జమిలి ఎన్నికలకు జై అందామా?

జమిలి ఎన్నికలకు జై అందామా?


త్రికాలమ్‌

‘ఒక దేశం ఒకే పన్ను విధానం’ లాగానే ‘ఒక దేశం ఒకేసారి ఎన్నికలు’ అనే జమిలి ఎన్నికల నినాదం తెరమీదికి వచ్చింది. ఈ ప్రతిపాదన వల్ల కలిగే లాభనష్టాలను చర్చించి ఒక నిర్ణయానికి రావడం ప్రతి పౌరుడికీ అవసరం. రాష్ట్రపతి, ప్రధాని, ఎన్నికల ప్రధానాధికారులూ, నీతి ఆయోగ్‌ సభ్యులూ జమిలి ఎన్నికలను సిఫార్సు చేస్తున్నారంటే ఆ ప్రతిపాదనలో కొంత బలం ఉండి తీరాలి. ప్రతిపాదనను ఆమోదించినా, తిరస్కరించినా అధ్యయనం చేయడం అవసరం. నీతి ఆయోగ్‌ సభ్యుడు ప్రొఫెసర్‌ బిబేక్‌ దేబ్‌రాయ్, ప్రత్యేకాధికారి కిశోర్‌దేశాయ్‌ కలిసి ఒక ప్రామాణికమైన అధ్యయన పత్రం వెలువరించారు. జస్టిస్‌ జీవన్‌ రెడ్డి నాయకత్వంలోని లా కమిషన్,  పార్లమెంటు స్థాయీ సంఘం ఈ ప్రతిపాదనకు అనుకూలంగా వ్యాఖ్యానించాయి. రాష్ట్రపతి, ప్రధాని,  ఎన్నికల ప్రధానాధికా రిగా పనిచేసిన ఖురేషీ తదితరులు దీనిని ఆమోదిస్తున్నారు.



జమిలి ఎన్నికలను ప్రతిపాదిస్తున్న వారంతా చెప్పే అంశాలు నాలుగు. 1) ప్రతి సంవత్సరం అయిదు లేదా ఏడు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరు గుతున్నాయి. పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు సరేసరి. దీని వల్ల పాలకులు ఎక్కువ కాలం ఎన్నికల రంధిలోనే ఉంటారు. పరిపాలన పైన దృష్టి తగ్గిపోతోంది. 2) ఎన్నికలు నిర్వహించడం ఖర్చుతో కూడిన పని. ఒకేసారి అయితే ఖర్చులు కలిసివస్తాయి. దుబారాను అరికట్టవచ్చు. 3) ఎన్నికలు జరిగిన ప్రతిసారీ సాయుధ బలగాలనూ, ప్రభుత్వ అధికారులనూ, ఉద్యోగులనూ రంగంలోకి దించాలి. ఈ మేరకు పరిపాలన దెబ్బ తింటుంది. 4) ఎన్నికల సమయంలో కులం, మతం విధిగా చర్చకు వస్తాయి. మత కలహాలూ, కుల వైషమ్యాలూ పెరుగుతాయి. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ కుల మతాలను వినియోగించుకునేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తాయి.



నిరంతర ఎన్నికలు  

ఎప్పుడూ ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయన్నమాట వాస్తవం. 2014లో 16వ లోక్‌సభ ఎన్నికలతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఆరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత అదే సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్‌ మాసాలలో మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్, జమ్మూ–కశ్మీర్‌ శాసనసభలకు ఎన్నికలు జరిగాయి. 2015 జనవరి–ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకీ, అదే సంవత్సరం సెప్టెంబర్‌– నవంబర్‌లో బిహార్‌ అసెంబ్లీకీ, 2016 ఫిబ్రవరి–మార్చిలో అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీలకీ ఎన్నికలు నిర్వహించారు. ఇటీవల 2017 ఫిబ్రవరి–మార్చిలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్‌ అసెంబ్లీల ఎన్నికలు జరగడం చూశాం. 2014 మార్చి నుంచి 2017 మార్చి వరకూ 19 రాష్టాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థలోని మూడో స్థాయికి చెందిన పంచాయతీరాజ్, మునిసిపాలిటీ ఎన్నికలు ఎల్లకాలం జరుగుతున్నట్టే కనిపిస్తాయి. కనుక దేశం యావత్తూ ఎప్పుడూ ఏదో ఒక చోట ఎన్నికలలో మునిగితేలుతున్నట్టే అనిపిస్తున్నది. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ నియమావళి అమలులోకి వస్తుంది. దీని వల్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అంతరాయం కలుగుతుంది.



