ప్రమాదంలో స్వాతంత్య్ర ఫలాలు

ప్రమాదంలో స్వాతంత్య్ర ఫలాలు


భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి ఈ ఆగస్టు 15కి 70 సంవత్సరాలు పూర్తి చేసుకుని 71వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈ 70 ఏళ్ల కాలంలో దేశం సమస్యల సుడిగుండంలో ప్రయాణం చేస్తూనే, ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకుంటూ నిలకడగా స్థిరత్వం, వృద్ధి దిశగా వేగంగా అడుగులు  వేస్తున్నది. మన దేశం ఎందుకు స్వాతంత్య్రం కోల్పోయింది? స్వాతంత్య్ర సాధనలో మనం ఏం కోల్పోయాం అనే అంశాలను సమీక్షించుకుని అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడంపైనే మన స్వాతంత్య్ర రక్షణ ఆధారపడి ఉంది.



మనదేశం గత వెయ్యేళ్లుగా ఇస్లామిక్‌ సామ్రాజ్యవాదంపై ఎంతో ఘర్షణ పడింది. ఆ రోజుల్లో దేశంలో శక్తిమంతమైన రాజ్యాలున్నా, శక్తిమంతమైన సామ్రాజ్యాలు లేని కారణంగా మనం ఎంతో నష్టపోయాం. ఆ పెనుదెబ్బనుంచి మనం ఇప్పటికీ కోలుకోలేదనే చెప్పాలి. ఆ తర్వాత ఇస్లామ్‌ పాలన బలహీనపడుతూ, పాశ్చాత్య ప్రాబల్యం పెరుగుతూ వచ్చి మరో 200 ఏళ్లు దేశం బానిసత్వంలో మగ్గింది. 1857లో ఈస్టిండియా కంపెనీపై జరిగిన పోరాటంలో దేశంలోని హిందువులు, ముస్లింలు కలసి పోరాడారు. అదో అరుదైన సంఘటన. అయితే ఆ సమరంలో రాజకీయంగా ఓడిపోయాం కానీ మత మార్పిడిపై నైతిక విజయం సాధించాం. బ్రిటిష్‌ రాణి స్వయంగా వచ్చి మీ మతపరమైన విషయాల్లో మేం జోక్యం చేసుకోం అని ప్రకటించింది. తదుపరి కాలంలో అదే స్ఫూర్తితో ఈ దేశంలో స్వాతంత్య్ర పోరాటం జరిగి బ్రిటిషర్ల నుంచి స్వాతంత్య్రం పొందాం.. కానీ దేశం ముక్కలైంది.



ఈస్టిండియా పాలనలోని భారత్‌ని 1857 తర్వాత బ్రిటిష్‌ పార్లమెంటు నేరుగా పాలించడంతో ప్రజాస్వామ్యబద్ధ ఎన్నికల ప్రక్రియ చోటుచేసుకుంది. దీంతో రాజకీయ పార్టీలు ప్రారంభమయ్యాయి. స్వాతంత్య్ర పోరాటానికి మహాత్మాగాంధీ నాయకత్వం వహించిన తర్వాత కాంగ్రెస్‌ కూడా ఎన్నికలలో పోటీ చేయడం మొదలైంది. ఆ కాలంలోనే రష్యాలో కమ్యూనిస్టు విప్లవం భారతీయ నేతలను ప్రభావితం చేసింది. అలా దేశంలోకి కమ్యూనిస్టు సిద్ధాంతం ప్రవేశించింది. మరోవైపు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొంటూనే.. ఈ దేశంలో ఇస్లామిక్‌ సామ్రాజ్యవాద శక్తులు ఆధిపత్యం కోసం చేసిన పోరాటం చివరకు దేశాన్నే ముక్కలు చేసింది. కానీ నేడు ఇస్లామ్‌ సామ్రాజ్యవాదం నేడు ప్రపంచాధిపత్యం కోసమే పోరాటం చేస్తోంది. దేశంలో జరుగుతున్న పలు సైద్ధాంతిక ఘర్షణలకు తెర దించకపోతే మన స్వాతంత్య్రమే అస్థిరమైపోయే ప్రమాదం ఉంది. దీన్ని నివారించడానికి ఏం చేస్తున్నామనేది మౌలిక ప్రశ్న.



