామని ప్రభుత్వం వారి ఆర్థికస్వేచ్ఛకు భంగం కలిగిస్తోందని విమర్శ.



ఆకర్షణీయ గ్రామానికై జన్మభూమికి కొత్త రంగు

సూక్ష్మస్థాయి గ్రామ ప్రణాళికా రచనతోపాటు వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్య క్రమాల లబ్ధిదారుల ఎంపిక, సమన్వయం వంటి పనుల్ని పర్యవేక్షిస్తూ గ్రామాభివృద్ధి లక్ష్యంతో ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమాన్ని ఏపీ ప్రభు త్వం రచించింది. ఇక్కడో మతలబుంది. 2014 సెప్టెంబర్‌లో ఆ మేరకు (జీఓ ఎంఎస్ నం:22) ఆదేశాలిచ్చిన ప్రభుత్వం.. కమిటీల కూర్పులో స్వయం సహాయక బృందాలు, సామాజిక కార్యకర్తల పేరిట పార్టీ కార్యకర్తలు, సాను భూతిపరులకు దొడ్డిదారిన స్థానం కల్పించే ఎత్తుగడ వేసింది. పెన్షన్ అర్హు లతోపాటు వివిధ పథకాల లబ్ధిదారుల ఎంపికలో వీళ్లదే కీలకపాత్ర. గ్రామ స్థాయి ప్రణాళిక, ప్రాథమ్యాల నిర్ణయంలో ప్రజాప్రతినిధులకన్నా అధికారు లకే ప్రాధాన్యముండేలా ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రభుత్వం కొత్త ఆదేశాలిచ్చిం ది.



‘స్మార్ట్ విలేజ్’ దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. అంటే కార్పొరేట్ అధిపతులు, ఉన్నతాధికారులు, ఇతర వితరణశీలురు గ్రామాన్ని దత్తత తీసు కుంటారు. అమల్లో ఉన్న అధికారిక కార్యక్రమాలతో వారి ఆలోచనల్ని మేళ వించి ప్రజల జీవనవిధానంలో మార్పు తీసుకొచ్చేలా కార్యాచరణ నిర్వహి స్తారు. అన్ని పంచాయతీల్లో ఏకరీతి అభివృద్ధి పేరిట కేంద్రమిచ్చే నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం తమ అధీనంలోకి తీసుకుంటోందనేది విమర్శ. తెలంగాణ ‘హరితహారం’ లాగే ఏపీలో ‘చెట్టు-నీరు’ పథకం చేపట్టినా నిధుల దుర్విని యోగమేతప్ప చెట్టూలేదు, నీరూలేదని విమర్శ. అటు శాశ్వత ఆస్తులు నిర్మిం చకుండా, ఇటు నిరుపేదలకు ఉపాధి కల్పించకుండా ప్రొక్లెయినర్లతో పనులు చేయిస్తూ, ఉపాధి హామీ పథకం నిధుల్ని ఇతరేతరాలకు దారి మళ్లిస్తున్నారు.



ప్రజలు పూనుకోవాల్సిందే!

రెండు తెలుగు రాష్ట్రాల్లో స్వయంగా పౌరులు పూనుకుంటే తప్ప గ్రామాలు బాగుపడే ఛాయలు పొడచూపట్లేదు. ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు చేప ట్టినా వాటి ప్రచారానికి, ఆచరణకి మధ్య అంతరాలు తగ్గించడంలో ప్రజల పాత్ర, ప్రమేయం ఉంటేనే పల్లెలు పూర్వవైభవాన్ని సంతరించుకుంటాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మూలాధారమైన వ్యవసాయానికి దన్నుగా నిలవ డం, విద్య-ఆరోగ్యం-పారిశుధ్యంపట్ల శ్రద్ధ, అన్నింటికీమించి ఆర్థిక స్వావ లంభన ముఖ్యం.



ఇదివరకటిలా జిల్లా, మండల, గ్రామస్థాయిల్లో వేర్వేరు నిష్పత్తుల్లో నిధులివ్వడంగాక 14వ ఆర్థిక సంఘం నేరుగా గ్రామ పంచాయ తీలకే ఇవ్వాలని ప్రతిపాదించింది. దాన్ని కేంద్రం ఆమోదించింది. ఏపీలో 12,918 గ్రామ పంచాయతీల్లోని 3.50 కోట్ల గ్రామీణ జనాభా బాగోగుల కోసం వచ్చే ఐదేళ్లలో రూ.8,500 కోట్ల నిధుల్ని నేరుగా ఇవ్వనుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలోని 2.27 కోట్ల గ్రామీణుల ప్రయోజనాల కోసం 8,685 గ్రామ పంచాయతీలకు రూ.5,376 కోట్లను విడుదల చేస్తుంది. ఇవన్నీ సద్వి నియోగమై తెలుగు పల్లెలు వెలగాల్సి ఉంది. వ్యవసాయాన్ని ఆదుకోవాలి. చదువుల కోసం పిల్లలు, వారి తల్లిదండ్రులూ, బతుకుదెరువు కోసం యువ త, నడివయస్కులు ఊరొదిలి వెళితే... వయసుడిగిన వారితో ఉసూరుమం టున్న గ్రామాలకు కొత్తగా ఊపిరులూదాలి. గ్రామ స్వరాజ్యం సిద్ధించాలి.















దిలీప్ రెడ్డి

సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్

ఈమెయిల్: dileepreddy@sakshi.com.

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top