లోక్‌సభ ఎన్నికల ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి. లోక్‌సభకూ, శాసనసభకూ జమిలిగా ఎన్నికలు జరిగితే మొత్తం ఖర్చును చెరిసగం  భరించాలి. ఎన్నికల వ్యయం విప  రీతంగా పెరుగుతోంది. 2009లో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు రూ.1,115 కోట్లు ఖర్చయితే, 2014 ఎన్నికల ఖర్చు రూ. 3,870 కోట్లు. మూడు రెట్ల కంటే అధికం. ‘ఎన్నికలంటే అవినీతి. ఎక్కువసార్లు ఎన్నికలు నిర్వహించడం అంటే ఎక్కువ అవినీతికి అవకాశం ఇవ్వడం’ అన్నది ఖురేషీ విశ్వాసం. కుల,మత ప్రస్తావనలు వచ్చి, అప్రజాస్వామికమైన, అనారోగ్యకరమైన ధోరణులు ప్రబ లేది కూడా ఎన్నికల సమయంలోనే అన్న వాదన కూడా ఆయనదే. రాజకీయ పార్టీలూ, అభ్యర్థులూ పరిమితికి మించి విపరీతంగా ఖర్చు చేస్తున్న సంగతి బహిరంగ రహస్యం. దానిని అరికట్టే సంకల్పం కానీ యంత్రాంగం కానీ లేవు.



అయిదేళ్ళ పొడుగునా ఎక్కడో ఒక చోట అకాలంలో ఎన్నికలు జరిపించే విధానానికి వెంటనే స్వస్తి చెప్పాలంటూ ఎన్నికల కమిషన్‌ 1999లో సమ ర్పించిన నివేదికలో సిఫార్సు చేసింది. ఎస్‌ ఆర్‌ బొమ్మయ్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన అనంతరం రాజ్యాంగంలోని 360వ అధికరణను ప్రయోగించి రాష్ట్ర ప్రభుత్వాలను బర్తరఫ్‌ చేసి రాష్ట్రపతి పాలన విధించే అన్యాయమైన విధానం బాగా తగ్గిపోయిందనీ, పార్లమెంటుకూ, శాసనసభలకూ ఇదివరకు లేని సుస్థిరత ఇప్పుడు సమకూరిందనీ లా కమిషన్‌ అభిప్రాయం. అత్యవసర మైన సందర్భంలోనే అసెంబ్లీ ఎన్నికలు విడిగా నిర్వహించాలనీ, జమిలి ఎన్నికలే నియమం కావాలనీ లా కమిషన్‌ స్పష్టం చేసింది. ఈ విషయంపైన పార్లమెంటరీ స్థాయీ సంఘం అదే అభిప్రాయం వెలిబుచ్చింది.



జమిలి ఎన్నికల ప్రక్రియకు విఘాతం

జమిలి ఎన్నికలు మన దేశానికి కొత్త కాదు. 1951–52లో తొలి సార్వత్రిక ఎన్ని కల నుంచీ 1967లో నాలుగో లోక్‌సభకు ఎన్నికల వరకూ జమిలిగానే సాగాయి. 1968, 69 సంవత్సరాలలో అస్థిరత చోటు చేసుకుంది. చాలా రాష్ట్రాలలో అసెంబ్లీలు రద్దయినాయి. 1970లో నాలుగో లోక్‌సభనే రద్దు చేసి 1971లో ఎన్నికలు నిర్వహించారు. దాంతో జమిలి ఎన్నికల ప్రక్రియకు పూర్తి విఘాతం కలిగింది. ఆ తర్వాత అయిదో లోక్‌సభ గడువును ఆత్యయిక పరిస్థితిలో రాజ్యాంగంలోని 352 అధికరణను ఉపయోగించుకొని 1977 వరకూ పొడిగిం చారు.  1967 నుంచే కొన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్‌పార్టీ దారుణంగా దెబ్బతిన్నది. తమిళనాడు, ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్‌ వంటి రాష్ట్రాలలో మూడో స్థానానికో, నాలుగో స్థానానికో పడిపోయింది. 1984లో ఇందిరాగాం«ధీ హత్యా నంతర సానుభూతి పవనాలలో లోక్‌సభ ఎన్నికలలో ఘనవిజయం సాధించిన కాంగ్రెస్‌ 1989లో రాజీవ్‌గాంధీ నాయకత్వంలో పోటీ చేసినా చిత్తుగా ఓడి పోయింది.