సామాజికంగా కూడా మనం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నాం. మన మేధావులే మన దేశ విషయాలపై అపోహలూ, విద్వేషమూ నిర్మాణం చేస్తున్నారు. ఆ పనిలో కొంత విజయం కూడా సాధించారు. ఈ మధ్య నేనొక కార్యక్రమంలో మాట్లాడుతూ మన ధర్మశాస్త్రాలలోని రెండు మంచి విషయాలు ప్రస్తావించాను. సభానంతరం కొందరు నన్ను ‘మన ధర్మశాస్త్రాలను మీరు సమర్థిస్తారా?’ అని అడిగారు. దానికి నేను ‘మంచి విషయాలు ఎక్క డున్నా గ్రహించాలి, మీకేమైనా అభ్యంతరమా? అన్నాను. ఖురాన్, బైబిల్, దాస్‌క్యాపిటల్‌ నుంచి మంచి గ్రహించటంలో లేని అభ్యంతరం మన ధర్మశాస్త్రాల నుంచి గ్రహించటంలో ఎందుకు?’ అని కూడా అడిగాను. దీనిని విశ్లేషిస్తే ‘మనలో మనమే సవాళ్లు విసురుకుంటూ విడిపోతున్నాం’ అనేది అర్థమవుతుంది. ఈ విషయం మనం ఎంత త్వరగా గ్రహిస్తే దేశానికి అంత మంచిది. ఈ అంతర ఘర్షణ సమసిపోయినప్పుడే మన దేశ స్వాతంత్య్రం స్థిరమౌతుంది.



స్వాతంత్య్రం నాటి నుంచి మన దేశంలో సామాజిక సమత కోసం విశేష ప్రయత్నం జరుగుతున్నది. శతాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ప్రజలు మిగతా సమాజంతో పాటుగా ఎదగటానికి అటు ప్రభుత్వం, ఇటు సమాజం, కొన్ని స్వచ్ఛంద సంస్థలూ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఆ విషయంలో కొంత విజయం కూడా సాధించాం. కానీ మన దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య రాజకీయ స్వలాభం. మన రాజకీయ నేతలు వారి రాజకీయ లబ్ధి కోసం సమాజాన్ని మరింతగా విడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ స్థితి మారితే సామాజిక ఐక్యతకు అడ్డంకి తొలగిపోతుంది.



ఈ 70 ఏళ్లలో మన దేశం శాస్త్ర సాంకేతిక రంగాలలో దూసుకు పోతోంది. మన శక్తియుక్తులను ఈ రోజు ప్రపంచం విస్మరించే స్థితిలో లేదు. అలాగే మన విదేశీ సంబంధాలు ఎంతో మెరుగయ్యాయి. పైగా మనకు మానవ వనరుల లోటు లేదు. కానీ వాటిని సక్రమంగా వినియోగించుకోలేక పోవడమే సమస్య. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో ప్రారంభమైన ఆర్థిక సంస్కరణలు మన ఆర్థిక పరిస్థితులను వేగంగా మార్చాయి. కానీ వాటివల్ల దేశంలో ఆర్థిక అసమానతలు పోటీ పడి పెరుగుతున్నాయి. దేశంలోని ఆరు లక్షలకుపైగా గ్రామాల ప్రగతే దేశ ప్రగతి. కానీ చాలా గ్రామాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. మనకు స్వాతంత్య్రం లభించిన సమయంలో ‘ఈ దేశానికి రాజకీయ స్వాతంత్య్రం వచ్చింది. గ్రామ స్వరాజ్యం ఇంకా రావలసి ఉంది. వేల సంవత్సరాలుగా మన గ్రామాలు స్వయం సమృద్ధిగా ఉండేవి. నేడు అవి పతన స్థితిలో ఉన్నాయి. ఇది మారాలి’ అన్నారు మహాత్మాగాంధీ. దేశ రక్షణతో సహా అన్ని అంశాల్లో స్వావలంబన సాధ్యమైనప్పుడే భారత్‌ ప్రపంచంలో గౌరవనీయ స్థానం పొందుతుంది.

రాంపల్లి మల్లికార్జునరావు, సామాజిక కార్యకర్త

మొబైల్‌ : 95022 30095

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top