మళ్ళీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగల స్థితికి చేరుకోలేదు. 1984లో కేవలం రెండు స్థానాలకే పరిమితమైన బీజేపీ ఇప్పుడు సొంతబలంతో ప్రభుత్వం ఏర్పాటు చేయగల సంఖ్యాబలం సాధించింది. అయినప్పటికీ నేష నల్‌ డెమాక్రాటిక్‌ అలయెన్స్‌ను కొనసాగించే ఉద్దేశంతో అకాలీదళ్, శివసేన, తెలుగుదేశం పార్టీ వంటి మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలలో సమాజ్‌వాదీ పార్టీనీ, బహుజన సమాజ్‌ పార్టీనీ బీజేపీ మట్టి కరిపించిన తర్వాత ప్రధాని జోరుమీదున్నారు. జమిలి ఎన్నికల ప్రస్తావన తరచుగా చేస్తున్నారు.



అసలు జమిలి ఎన్నికల విధానం అమలు సాధ్యమేనా? 2019 లోక్‌సభ ఎన్నికలతో పాటే అన్ని రాష్ట్రాల శాసనసభలకూ ఎన్నికలు జరగాలంటే తమిళ నాడు, పశ్చిమబెంగాల్, అస్సాం రాష్ట్రాల శాసనసభల గడువు 24 మాసాల ముందే ముగిసిపోతుంది. జమ్మూ–కశ్మీర్‌ అసెంబ్లీ గడువు 21 మాసాలు తరిగిపోతుంది. మొన్న ఎన్నికలు జరిగిన యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్‌ తదితర రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు 2019లో కాకుండా 2024లో జరిపించాలంటే ఆ అసెంబ్లీల గడువును 27 మాసాలకు పెంచవలసి వస్తుంది. కర్ణాటక, గుజరాత్‌ అసెంబ్లీలకి కూడా 2019లోనే లోక్‌సభతో పాటు ఎన్నికలు నిర్వహించాలంటే ఆ రెండు శాసనసభల గడువు పెంచాలి. గడువు తగ్గిస్తే ప్రతిపక్షం సంతోషిస్తుంది. పెంచితే అధికారపక్షం ఆనందిస్తుంది, ప్రతిపక్షం ఆగ్రహిస్తుంది.



ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని పార్లమెంటరీ స్థాయీ సంఘం మరో సూచన చేసింది. ప్రతి ముప్పయ్‌ మాసాలకూ ఒకసారి ఎన్నికలు పెట్టు కోవచ్చునని సలహా చెప్పింది. 2019 ఏప్రిల్‌–మేలో ఒకసారీ, 2021 అక్టో బర్‌–నవంబర్‌లో మరోవిడతా ఎన్నికలన్నమాట. ఈ విధానం అయితే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు తేడా పడదు కానీ ఇతర రాష్ట్రాలలోని అసెంబ్లీల గడువు పెరగడం లేదా తరగడం అనివార్యం. 15 మాసాల కంటే ఎక్కువగా తగ్గకుండా, 13 మాసాల కంటే ఎక్కువగా పెరగకుండా మొదటి విడతలో 14 రాష్ట్రాల అసెంబ్లీలకూ, రెండో విడతలో 16 రాష్ట్రాల అసెంబ్లీలకూ ఎన్నికలు నిర్వహించవచ్చు. ఉప ఎన్నికలను కూడా రెండు విడతలు నిర్వహించాలనీ, ప్రతిసారీ నెలన్నర సమయం కేటాయించాలనీ స్థాయీ సంఘం సూచించింది. ఎన్నికల సంఘం ప్రచురించిన 2015–2025 వ్యూహాత్మక ప్రణాళిక సైతం ఈ విధానానికి దగ్గరలో ఉంది.



మంచి, చెడుల విశ్లేషణ

జమిలి ఎన్నికల ప్రతిపాదనను వస్తునిష్టంగా పరిశీలించినట్లయితే అనుకూలురు చెప్పే కారణాలను కాదనడం సాధ్యం కాదు. సమస్యలు ఉన్నమాట వాస్తవం. జమిలి ఎన్నికల విధానం అమలు జరిగితే ఇప్పుడున్న సమస్యలు కొంతవరకూ పరిష్కారం కావచ్చు. జమిలి ప్రతిపాదన  ప్రాణాంతకమైన పెనుప్రమాదం వైపు దేశాన్ని నెడుతుందా? సమాఖ్య స్ఫూర్తికి భంగం వాటిల్లుతుందా? ఏకీకృత వ్యవస్థకు దారితీస్తుందా? జమిలి ప్రతిపాదన చేయడం వెనుక మోదీ ఆంతర్యం ఏమిటి అనేది మొదటి భయం. ‘కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌’ అంటూ జాతీయ స్థాయిలో 2013లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఎన్నికల ప్రచారం ప్రారంభించిన మోదీ ప్రాంతీయ పార్టీలను నామరూపాలు లేకుండా చేయాలన్న సంకల్పం చెప్పుకున్నారని వినికిడి.



ఖురేషీ వెలిబుచ్చిన భయం మోదీ ఎన్నికల ప్రచారంలో నిజమై కూర్చుంటుంది. ఇటీవలి ఎన్నికలలో మోదీ, అమిత్‌షా జోడీ మతాన్ని, కులాన్నీ చాలా తెలివిగా వినియోగించుకొని కుల రాజకీయాలకు అతీతంగా, నవరాజకీయం చేయాలని ప్రయత్నించిన అఖిలేశ్‌ యాదవ్‌ మాడు పగుల కొట్టారు. మాయావతి శిబిరం నుంచి దళిత నాయకులను తమ వైపుకు తిప్పు కొని బీఎస్‌పీని పూర్వపక్షం చేశారు. ప్రాంతీయ పార్టీల అస్తిత్వం ప్రాంతీయత లోనే ఉంది. జాతీయతావాదం ప్రాంతీయ పార్టీలకు ప్రమాదకరం. జాతీయ వాదాన్నీ, హిందూత్వవాదాన్నీ, కులసమీకరణలనూ వినియోగించుకొని ప్రాంతీయ పార్టీల ఆయువుపట్టు మీద కొట్టాలన్నది మోదీ, షాల వ్యూహం కావచ్చు. ఇది జయప్రదం కావడానికి జమిలి ఎన్నికల విధానం తోడ్పడుతుంది.



మోదీ వంటి అద్భుతమైన వాగ్ధాటి కలిగిన వక్త ఎన్నికల ప్రచారానికి సారథ్యం వహించినప్పుడు ఆయన ప్రభావం ఓటర్లమీద నిశ్చయంగా పడు తుంది.  లోక్‌సభకూ, శాసనసభకూ ఒకే సారి ఎన్నికలు జరిగినప్పుడు లోక్‌సభ ఓటు జాతీయ పార్టీకీ, శాసన సభ ఓటు ప్రాంతీయపార్టీకి వేసేటంతటి విచక్షణ శక్తి ఓటర్లకు అంతగా ఉండదు. అసోసియేషన్‌ ఫర్‌ డెమాక్రాటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) ఇటీవల వెలువరించిన ఒక నివేదికలో భారత ఓటర్ల మనస్తత్వంపైన అధ్యయన ఫలితాలను పేర్కొన్నది. లోక్‌సభ ఎన్నికలూ, శాసనసభ ఎన్ని కలూ జమిలిగా జరిగితే రెండు ఎన్నికలలోనూ ఒకే పార్టీకి ఓటు వేసే మానసిక ధోరణి పెరుగుతోంది. 1999లో ఈ ధోరణిలో ఓటు చేసినవారు 68 శాతం ఉండగా, 2004 నాటికి అది 71 శాతానికీ, 2009 నాటికి 77 శాతానికీ, 2014 నాటికి 86 శాతానికీ పెరిగింది. ఢిల్లీలో, బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు విడిగా జరిగాయి కనుక బీజేపీ ఓడిపోయింది.



లోక్‌సభ ఎన్నికలతోపాటే జరిగి ఉంటే ఓడిపోయేది కాదు. ప్రాంతీయ పార్టీలు  లేకుండా, ప్రతిపక్షం లేకుండా ఒకే ఒక రాజకీయ పార్టీ లేదా కూటమి వెలిగిపోవడం సమాఖ్య స్వభావానికి విరుద్ధం. అధికారంలో సుస్థిరంగా ఉన్న ప్రధాని మోదీకీ దేశం అంతటా ఒకే పన్ను విధానం ఉన్నట్టే ఒకే ఎన్నికల విధానం (జమిలి), ఒకే భాష (హిందీ), ఒకే మతం (హిందూ), ఒకే పార్టీ (బీజేపీ) ఉండాలని మనసులో ఉండవచ్చు. భిన్న త్వంలో ఏకత్వాన్నీ, సర్వ మత సమభావననూ, త్రిభాషా సూత్రాన్నీ, రాజMీ య బాహుళ్యాన్నీ (ప్లూరల్‌ పోలిటీ) ప్రాతిపదికగా చేసుకొని రిపబ్లిక్‌గా మనుగడ సాగిస్తున్న భారతదేశంలో మోదీ మన్‌ కీబాత్‌ (మనసులో మాట) నిజం కావడం అంత తేలికకాదు. సమాఖ్య స్వభావం వంటబట్టించుకున్న ప్రజలు ఏకీకృత వ్యవస్థను ఆమోదించరు.




కె. రామచంద్రమూర్తి

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top